Revised Common Lectionary (Complementary)
15 మంచి మనుష్యులను యెహోవా కాపాడుతాడు.
ఆయన వారి ప్రార్థనలు వింటాడు.
16 కాని చెడు కార్యాలు చేసే వారికి యెహోవా విరోధంగా ఉంటాడు.
ఆయన వారిని పూర్తిగా నాశనం చేస్తాడు.
17 ప్రార్థించండి, యెహోవా మీ ప్రార్థన వింటాడు.
ఆయన మిమ్మల్ని మీ కష్టాలన్నింటినుండి రక్షిస్తాడు.
18 గర్విష్ఠులు కాని మనుష్యులకు యెహోవా సమీపంగా ఉంటాడు.
ఆత్మలో అణగిపోయిన మనుష్యులను ఆయన రక్షిస్తాడు.
19 మంచి మనుష్యులకు అనేక సమస్యలు ఉండవచ్చు.
కాని ఆ మంచి మనుష్యులను వారి ప్రతి కష్టం నుండి యెహోవా రక్షిస్తాడు.
20 వారి ఎముకలన్నింటినీ యెహోవా కాపాడుతాడు.
ఒక్క ఎముక కూడా విరువబడదు.
21 అయితే దుష్టులను కష్టాలు చంపేస్తాయి.
చెడ్డవాళ్లు మంచి మనుష్యులను ద్వేషిస్తారు. కాని ఆ చెడ్డ వాళ్లు నాశనం చేయబడతారు.
22 యెహోవా తన సేవకులలో ప్రతి ఒక్కరి ఆత్మనూ రక్షిస్తాడు.
తన మీద ఆధారపడే ప్రజలను నాశనం కానీయడు.
మూడు వంశాలు ఇండ్లకు వెళ్లటం
22 అప్పుడు రూబేను, గాదు వంశాలు, మనష్షే వంశంలో సగం మంది, అందరినీ ఒక సమావేశానికి పిలిచాడు యెహోషువ. 2 యెహోషువ వారితో ఇలా అన్నాడు: “మీరు చేయాలని మోషే చెప్పిన వాటన్నింటికీ మీరు విధేయులయ్యారు. మోషే యెహోవా సేవకుడు. మరియు, మీరు నా ఆజ్ఞలన్నింటికి కూడా విధేయులయ్యారు. 3 ఇంకను ఇన్నాళ్లూ ఇశ్రాయేలు ఇతర ప్రజలందరినీ మీరు బలపర్చారు. మీ యెహోవా దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నింటికీ మీరు జాగ్రత్తగా విధేయులయ్యారు. 4 ఇశ్రాయేలు ప్రజలకు శాంతి ఇస్తానని మీ యెహోవా దేవుడు వాగ్దానం చేసాడు. కనుక ఇప్పుడు యెహోవా తన వాగ్దానం నిలబెట్టుకొన్నాడు. ఇప్పటికి మీరు తిరిగి మీ ఇండ్లకు వెళ్లవచ్చును. మీకు ఇవ్వబడ్డ దేశానికి మీరు తిరిగి వెళ్లవచ్చును. ఇది యొర్దాను నదికి తూర్పున ఉన్న దేశం. యెహోవా సేవకుడు మోషే మీకు ఇచ్చిన దేశం ఇది. 5 అయితే మోషే మీకు ఇచ్చిన చట్టానికి లోబడుతూనే ఉండాలని జ్ఞాపకం ఉంచుకోండి. మీ యెహోవా దేవుడ్ని ప్రేమిస్తూ, ఆయన ఆజ్ఞలకు లోబడటమే ఆ చట్టం. మీరు ఆయనను వెంబడిస్తూనే ఉండాలి, మీకు చేతనైనంత బాగుగా అయనను సేవిస్తూనే ఉండాలి.”
6 తర్వాత యెహోషువ వారికి వీడ్కోలు చెప్పగా, వారు వెళ్లిపోయారు. వారు వారి ఇండ్లకు వెళ్లిపోయారు. 7 బాషాను దేశాన్ని మనష్షే అర్ధ వంశం వారికి మోషే ఇచ్చాడు. మిగిలిన అర్ధ వంశంవారికి యొర్దాను నది పడమటి వైపు దేశాన్ని యెహోషువ ఇచ్చాడు. అక్కడికి వారి ఇండ్లకు యోహోషువ వారిని పంపివేసాడు. యెహోషువ వారిని ఆశీర్వదించాడు. 8 “మీ ఇండ్లకు మీ ఐశ్వర్యాలకు తిరిగి వెళ్లండి. మీకు చాల పశువులు, చాల విలువైన నగలు, వెండి, బంగారం ఉన్నాయి. మీకు చాల అందమైన బట్టలు ఉన్నాయి. మరియు మీ శత్రువుల దగ్గర చాల వస్తువులు మీరు తీసుకొన్నారు. వీటన్నింటినీ మీలో మీరు పంచుకోవాలి.” అని అతడు చెప్పాడు.
9 కనుక రూబేను, గాదు, మనష్షే వంశాలవారు మిగిలిన ఇశ్రాయేలు ప్రజలను విడిచి వెళ్లారు. వారు కనానులోని షిలోహులో ఉన్నారు. ఆ స్థలం విడిచి వారు తిరిగి గిలాదు వెళ్లారు. ఇది వారి స్వంత దేశం. ఈ దేశాన్ని మోషే వారికి ఇవ్వాలని యెహోవా ఆజ్ఞాపించినందువల్ల అతడు దానిని వారికి ఇచ్చాడు.
ప్రభువు రాకకు సిద్ధంగా ఉండండి
5 సోదరులారా! ఇవి ఎప్పుడు జరుగనున్నాయో, వాటి సమయాలను గురించి, కాలాలను గురించి మేము వ్రాయనవసరం లేదు. 2 ప్రభువు రానున్న దినము అకస్మాత్తుగా రాత్రిపూట దొంగ వచ్చినట్లు వస్తుందని మీకు బాగా తెలుసు. 3 ప్రజలు, “మేము శాంతంగా, క్షేమంగా ఉన్నాము” అని అంటున్నప్పుడు గర్భిణీయైన స్త్రీకి అకస్మాత్తుగా నొప్పులు వచ్చినట్లే వాళ్ళు నాశనమౌతారు. తప్పించుకోలేరు.
4 కాని సోదరులారా! మీరు చీకట్లో లేరు. కనుక ఆ దినం మిమ్మల్ని దొంగల్లా ఆశ్చర్యపరచదు. 5 మనం వెలుగుకు, పగటి వేళకు సంబంధించినవాళ్ళము. రాత్రికి, చీకటివేళకు సంబంధించినవాళ్ళము కాము. 6 మరి అలాంటప్పుడు యితరుల వలె నిద్రపోకుండా, హుషారుగా, ఆత్మ నిగ్రహంతో ఉందాము. 7 ఎందుకంటే, నిద్రపొయ్యే వాళ్ళు రాత్రివేళ నిద్రపోతారు. త్రాగుబోతులు రాత్రివేళ త్రాగుతారు. 8 మనం పగటికి చెందిన వాళ్ళము కనుక ఆత్మ నిగ్రహంతో ఉందాము. విశ్వాసాన్ని, ప్రేమను కవచంగాను, రక్షణ, నిరీక్షణలను శిరస్త్రాణంగాను ధరించుదాము.
9 ఎందుకంటే దేవుడు కోపాన్ని చూపటానికి మనల్ని ఎన్నుకోలేదు. మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ ఇవ్వటానికి ఎన్నుకొన్నాడు. 10 మనం మరణించినా, లేక బ్రతికి ఉన్నా తాను వచ్చినప్పుడు తనతో కలిసి జీవించాలని క్రీస్తు మనకోసం మరణించాడు. 11 మీరు ఎప్పటిలాగే పరస్పరం ఉత్సాహపరుచుకుంటూ, యితర్ల అభివృద్ధికి తోడ్పడుతూ ఉండండి.
© 1997 Bible League International