Revised Common Lectionary (Complementary)
కఫ్
81 నీవు నన్ను రక్షిస్తావని నిరీక్షిస్తూ నేను చనిపోబోతున్నాను.
కాని యెహోవా, నీవు చెప్పే విషయాలు నేను నమ్ముతాను.
82 నీవు వాగ్దానం చేసిన వాటికోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. కాని నా కళ్లు అలసిపోతున్నాయి.
యెహోవా, నీవు నన్ను ఎప్పుడు ఆదరిస్తావు?
83 నేను చెత్తకుప్పలో ఎండిపోయిన ద్రాక్ష తొక్కలా ఉన్నప్పుడు కూడా
నీ న్యాయ చట్టాలను నేను మరచిపోలేదు.
84 నేను ఎంత కాలం జీవిస్తాను?
యెహోవా, నన్ను హింసించే మనుష్యులకు ఎప్పుడు తీర్పు తీరుస్తావు?
85 కొందరు గర్విష్ఠులు వారి అబద్ధాలతో నన్ను పొడిచారు.
మరి అది నీ ఉపదేశాలకు విరుద్ధం.
86 యెహోవా, మనుష్యులు నీ ఆజ్ఞలన్నింటిని నమ్మగలరు.
అబద్ధికులు నన్ను హింసిస్తారు. నాకు సహాయం చేయుము!
87 ఆ అబద్ధికులు నన్ను దాదాపుగా నాశనం చేశారు.
నేను మాత్రం నీ ఆదేశాలను అనుసరించటం మానలేదు.
88 యెహోవా, నిజమైన నీ ప్రేమ చూపించి నన్ను జీవించనిమ్ము.
నీవు చెప్పే వాటిని నేను చేస్తాను.
ఆపద రోజు
16 యెహోవా వర్తమానం నాకు వచ్చింది: 2 “యిర్మీయా, నీవు వివాహం చేసికోరాదు. ఈ స్థలములో నీవు కొడుకులను, కూతుళ్లను కలిగి యుండరాదు.”
3 యూదా రాజ్యంలో పుట్టిన కొడుకులు, కూతుళ్లను గురించి యెహోవా ఈ విషయాలు చెప్పాడు. మరియు ఆ పిల్లల తల్లిదండ్రులను గూర్చి యెహోవా ఇలా సెలవిచ్చాడు: 4 “ఆ ప్రజలు ఒక భయంకరమైన చావు చస్తారు! వారిని గురించి ఒక్కడు కూడా ఏడ్వడు, విచారించడు. వారినెవ్వడూ సమాధిచేయడు. పశువుల పేడవలె వారి శవాలు నేలమీద పడివుంటాయి. వారు శత్రువు కత్తికి బలియైపోతారు. లేదా ఆకలితో మాడి చనిపోతారు. వారి శవాలు ఆకాశ పక్షులకు, అడవి జంతువులకు ఆహారమవుతాయి.”
5 అందువల్ల యెహోవా ఇలా చెప్పాడు: “యిర్మీయా, ఏ ఇంటిలోనయితే చావు దినపు భోజనాలు జరుగుతూ వుంటాయో, నీవా ఇంటిలోనికి పోవద్దు. చనిపోయిన వారికొరకు విలపించటానికి గాని, నీ సంతాపాన్ని వెలిబుచ్చటానికి గాని నీవక్కడికి వెళ్లవద్దు. ఆ పనులు నీవు చేయవద్దు. ఎందువల్లనంటే, నా ఆశీర్వాదాన్ని నేను తిరిగి తీసుకున్నాను. యూదా ప్రజలకు నేను కరుణ చూపను. వారి కొరకు నేను బాధపడను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
6 “యూదా రాజ్యంలో ప్రముఖులు, సామాన్యులు అంతా చనిపోతారు. వారినెవరూ సమాధిచేయరు. లేక వారి కొరకు ఎవ్వరూ దుఃఖించరు. మృతుల కొరకు దుఃఖ సూచకంగా ఎవ్వడూ తన శరీరం చీరుకొనటంగాని, తల గొరిగించుకోవటం గాని చేయడు. 7 చనిపోయిన వారికొరకై విలపించేవారికి ఎవ్వరూ ఆహారం తెచ్చియివ్వరు. తల్లిదండ్రులు చనిపోయి విలపించేవారిని ఎవ్వరూ ఓదార్చరు. మృతుల కొరకు రోదించేవారిని ఆదరించుటకు ఎవ్వరూ తాగటానికి నీరు ఇవ్వరు.
8 “విందు జరుపుకుంటూన్న ఏ ఇంటిలోనికీ నీవు వెళ్లవద్దు. ఆ ఇంట్లోకి వెళ్లి తాగటానికి, తినటానికి కూర్చోవద్దు. 9 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తి మంతుడైన యెహోవా ఇలా చెప్పినాడు: ‘వేడుక చేసుకొనే వారు ఆనందమును నేను వెంటనే ఆపివేస్తాను. ఇది నీ జీవితకాలంలోనే జరుగుతుంది. ఇవన్నీ త్వరలోనే చేస్తాను.’
10 “యిర్మీయా, యూదా ప్రజలకు నీవు ఈ విషయాలన్నీ చెపుతావు. తిరిగి వారు నిన్నిలా అడుగుతారు: ‘మా విషయంలో దేవుడు ఆ భయంకర విషయాలు జరుగుతాయని ఎందుకు చెప్పాడు? మేము చేసిన తప్పేమిటి? మా యెహోవా దేవునికి వ్యతిరేకంగా మేము చేసిన పాపం ఏమిటి?’ 11 అప్పుడు వారికి నీవు ఈ విషయాలు చెప్పాలి: ‘ఈ భయంకర పరిణామాలు జరగబోవడానికి కారణం మీ పితరులు నన్ను అనుసరించటం మానివేయటమే’ ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది: ‘వారు నన్ను వదిలి అనేక ఇతర దైవముల ననుసరించి ఆరాధించినారు. మీ పితరులు నన్ను వదిలి, నా ధర్మశాస్త్రాన్ని అనుసరించుట మానివేశారు. 12 కాని మీరు మీ పూర్వీకులకంటె నీచంగా పాపం చేశారు. మీరు కఠినాత్ములై చాలా మొండివైఖిరి దాల్చారు. మీరు చేయదలచుకున్నదే మీరు చేస్తున్నారు. మీరు నాకు విధేయులుగా లేరు. మీకు యిష్టమైనదే మీరు చేస్తున్నారు. 13 కావున మిమ్మల్ని ఈ దేశంనుండి బహిష్కరిస్తాను. మిమ్మల్ని అన్యదేశానికి తరిమివేస్తాను. మీరు, మీ పూర్వీకులు ముందెన్నడూ చూడని దేశానికి మీరు వెళతారు. అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు బూటకపు దేవతలను వెంబడించవచ్చు. నేను మీకు సహాయం చేయను. ఏ రకమైన ఉపకారమూ చేయను.’
సహనము
7 అందువల్ల సోదరులారా! ప్రభువు వచ్చే వరకు సహనంతో ఉండండి. రైతు పొలం నుండి వచ్చే విలువైన పంటకోసం ఏ విధంగా కాచుకొని ఉంటాడో గమనించండి. అతడు, తొలకరి కడవరి వర్షం దాకా సహనంతో కాచుకొని ఉంటాడు. 8 ప్రభువు రానున్న సమయం సమీపిస్తోంది. కనుక ధైర్యం చెడకుండా సహనంతో ఉండండి. 9 సోదరులారా! ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోకండి. అలా చేస్తే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆ న్యాయాధిపతి మీ తలుపు ముందు నిలుచున్నాడు.
10 సోదరులారా! ప్రభువు పక్షాన మాట్లాడిన ప్రవక్తలు కష్టాలు అనుభవించారు. వాళ్ళలో సహనం ఉంది. వాళ్ళను ఆదర్శంగా తీసుకోండి. 11 కష్టాలు అనుభవించి కూడా విశ్వాసంతో ఉన్నవాళ్ళను మనము ధన్యులుగా భావిస్తాము. యోబు సహనాన్ని గురించి మీరు విన్నారు. ప్రభువు చేసినదాన్ని చూసారు. ప్రభువులో దయా దాక్షిణ్యాలు సంపూర్ణంగా ఉన్నాయి.
మీరేమంటున్నారో జాగ్రత్త
12 నా సోదరులారా! అన్నిటికన్నా ముఖ్యమైనదేమిటంటే, పరలోకం పేరిట గాని, భూమి పేరిట గాని, మరేదానిపై గాని ఒట్టు పెట్టుకోకండి. మీరు “ఔను” అని అనాలనుకొంటె “ఔను” అనండి. “కాదు” అని అనాలనుకొంటె “కాదు” అని అనండి. అలా చేస్తే దేవుడు మిమ్మల్ని శిక్షించడు.
© 1997 Bible League International