Revised Common Lectionary (Complementary)
8 సాయంకాలపు చల్లని వేళలో యెహోవా దేవుడు ఆ తోటలో నడుస్తుండగా ఆ పురుషుడు, స్త్రీ ఆ చప్పుడు విని, తోటలోని చెట్లమధ్య దాగుకొన్నారు. యెహోవా దేవుని నుండి దాగుకొనేందుకు వారు ప్రయత్నించారు. 9 అయితే యెహోవా దేవుడు ఆ పురుషుని పిలిచాడు. “నీవు ఎక్కడున్నావు?” అన్నాడు యెహోవా.
10 “నీవు తోటలో నడుస్తున్న చప్పుడు విన్నాను, నాకు భయం వేసింది. నేను నగ్నంగా ఉన్నాను, అందుకే దాగుకొన్నాను” అన్నాడు ఆ పురుషుడు.
11 దేవుడు ఆ పురుషునితో ఇలా అన్నాడు. “నీవు నగ్నంగా ఉన్నావని నీతో ఎవరు చెప్పారు? నిన్ను సిగ్గుపడేటట్లు చేసింది ఏమిటి? నేను తినవద్దని చెప్పిన పండు నీవు తిన్నావా ఏమిటి? ఆ చెట్టు ఫలం తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించానుగదా!”
12 అందుకు ఆ పురుషుడు, “నా కోసం నీవు చేసిన ఈమె ఆ చెట్టు ఫలాన్ని నాకిచ్చింది, అందుచేత నేను తిన్నాను” అన్నాడు.
13 అప్పుడు యెహోవా దేవుడు, “ఏమిటి నీవు చేసింది?” అన్నాడు ఆ స్త్రీతో.
ఆ స్త్రీ, “సర్పం నన్ను మోసం చేసింది. నన్ను వెర్రిదాన్ని చేస్తే నేను ఆ పండు తినేశాను” అని చెప్పింది.
14 అందుచేత యెహోవా దేవుడు సర్పంతో ఇలా అన్నాడు:
“ఈ మహా చెడ్డ పని నీవే చేశావు
కనుక నీవు శపించబడ్డావు.
జంతువులన్నిటి కంటే
నీ పరిస్థితి హీనంగా ఉంటుంది.
నీవు నీ పొట్టతో పాకడం తప్పనిసరౌతుంది.
నీవు జీవిత కాలమంతా మట్టి తింటావు.
15 ఈ స్త్రీని, నిన్ను ఒకరికొకర్ని
విరోధుల్నిగా నేను చేస్తాను.
నీ సంతానము, ఆమె సంతానము
ఒకరికొకరు విరోధులవుతారు.
నీవు ఆమె శిశువు పాదం మీద కాటేస్తావు
ఈ శిశువు నీ తలను చితుక కొడతాడు.”
యాత్ర కీర్తన.
130 యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను.
కనుక సహాయం కోసం నిన్ను పిలుస్తున్నాను.
2 నా ప్రభువా, నా మాట వినుము.
సహాయం కోసం నేను చేస్తున్న మొర వినుము.
3 యెహోవా, మనుష్యులను వారి పాపాలన్నిటిని బట్టి నీవు శిక్షిస్తే
ఒక్క మనిషి కూడా మిగలడు.
4 యెహోవా, నీ ప్రజలను క్షమించుము.
అప్పుడు నిన్ను ఆరాధించుటకు మనుష్యులు ఉంటారు.
5 యెహోవా నాకు సహాయం చేయాలని నేను కనిపెడుతున్నాను.
నా ఆత్మ ఆయన కోసం కనిపెడుతుంది.
యెహోవా చెప్పేది నేను నమ్ముతున్నాను.
6 నా ప్రభువు కోసం నేను కనిపెడుతున్నాను.
ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో కనిపెడుతున్న కావలివాండ్లలా నేను ఉన్నాను.
7 ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో.
నిజమైన ప్రేమ యెహోవా దగ్గర మాత్రమే కనబడుతుంది.
యెహోవా మనలను మరల, మరల రక్షిస్తాడు.
8 మరియు యెహోవా ఇశ్రాయేలీయుల పాపాలు అన్నింటి విషయంలో వారిని క్షమిస్తాడు.
13 లేఖనాల్లో, “నేను విశ్వసించాను. కనుక మాట్లాడుతున్నాను”(A) అని వ్రాయబడి ఉంది. మేము కూడా అదే విధంగా విశ్వసించాము. కనుక మాట్లాడుతున్నాము. 14 ఎందుకంటే, చనిపోయిన యేసు ప్రభువును బ్రతికించినవాడు, ఆయనతో సహా మమ్మల్ని కూడా బ్రతికిస్తాడని మాకు తెలుసు. ఆ విధంగా మమ్ములను కూడా లేపి, మీతో సహా మమ్మల్ని కూడా దేవుని సమక్షంలో నిలబెడతాడు. 15 ఇవన్నీ మీ కోసమే జరుగుతున్నాయి. దైవానుగ్రహం ప్రజల్లో వ్యాపిస్తూ పోవాలనీ, దేవుని మహిమ నిమిత్తమై ప్రజలు అర్పించే కృతజ్ఞతలు పెరుగుతూ పోవాలని యిందులోని ఉద్దేశ్యం.
విశ్వాసంద్వారా జీవించటం
16 కనుక మేము అధైర్యపడము. భౌతికంగా మేము క్షీణించిపోతున్నా, మా ఆంతర్యం ప్రతి రోజూ శక్తి పొందుతూ ఉంది. 17 క్షణికమైన మా మామూలు కష్టాలు మా కోసం శాశ్వతమైన మహిమను కలిగిస్తున్నవి. మనము పొందుతున్న మహిమతో, అనుభవింపనున్న కష్టాలను పోలిస్తే ఈ కష్టాలు లెక్కింపతగినవి కావు. 18 అందువల్ల కనిపించే వాటిపై మా దృష్టి ఉంచక కనిపించని వాటిపై మా దృష్టి కేంద్రీకరిస్తున్నాము. కనిపించేది క్షణికము. కనిపించనిది అనంతము.
5 భూలోక నివాసులమైన మనము నివసిస్తున్న ఈ గుడారం, అంటే మన శరీరం నశిస్తే, పరలోకంలో మనము నివసించటానికి ఒక భవనం ఉంది. దాన్ని మానవుడు నిర్మించలేదు. శాశ్వతమైన ఆ భవనాన్ని దేవుడే నిర్మించాడు.
యేసుని శక్తి దేవునినుండి వచ్చినది
(మత్తయి 12:22-32; లూకా 11:14-23; 12:10)
20 ఆ తర్వాత యేసు యింటికి వెళ్ళాడు. మళ్ళీ ప్రజలు సమావేశమయ్యారు. దీనితో ఆయనకు, ఆయన శిష్యులకు తినటానికి కూడా సమయం దొరకలేదు. 21 ప్రజలు “ఆయనకు మతిపోయింది” అని అంటూ ఉండటంవల్ల ఆయన బంధువులు ఆయన భారం వహించటానికి వచ్చారు.
22 యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు, “అతనికి బయల్జెబూలు దయ్యం పట్టింది. దయ్యాల రాజు సహాయంతో అతడు దయ్యాలను వదిలిస్తున్నాడు” అని అన్నారు.
23 అందువల్ల యేసు వాళ్ళను గురించి, ఉపమానాలు ఉపయోగించి వారితో ఈ విధంగా అన్నాడు: “సైతాను తనను తాను ఏవిధంగా పారద్రోలుతాడు? 24 ఏ రాజ్యంలో చీలికలు వస్తాయో ఆ రాజ్యం నిలువదు. 25 కుటుంబంలో చీలికలు వస్తే ఆ కుటుంబం నిలువదు. 26 సైతాను తనకు తాను విరోధి అయి తన అధికారంతో చీలికలు తెచ్చుకొంటే ఆ సైతాను నిలవడు. వాని అధికారం అంతమౌతుంది.
27 “నిజానికి బలవంతుని యింట్లోకి వెళ్ళి అతని వస్తువుల్ని దోచుకోవాలనుకొంటే మొదట ఆ బలవంతుణ్ణి కట్టివేయవలసి వస్తుంది. అప్పుడే ఆ యింటిని దోచుకోగల్గుతాడు.
28 “నేను నిజం చెబుతున్నాను. మానవులు చేసిన అన్ని పాపాలను, వాళ్ళ దూషణలను, దేవుడు క్షమిస్తాడు. 29 కాని పవిత్రాత్మను దూషించిన వాణ్ణి దేవుడు ఎప్పటికి క్షమించడు. అతణ్ణి శాశ్వతమైన పాపం చేసిన వానిగా పరిగణిస్తాడు.”
30 ధర్మశాస్త్ర పండితులు తనలో దురాత్మ ఉందని అనటం వలన ఆయన పై విధంగా అన్నాడు.
యేసుని శిష్యులు ఆయన నిజమైన బంధువులు
(మత్తయి 12:46-50; లూకా 8:19-21)
31 యేసు తల్లి, ఆయన సోదరులు అక్కడికి వచ్చారు. బయటే నిలుచుని యేసును పిలవమని ఒకణ్ణి లోపలికి పంపారు. 32 యేసు చుట్టూ జనసమూహం ఉంది. వాళ్ళు ఆయనతో, “మీ తల్లి, సోదరులు మీకోసం అడుగుతూ బయట నిలుచున్నారు” అని అన్నారు.
33 “ఎవరు నా తల్లి? ఎవరు నా సోదరులు?” అని అంటూ 34 చుట్టూ కూర్చున్న వాళ్ళవైపు చూసి, “వీరే నా తల్లి, నా సోదరులు. 35 దైవేచ్చానుసారం నడుచుకొనే వాళ్ళు నా సోదరులు, నా అక్కచెల్లెండ్లు, నా తల్లి” అని అన్నాడు.
© 1997 Bible League International