Revised Common Lectionary (Complementary)
యాత్ర కీర్తన.
130 యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను.
కనుక సహాయం కోసం నిన్ను పిలుస్తున్నాను.
2 నా ప్రభువా, నా మాట వినుము.
సహాయం కోసం నేను చేస్తున్న మొర వినుము.
3 యెహోవా, మనుష్యులను వారి పాపాలన్నిటిని బట్టి నీవు శిక్షిస్తే
ఒక్క మనిషి కూడా మిగలడు.
4 యెహోవా, నీ ప్రజలను క్షమించుము.
అప్పుడు నిన్ను ఆరాధించుటకు మనుష్యులు ఉంటారు.
5 యెహోవా నాకు సహాయం చేయాలని నేను కనిపెడుతున్నాను.
నా ఆత్మ ఆయన కోసం కనిపెడుతుంది.
యెహోవా చెప్పేది నేను నమ్ముతున్నాను.
6 నా ప్రభువు కోసం నేను కనిపెడుతున్నాను.
ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో కనిపెడుతున్న కావలివాండ్లలా నేను ఉన్నాను.
7 ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో.
నిజమైన ప్రేమ యెహోవా దగ్గర మాత్రమే కనబడుతుంది.
యెహోవా మనలను మరల, మరల రక్షిస్తాడు.
8 మరియు యెహోవా ఇశ్రాయేలీయుల పాపాలు అన్నింటి విషయంలో వారిని క్షమిస్తాడు.
కనానులోనికి ప్రవేశించేందుకు ప్రజలు అనుమతింపబడలేదు
34 “మీరు చెప్పింది యెహోవా విన్నాడు, ఆయనకు కోపం వచ్చింది. ఆయన ఒక గట్టి ప్రమాణం చేసాడు. ఆయన చెప్పాడు: 35 ‘ఇప్పుడు జీవిస్తున్న దుష్టప్రజలైన మీలో ఎవ్వరూ, నేను మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన ఆ మంచి దేశంలో ప్రవేశించరు. 36 యెఫున్నె కుమారుడైన కాలేబు మాత్రమే ఆ దేశాన్ని చూస్తాడు. కాలేబు నడిచిన భూమిని నేను అతనికి యిస్తాను. ఆ భూమిని అతని సంతతివారికి నేను యిస్తాను. ఎందుకంటే నేను ఆజ్ఞాపించినది అంతా కాలేబు జరిగించాడు గనుక’.
37 “మీ వల్ల యెహోవా నా మీదకూడా కోపగించాడు. నాతో ఆయన చెప్పాడు: ‘నీవు కూడా ఆ దేశంలో ప్రవేశించజాలవు. 38 అయితే నీ సహాయకుడును నూను కుమారుడైన యెహోషువ ఆ దేశంలోనికి వెళ్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు అతడే వారిని నడిపిస్తాడు గనుక యెహోషువాను ప్రోత్సహించు.’ 39 మరియు యెహోవా మనతో చెప్పాడు; ‘మీ చిన్న పిల్లలను మీ శ్రతువులు ఎత్తికొనిపోతారని మీరు చెప్పారు గదా, కానీ ఆ పిల్లలే ఆ దేశంలో ప్రవేశిస్తారు. ఒక విషయం తప్పో? ఒప్పో? అని, తెలుసుకోలేనంత చిన్నవాళ్లు గనుక మీరు చేసిన తప్పుకు మీ పిల్లల్ని నేను నిందించను. కనుక వారికే ఆ దేశాన్ని నేను యిస్తాను. ఆ దేశాన్ని మీ పిల్లలే వారి స్వంతంగా తీసుకొంటారు. 40 కానీ మీరు మాత్రం వెనుకకు తిరిగి ఎర్రసముద్ర మార్గంలో అరణ్యానికే వెళ్లాలి.’
5 భూలోక నివాసులమైన మనము నివసిస్తున్న ఈ గుడారం, అంటే మన శరీరం నశిస్తే, పరలోకంలో మనము నివసించటానికి ఒక భవనం ఉంది. దాన్ని మానవుడు నిర్మించలేదు. శాశ్వతమైన ఆ భవనాన్ని దేవుడే నిర్మించాడు. 2 పరలోకపు గుడారాన్ని ధరించాలని ఆశిస్తూ మనము ఇంకా మూల్గుతూ ఉన్నాము. 3 మనము ఆ శరీరాన్ని ధరించాక మనకు నగ్నత ఉండదు. 4 ఈ గుడారంలో నివసిస్తున్నంతకాలం మనం పెద్దభారంతో మూల్గుతూ ఉంటాము. ఈ భౌతిక శరీరాన్ని ధరించిన మనము ఈ జీవితం యొక్క అంతంలో పరలోకపు శరీరాన్ని ధరించుకొంటాము. 5 ఆ శరీరాన్ని ధరించటానికి దేవుడు మనల్ని సిద్ధం చేసాడు. దానికి హామీగా తన ఆత్మను మనకు ఇచ్చాడు.
© 1997 Bible League International