Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: గిత్తీత్ రాగం. ఆసాపు కీర్తన.
81 సంతోషించండి, మన బలమైన దేవునికి గానం చేయండి.
ఇశ్రాయేలీయుల దేవునికి సంతోషంతో కేకలు వేయండి.
2 సంగీతం ప్రారంభించండి.
గిలక తప్పెట వాయించండి.
స్వరమండలం, సితారాలను శ్రావ్యంగా వాయించండి.
3 నెలవంకనాడు గొర్రెపోతు కొమ్ము ఊదండి.
పౌర్ణమినాడు[a] గొర్రెపోతు కొమ్ము ఊదండి. ఆనాడే మన పండుగ ఆరంభం.
4 అది ఇశ్రాయేలు ప్రజలకు న్యాయచట్టం.
ఆ ఆదేశాన్ని యాకోబుకు దేవుడు ఇచ్చాడు.
5 ఈజిప్టునుండి యోసేపును[b] దేవుడు తీసుకొనిపోయిన సమయంలో
దేవుడు వారితో ఈ ఒడంబడిక చేసాడు.
ఈజిప్టులో నేను గ్రహించని భాష విన్నాను.
6 దేవుడు ఇలా చెబుతున్నాడు: “మీ భుజంమీద నుండి బరువు నేను దింపాను.
నేను మీ మోతగంప పడవేయనిచ్చాను.
7 మీరు కష్టంలో ఉన్నప్పుడు మీరు సహాయం కోసం వేడుకొన్నారు. నేను మిమ్మల్ని స్వతంత్రుల్ని చేశాను.
తుఫాను మేఘాలలో దాగుకొని నేను మీకు జవాబు ఇచ్చాను.
నీళ్ల వద్ద నేను మిమ్మల్ని పరీక్షించాను.”
8 “నా ప్రజలారా, నా మాట వినండి. నా ఒడంబడిక[c] నేను మీకు యిస్తాను.
ఇశ్రాయేలూ, నీవు దయచేసి నా మాట వినాలి!
9 విదేశీయులు పూజించే తప్పుడు దేవుళ్ళను
ఎవరినీ ఆరాధించవద్దు.
10 నేను యెహోవాను, నేనే మీ దేవుడను.
మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చిన దేవుడను నేనే.
ఇశ్రాయేలూ, నీ నోరు తెరువు,
నేను దానిని నింపుతాను.
సబ్బాతు
12 అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 13 “ఇశ్రాయేలు ప్రజలతో దీన్ని చెప్పు; ‘నా ప్రత్యేక విశ్రాంతి రోజులను గూర్చిన నియమాలను మీరు పాటించాలి. రాబోయే తరాలన్నింటిలో మీకు, నాకు మధ్య అవి ఒక గురుతుగా ఉంటాయి కనుక మీరు ఇలా చేయాలి. యెహోవానైన నేనే మిమ్మల్ని నా ప్రత్యేక ప్రజలుగా ఏర్పరచుకొన్నానని ఇది మీకు తెలియజేస్తుంది.
14 “‘సబ్బాతు[a] రోజును ఒక ప్రత్యేక రోజుగా చేయి. ఏ వ్యక్తి అయినా సరే సబ్బాతు రోజును మామూలు రోజుగానే పరిగణిస్తే, ఆ వ్యక్తిని చంపేయాలి. సబ్బాతు రోజున ఏ వ్యక్తి అయినా సరే పనిచేస్తే ఆ వ్యక్తి తన ప్రజల నుండి వేరు చేయబడాలి. 15 పని చేయడానికి వారంలో ఇంకా ఆరు రోజులున్నాయి. అయితే, ఏడో రోజు చాల ప్రత్యేకమైన విశ్రాంతి రోజు. సబ్బాతు నాడు ఏ వ్యక్తి అయినా సరే పనిచేస్తే వాణ్ణి చంపెయ్యాలి. 16 ఇశ్రాయేలు ప్రజలు సబ్బాతు రోజును జ్ఞాపకం ఉంచుకొని, దాన్ని ఒక ప్రత్యేక రోజుగా చేయాలి. ఇది నాకూ, వారికీ మధ్య శాశ్వతంగా కొనసాగే ఒడంబడిక. 17 ఇశ్రాయేలీయులకూ, నాకూ మధ్య శాశ్వత సంకేతం సబ్బాతు రోజే. యెహోవా ఆరు రోజులు పనిచేసి ఆకాశాన్ని, భూమిని చేసాడు. ఏడోరోజున ఏ పని చేయక విశ్రాంతి తీసుకొన్నాడు.’”
18 అలా సీనాయి పర్వతం మీద యెహోవా మోషేతో మాట్లాడ్డం ముగించాడు. అప్పుడు ఆజ్ఞలు రాయబడ్డ రెండు రాతి పలకలను యెహోవా మోషేకు ఇచ్చాడు. దేవుడు తన వ్రేలితో రాళ్లమీద ఈ ఆజ్ఞలు రాసాడు.
ఫేస్తు సమక్షంలో విచారణ
25 ఫేస్తు ఆ ప్రాంతానికి వచ్చిన మూడు రోజుల తర్వాత కైసరియనుండి యెరూషలేమునకు వెళ్ళాడు. 2 అక్కడ ప్రధాన యాజకులు, యూదుల పెద్దలు అతణ్ణి కలుసుకొని, పౌలును గురించి చెప్పారు. 3 పౌలును వెంటనే యెరూషలేముకు పంపి తమకు ఉపకారం చెయ్యమని వేడుకున్నారు. ఎవ్వరికీ తెలియకుండా పౌలును దారిలో చంపేయాలని వాళ్ళ కుట్ర. 4 ఫేస్తు, “పౌలు కైసరియలో బందీగా ఉన్నాడు. నేను కూడా అక్కడికి త్వరలోనే వెళ్తున్నాను. 5 మీలో ముఖ్యమైనవాళ్ళు నావెంట వస్తే, అతడు ఒకవేళ ఏదైనా నేరం చేసి ఉంటే అతనిపై మీ నేరారోపణలు అక్కడే చేయవచ్చు” అని అన్నాడు.
6 అక్కడ వాళ్ళతో ఎనిమిది, పది రోజులు గడిపాక కైసరియకు వెళ్ళాడు. వెళ్ళిన మరుసటి రోజు న్యాయసభను ఏర్పాటు చేసి పౌలును తన ముందుకు పిలుచుకు రమ్మని ఆజ్ఞాపించాడు. 7 పౌలు కనపడగానే యెరూషలేమునుండి వచ్చిన యూదులు అతని చుట్టూ చేరి అతనిపై తీవ్రమైన నేరాలు ఆరోపించారు. ఎన్ని నేరాల్ని ఆరోపించినా, ఒక్క నేరాన్ని కూడా నిరూపించలేక పోయారు. 8 తదుపరి పౌలు, తాను నేరస్థుడు కాదని నిరూపించుకోవటానికి ఈ విధంగా వాదించాడు, “నేను యూదుల ధర్మశాస్త్రాన్ని కాని, మందిర నియమాల్ని కాని అతిక్రమించ లేదు. చక్రవర్తికి ఎదురు తిరిగి ప్రవర్తించనూ లేదు.”
9 ఫేస్తు, యూదులకు ఉపకారం చేయాలని, పౌలుతో, “నీవు యెరూషలేము వచ్చి అక్కడ నా ఎదుట న్యాయస్థానంలో నిలుచోగలవా?” అని అడిగాడు.
10 పౌలు ఈ విధంగా సమాధానం చెప్పాడు. “నేను ప్రస్తుతం చక్రవర్తి యొక్క న్యాయస్థానంలో నిలుచున్నాను. ఇక్కడే తీర్పు జరగాలి. నేను యూదులకు ఏ అన్యాయం చెయ్యలేదు. ఇది మీకు బాగా తెలుసు. 11 మరణదండన పొందవలసిన నేరం నేను ఒక వేళ ఏదైనా చేసివుంటే, మరణించటానికి నేను వెనుకంజ వేయను. కాని వీళ్ళు ఆరోపించిన నేరాలు అసత్యమైతే నన్ను వీళ్ళకప్పగించే అధికారం ఎవ్వరికీ లేదు. చక్రవర్తినే ఈ విషయంపై తీర్పు చెప్పమని నేను విన్నవించుకొంటాను.”
12 ఫేస్తు తన సలహాదార్లతో సంప్రదించి యిలా ప్రకటించాడు: “నీవు చక్రవర్తి సమక్షంలో విన్నవించుకోవాలని కోరావు. కనుక నిన్ను చక్రవర్తి దగ్గరకు పంపుతాను.”
© 1997 Bible League International