Revised Common Lectionary (Complementary)
15 మంచి మనుష్యులను యెహోవా కాపాడుతాడు.
ఆయన వారి ప్రార్థనలు వింటాడు.
16 కాని చెడు కార్యాలు చేసే వారికి యెహోవా విరోధంగా ఉంటాడు.
ఆయన వారిని పూర్తిగా నాశనం చేస్తాడు.
17 ప్రార్థించండి, యెహోవా మీ ప్రార్థన వింటాడు.
ఆయన మిమ్మల్ని మీ కష్టాలన్నింటినుండి రక్షిస్తాడు.
18 గర్విష్ఠులు కాని మనుష్యులకు యెహోవా సమీపంగా ఉంటాడు.
ఆత్మలో అణగిపోయిన మనుష్యులను ఆయన రక్షిస్తాడు.
19 మంచి మనుష్యులకు అనేక సమస్యలు ఉండవచ్చు.
కాని ఆ మంచి మనుష్యులను వారి ప్రతి కష్టం నుండి యెహోవా రక్షిస్తాడు.
20 వారి ఎముకలన్నింటినీ యెహోవా కాపాడుతాడు.
ఒక్క ఎముక కూడా విరువబడదు.
21 అయితే దుష్టులను కష్టాలు చంపేస్తాయి.
చెడ్డవాళ్లు మంచి మనుష్యులను ద్వేషిస్తారు. కాని ఆ చెడ్డ వాళ్లు నాశనం చేయబడతారు.
22 యెహోవా తన సేవకులలో ప్రతి ఒక్కరి ఆత్మనూ రక్షిస్తాడు.
తన మీద ఆధారపడే ప్రజలను నాశనం కానీయడు.
21 రూబేను, గాదు, మనష్షే వంశాల ప్రజలు ఆ పదకొండు మందికీ జవాబు చెప్పారు. వారు చెప్పింది ఇదే: 22 “యెహోవాయే మా దేవుడు. మళ్లీ చెబుతున్నాము. యెహోవాయే మా దేవుడు. మేము ఎందుకు ఇలా చేసామో దేవునికి తెలుసు. మీరు కూడ తెలుసుకోవాలని మేము కోరుతున్నాము. మేము చేసినదానికి వీరు విచారణ జరుపవచ్చు. మేము చేసింది తప్పు అనే నమ్మకం మీకు కలిగితే, మీరు మమ్మల్ని చంపవచ్చు. 23 మేము గనుక దేవుని చట్టాన్ని ఉల్లంఘించిఉంటే, మమ్మల్ని శిక్షించుమని చెప్పి ఆ దేవుడినే మేము అడుగుతాము. ధాన్యార్పణలు, సమాధానబలులు అర్పించేందుకు, దహనబలుల కోసమూ మేము ఈ బలిపీఠం నిర్మించామని మీరు తలుస్తున్నారా? లేదు. ఆ కారణంతో మేము దీన్ని నిర్మించలేదు. మేము ఈ బలిపీఠాన్ని ఎందుకు నిర్మించాము? 24 మేము కూడ మీ దేశంలో భాగస్థులమేనని మీ ప్రజలు భవిష్యత్తులో ఒప్పుకోరేమోనని మేము భయపడ్డాం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను మేము ఆరాధించకూడదని అప్పుడు మీ ప్రజలు అంటారు. 25 యొర్దాను నది అవతలి వైపు దేవుడు మాకు భూమి ఇచ్చాడు. అంటే యొర్దాను నది మనల్ని వేరు చేస్తుందని దీని అర్థం. మీ పిల్లలు పెద్దవారై, మీ దేశాన్ని పాలించినప్పుడు, మేమూ మీ వాళ్లమేనని వారికి జ్ఞాపకం ఉండదు. ‘రూబేను, గాదు ప్రజలారా, మీరు ఇశ్రాయేలు ప్రజల మధ్యను చెందినవారు కారు’ అని మాతో వారు అంటారు. అందుచేత మా పిల్లలు యెహోవాను ఆరాధించకుండా మీ పిల్లలు ఆటంకపరుస్తారు.
26 “అందుచేత మేము ఈ బలిపీఠం నిర్మించాలని నిర్ణయించాం. అంతేగాని దీనిని దహనబలులకు, బలులకు ఉపయోగించాలని మేము తలంచలేదు. 27 మీరు ఆరాధిస్తున్న, మీరు ఆరాధించే దేవుడినే మేమూ ఆరాధిస్తున్నామనే విషయం మా బలిపీఠం మా ప్రజలకు తెలియజేయాలనేదే అసలైన కారణం. మేము యెహోవాను ఆరాధిస్తామని మీకు, మాకు, మనభవిష్యత్ పిల్లలందరికీ ఈ బలిపీఠం ఋజువుగా ఉంటుంది. మా బలులు, ధాన్యార్పణలు, సమాధాన బలులు యెహోవాకు అర్పిస్తాము. మీ పిల్లలు పెరిగి పెద్దవారైనప్పుడు, మీవలెనే మేము కూడ ఇశ్రాయేలీయులం అని తెలుసుకోవాలని మా కోరిక. 28 ముందు నాటికి మేము ఇశ్రాయేలీయులకు చెందిన వాళ్లము కాదు అని మీ పిల్లలు చెప్పినట్లయితే ‘చూడండి! మాకు ముందు జీవించిన మా పితరులు ఒక బలిపీఠం నిర్మించారు. ఆ బలిపీఠం సరిగ్గా పవిత్ర గుడారం ముందర ఉన్న బలిపీఠంలాగానే ఉంది. ఈ బలిపీఠాన్ని బలులు అర్పించేందుకు మేము ఉపయోగించము. మేమూ ఇశ్రాయేలు ప్రజల్లో ఒక భాగమే అని ఈ బలిపీఠం తెలియజేస్తుంది’ అని మా పిల్లలు చెప్పగలుగుతారు.
29 “వాస్తవంగా మేము యెహోవాకు వ్యతిరేకంగా ఉండాలనుకోవటం లేదు. ఆయనను వెంబడించటం ఇప్పుడు మానివేయాలని కోరటం లేదు. పవిత్ర గుడారం ఎదుట ఉన్నదే సత్యమైన ఒకే బలిపీఠం అని మాకు తెలుసు. ఆ బలిపీఠం మన యెహోవా దేవునిది.”
30 రూబేను, గాదు, మనష్షే ప్రజలు చెప్పిన ఈ విషయాలను యాజకుడు ఫీనెహాసు, పదిమంది నాయకులు విన్నారు. ఈ మనుష్యులు సత్యమే చెబుతున్నారని వారు తృప్తిపడ్డారు. 31 కనుక యాజకుడు ఫీనెహాసు, “యెహోవా మనతో ఉన్నాడని ఇప్పుడు మాకు తెలుసు. మరియు మీరు ఆయనకు విరోధంగా తిరుగలేదని కూడ ఇప్పుడు తెలుస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా చేత శిక్షించబడరు గనుక మేము సంతోషిస్తున్నాము” అన్నాడు.
32 అప్పుడు ఫీనెహాసు, తదితర నాయకులు ఆ చోటువిడిచి, ఇంటికి వెళ్లారు. రూబేను, గాదు ప్రజలను గిలాదు దేశంలో విడిచిపెట్టి, వారు కనానుకు తిరిగి వెళ్లారు. ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వారు తిరిగి వెళ్లి జరిగినది వారికి తెలియజేసారు. 33 ఇశ్రాయేలు ప్రజలు కూడ తృప్తి చెందారు. వారు సంతోషించి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. రూబేను, గాదు, మనష్షే ప్రజల మీదికి యుద్ధానికి వెళ్లకూడదని వారు తీర్మానించారు. ఆ దేశాలను నాశనం చేయకూడదని వారు నిర్ణయించారు.
34 మరియు, “యెహోవాయే దేవుడని మేము నమ్ముతున్నట్టు ఈ బలిపీఠం ప్రజలందరికీ తెలియజేస్తుంది” అని రూబేను, గాదు, మనష్షే ప్రజలు చెప్పారు. అందుచేత వారు ఆ బలిపీఠానికి “ఋజువు” (ఏద) అని పేరు పెట్టారు.
నీకు కావల్సినవాటికై దేవుని అడుగుము
(మత్తయి 7:7-11)
5-6 ఆ తర్వాత ఆయన వాళ్ళతో, “ఒక వేళ మీలో ఒకడు అర్ధరాత్రివేళ తన స్నేహితుని యింటికి వెళ్ళి, ‘నా స్నేహితుడు ఒకడు అకస్మాత్తుగా మా యింటికొచ్చాడు. మా యింట్లో తినటానికి ఏమి లేదు. మూడు రొట్టెలుంటే యిస్తావా?’ అని అడిగాడనుకొండి. 7 ఆ స్నేహితుడు యింటి నుండి బయటకు రాకుండా, ‘నేను, నా పిల్లలు పడుకున్నాం. తలుపులు కూడా తాళం వేసాం. అనవసరంగా బాధ పెట్టొద్దు. అయినా యిప్పుడు లేచి నేను రొట్టెలివ్వలేను’ అని అన్నాడనుకోండి. నేను చెప్పేదేమిటంటే, 8 అతడు తన స్నేహితుడైనందుకు రొట్టెలు యివ్వకపోయినా మొండిగా అడగటం వల్ల తప్పక లేచి అతడడిగిన రొట్టెలు యిస్తాడు. 9 కనుక, నేను మీకు చెప్పేదేమంటే; అడగండి, మీకు లభిస్తుంది. వెతకండి దొరుకుతుంది. తలుపు తట్టండి, అది మీకోసం తెరుచుకుంటుంది. 10 ఎందుకంటే, అడిగిన ప్రతి ఒక్కనికి లభిస్తుంది. వెతికిన వానికి దొరుకుతుంది. తలుపు తడితే అది అతని కోసం తెరుచుకుంటుంది. 11 మీలో ఏ తండ్రి తన కుమారుడు చేప నడిగితే, చేపకు బదులుగా పామునిస్తాడు? 12 లేక గ్రుడ్డునడిగితే తేలునిస్తాడు? 13 మీరు చెడ్డవాళ్లైనా మీ కుమారులకు మంచి బహుమతులు ఎట్లా యివ్వాలో మీకు తెలుసు. కనుక పరలోకంలో ఉన్న మీ తండ్రి తన్నడిగినవాళ్ళకు పవిత్రాత్మను తప్పక యిస్తాడని గ్రహించండి” అని చెప్పాడు.
© 1997 Bible League International