Revised Common Lectionary (Complementary)
ఆసాపు ధ్యాన గీతం.
74 దేవా, నీవు మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టేశావా?
నీవు నీ ప్రజల మీద ఇంకా కోపంగా ఉన్నావా?
2 చాలా కాలం క్రిందట నీవు కొన్న ప్రజలను జ్ఞాపకం చేసుకో.
నీవు మమ్మల్ని రక్షించావు. మేము నీకు చెందినవాళ్లం.
నీ నివాస స్థానమైన సీయోను పర్వతాన్ని జ్ఞాపకముంచుకొనుము.
3 దేవా, నీవు వచ్చి ఈ పురాతన శిథిలాల మధ్య నడువుము.
శత్రువు నాశనం చేసిన పవిత్ర స్థలానికి మరలా రమ్ము.
4 శత్రువులు ఆలయంలో యుద్ధపు కేకలు వేసారు.
యుద్ధంలో తాము గెలిచినట్లు చూపించుటకు వారు జెండాలను ఆలయంలో ఉంచారు.
5 శత్రుసైనికులు గొడ్డలితో కలుపు మొక్కలను
నరికే మనుష్యుల్లా ఉన్నారు.
6 ఈ సైనికులు తమ గొడ్డళ్లను సమ్మెటలను ప్రయోగించి దేవా,
నీ ఆలయంలోని నగిషీ గల చెక్క పనిని నరికివేశారు.
7 దేవా, ఆ సైనికులు నీ పవిత్ర స్థలాన్ని కాల్చివేశారు.
వారు నీ ఆలయాన్ని నేలమట్టంగా కూల్చివేశారు.
ఆ ఆలయం నీ నామ ఘనత కోసం నిర్మించబడింది.
8 శత్రువు మమ్మల్ని పూర్తిగా చితుకగొట్టాలని నిర్ణయించాడు.
దేశంలోని ప్రతి ఆరాధనా స్థలాన్నీ వారు కాల్చివేసారు.
9 మా సొంత గుర్తులు ఏవీ మేము చూడలేక పోయాము.
ఇంకా ప్రవక్తలు ఎవరూ లేరు.
ఏమి చేయాలో ఎవ్వరికీ తెలియదు.
10 దేవా, ఇకెంత కాలం శత్రువు మమ్మల్ని ఎగతాళి చేస్తాడు?
నీ శత్రువు నీ నామమును శాశ్వతంగా అవమానించనిస్తావా?
11 దేవా, నీవెందుకు మమ్మల్ని అంత కఠినంగా శిక్షించావు?
నీవు నీ మహా శక్తిని ప్రయోగించి మమ్మల్ని పూర్తిగా నాశనం చేశావు.
12 దేవా, చాల కాలంగా నీవే మా రాజువు.
నీవు ఎల్లప్పుడూ మమ్ములను విడుదలచేసి నీవు భూమిమీద రక్షణ తెస్తావు.
13 దేవా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేందుకు నీవు నీ మహా శక్తిని ప్రయోగించావు.
14 మకరపు తలను నీవు చితుకగొట్టావు.
దాని శరీరాన్ని అడవి జంతువులు తినివేయుటకు విడిచిపెట్టావు.
15 జల ఊటలను, భూగర్భ జలాన్ని నీవు తెరచి ప్రపంచాన్ని వరదపాలు చేశావు.
మరియు నదులు ఎండిపోవునట్లు నీవు చేశావు.
16 దేవా, పగటిని నీవు ఏలుతున్నావు. మరియు రాత్రిని నీవు ఏలుతున్నావు.
సూర్యుని, చంద్రుని నీవే చేశావు.
17 భూమి మీద ఉన్న సమస్తానికీ నీవే హద్దులు నియమించావు.
వేసవికాలం, చలికాలం నీవే సృష్టించావు.
18 దేవా, ఈ సంగతులు జ్ఞాపకం చేసుకో. మరియు శత్రువు నిన్ను అవమానించాడని జ్ఞాపకం చేసుకో.
ఆ తెలివితక్కువ ప్రజలు నీ నామాన్ని ద్వేషిస్తారు.
19 దేవా, ఆ అడవి మృగాలను నీ పావురాన్ని[a] తీసుకోనివ్వకుము.
నీ పేద ప్రజలను శాశ్వతంగా మరచిపోకుము.
20 నీ ఒడంబడికను జ్ఞాపకం చేసుకొనుము.
ఈ దేశంలోని ప్రతి చీకటి స్థలంలోనూ బలాత్కారమే ఉంది.
21 దేవా, నీ ప్రజలకు అవమానం కలిగింది.
వారిని ఇంకెంత మాత్రం బాధపడనివ్వకుము.
నిస్సహాయులైన నీ పేద ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
22 దేవా, లేచి పోరాడుము.
ఆ తెలివితక్కువ ప్రజలు ఎల్లప్పుడూ నిన్ను అవమానించారని జ్ఞాపకం చేసుకొనుము.
23 ప్రతి రోజూ నీ శత్రువులు నిన్ను గూర్చి చెప్పిన చెడు సంగతులు మరచిపోకుము.
ఎడతెగక నీ శత్రువులు చేసే గర్జనను మరువవద్దు.
16 యెహోవా, ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు
నిన్ను జ్ఞాపకం చేసుకొంటారు.
నీవు ప్రజలను శిక్షించినప్పుడు
వారు మౌన ప్రార్థనలు నీకు చేస్తారు.
17 యెహోవా, మేం నీతో లేనప్పుడు
మేం ప్రసవవేదన పడుతున్న స్త్రీలా ఉంటాం
ఆమె ఏడుస్తుంది, ప్రసవ బాధ పడుతుంది.
18 అదే విధంగా మాకు బాధ ఉంది
మేము కంటాము, కాని, గాలిని మాత్రమే.
ప్రపంచానికి మేం క్రొత్త మనుష్యుల్ని తయారు చేయం.
దేశానికి మేం రక్షణ కలిగించం
19 కాని యెహోవా చెప్పేదేమంటే,
“నీ ప్రజలు మరణించారు
కానీ వారు మళ్లీ లేస్తారు
నా ప్రజల శరీరాలు
మరణం నుండి లేస్తాయి.
భూమిలోని మృతులు లేచి,
సంతోషిస్తారు.
నిన్ను కప్పియున్న మంచు,
ఒక క్రొత్త రోజు వెలుతురులా ఉంది.
ఒక క్రొత్త కాలం వస్తోందని అది సూచిస్తుంది
ప్రజలు ఇప్పుడు భూమిలో పాతిపెట్ట బడ్డారు, కాని వారు నూతన జీవం పొందుతారు.”
తీర్పు: బహుమానం లేక శిక్ష
20 నా ప్రజలారా, మీ గదుల్లోకి వెళ్లండి.
తలుపులకు తాళాలు వేసుకోండి.
కొద్దికాలం పాటు మీ గదుల్లో దాక్కోండి.
దేవుని కోపం తగ్గేంతవరకు దాక్కోండి.
21 యెహోవా తన నివాసం విడిచి వస్తున్నాడు.
ప్రపంచంలోని మనుష్యులు చేసిన చెడు కార్యాలను బట్టి దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు.
చంపబడిన వారి రక్తాన్ని భూమి చూపిస్తుంది
భూమి ఇక ఎన్నటికీ చనిపోయిన వాళ్లను కప్పెట్టదు.
27 ఆ సమయంలో వంకర సర్పమైన మకరానికి ఆయన తీర్పు తీర్చును.
యెహోవా తన ఖడ్గం ప్రయోగిస్తాడు,
కఠినమైన, తన శక్తిగల ఖడ్గంతో ఆయన మకర సర్పాన్ని ఆ మెలికల సర్పాన్ని శిక్షిస్తాడు.
ఆ పెద్ద ప్రాణిని సముద్రం లోనే యెహోవా చంపేస్తాడు.
యేసుని శక్తి దేవునినుండి వచ్చినది
(మత్తయి 12:22-30; మార్కు 3:20-27)
14 ఒక రోజు యేసు ఒక మూగ దయ్యాన్ని పారద్రోలుతూ ఉన్నాడు. ఆ దయ్యం వెళ్ళిపోగానే అది పట్టిన మనిషి మాట్లాడటం మొదలు పెట్టాడు. అది చూసి ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. 15 కొందరు, “బయెల్జెబూలు అనే దయ్యాలరాజు ద్వారా అతడు దయ్యాల్ని పారద్రోలుతున్నాడు” అని అన్నారు.
16 మరి కొందరు యేసును పరీక్షించుచూ ఒక అద్భుతం పరలోకం నుండి చూపుమని అడిగారు. 17 యేసుకు వాళ్ళ అభిప్రాయం తెలిసిపోయింది. అందువల్ల వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “చీలికలు కలిగిన యిల్లు పడిపోతుంది. 18 సైతానురాజ్యంలో చీలికలు కలిగితే వాని రాజ్యం ఎలా నిలుస్తుంది? ఇలా ఎందుకు అంటున్నానంటే బయెల్జెబూలు సహాయంతో నేను దయ్యాల్ని వదిలిస్తున్నానని మీరు అంటున్నారు. 19 నేను బయెల్జెబూలు ద్వారా దయ్యాల్ని వదిలిస్తున్నట్లైతే, మీ వాళ్ళు దేని సహయంతో దయ్యాల్ని వదిలిస్తున్నారు? అందువల్ల మీ వాదన తప్పని మీ వాళ్ళే రుజువు చేస్తున్నారు. 20 కాని నేను దైవశక్తితో దయ్యాల్ని వదిలిస్తున్నాను కనుక, దేవుని రాజ్యం వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తొంది.
21 “ఒక బలవంతుడు ఆయుధాల్ని ధరించి తన యింటిని కాపలా కాస్తే అతని యింట్లోని వస్తువులు భధ్రంగా ఉంటాయి. 22 కాని అతని కన్నా బలవంతుడు వచ్చి మీదపడి అతన్ని ఓడిస్తే అతడిన్నాళ్ళు నమ్ముకున్న ఆయుధాలన్నీ ఇంటివానియొద్ద నుండి తీసుకొని, ఆదోచుకొన్న వస్తువుల్ని అందరికి పంచి పెడ్తాడు.
23 “నాతో ఉండని వాడు నాకు వ్యతిరేకంగా ఉన్న వానితో సమానము. నాతో కలిసి గొఱ్ఱెల్ని ప్రోగుచేయటానికి సహాయం చెయ్యనివాడు వాటిని చెదరగొట్టిన వానితో సమానము.
శూన్యమై ఉండుట అపాయము
(మత్తయి 12:43-45)
24 “దయ్యము ఒక మనిషి నుండి వెలుపలికి వచ్చాక విశ్రాంతి కోసం నీరులేని స్థలాల్లో వెతుకుతుంది. కాని దానికి విశ్రాంతి లభించదు. అప్పుడది, ‘నేను వదిలి వచ్చిన యింటికి వెళ్తాను’ అని అనుకుంటుంది. 25 అక్కడికి వెళ్ళాక ఆ యిల్లు ఊడ్చబడి వుండటం ఎక్కడి వస్తువులక్కడ సక్రమంగా వుండటం చూస్తుంది. 26 అది మళ్ళీ బయటికి వెళ్ళి తనకన్నా దుర్మార్గులైన ఏడు దయ్యాలను తనవెంట తీసుకువస్తుంది. ఆ దయ్యాలన్నీ కలిసి ఆ యింట్లో నివసించటానికి వెళ్తాయి. అప్పుడు ఆ మనిషి స్థితి మొదటిస్థితికన్నా అధ్వాన్నంగా ఉంటుంది.”
దేవుడు దీవించు జనులు
27 యేసు ఈ విషయాలు చెబుతుండగా ప్రజల్లో ఒక స్త్రీ బిగ్గరగా, “నిన్ను కని, పెంచిన ఆ తల్లి ధన్యురాలు” అని అన్నది.
28 ఆయన, “అవునుగాని, దైవసందేశం విని దాన్ని పాటించే వాళ్ళు ఇంకా ధన్యులు” అని సమాధానం చెప్పాడు.
© 1997 Bible League International