Revised Common Lectionary (Complementary)
ఆసాపు ధ్యాన గీతం.
78 నా ప్రజలారా, నా ఉపదేశాలను వినండి.
నేను చెప్పే విషయాలు వినండి.
2 ఈ కథ మీతో చెబుతాను.
ఈ పురాతన కథ నేను మీతో చెబుతాను.
3 ఈ కథ మనం విన్నాము. ఇది మనకు బాగా తెలుసు.
మన తండ్రులు ఈ కథ మనకు చెప్పారు.
4 ఈ కథను మనము మరచిపోము.
మన ప్రజలు చివరి తరం వారి వరకు ఈ కథ చెబుతారు.
మనమంతా యెహోవాను స్తుతిద్దాము.
ఆయన చేసిన అద్భుత కార్యాలను గూర్చి చెబుదాము.
52 తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులను గొర్రెల కాపరిలా నడిపించాడు.
ఆయన తన ప్రజలను అరణ్యం లోనికి గొర్రెలను నడిపించినట్లుగా నడిపించాడు.
53 ఆయన తన ప్రజలను క్షేమంగా నడిపించాడు.
దేవుని ప్రజలు భయపడాల్సింది. ఏమీ లేదు.
వారి శత్రువులను దేవుడు ఎర్ర సముద్రంలో ముంచి వేసాడు.
54 దేవుడు తన ప్రజలను తన పవిత్ర దేశానికి నడిపించాడు.
తన స్వంత శక్తితో సీయోను పర్వతానికి ఆయన నడిపించాడు.
55 ఇతర రాజ్యాలు ఆ దేశాన్ని విడిచిపెట్టేటట్టు దేవుడు వారిని బలవంతం చేసాడు.
దేవుడు తన ప్రజలకు వారి వంతు దేశాన్ని ఇచ్చాడు.
అందుచేత ఇశ్రాయేలీయులు వారి స్వంత గృహాలలో నివసించారు.
56 కాని ఇశ్రాయేలు ప్రజలు సర్వోన్నతుడైన దేవున్ని ఇంకను పరీక్షించి ఆయన్ని దుఃఖ పెట్టారు.
ఆ ప్రజలు దేవుని ఆదేశాలకు విధేయులు కాలేదు.
57 ఇశ్రాయేలు ప్రజలు దేవుని నుండి మళ్లుకొన్నారు. వారు వారి తండ్రుల్లాగే ద్రోహులుగాను, అపనమ్మకస్తులుగాను ఉన్నారు.
వారు మోసకరమైన విల్లులా వంకర తిరిగారు.
58 ఇశ్రాయేలు ప్రజలు ఎత్తయిన గోపురాలు నిర్మించి దేవునికి కోపం పుట్టించారు.
దేవతల విగ్రహాలను వారు తయారు చేసి దేవునికి రోషం పుట్టించారు.
59 దేవుడు ఇది విని చాలా కోపగించాడు.
మరియు ఇశ్రాయేలీయులను దేవుడు పూర్తిగా తిరస్కరించాడు.
60 షిలోహులో పవిత్ర గుడారాన్ని దేవుడు విడిచిపెట్టేశాడు.
ఇది ప్రజల మధ్య నివసించిన దేవుని గుడారం.
61 అప్పుడు దేవుడు ఇతర రాజ్యాలు తన ప్రజలను బంధీలుగా చేయనిచ్చాడు.
దేవుని “అందమైన ఆభరణాన్ని” శత్రువులు తీసుకొన్నారు.
62 తన ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు తన కోపం చూపించాడు.
ఆయన వారిని యుద్ధంలో చంపబడనిచ్చాడు.
63 యువకులు చనిపోయేవరకు కాల్చబడ్డారు.
పెళ్లి కావాల్సిన యువతులు పెళ్లిపాటలు ఏమి పాడలేదు.
64 యాజకులు చంపివేయబడ్డారు.
కాని విధవలు వారి కోసం ఏడ్వలేదు.
65 త్రాగి కేకలువేసే బలాఢ్యుడైన మనిషివలె,
నిద్రనుండి మేల్కొన్న మనిషివలె ప్రభువు లేచాడు.
66 దేవుడు తన శత్రువును వెనుకకు తరిమి వారిని ఓడించాడు.
దేవుడు తన శత్రువులను ఓడించి, శాశ్వతంగా వారిని అవమానించాడు.
67 కాని యోసేపు కుటుంబాన్ని దేవుడు నిరాకరించాడు.
ఎఫ్రాయిము కుటుంబాన్ని దేవుడు కోరుకోలేదు.
68 దేవుడు యూదావారిని ఎంచుకొన్నాడు.
మరియు దేవుడు తనకు ప్రియమైన సీయోను పర్వతాన్ని కోరుకొన్నాడు.
69 ఆ పర్వతం మీద ఎత్తుగా దేవుడు తన పవిత్ర ఆలయాన్ని నిర్మించాడు.
భూమిలాగే, తన పవిత్ర ఆలయం శాశ్వతంగా ఉండేటట్టు దేవుడు నిర్మించాడు.
70 తర్వాత తన ప్రత్యేక సేవకునిగా దావీదును దేవుడు ఏర్పాటు చేసుకొన్నాడు.
దావీదు గొర్రెలను కాస్తూ ఉన్నాడు. కాని దేవుడు అతన్ని ఆ పని నుండి తీసివేసాడు.
71 గొర్రెలను కాపాడే పని నుండి దేవుడు దావీదును తొలగించి,
తన ప్రజలను, యాకోబు ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను, దేవుని సొత్తును కాపాడే పని దావీదుకు యిచ్చాడు.
72 మరియు దావీదు పవిత్ర హృదయంతో ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు.
అతడు చాలా జ్ఞానంతో వారిని నడిపించాడు.
13 ఆ రాత్రి వారి బస అంతటా పూరేళ్లు (పిట్టలు) వచ్చాయి. (మాంసం కోసం ప్రజలు ఈ పిట్టల్ని పట్టుకొన్నారు) ప్రతి ఉదయం బసకు దగ్గర్లో నేలమీద మంచు కురిసింది. 14 సూర్యోదయం కాగానే ఆ మంచు కరిగిపోయింది. అయితే మంచు పోగానే నేలమీద నూగుమంచు ఉండేది. 15 ఇశ్రాయేలు ప్రజలు అది చూసి “అది ఏమిటి?” అంటూ ఒకళ్లనొకళ్లు ప్రశ్నించుకొన్నారు. ఈ పదార్థం ఏమిటో వారికి అర్థం కాలేదు కనుక వాళ్లు ఈ ప్రశ్న అడిగారు. మోషే వాళ్లతో చెప్పాడు: “మీరు భోజనంచేయడానికి యెహోవా మీకు ఇచ్చిన భోజనం ఇది. 16 ప్రతి వ్యక్తి తనకు అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. మీ కుటుంబంలో ప్రతి వ్యక్తికీ 2 పావుల[a] కొలత ప్రకారం మీలో ఒక్కొక్కరు తీసుకోవాలి అని యెహోవా చెబుతున్నాడు.”
17 కనుక ఇశ్రాయేలు ప్రజలు అలాగే చేసారు. ప్రతి వ్యక్తి ఈ భోజనం కూర్చుకొన్నారు. కొంతమంది మిగతా వాళ్ల కంటె ఎక్కువ కూర్చుకొన్నారు. 18 ఆ ప్రజలు వారి కుటుంబంలో ప్రతివొక్కరికీ ఆ భోజనం పెట్టారు. ఆ భోజన పదార్థం కొలుచుకొన్నప్పుడల్లా, ప్రతి వ్యక్తికీ సరిపడ్డంత మాత్రమే ఉండేది. కాని ఎన్నడూ ఎక్కువ మిగిలేది కాదు. ప్రతి వ్యక్తీ తాను, తన కుటుంబం ఎంత తినగలరో సరిగ్గా అంతే తీసుకొన్నారు.
19 “రేపటికోసం ఆ భోజనం దాచుకోకండి” అని మోషే వారితో చెప్పాడు. 20 కానీ ప్రజలు మోషేకు లోబడలేదు. కొంత మంది మర్నాడు తినవచ్చని తమ భోజనంలో కొంత దాచుకొన్నారు. అలా దాచుకొన్న భోజనం పురుగులు పట్టేసి, కంపు కొట్టేసింది. ఇలా చేసినవాళ్ల మీద మోషేకు కోపం వచ్చింది.
21 ప్రతి ఉదయం ప్రజలు భోజనం కూర్చుకొన్నారు. ప్రతి వ్యక్తీ తాను తిన గలిగినంత కూర్చుకొన్నాడు. అయితే, ఎండ ఎక్కువ కాగానే ఆహారం కరిగిపోయి కనబడకుండా పోయింది.
22 శుక్రవారంనాడు, రెండంతల ఆహారం ప్రజలు కూర్చుకొన్నారు. ఒక్కొక్క మనిషికి 4 పావుల ప్రకారం వారు కూర్చుకొన్నారు. కనుక ప్రజానాయకులు మోషే దగ్గరకు వచ్చి ఈ విషయం తెలియజేసారు.
23 “ఇలా జరుగుతుందని యెహోవా చెప్పాడు. ఎందుచేత? రేపు సబ్బాతు కనుక. అది యెహోవాకు ప్రత్యేకంగా విశ్రాంతి రోజు. ఈరోజు వండుకోవాల్సిన భోజనం అంతా వండుకోండి, అయితే మిగతా భోజనం రేపు ఉదయానికి దాచుకోండి” అన్నాడు మోషే వాళ్లతో.
24 కనుక ప్రజలు ఆ భోజనంలో మిగిలినదాన్ని మర్నాటికోసం దాచుకొన్నారు. ఆ భోజనంలో ఏమీ చెడిపోలేదు. అందులో కొంచెము కూడా పురుగుపట్టలేదు.
25 శనివారం నాడు ప్రజలతో మోషే ఇలా చెప్పాడు: “ఈవేళ సబ్బాతు, అంటే యెహోవా విశ్రాంతి రోజు. అందుచేత మీలో ఏ ఒక్కరూ బయట పొలాల్లో ఉండకూడదు. నిన్న కూర్చుకొన్న భోజనాన్ని తినండి. 26 ఆరు రోజుల కోసం మీరు ఆహారం కూర్చుకోవాలి. అయితే ఏడోరోజు విశ్రాంతి రోజు కనుక నేల మీద ప్రత్యేక ఆహారం ఏమీ దొరకదు.”
19 మీరు నాతో, “మరి, దేవుడు మమ్ముల్ని ఎందుకు ఇంకా నిందిస్తున్నాడు? ఆయన ఇష్టాన్ని ఎవరు కాదనగలరు?” అని అనవచ్చు. 20 కాని, ఓ మనిషీ! దేవునితో ఎదురు తిరిగి మాట్లాడటానికి నీవెవరవు? సృష్టింపబడింది సృష్టికర్తతో, “నన్నీవిధంగా ఎందుకు సృష్టించావు?” అని అడగవచ్చా? 21 కుమ్మరి ఒకే మట్టి ముద్దతో కొన్ని కుండల్ని మంచి పనులకోసం, మరి కొన్నిటిని మామూలుగా ఉపయోగించుకోవటానికి చేస్తాడు. అలా చెయ్యటానికి అతనికి అధికారం లేదా?
22 భవిష్యత్తులో దేవుడు తన కోపాన్ని చూపాలని, తన శక్తిని తెలియచెయ్యాలని, నాశనం చెయ్యతగిన దుర్మార్గుల పట్ల సహనం వహించాడంటే మనమేమనగలము? 23 దేవుడు తన తేజస్సులోని గొప్పతనాన్ని తెలియచెయ్యాలని తన మహిమను పంచుకోవటానికి దయతో ఇతర్లను సృష్టించాడంటే మనం ఏమనగలం? 24 యూదుల నుండే కాక, యూదులు కానివాళ్ళ నుండి కూడా దేవుడు ప్రజల్ని పిలిచాడు. ఆయన పిలిచింది మనల్నే. 25 హోషేయ గ్రంథంలో దేవుడు ఈ విధంగా చెప్పాడు:
“నా ప్రజలు కాని వాళ్ళను
నా ప్రజలని పిలుస్తాను.
నా ప్రియురాలు కాని జనాన్ని
నా ప్రియురాలా అని పిలుస్తాను.”(A)
26 “మీరు నా ప్రజలు కారు అని అన్న చోటనే మీరు సజీవంగా ఉండే దేవుని పుత్రులు అని అనటం సంభవిస్తుంది.”(B)
27 యెషయా ప్రవక్త ఇశ్రాయేలు వంశాన్ని గురించి ఇలా అన్నాడు:
“ఇశ్రాయేలు పుత్రుల సంఖ్య సముద్ర తీరంపై ఉన్న ఇసుక రేణువుల్లా ఉన్నా,
కొందరు మాత్రమే రక్షింపబడతారు.
28 ఎందుకంటే, ప్రపంచానికి విధించిన శిక్షను ప్రభువు త్వరలోనే నెరవేరుస్తాడు.”(C)
29 యెషయా జరుగుతుందని చెప్పినట్లు:
“సర్వ శక్తిసంపన్నుడైన ప్రభువు కొంత మందిని
మనకు వదిలి ఉండక పోయినట్లైతే
మనం సొదొమ ప్రజలవలే,
గొమొఱ్ఱా ప్రజలవలె ఉండే వాళ్ళం.”(D)
© 1997 Bible League International