Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 104:24-34

24 యెహోవా, నీవు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశావు.
    భూమి నీ కార్యాలతో నిండిపోయింది.
    నీవు చేసే ప్రతి పనిలో నీవు నీ జ్ఞానాన్ని ప్రదర్శిస్తావు.
25 మహా సముద్రాన్ని చూడు. అది ఎంతో పెద్దది.
    మహా సముద్రంలో రకరకాల ప్రాణులు నివసిస్తాయి. వాటిలో కొన్ని ప్రాణులు పెద్దవి, కొన్ని చిన్నవి.
    మహా సముద్రంలో ఉండే వాటిని లెక్కించుటకు అవి చాలా విస్తారంగా ఉన్నాయి.
26 మహా సముద్రంలో ఓడలు ప్రయాణం చేస్తాయి.
    నీవు చేసిన సముద్ర ప్రాణి మకరం[a] ఆ సముద్రంలో ఆడుకుంటుంది.

27 దేవా, ఆ ప్రాణులన్నీ నీ మీద ఆధారపడి ఉన్నాయి.
    దేవా, వాటికి సరియైన సమయంలో నీవు ఆహారం ఇస్తావు.
28 దేవా, జీవించే ప్రాణులన్నీ తినే ఆహారం నీవే వాటికి ఇస్తావు.
    మంచి భోజనంతో నిండిన నీ గుప్పిళ్లు నీవు విప్పగా అవి కడుపు నిండేంత వరకు భోజనము చేస్తాయి.
29 నీవు వాటి నుండి తిరిగిపోయినప్పుడు
    అవి భయపడిపోతాయి.
వాటి ప్రాణం వాటిని విడిచినప్పుడు అవి బలహీనమై చస్తాయి.
    మరియు అవి మరల మట్టి అయిపోతాయి.
30 కాని యెహోవా, నీ ఆత్మను పంపినప్పుడు, అవి మరల ఆరోగ్యంగా ఉంటాయి.
    భూమి మరల క్రొత్తదిగా అవుతుంది.

31 యెహోవా మహిమ శాశ్వతంగా కొనసాగును గాక.
    యెహోవా చేసిన వాటిని చూచి ఆయన ఆనందించునుగాక.
32 యెహోవా భూమివైపు చూసేటప్పుడు
    అది వణకుతుంది.
ఆయన పర్వతాలను ముట్టేటప్పుడు
    వాటినుండి పొగ లేవటానికి ప్రారంభిస్తుంది.

33 నా జీవితకాలం అంతా నేను యెహోవాకు పాడుతాను.
    నేను బ్రతికి ఉండగా యెహోవాకు స్తుతులు పాడుతాను.
34 నేను చెప్పిన విషయాలు ఆయనను సంతోషపెడతాయని నేను ఆశిస్తున్నాను.
    యెహోవా విషయమై నేను సంతోషిస్తున్నాను.

కీర్తనలు. 104:35

35 భూమి మీద నుండి పాపం కనబడకుండా పోవును గాక.
    దుర్మార్గులు శాశ్వతంగా తొలగిపోవుదురు గాక.
నా ప్రాణమా, యెహోవాను స్తుతించు!

యెహోవాను స్తుతించు!

యెహెజ్కేలు 37:1-14

ఎండిన ఎముకల దర్శనం

37 యెహోవా శక్తి నా మీదికి వచ్చింది. దేవుని ఆత్మ (సుడిగాలి రూపంలో) నన్ను నగరం నుండి ఎత్తుకుపోయి ఒక లోయ మధ్యలో దించింది. ఆ లోయ అంతా మానవ అస్థిపంజరాలతో నిండిఉంది. లోయలో భూమిమీద ఎముకలు లెక్కకు మించి పడివున్నాయి. ఆ ఎముకల మధ్యగా యెహోవా నన్ను నడిపించాడు. ఎముకలు బాగా ఎండిపోయి ఉన్నట్లు నేను చూశాను.

నా ప్రభువైన యెహోవా నన్ను, “నరపుత్రుడా, ఈ ఎముకలు తిరిగి ప్రాణం పోసుకోగలవా?” అని అడిగాడు.

“నా ప్రభువైన యెహోవా, ఈ ప్రశ్నకు సమాధానం నీకే తెలుసు” అని నేనన్నాను.

అందుకు నా ప్రభువైన యెహోవా ఇలా అన్నాడు: “ఆ ఎముకలతో నా తరపున మాట్లాడు. వాటికి ఈ విధంగా చెప్పు, ‘ఎండిన ఎముకల్లారా, యెహోవా మాట వినండి! నా ప్రభువైన యెహోవా మీకు ఈ విషయాలు చెపుతున్నాడు: మీలోకి ఊపిరి వచ్చేలా చెస్తాను. మీరు ప్రాణం పోసుకుంటారు! మీమీద మళ్లీ నరాలు, కండరాలు కలుగజేస్తాను. మిమ్మల్ని చర్మంతో కప్పుతాను. పిమ్మట మీలో ఊపిరి పోస్తాను. మీరు బతుకుతారు! అప్పుడు ప్రభువును, యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.’”

ఆయన చెప్పిన రీతిలో నేను యెహోవా తరపున ఎముకలతో మాట్లాడాను. నేను ఇంకా మాట్లాడుతూ ఉండగానే ఒక పెద్ద శబ్దం విన్నాను. ఎముకలలో గలగల శబ్దం వినవచ్చింది. ఒక ఎముకతో మరొక ఎముక కలవటం మొదలు పెట్టింది! తరువాత నా కళ్ల ముందే వాటిమీద నరాలు, కండరాలు ఏర్పడటం జరిగింది. వాటిమీద చర్మం కప్పివేయటం మొదలయింది. కాని శరీరాలు మాత్రం కదలలేదు. వాటిలో ఊపిరి లేదు.

పిమ్మట నా ప్రభువైన యెహోవా నాతో ఇలా అన్నాడు: “వాయువుతో మాట్లాడు. ఓ నరపుత్రుడా, ఊపిరితో మాట్లాడు. ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని ఊపిరితో చెప్పు: ‘ఊపిరి, అన్ని దిశలనుండి నీవు వీచి ఈ శవాలలో జీవంపోయుము! వాటికి ఊపిరి పోయుము; అవి తిరిగి బ్రతుకుతాయి!’”

10 ఆయన చెప్పిన విధంగా నేను యెహోవా తరపున ఆత్మతో మాట్లాడాను. వెంటనే శవాలలోకి ఊపిరి వచ్చింది. వాటికి ప్రాణం వచ్చి లేచి నుంచున్నాయి. అక్కడ ఎంతో మంది మనుష్యులున్నారు. వారంతా ఒక పెద్ద సైన్యం!

11 తరువాత నా ప్రభువైన యెహోవా నాతో ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, ఈ ఎముకలు మొత్తం ఇశ్రాయేలు వంశంలా ఉన్నాయి. ఇశ్రాయేలీయులు, ‘మా ఎముకలు ఎండిపోయాయి. మా ఆశలు అడుగంటాయి. మేము సర్వనాశనమయ్యాము!’ అని అంటున్నారు. 12 కావున నీవు నా తరపున వారితో మాట్లాడి ప్రభువైన యెహోవా ఈ రకంగా చెపుతున్నాడని తెలుపు, ‘నా ప్రజలారా నేను మీ సమాధులను తెరచి, మిమ్మల్ని బయటికి తెస్తాను! పిమ్మట మిమ్మల్ని ఇశ్రాయేలు దేశానికి తీసుకొని వస్తాను. 13 నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరచి, మిమ్మల్ని వాటినుండి బయటకు తెస్తాను! అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. 14 నా ఆత్మను మీలో పెడతాను. దానితో మీరు మళ్లీ జీవిస్తారు. అప్పుడు మిమ్మల్ని మీ స్వదేశానికి తిరిగి నడిపిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. ఈ విషయాలు నేనే చెప్పానని, వాటిని జరిగేలా చేశానని మీరు తెలుసుకుంటారు!’” ఈ విషయాలు యెహోవా చెప్పాడు.

యోహాను 20:19-23

యేసు తన శిష్యులకు కనిపించటం

(మత్తయి 28:16-20; మార్కు 16:14-18; లూకా 24:36-49)

19 ఆ ఆదివారం సాయంకాలం శిష్యులందరు ఒకే చోట సమావేశమయి ఉన్నారు. యేసు వచ్చి వాళ్ళ మధ్య నిలుచొని, “మీకు శాంతి కలుగుగాక!” అని అన్నాడు. 20 ఇలా అన్నాక ఆయన తన చేతుల్ని, ప్రక్క భాగాన్ని చూపించాడు. ప్రభువును చూసాక శిష్యులకు చాలా ఆనందం కలిగింది.

21 యేసు మళ్ళీ, “మీకు శాంతి కులుగు గాక! తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను” అని అన్నాడు. 22 ఇలా అన్నాక, “పవిత్రాత్మను పొందండి!” అని వాళ్ళపై ఊదాడు. 23 ఆ తర్వాత, “మీరు ఎవరి పాపాలు క్షమిస్తే వారి పాపాలు క్షమింపబడతాయి. మీరు ఎవరి పాపాలు క్షమించకపోతే వారి పాపాలు క్షమించబడవు” అని వాళ్ళతో అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International