Revised Common Lectionary (Complementary)
23-24 కాని అప్పుడు దేవుడు పైన మేఘాలను తెరిచాడు.
వారికి ఆహారంగా ఆయన మన్నాను కురిపించాడు.
అది ఆకాశపు ద్వారాలు తెరచినట్టు
ఆకాశంలోని ధాన్యాగారంనుండి ధాన్యం పోసినట్టు ఉంది.
25 ప్రజలు దేవదూతల ఆహారం తిన్నారు.
ఆ ప్రజలను తృప్తిపరచుటకు దేవుడు సమృద్ధిగా ఆహారం పంపించాడు.
26-27 అంతట దేవుడు తూర్పు నుండి ఒక బలమైన గాలి వీచేలా చేశాడు.
వర్షం కురిసినట్లుగా పూరేళ్లు[a] వారిమీద వచ్చి పడ్డాయి.
దేవుని మహా శక్తి తేమాను నుండి గాలి వీచేలా చేసింది.
ఆ పక్షులు చాలా విస్తారంగా ఉండినందుచేత నీలాకాశం నల్లగా మారిపోయింది.
28 ఆ ప్రజల గుడారాల చుట్టూరా, వారి ఇండ్ల మధ్యలో
ఆ పక్షులు వచ్చి పడ్డాయి.
29 తినేందుకు వారికి సమృద్ధిగా ఉంది.
కాని తమ ఆకలి తమని పాపం చేసేలా వారు చేసుకున్నారు.
43 మోషే అహరోనులతో యెహోవా యిలా చెప్పాడు: “పస్కా పండుగకు నియమాలు ఇవి. పస్కా భోజనం విదేశీయుడెవరూ తినకూడదు. 44 ఒకడు బానిసను కొంటే, ఆ బానిసకు అతడు సున్నతి చేస్తే అప్పుడు ఆ బానిస పస్కా పండుగ భోజనం చెయ్యవచ్చు. 45 అయితే, ఒక వ్యక్తి కేవలం మీ దేశంలో ఉంటున్నా, లేక మీకోసం పని చేసేందుకు కూలికి కుదుర్చుకొన్నా, అలాంటి వ్యక్తి పస్కా పండుగ భోజనం చెయ్యకూడదు. (పస్కా పండుగ ఇశ్రాయేలీయులకు మాత్రమే)”
46 “ప్రతి కుటుంబము ఒకే ఇంటిలో భోజనం చేయాలి. భోజనాన్ని ఎవ్వరూ ఇంటి బయట తినకూడదు. మీరు గొర్రెమాంసము తిని దాని ఎముకను విరువకూడదు. 47 ఇశ్రాయేలు ప్రజలందరు ఈ పండుగను ఆచరించాలి. 48 ఇశ్రాయేలు సమాజంలో సభ్యుడు కాని ఏ వ్యక్తి అయినా మీతోబాటు నివసిస్తూ ఉండి యెహోవా పస్కా పండుగలో అతడు పాల్గొనాలనుకొంటే, అతనికి సున్నతి చేయాలి. అప్పుడు అతను కూడ ఇశ్రాయేలు పౌరుడుగా ఆ భోజనంలో పాల్గొనవచ్చు. కాని ఒకడు సున్నతి చేసుకోకపోతే అతను పస్కా పండుగ భోజనంలో పాల్గొన కూడదు. 49 అందరికీ ఇవే నియమాలు వర్తిస్తాయి. మీ దేశంలో నివసిస్తున్న వ్యక్తి పౌరుడైనా సరే, విదేశీయుడైనా సరే యివే నియమాలు వర్తిస్తాయి.”
50 మోషే అహరోనులకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలకు ప్రజలంతా విధేయులయ్యారు. 51 కనుక అదే రోజు ఇశ్రాయేలు ప్రజలందరినీ ఈజిప్టు దేశం నుండి యెహోవా బయటకు నడిపించాడు. ప్రజలు గుంపులుగా బయల్దేరారు.
13 అప్పుడు యెహోవా మోషేతో యిలా అన్నాడు. 2 “ఇశ్రాయేలులో పెద్దకుమారుడు ప్రతి ఒక్కడూ నాకు చెందుతాడు. ప్రతి స్త్రీకి పుట్టిన పెద్దకుమారుడూ నావాడు. మీ జంతువుల్లో మొదట పుట్టే ప్రతి మగదాన్నీ మీరు నాకు అర్పించాలి.”
27 కనుక ప్రభువు పట్ల అయోగ్యముగా ఎవరు ఆయన రొట్టె తింటారో, ఎవరు ఆయన పాత్ర నుండి త్రాగుతారో అతడు ప్రభువు శరీరం పట్ల, ఆయన రక్తం పట్ల పాపం చేసినవాడగును. 28 ప్రతీ వ్యక్తి రొట్టెను తినే ముందు, ఆ పాత్రనుండి త్రాగే ముందు తన ఆత్మను స్వయంగా పరిశోధించుకోవాలి. 29 ప్రభువు శరీరమని గ్రహించక రొట్టెను తినువాడు, మరియు ద్రాక్షారసం త్రాగువాడు శిక్షావిధికి గురి అవుతాడు. 30 అందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగగ్రస్తులు అయినారు, కొందరు మరణించారు. 31 కనుక మొదటే మనల్ని మనం పరీక్షించుకొంటే మనం శిక్ష పొందం. దేవుడు మనల్ని శిక్షించడు. 32 కాని, మనకు సరియైన శిక్షణ యివ్వాలని ప్రభువు మనల్ని శిక్షిస్తాడు. ప్రపంచంతో పాటు మనకు శిక్ష లభించరాదని ఆయన ఉద్దేశ్యం.
33 అందువల్ల నా సోదరులారా! మీరు భోజనానికి సమావేశమైనప్పుడు ఒకరి కోసం ఒకరు కాచుకోండి. 34 మీరు సమావేశమైనప్పుడు ఒకవేళ మీలో ఎవరికైనా ఆకలి వేస్తే, అలాంటివాడు యింట్లోనే తిని రావాలి. అలా చేస్తే మీరు సమావేశమైనప్పుడు తీర్పుకు గురికారు. నేను వచ్చినప్పుడు మీకు మిగతా ఆజ్ఞలు యిస్తాను.
© 1997 Bible League International