Revised Common Lectionary (Complementary)
15 మంచి మనుష్యులను యెహోవా కాపాడుతాడు.
ఆయన వారి ప్రార్థనలు వింటాడు.
16 కాని చెడు కార్యాలు చేసే వారికి యెహోవా విరోధంగా ఉంటాడు.
ఆయన వారిని పూర్తిగా నాశనం చేస్తాడు.
17 ప్రార్థించండి, యెహోవా మీ ప్రార్థన వింటాడు.
ఆయన మిమ్మల్ని మీ కష్టాలన్నింటినుండి రక్షిస్తాడు.
18 గర్విష్ఠులు కాని మనుష్యులకు యెహోవా సమీపంగా ఉంటాడు.
ఆత్మలో అణగిపోయిన మనుష్యులను ఆయన రక్షిస్తాడు.
19 మంచి మనుష్యులకు అనేక సమస్యలు ఉండవచ్చు.
కాని ఆ మంచి మనుష్యులను వారి ప్రతి కష్టం నుండి యెహోవా రక్షిస్తాడు.
20 వారి ఎముకలన్నింటినీ యెహోవా కాపాడుతాడు.
ఒక్క ఎముక కూడా విరువబడదు.
21 అయితే దుష్టులను కష్టాలు చంపేస్తాయి.
చెడ్డవాళ్లు మంచి మనుష్యులను ద్వేషిస్తారు. కాని ఆ చెడ్డ వాళ్లు నాశనం చేయబడతారు.
22 యెహోవా తన సేవకులలో ప్రతి ఒక్కరి ఆత్మనూ రక్షిస్తాడు.
తన మీద ఆధారపడే ప్రజలను నాశనం కానీయడు.
10 రూబేను, గాదు, మనష్షే ప్రజలు గెలిలోతు అనే స్థలానికి ప్రయాణం చేసారు. ఇది కనాను దేశంలో యొర్దాను నది దగ్గర ఉంది. ఆ స్థలంలో ప్రజలు ఒక చక్కని బలిపీఠం నిర్మించారు. 11 కానీ ఈ మూడు వంశాలవారు నిర్మించిన బలిపీఠం గూర్చి, ఇంకా షిలోహులోనే ఉన్న ఇతర ఇశ్రాయేలు ప్రజలు విన్నారు. కనాను సరిహద్దులో గెలిల్‌తో అనే చోట బలిపీఠం ఉన్నదని వారు విన్నారు. అది యొర్దాను నది దగ్గర ఇశ్రాయేలీయుల వైపుగా ఉంది. 12 ఈమూడు వంశాల మీద ఇశ్రాయేలు ప్రజలందరికీ చాల కోపం వచ్చింది. వారు కలుసుకొని, వాళ్లతో యుద్ధం చేయాలని నిర్ణయం చేసారు.
13 కనుక రూబేను, గాదు, మనష్షే ప్రజలతో మాట్లాడేందుకు ఇశ్రాయేలు ప్రజలు కొందరు మనుష్యుల్ని పంపించారు. యాజకుడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు ఈ మనుష్యులకు నాయకుడు. 14 వంశాల నాయకులలో పదిమందిని కూడ వారు అక్కడికి పంపించారు. షిలోహులో ఉన్న ఇశ్రాయేలు వంశాల్లో ఒక్కో దాని నుండి ఒక్కో మనిషి అందులో ఉన్నాడు.
15 కనుక ఈ పదకొండు మంది గిలాదు వెళ్లారు. రూబేను, గాదు, మనష్షే ప్రజలతో మట్లాడటానికి వారు వెళ్లారు. ఆ పదకొండు మంది వారితో అన్నారు: 16 “ఇశ్రాయేలు ప్రజలంతా మిమ్మల్ని అడిగేది ఏమిటంటే, ‘ఇశ్రాయేలీయుల దేవునికి వ్యతిరేకంగా మీరు ఈ పని ఎందుకు చేసారు? మీరెందుకు యెహోవాకు అడ్డం తిరిగారు? మీకోసం మీరెందుకు బలిపీఠం కట్టుకొన్నారు? ఇది దేవుని చట్టానికి విరుద్ధం అని మీకు తెలుసు. 17 పెయొరు అనే మనిషి జ్ఞాపకం ఉన్నాడా? అతడు ఇలాగే చేసాడు. అతడి పాపం మూలంగా నేటికీ మనం శ్రమ అనుభవిస్తున్నాం. అతడి మహా అపరాధం మూలంగా ఇశ్రాయేలు ప్రజలు అనేకమంది రోగులు అయ్యేటట్టు దేవుడు చేసాడు. ఆ రోగం మూలంగా మనం నేడు కూడ శ్రమపడుతున్నాం. 18 ఇప్పుడు మీరు మళ్లీ అలాగే చేస్తున్నారు. మీరు యెహోవాకు విరోధంగా తిరుగుతున్నారు. యెహోవాను వెంబడించటానికి మీరు నిరాకరిస్తారా? మీరు చేస్తున్న దానిని మానివేయకపోతే ఇశ్రాయేలీయుల్లో ప్రతి ఒక్కరి మీదా యెహోవా కోపగిస్తాడు.
19 “‘ఆరాధించుకొనేందుకు మీ దేశం తగినట్టుగా లేకపోతే, మా దేశంలోనికి రండి. యెహోవా గుడారం మా దేశంలో ఉంది. మీరు కూడ మా దేశంలో కొంత తీసుకొని, అక్కడే నివసించవచ్చు. అంతేకాని యెహోవాకు విరోధంగా తిరుగకండి. మరో బలిపీఠం నిర్మించవద్దు. మన యెహోవా దేవుని బలిపీఠం సన్నిధి గుడారంలో ఇదివరకే ఉంది.
20 “‘జెరహు కుమారుడు ఆకాను ఆనేవాడ్ని జ్ఞాపకం చేసుకోండి. నాశనం చేయాల్సిన వస్తువుల విషయంలో అతడు ఆజ్ఞకు లోబడేందుకు ఇష్టపడలేదు. ఆ ఒక్కడు యెహోవా ఆజ్ఞకు ఉల్లంఘించాడు, కానీ ఇశ్రాయేలు ప్రజలంతా శిక్షపొందారు. ఆకాను అతని అపరాధం మూలంగా చనిపోయాడు. కానీ అతని వలన ఇంకా చాలమంది ప్రజలు కూడ చనిపోయారు.’”
11 యేసు క్రీస్తును మనం నమ్మిన నాటి కంటే నేడు రక్షణ దగ్గరగా ఉంది కనుక ప్రస్తుత కాలాన్ని అర్థం చేసుకోండి. ఆ గడియ అప్పుడే వచ్చేసింది. కనుక నిద్రనుండి మేలుకోండి. 12 రాత్రి గడిచిపోతోంది. అంతం కాని పగలు త్వరలోనే రాబోతోంది. అందువల్ల చీకట్లో చేసే పనుల్ని ఆపి, పగటి వేళ ధరించే ఆయుధాల్ని ధరించండి. 13 పగటి వేళకు తగ్గట్టుగా మర్యాదగా మసలుకొండి. ఉగ్రత తాండవం చెయ్యకుండా, త్రాగి మత్తులు కాకుండా, వ్యభిచారం చెయ్యకుండా, నీతి లేని పనులు చెయ్యకుండా, కలహాలు, అసూయలు లేకుండా ప్రవర్తించండి. 14 యేసు క్రీస్తు ప్రభువును వస్త్రంగా ధరించండి. శారీరక వాంఛల్ని ఏ విధంగా తృప్తి పరుచుకోవాలా అని ఆలోచించటం మానుకోండి.
© 1997 Bible League International