Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 111

111 యెహోవాను స్తుతించండి!
మంచి మనుష్యులు సమావేశమయ్యే సమాజంలో
    నేను నా హృదయపూర్తిగా యెహోవాకు వందనాలు చెల్లిస్తాను.
యెహోవా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
    దేవుని నుండి లభ్యమయ్యే మంచిది ప్రతి ఒక్కటి ప్రజలకు కావాలి.
దేవుడు వాస్తవంగా మహిమగల ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
    ఆయన మంచితనం నిరంతరం కొనసాగుతుంది.
దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
    కనుక యెహోవా దయ, జాలి గలవాడని మనం జ్ఞాపకం చేసుకొంటాము.
దేవుడు తన అనుచరులకు ఆహారం ఇస్తాడు.
    దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొంటాడు.
దేవుడు చేసిన శక్తివంతమైన పనులు ఆయన తన ప్రజలకు
    వారి దేశాన్ని ఇస్తున్నాడని తెలియజేస్తున్నాయి.
దేవుడు చేసే ప్రతిది మంచిది, న్యాయమయింది కూడా.
    ఆయన ఆదేశాలు అన్నీ నమ్మదగినవి.
దేవుని ఆదేశాలు నిత్యం కొనసాగుతాయి.
    ఆ ఆదేశాలు ఇవ్వటంలోగల దేవుని కారణాలు నిజాయితీగలవి, పవిత్రమైనవి.
దేవుడు తన ప్రజలను రక్షిస్తాడు. దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా కొనసాగేందుకు చేసాడు.
    దేవుని నామం అద్భుతం, పవిత్రం!
10 దేవుడంటే భయము, భక్తి ఉంటేనే జ్ఞానం ప్రారంభం అవుతుంది.
    దేవుణ్ణి గౌరవించే ప్రజలు చాలా జ్ఞానంగలవారు.
శాశ్వతంగా దేవునికి స్తుతులు పాడుతారు.

యెషయా 25:6-10

తన సేవకులకు, దేవుని విందు

ఆ కాలంలో, సర్వశక్తిమంతుడైన యెహోవా ప్రజలందరికీ ఈ కొండ మీద విందు చేస్తాడు. ఆ విందులో శ్రేష్ఠమైన భోజనాలు, ద్రాక్షరసాలు ఉంటాయి. మాంసం లేతగా బాగుంటుంది.

కానీ ఇప్పుడు రాజ్యాలన్నింటినీ, ప్రజలనూ కప్పి వేసే ముసుగు ఉంది. ఈ ముసుగు “మరణం” అని పిలువబడుతుంది కానీ మరణం శాశ్వతంగా నాశనం చేయబడుతుంది మరియు నా ప్రభువు యెహోవా ప్రతి ఒక్కరి చెంపల మీదా ప్రతీ కన్నీటి బొట్టునూ తుడిచి వేస్తాడు. గతంలో ఆయన ప్రజలు అందరూ విచారంగా ఉన్నారు. అయితే దేవుడు ఆ విచారాన్ని భూమి మీద నుండి తీసి వేస్తాడు. ఇలా జరుగుతుంది అని యెహోవా చెప్పాడు గనుక ఇదంతా జరుగుతుంది.

ఆ సమయంలో ప్రజలు అంటారు,
    “ఇదిగో మన దేవుడు ఇక్కడ ఉన్నాడు.
మనం కనిపెడ్తున్నవాడు ఈయనే.
    మనల్ని రక్షించటానికి ఈయన వచ్చాడు.
మనం మన యెహోవా కోసం కనిపెడుతున్నాం.
    అందుచేత యెహోవా మనలను రక్షించినప్పుడు మనం ఆనందించి, సంతోషంగా ఉందాం.”
10 యెహోవా హస్తం (శక్తి) ఈ కొండ మీద ఉంది.
    మరియు మోయాబు ఓడించబడుతుంది.
యెహోవా శత్రువును అణగ త్రొక్కుతాడు.
    చెత్త కుప్ప మీద వరిగడ్డిపై నడిచినట్టుగా అది ఉంటుంది.

మార్కు 6:35-44

35 అప్పటికే మధ్యాహ్నం దాటి సాయంకాలమవుతూ వుంది. ఆయన శిష్యులు వచ్చి, “ఇది నిర్మానుష్య ప్రాంతం. ఇప్పటికే సాయంకాలమవుతూ వుంది. 36 మీరి ప్రజల్ని పంపివేస్తే వాళ్ళు చుట్టూవున్న పల్లెలకో లేక గ్రామలకో వెళ్ళి ఏదైనా కొనుక్కొని తింటారు” అని అన్నారు.

37 కాని యేసు, “వాళ్ళు తినటానికి మీరే ఏదైనా ఇవ్వండి!” అని సమాధానం చెప్పాడు.

“రెండు వందల దేనారాలకు రొట్టెలు కొని వాళ్లకు పంచి పెట్టమంటావా?” అని ఆయన్ని అడిగారు.

38 “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయో వెళ్ళి చూడండి” అని యేసు అన్నాడు.

వాళ్ళు వెళ్ళి చూసి వచ్చి, “ఐదు రొట్టెలు, రెండు చేపలు ఉన్నాయి” అని అన్నారు.

39 పచ్చిగడ్డి మీద అందరిని గుంపులు గుంపులుగా కూర్చోబెట్టమని శిష్యులతో చెప్పాడు. 40 ప్రజలు గుంపుకు యాబై, నూరుగురి చొప్పున కూర్చున్నారు.

41 యేసు ఆ ఐదు రొట్టెల్ని రెండు చేపల్ని తీసుకొని ఆకాశం వైపు చూసి కృతజ్ఞత చెప్పి రొట్టెల్ని తుంచాడు. అవి తన శిష్యులకిచ్చి ప్రజల ముందుంచమన్నాడు. అదే విధంగా ఆ రెండు చేపల్ని కూడా భాగాలు చేసి అందరికి పంచాడు.

42 అందరూ సంతృప్తిగా తిన్నారు. 43 శిష్యులు మిగిలిన రొట్టెముక్కల్ని, చేప ముక్కల్ని పన్నెండు గంపల నిండా నింపారు. 44 ఆ రోజు అక్కడ ఐదు వేలమంది పురుషులు భోజనం చేసారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International