Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 78:1-4

ఆసాపు ధ్యాన గీతం.

78 నా ప్రజలారా, నా ఉపదేశాలను వినండి.
    నేను చెప్పే విషయాలు వినండి.
ఈ కథ మీతో చెబుతాను.
    ఈ పురాతన కథ నేను మీతో చెబుతాను.
ఈ కథ మనం విన్నాము. ఇది మనకు బాగా తెలుసు.
    మన తండ్రులు ఈ కథ మనకు చెప్పారు.
ఈ కథను మనము మరచిపోము.
    మన ప్రజలు చివరి తరం వారి వరకు ఈ కథ చెబుతారు.
మనమంతా యెహోవాను స్తుతిద్దాము.
    ఆయన చేసిన అద్భుత కార్యాలను గూర్చి చెబుదాము.

కీర్తనలు. 78:52-72

52 తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులను గొర్రెల కాపరిలా నడిపించాడు.
    ఆయన తన ప్రజలను అరణ్యం లోనికి గొర్రెలను నడిపించినట్లుగా నడిపించాడు.
53 ఆయన తన ప్రజలను క్షేమంగా నడిపించాడు.
    దేవుని ప్రజలు భయపడాల్సింది. ఏమీ లేదు.
    వారి శత్రువులను దేవుడు ఎర్ర సముద్రంలో ముంచి వేసాడు.
54 దేవుడు తన ప్రజలను తన పవిత్ర దేశానికి నడిపించాడు.
    తన స్వంత శక్తితో సీయోను పర్వతానికి ఆయన నడిపించాడు.
55 ఇతర రాజ్యాలు ఆ దేశాన్ని విడిచిపెట్టేటట్టు దేవుడు వారిని బలవంతం చేసాడు.
    దేవుడు తన ప్రజలకు వారి వంతు దేశాన్ని ఇచ్చాడు.
    అందుచేత ఇశ్రాయేలీయులు వారి స్వంత గృహాలలో నివసించారు.
56 కాని ఇశ్రాయేలు ప్రజలు సర్వోన్నతుడైన దేవున్ని ఇంకను పరీక్షించి ఆయన్ని దుఃఖ పెట్టారు.
    ఆ ప్రజలు దేవుని ఆదేశాలకు విధేయులు కాలేదు.
57 ఇశ్రాయేలు ప్రజలు దేవుని నుండి మళ్లుకొన్నారు. వారు వారి తండ్రుల్లాగే ద్రోహులుగాను, అపనమ్మకస్తులుగాను ఉన్నారు.
    వారు మోసకరమైన విల్లులా వంకర తిరిగారు.
58 ఇశ్రాయేలు ప్రజలు ఎత్తయిన గోపురాలు నిర్మించి దేవునికి కోపం పుట్టించారు.
    దేవతల విగ్రహాలను వారు తయారు చేసి దేవునికి రోషం పుట్టించారు.
59 దేవుడు ఇది విని చాలా కోపగించాడు.
    మరియు ఇశ్రాయేలీయులను దేవుడు పూర్తిగా తిరస్కరించాడు.
60 షిలోహులో పవిత్ర గుడారాన్ని దేవుడు విడిచిపెట్టేశాడు.
    ఇది ప్రజల మధ్య నివసించిన దేవుని గుడారం.
61 అప్పుడు దేవుడు ఇతర రాజ్యాలు తన ప్రజలను బంధీలుగా చేయనిచ్చాడు.
    దేవుని “అందమైన ఆభరణాన్ని” శత్రువులు తీసుకొన్నారు.
62 తన ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు తన కోపం చూపించాడు.
    ఆయన వారిని యుద్ధంలో చంపబడనిచ్చాడు.
63 యువకులు చనిపోయేవరకు కాల్చబడ్డారు.
    పెళ్లి కావాల్సిన యువతులు పెళ్లిపాటలు ఏమి పాడలేదు.
64 యాజకులు చంపివేయబడ్డారు.
    కాని విధవలు వారి కోసం ఏడ్వలేదు.
65 త్రాగి కేకలువేసే బలాఢ్యుడైన మనిషివలె,
    నిద్రనుండి మేల్కొన్న మనిషివలె ప్రభువు లేచాడు.
66 దేవుడు తన శత్రువును వెనుకకు తరిమి వారిని ఓడించాడు.
    దేవుడు తన శత్రువులను ఓడించి, శాశ్వతంగా వారిని అవమానించాడు.
67 కాని యోసేపు కుటుంబాన్ని దేవుడు నిరాకరించాడు.
    ఎఫ్రాయిము కుటుంబాన్ని దేవుడు కోరుకోలేదు.
68 దేవుడు యూదావారిని ఎంచుకొన్నాడు.
    మరియు దేవుడు తనకు ప్రియమైన సీయోను పర్వతాన్ని కోరుకొన్నాడు.
69 ఆ పర్వతం మీద ఎత్తుగా దేవుడు తన పవిత్ర ఆలయాన్ని నిర్మించాడు.
    భూమిలాగే, తన పవిత్ర ఆలయం శాశ్వతంగా ఉండేటట్టు దేవుడు నిర్మించాడు.
70 తర్వాత తన ప్రత్యేక సేవకునిగా దావీదును దేవుడు ఏర్పాటు చేసుకొన్నాడు.
    దావీదు గొర్రెలను కాస్తూ ఉన్నాడు. కాని దేవుడు అతన్ని ఆ పని నుండి తీసివేసాడు.
71 గొర్రెలను కాపాడే పని నుండి దేవుడు దావీదును తొలగించి,
    తన ప్రజలను, యాకోబు ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను, దేవుని సొత్తును కాపాడే పని దావీదుకు యిచ్చాడు.
72 మరియు దావీదు పవిత్ర హృదయంతో ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు.
    అతడు చాలా జ్ఞానంతో వారిని నడిపించాడు.

నిర్గమకాండము 16:27-36

27 శనివారంనాడు ప్రజల్లో కొంతమంది ఆహారం కూర్చుకోవాలని బయటకు వెళ్లారు కాని వారికి ఆహారం ఏమీ కనబడలేదు. 28 అప్పుడు మోషేతో యెహోవా అన్నాడు. “నా ఆజ్ఞలకు ఉపదేశాలకు లోబడకుండా ఎన్నాళ్లు మీరు తిరస్కరిస్తారు? 29 చూడండి, శనివారం మీకు విశ్రాంతి రోజుగా చేసాడు యెహోవా. అందుచేత రెండు రోజులకు సరిపడేంత ఆహారం శుక్రవారమే యెహోవా మీకు ఇస్తాడు. కనుక శనివారంనాడు మీలో ప్రతి ఒక్కరూ కూర్చొని విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కడి వాళ్లు అక్కడే ఉండండి.” 30 కనుక శనివారంనాడు ప్రజలు విశ్రాంతి తీసుకొన్నారు.

31 ఆ ప్రత్యేక ఆహారాన్ని “మన్నా”[a] అని పిలవడం మొదలుబెట్టారు ప్రజలు. మన్నా కొత్తిమెర గింజల్లా చిన్నగా తెల్లగా ఉండి, తేనెపూసిన పూతరేకుల్లా ఉంది. 32 అప్పుడు మోషే అన్నాడు, “నేను మిమ్మల్ని ఈజిప్టునుండి బయటికి రప్పించినప్పుడు ఎడారిలో నేను మీకు ఇచ్చిన ఆహారాన్ని మీ సంతానం వాళ్లు చూడ గలిగేటట్టు ఈ ఆహారం 2 పావులు దాచి ఉంచమని యెహోవా చెప్పాడు.”

33 కనుక మోషే అహరోనుతో ఇలా అన్నాడు: “ఒక పాత్ర తీసుకొని దానిలో 8 పావులు మన్నా నింపు. ఈ మన్నాను మన సంతానం వారి కోసం దాచిపెట్టు” 34 మోషే యెహోవా చెప్పినట్టు చేసాడు. మన్నా పాత్రను ఒడంబడిక పెట్టె[b] ముందర పెట్టాడు అహరోను. 35 40 సంవత్సరాల పాటు ప్రజలు మన్నా తిన్నారు. కనాను దేశ సరిహద్దుల వచ్చేంతవరకు వారు దాన్ని తిన్నారు 36 (మన్నా కొలిచేందుకు వారి ఉపయోగించిన కొలత ఓమెరు. ఓమెరు అంటే ఏపాలో పదో భాగం.)

అపొస్తలుల కార్యములు 15:1-5

యెరూషలేములో సమావేశం

15 కొందరు యూదయనుండి అంతియొకయకు వచ్చి అక్కడున్న సోదరులకు, “సున్నతి అనే మోషే ఆచారాన్ని పాటిస్తే తప్ప మీకు రక్షణ లభించదు” అని బోధించారు. ఈ కారణంగా పౌలు, బర్నబా వాళ్ళతో తీవ్రమైన వాదనలు, చర్చలు చేసారు. అపొస్తలుల్ని ఈ విషయాన్ని గురించి సంప్రదించాలనే ఉద్దేశ్యంతో పౌలును, బర్నబాను, మరి కొంతమందిని యెరూషలేమునకు పంపాలనే నిర్ణయం జరిగింది.

అక్కడున్న సంఘం వీళ్ళకు వీడ్కోలు యిచ్చింది. వీళ్ళు ఫోనీషియ, సమరయ పట్టణాల ద్వారా ప్రయాణం చేస్తూ యూదులు కానివాళ్లలో వచ్చిన మార్పును గురించి అక్కడి వాళ్ళకు చెప్పారు. ఇది సోదరులందరికీ చాలా ఆనందం కలిగించింది. వీళ్ళు యెరూషలేము చేరగానే సంఘము, అపొస్తలులు, పెద్దలు అంతా కలిసి వీళ్ళకు స్వాగతం యిచ్చారు. పౌలు, బర్నబా దేవుడు తమ ద్వారా చేసిన వాటిని వాళ్ళకు చెప్పారు. పరిసయ్యుల తెగకు చెందిన కొందరు భక్తులు లేచి, “యూదులు కానివాళ్ళు తప్పక సున్నతి చేసుకోవాలి. మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలి” అని అన్నారు.

అపొస్తలుల కార్యములు 15:22-35

యూదులుకాని భక్తులకు లేఖ

22 అపొస్తలులు, పెద్దలు, సంఘసభ్యులు, అంతా కలిసి సంఘంనుండి కొందర్ని ఎన్నుకొని పౌలు, బర్నబాతో సహా వాళ్ళను అంతియొకయకు పంపారు. సోదరుల్లో ముఖ్యులైన బర్సబ్బా అని పిలువబడే యూదాను, సీలను ఎన్నుకొని 23 వాళ్ళ వెంట ఈ లేఖను పంపారు:

మీ సోదరులైన అపొస్తలులనుండి, పెద్దలనుండి,

అంతియొకయ, సిరియ, కిలికియ పట్టణాల్లోని యూదులుకాని సోదరులకు, శుభం!

ప్రియ సహోదరులారా!

24 మా అనుమతి లేకుండా మాలో కొందరు అక్కడికి వచ్చి తమ మాటల్తో మీలో అశాంతి కలిగించి మీ మనస్సుల్ని పాడుచేసారని విన్నాము. 25 మా ప్రియమిత్రులైన బర్నబాతో, పౌలుతో కొందర్ని మీ వద్దకు పంపాలని మేమంతా కలిసి నిర్ణయించాము. 26 వీళ్ళు మన యేసు క్రీస్తు ప్రభువు కోసం తమ ప్రాణాల్ని తెగించినవాళ్ళు. 27 అందువల్ల, మేము వ్రాస్తున్నవి తమ నోటి ద్వారా మీకు తెలపాలని యూదాను, సీలను పంపుతున్నాము. 28 ఈ నియమాల్ని తప్ప మిగతా నియమాల్ని మీపై మోపటం భావ్యంకాదని పవిత్రాత్మకు, మాకు అనిపించింది:

29 విగ్రహాలకు నైవేద్యం పెట్టిన ఆహారాన్ని,

గొంతు నులిమి చంపిన జంతువుల మాంసాన్ని, జంతువుల రక్తాన్ని ముట్టకండి.

లైంగిక పాపము చేయకండి.

ఇలా వీటికి దూరంగా ఉండటంవల్ల మీలో సత్ప్రవర్తన కలుగుతుంది.

వీడ్కోలు.

30 వాళ్ళు సెలవు తీసుకొని అంతియొకయకు వెళ్ళారు. యేసు భక్తులందర్ని పిలిచి వాళ్ళకీ లేఖనిచ్చారు. 31 ప్రోత్సాహపరిచే ఈ లేఖను చదివి ప్రజలు చాలా ఆనందించారు. 32 యూదా, సీల కూడా ప్రవక్తలు కాబట్టి ఆ ఊరి సోదరులతో చాలా సేపు మాట్లాడి వాళ్ళను ప్రోత్సాహపరిచి ఆధ్యాత్మికంగా బలపరిచారు. 33 వాళ్ళక్కడ కొద్ది రోజులు గడిపారు. ఆ తదుపరి అక్కడి సోదరులు, “శాంతి కలుగుగాక” అని కోరుతూ వాళ్ళకు వీడ్కోలు చెప్పారు. వీళ్ళు తమను పంపిన వాళ్ళ దగ్గరకు తిరిగి వెళ్ళిపోయారు. 34 “కాని సీల అక్కడే ఉండిపోవాలనుకొన్నాడు.”[a]

35 పౌలు, బర్నబా అంతియొకయలో కొద్ది రోజులు గడిపారు. వీళ్ళు, యింకా అనేకులు కలిసి ప్రభువు సందేశాన్ని ఉపదేశించి బోధించారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International