Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: యెహోవా సేవకుడైన దావీదు కీర్తన.
36 “నేను దేవునికి భయపడను, గౌరవించను” అని దుర్మార్గుడు తనలో తాను చెప్పుకొన్నప్పుడు
అతడు చాలా చెడ్డ పని చేస్తున్నాడు.
2 ఆ మనిషి తనకు తానే అబద్ధం చెప్పుకొంటున్నాడు.
ఆ మనిషి తన సొంత తప్పులను చూడడు.
కనుక అతడు క్షమాపణ వేడుకోడు.
3 అతని మాటలు కేవలం పనికిమాలిన అబద్ధాలే.
అతడు తెలివిగలవాడు కాజాలడు, మేలు చేయడం నేర్చుకోలేడు.
4 రాత్రిపూట, అతడు పనికిమాలిన సంగతులు తలుస్తూంటాడు.
అతడు మేల్కొన్నప్పుడు, ఏ మేలూ చేయడు.
ఏ చెడు కార్యాం చేయటానికైనా అతడు నిరాకరించడు.
5 యెహోవా, నీ నిజమైన ప్రేమ ఆకాశాల కంటె ఉన్నతమైనది.
నీ నమ్మకత్వం మేఘాలకంటె ఉన్నతం.
6 యెహోవా, నీ నీతి “దేవతల పర్వతాల కంటె ఉన్నతమైనది.”
నీ న్యాయం లోతైన మహాసముద్రం కంటె లోతైనది.
యెహోవా, నీవు మానవులను, జంతువులను కాపాడుతావు.
7 ప్రేమగల నీ దయకంటె ఎక్కువ ప్రశస్తమైనది ఇంకేది లేదు.
కాపుదల కోసం మనుష్యులు, దేవ దూతలు నీ దగ్గరకు వస్తారు.
8 యెహోవా, నీ ఇంటిలోని సమృద్ధియైన ఆహారంనుండి వారు నూతన బలం పొందుతారు.
అధ్బుతమైన నీ నదిలోనుండి నీవు వారిని త్రాగనిస్తావు.
9 యెహోవా, జీవపు ఊట నీ నుండి ప్రవహిస్తుంది.
నీ వెలుగు మమ్మల్ని వెలుగు చూడనిస్తుంది.
10 యెహోవా, వాస్తవంగా నిన్ను ఎరిగినవారిని ప్రేమించటం కొనసాగించుము.
నీకు నమ్మకంగావుండే ప్రజలకు నీ మేలు కలుగనిమ్ము.
11 యెహోవా, గర్విష్ఠుల మూలంగా నన్ను పట్టుబడనివ్వకుము.
దుర్మార్గుల చేత తరుమబడనియ్యకుము.
12 వారి సమాధుల మీద ఈ మాటలు చెక్కుము.
“ఇక్కడే దుర్మార్గులు పడిపోయారు.
వారు చితుకగొట్టబడ్డారు.
వారు మళ్లీ ఎన్నటికీ లేచి నిలబడరు.”
యోసేపు తానెవరని చెప్పుట
45 యోసేపు ఇంకెంతమాత్రం తనను తాను ఓర్చుకోలేక పోయాడు. అక్కడున్న ప్రజలందరి ముందు అతడు గట్టిగా ఏడ్చేశాడు. “అందర్నీ ఇక్కడనుండి వెళ్లిపొమ్మనండి” అన్నాడు యోసేపు. అందుచేత అందరూ అక్కడనుండి వెళ్లిపోయారు. ఆ సోదరులు మాత్రమే యోసేపు దగ్గర ఉన్నారు. అప్పుడు యోసేపు తాను ఎవరయిందీ వారితో చెప్పేశాడు. 2 యోసేపు ఇంకా ఏడుస్తూనే ఉన్నందుచేత, ఫరో ఇంటిలో ఉన్న ఈజిప్టు ప్రజలంతా అది విన్నారు. 3 యోసేపు తన సోదరులతో “మీ సోదరుడు యోసేపును నేనే, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా?” అన్నాడు. కాని ఆ సోదరుల నోట మాట రాలేదు. వారు భయంతో కలవరపడిపోయారు.
4 కనుక యోసేపు మళ్లీ తన సోదరులతో, “నా దగ్గరకు రండి. ఇలా నా దగ్గరకు రమ్మని బ్రతిమాలుతున్నాను, రండి” అన్నాడు. కనుక ఆ సోదరులంతా యోసేపుకు దగ్గరగా వెళ్లారు. యోసేపు వాళ్లతో చెప్పాడు, “నేనే మీ సోదరుణ్ణి, యోసేపును. ఈజిప్టుకు బానిసగా మీరు అమ్మిన వాడిని నేనే. 5 ఇప్పుడేమీ బాధపడకండి. మీరు చేసినదాన్నిబట్టి మీ మీద మీరు కోపం తెచ్చుకోవద్దు. నేను ఇక్కడికి రావటం దేవుని ఏర్పాటు. మీ ప్రాణం కాపాడేందుకు నేను ఇక్కడికి వచ్చాను. 6 భయంకరమైన ఈ కరవు కాలం ఇప్పటికే రెండు సంవత్సరాలనుండి ఉంది. నాట్లు వేయకుండా, కోతలు కోయకుండా ఇంకా అయిదు సంవత్సరాలు గడచిపోవాలి. 7 కనుక మీ వాళ్లందరినీ ఈ దేశంలో నేను రక్షించాలని దేవుడే నన్ను మీకంటె ముందుగా ఇక్కడికి పంపించాడు. 8 నేను యిక్కడికి పంపబడటం మీ తప్పుకాదు. అదంతా దేవుని సంకల్పం. దేవుడు నన్ను ఫరోకు తండ్రిలా చేశాడు. ఆయన దివాణం అంతటిమీదను, మొత్తం ఈజిప్టు అంతటికిని నేను పాలకుడ్ని.”
ఇశ్రాయేలుకు ఈజిప్టు వచ్చుటకు ఆహ్వానం
9 “కనుక మీరు త్వరగా నా తండ్రి దగ్గరకు వెళ్లండి. ఆయన కుమారుడు యోసేపు పంపిన సందేశం ఇది అని నా తండ్రితో చెప్పండి అన్నాడు యోసేపు. ‘దేవుడు నన్ను ఈజిప్టు అంతటి మీద అధికారినిగా చేశాడు. ఇక్కడికి నా దగ్గరకు వచ్చేయండి. ఇంకా వేచి ఉండవద్దు. ఇప్పుడే వచ్చేయండి. 10 గోషెను దేశంలో నా దగ్గర మీరు నివసిస్తారు. మీరు, మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు, మీ జంతువులు, మీ మందలు ఇక్కడికి రావాలని ఆహ్వానిస్తున్నాను. 11 వచ్చే అయిదు కరువు సంవత్సరాల కాలంలోనూ నేను మిమ్మల్ని చూచుకొంటాను. అందుచేత మీరూ, మీ కుటుంబాలు, మీ స్వంతది ఏదీ నష్టపోదు.’”
12 యోసేపు తన సోదరులతో మాట్లాడటం కొనసాగిస్తూనే ఉన్నాడు. “ఇప్పుడు మీరు నిజంగా, నేను యోసేపును అని చూడగలుగుతున్నారు. నేనే అని మీ సోదరుడు బెన్యామీనుకు తెలుసు. మీతో మాట్లాడుతున్న నేను మీ సోదరుణ్ణి. 13 కనుక ఇక్కడ ఈజిప్టులో నాకు ఉన్న సమస్త ఘనతను గూర్చి నా తండ్రికి చెప్పండి. మీరు ఇక్కడ చూచిన వాటన్నింటి గూర్చి నా తండ్రికి చెప్పండి. ఇక మీరు త్వరపడి నా తండ్రిని నా దగ్గరకు తీసుకురండి.” అన్నాడు అతడు. 14 అప్పుడు యోసేపు తన తమ్ముడు బెన్యామీనును కౌగలించుకొని ఏడ్చాడు. బెన్యామీను కూడ ఏడ్చాడు. 15 తర్వాత యోసేపు తన సోదరులందరినీ ముద్దు పెట్టుకొని, వారి మీదపడి ఏడ్చాడు. ఆ తర్వాత ఆ సోదరులు అతనితో మాట్లాడటం మొదలు బెట్టారు.
9 “వీళ్ళకు, తమలో ఒకడైన యోసేపు మీద ఈర్ష్య ఉండేది. అందువల్ల వాళ్ళతణ్ణి ఈజిప్టు దేశానికి బానిసగా అమ్మేసారు. కాని దేవుడతనికి అండగా ఉండి, 10 అతణ్ణి కష్టాలనుండి రక్షించాడు. అతనికి జ్ఞానాన్ని యిచ్చాడు. ఆ జ్ఞానంతో అతడు ఈజిప్టు రాజైన ‘ఫరో’ అభిమానాన్ని సంపాదించాడు. ఫరో అతణ్ణి ఈజిప్టు దేశానికి పాలకునిగా, తన రాజభవనాలకు అధికారిగా నియమించాడు. 11 ఇంతలో ఈజిప్టు, కనాను దేశాల్లో కరువు రాగా ప్రజలు చాలా కష్టాలనుభవించారు. మన పూర్వికులకు తినటానికి తిండి కూడా లేకుండింది.
12 “ఈజిప్టు దేశంలో ధాన్యం ఉందని తెలియగానే యాకోబు మన పూర్వికుల్ని మొదటి సారిగా అక్కడకు పంపాడు. 13 రెండవసారి వచ్చినప్పుడు, యోసేపు తానెవ్వరన్న విషయం తన సోదరులకు చెప్పాడు. యోసేపు కుటుంబాన్ని గురించి ఫరోకు తెలిసిపోయింది. 14 ఆ తర్వాత యోసేపు తన తండ్రి యాకోబును, డెభ్బై ఐదు మందిగల తన కుటుంబాన్ని పిలవనంపాడు. 15 యాకోబు ఈజిప్టు దేశానికి వచ్చాక, అతడు, మన పూర్వికులు అందరూ చనిపోయారు. 16 వాళ్ళ దేహాలు షెకెము పట్టణానికి తేబడ్డాయి. అబ్రాహాము యిదివరలో హమోరు వంశం వాళ్ళకు డబ్బిచ్చి వాళ్ళనుండి ఒక స్మశాన భూమిని కొని ఉంచాడు. వాళ్ళు అక్కడ సమాధి చేయబడ్డారు.
© 1997 Bible League International