Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 107:1-3

అయిదవ భాగం

(కీర్తనలు 107–150)

107 యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి.
    ఆయన ప్రేమ శాశ్వతం.
యెహోవా రక్షించిన ప్రతి మనిషి ఆ మాటలు చెప్పాలి.
    వారి శత్రువుల నుండి యెహోవా రక్షించిన ప్రతి మనిషీ ఆయనను స్తుతించాలి.
అనేక దేశాల నుండి యెహోవా తన ప్రజలను ఒక్కచోట సమావేశపర్చాడు.
    తూర్పు పడమరల నుండి, ఉత్తర దక్షిణాల[a] నుండి ఆయన వారిని తీసుకొని వచ్చాడు.

కీర్తనలు. 107:33-43

33 దేవుడు నదులను ఎడారిగా మార్చాడు.
    నీటి ఊటలు ప్రవహించకుండా ఆయన నిలిపివేశాడు.
34 సారవంతమైన భూమిని పనికిమాలిన ఉప్పు భూమిగా దేవుడు మార్చాడు.
    ఎందుకంటే, అక్కడ నివసిస్తున్న ప్రజలు చేసిన చెడ్డపనులవల్లనే.
35 దేవుడు ఎడారిని సరస్సులుగల దేశంగా మార్చాడు.
    ఎండిన భూమి నుండి నీటి ఊటలు ప్రవహించేలా చేశాడు.
36 దేవుడు ఆకలితో ఉన్న ప్రజలను ఆ మంచి దేశానికి నడిపించాడు.
    ఆ ప్రజలు నివాసం ఉండుటకు ఒక పట్టణాన్ని నిర్మించాడు.
37 ఆ ప్రజలు వారి పొలాల్లో విత్తనాలు చల్లారు. పొలంలో ద్రాక్షలు వారు నాటారు.
    వారికి మంచి పంట వచ్చింది.
38 దేవుడు ఆ ప్రజలను ఆశీర్వదించాడు. వారి కుటుంబాలు పెద్దవయ్యాయి.
    వారికి ఎన్నెన్నో పశువులు ఉన్నాయి.
39 విపత్తు, కష్టాల మూలంగా వారి కుటుంబాలు
    చిన్నవిగా బలహీనంగా ఉన్నాయి.
40 దేవుడు వారి నాయకులను ఇబ్బంది పెట్టి అవమానించాడు.
    బాటలు లేని ఎడారిలో దేవుడు వారిని తిరుగులాడనిచ్చాడు.
41 అయితే, అప్పుడు దేవుడు ఆ పేద ప్రజలను వారి దౌర్భాగ్యం నుండి తప్పించాడు.
    ఇప్పుడు వారి కుటుంబాలు గొర్రెల మందల్లా పెద్దవిగా ఉన్నాయి.
42 మంచి మనుష్యులు యిది చూచి సంతోషిస్తారు.
    కాని దుర్మార్గులు యిది చూచి ఏమి చెప్పాలో తెలియక ఉంటారు.
43 ఒక వ్యక్తి తెలివిగలవాడైతే ఈ సంగతులను జ్ఞాపకం ఉంచుకొంటాడు.
    ఒక వ్యక్తి తెలివిగలవాడైతే నిజంగా దేవుని ప్రేమ అంటే ఏమిటో గ్రహిస్తాడు.

సంఖ్యాకాండము 11:16-23

16 మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయుల పెద్దలను (నాయకులను) 70 మందిని నాదగ్గరకు తీసుకొనిరా. వీరు ప్రజలలో నాయకులు. సన్నిధి గుడారం దగ్గరకు వారిని తీసుకొనిరా. అక్కడ నీతోబాటు వారిని నిలబెట్టు. 17 అప్పుడు నేను దిగివచ్చి, అక్కడ నీతో మాట్లాడతాను. ఇప్పుడు నీ మీదికి వచ్చిన ఆత్మను వారికికూడ నేను కొంత ఇస్తాను. అప్పుడు నీవు ప్రజల బాధ్యత వహించటంలో వారు కూడ నీకు సహాయం చేస్తారు. ఈ విధంగా ఈ ప్రజల బాధ్యత నీవు ఒంటరిగా భరించాల్సిన అవసరం ఉండదు.

18 “ప్రజలతో ఇలా చెప్పు: రేపటికోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. రేపు మీరు మాంసం తింటారు. మీ ఏడ్పు యెహోవా విన్నాడు. ‘తినటానికి మాకు మాంసం కావాలి. ఈజిప్టులోనే బాగుంది మాకు’ అని మీరు చెప్పిన మాటలు యెహోవా విన్నాడు. కనుక యెహోవా ఇప్పుడు మీకు మాంసం ఇస్తాడు. మీరు అది తింటారు. 19 ఒకటి, రెండు, అయిదు, పది, ఇరవై రోజులకంటె ఎక్కువగానే మీరు అది తింటారు. 20 ఒక నెల అంతా మీరు ఆ మాంసం తింటారు. మొఖం మొత్తేటంతవరకు మీరు ఆ మాంసం తింటారు. యెహోవాకు వ్యతిరేకంగా మీరు ఫిర్యాదు చేసారు కనుక మీకు ఇలా జరుగుతుంది. యెహోవా మీ మధ్య సంచరిస్తూ, మీ అవసరాలను గ్రహిస్తాడు. కానీ మీరు ఆయన ఎదుట ఏడ్చి, ఫిర్యాదు చేసారు! అసలు ‘మేము ఈజిప్టు ఎందుకు విడిచిపెట్టాము’ అన్నారు మీరు.”

21 మోషే ఇలా అన్నాడు: “యెహోవా, ఇక్కడ 6,00,000 మంది పురుషులు సంచరిస్తున్నారు. ‘నీవేమో వారు ఒక నెలంతా తినటానికి సరిపోయే మాంసం ఇస్తాను అంటున్నావు!’ 22 మొత్తం గొర్రెలు, పశువులు అన్నింటినీ వధించినా, ఇంత మంది ప్రజలకు ఒక నెల అంతా భోజనంగా పెట్టాలంటే అది చాలదు. అలానే సముద్రంలో ఉన్న మొత్తం చేపలన్నీ మేము పట్టినా, అవీ వారికి చాలవు.”

23 అయితే, “యెహోవా శక్తిని పరిమితం చేయకు. నేను చేస్తానని చెప్పినవాటిని చేస్తానో లేదో నీవు చూస్తావు” అని మోషేతో యెహోవా చెప్పాడు.

సంఖ్యాకాండము 11:31-32

పూరేళ్లు వచ్చాయి

31 అప్పుడు యెహోవా సముద్రం నుండి గొప్పగాలి వీచేటట్టుగా చేసాడు. ఆ గాలి పూరేళ్లను ఆ ప్రాంతంలోకి విసిరాయి. వారి నివాసాల చుట్టూరా పూరేళ్లు ఎగిరాయి. నేల అంతా పూరేళ్లతో నిండి పోయేటన్ని ఉన్నాయి అవి. నేలమీద మూడు అడుగుల ఎత్తుగా పూరేళ్లు నిండిపోయాయి. ఒక మనిషి ఒక రోజున నడువగలిగినంత దూరం అన్ని దిశల్లో పూరేళ్లు ఉన్నాయి. 32 ప్రజలు బయటకు వెళ్లి ఆ రాత్రి పగలు అంతా పూరేళ్లను ఏరుకొన్నారు. ఆ మర్నాడు అంతా వారు పూరేళ్లు పోగుచేసుకొన్నారు. తక్కువ కూర్చుకొన్నవాడు నూరు తూములుకన్నా ఎక్కువ పూరేళ్లను పోగుచేసుకున్నాడు. తర్వాత ప్రజలు ఆ పూరేళ్లను వారి గుడారాల చుట్టూ ఎండటానికి ఎండలో పరిచారు.

ఎఫెసీయులకు 4:17-24

వెలుగు పిల్లలుగా జీవించటం

17 ప్రభువు పేరిట నేను ఈ విషయం చెప్పి వారిస్తున్నాను. ఇక మీదట యూదులు కానివాళ్ళవలే జీవించకండి. వాళ్ళ ఆలోచనలు నిరుపయోగమైనవి. 18 వాళ్ళు చీకట్లో ఉన్నారు. వాళ్ళలో ఉన్న మూర్ఖత కారణంగా వాళ్ళ హృదయాలు కఠినంగా ఉండటం వల్ల వాళ్ళకు దేవుడిచ్చిన జీవితంలో భాగం లభించలేదు. 19 వాళ్ళు మంచిగా ఉండటం మానుకొన్నారు. అంతులేని ఆశతో శారీరక సుఖాలు అనుభవిస్తూ అన్ని రకాల అపవిత్రమైన సుఖాలకు మరిగారు. 20 కాని మీరు క్రీస్తును గురించి నేర్చుకొన్నది యిది కాదు. 21 మీరు యేసును గురించి విన్నారు. ఆయనలో ఉన్న సత్యాన్ని ఆయన పేరిట నేర్చుకొన్నారు. 22 మీ గత జీవితం మిమ్మల్ని పాడు చేసింది. దాన్ని మరిచిపొండి. మీ మోసపు తలంపులు మిమ్మల్ని తప్పు దారి పట్టించాయి. తద్వారా మీ గత జీవితం మిమ్మల్ని నాశనం చేసింది. 23 మీ బుద్ధులు, మనస్సులు మారి మీలో నూతనత్వం రావాలి. 24 దేవుడు తన పోలికలతో సృష్టించిన క్రొత్త మనిషిగా మీరు మారాలి. ఆ క్రొత్త మనిషిలో నిజమైన నీతి, పవిత్రత ఉన్నాయి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International