Revised Common Lectionary (Complementary)
24 యెహోవా, నీవు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశావు.
భూమి నీ కార్యాలతో నిండిపోయింది.
నీవు చేసే ప్రతి పనిలో నీవు నీ జ్ఞానాన్ని ప్రదర్శిస్తావు.
25 మహా సముద్రాన్ని చూడు. అది ఎంతో పెద్దది.
మహా సముద్రంలో రకరకాల ప్రాణులు నివసిస్తాయి. వాటిలో కొన్ని ప్రాణులు పెద్దవి, కొన్ని చిన్నవి.
మహా సముద్రంలో ఉండే వాటిని లెక్కించుటకు అవి చాలా విస్తారంగా ఉన్నాయి.
26 మహా సముద్రంలో ఓడలు ప్రయాణం చేస్తాయి.
నీవు చేసిన సముద్ర ప్రాణి మకరం[a] ఆ సముద్రంలో ఆడుకుంటుంది.
27 దేవా, ఆ ప్రాణులన్నీ నీ మీద ఆధారపడి ఉన్నాయి.
దేవా, వాటికి సరియైన సమయంలో నీవు ఆహారం ఇస్తావు.
28 దేవా, జీవించే ప్రాణులన్నీ తినే ఆహారం నీవే వాటికి ఇస్తావు.
మంచి భోజనంతో నిండిన నీ గుప్పిళ్లు నీవు విప్పగా అవి కడుపు నిండేంత వరకు భోజనము చేస్తాయి.
29 నీవు వాటి నుండి తిరిగిపోయినప్పుడు
అవి భయపడిపోతాయి.
వాటి ప్రాణం వాటిని విడిచినప్పుడు అవి బలహీనమై చస్తాయి.
మరియు అవి మరల మట్టి అయిపోతాయి.
30 కాని యెహోవా, నీ ఆత్మను పంపినప్పుడు, అవి మరల ఆరోగ్యంగా ఉంటాయి.
భూమి మరల క్రొత్తదిగా అవుతుంది.
31 యెహోవా మహిమ శాశ్వతంగా కొనసాగును గాక.
యెహోవా చేసిన వాటిని చూచి ఆయన ఆనందించునుగాక.
32 యెహోవా భూమివైపు చూసేటప్పుడు
అది వణకుతుంది.
ఆయన పర్వతాలను ముట్టేటప్పుడు
వాటినుండి పొగ లేవటానికి ప్రారంభిస్తుంది.
33 నా జీవితకాలం అంతా నేను యెహోవాకు పాడుతాను.
నేను బ్రతికి ఉండగా యెహోవాకు స్తుతులు పాడుతాను.
34 నేను చెప్పిన విషయాలు ఆయనను సంతోషపెడతాయని నేను ఆశిస్తున్నాను.
యెహోవా విషయమై నేను సంతోషిస్తున్నాను.
35 భూమి మీద నుండి పాపం కనబడకుండా పోవును గాక.
దుర్మార్గులు శాశ్వతంగా తొలగిపోవుదురు గాక.
నా ప్రాణమా, యెహోవాను స్తుతించు!
యెహోవాను స్తుతించు!
బాబెలు గోపురం
11 జలప్రళయం తర్వాత మానవులంతా ఒకే భాష మాట్లాడారు. ప్రజలంతా ఒకే పదజాలం ఉపయోగించారు. 2 తూర్పు నుండి ప్రజలు కదిలిపోయారు. షీనారు దేశంలో మైదాన భూమిని వారు కనుగొన్నారు. బ్రతుకుదెరువు కోసం ప్రజలంతా అక్కడే ఉండిపోయారు. 3 “మనం ఇటుకలు చేసి, అవి గట్టిపడేందుకు వాటిని కాల్చాలి” అనుకొన్నారు ప్రజలు. ఇళ్లు కట్టుటకు ప్రజలు రాళ్లు కాక ఇటుకలనే ఉపయోగించారు. అలానే అడుసు కాక తారు ఉపయోగించారు.
4 అప్పుడు ప్రజలు ఇలా అన్నారు: “మన కోసం మనం ఒక పట్టణం కట్టుకోవాలి. ఆకాశం అంత ఎత్తుగా మనం ఒక గోపుర శిఖరం కట్టుకోవాలి. ఇలా గనుక చేస్తే మనం ప్రఖ్యాతి చెందుతాం. ప్రపంచమంతటా మనం చెల్లా చెదురవకుండా ఒకే చోట మనమంతా కలసి ఉంటాం.”
5 ఆ పట్టణాన్ని, ఆ గోపుర శిఖరాన్ని చూచుటకు యెహోవా దిగి వచ్చాడు. వాటిని ప్రజలు నిర్మిస్తూ ఉండటం యెహోవా చూశాడు. 6 యెహోవా ఇలా అన్నాడు: “ఈ ప్రజలంతా ఒకే భాష మాట్లాడుతున్నారు. వీళ్లంతా కలసి ఉమ్మడిగా ఈ పని చేస్తున్నట్లు నాకు కనబడుతోంది. వారు చేయగలిగిన దానికి ఇది ప్రారంభం మాత్రమే. త్వరలో వాళ్లు యోచించినదేదైనా చేయ గలుగుతారు. 7 అందుచేత మనం క్రిందికి వెళ్లి, వారి భాషను గలిబిలి చేద్దాం. అప్పుడు వాళ్లు ఒకరినొకరు అర్థం చేసుకోలేరు.”
8 ఆ ప్రజలు భూలోకం అంతటా చెదిరిపోయేటట్లు యెహోవా చేశాడు. కనుక ఆ పట్టణాన్ని కట్టుకోవటం ఆ ప్రజలు ముగించలేకపోయారు. 9 మొత్తం ప్రపంచంలోని భాషను దేవుడు గలిబిలి చేసిన చోటు అదే. కనుక ఆ స్థలం బాబెలు[a] అని పిలువబడింది. కనుక ఆ స్థలం నుండి భూమిమీద ఇతర చోట్లన్నింటికీ ఆ ప్రజలను యెహోవా చెదరగొట్టాడు.
ఒకే శరీరం, అనేక అవయవాలు
12 శరీరంలో అనేక భాగాలు ఉన్నా అవి కలిసి ఒక దేహంగా పని చేస్తాయి. క్రీస్తు కూడా అంతే. 13 అంటే మనమంతా ఒక ఆత్మ ద్వారా బాప్తిస్మము పొంది, ఒక శరీరంలో ఐక్యం అయ్యాము. మనము యూదులమైనా, గ్రీకులమైనా, బానిసలమైనా, బానిసలము కాకపోయినా, మనకందరికీ ఒకే ఆత్మ యివ్వబడినాడు.
14 మన శరీరంలో ఎన్నో భాగాలున్నాయి. ఒకటి కాదు. 15 ఒకవేళ, కాలు, “నేను చేతిని కాను, కనుక నేను ఈ శరీరానికి చెందను” అని అన్నంత మాత్రాన అది శరీరంలో ఒక భాగం కాకపోదు. 16 అదే విధంగా ఒకవేళ చెవి, “నేను కన్నును కాను. కనుక ఈ శరీరానికి చెందను” అని అన్నంత మాత్రాన అది శరీరంలో ఒక భాగం కాకపోదు. 17 శరీరమంతా కన్నైపోతే దేనితో వింటాం? శరీరమంతా చెవియైతే దేనితో వాసన చూస్తాం? 18 కాని నిజానికి దేవుడు ఈ శరీరంలోని ప్రతి అవయవాన్ని తాను అనుకొన్న విధంగా అమర్చాడు. 19 అన్ని అవయవాలు ఒక అవయవంగా మారితే శరీరం ఉండదు. 20 నిజానికి శరీరంలో అనేక భాగాలు ఉన్నా శరీరం ఒక్కటే.
21 కన్ను చేతితో, “నీవు నాకు అవసరం లేదు” అని అనలేదు. అదే విధంగా శిరస్సు పాదాలతో, “మీరు నాకు అవసరం లేదు” అని అనలేదు. 22 సున్నితంగా కనిపించే అవయవాలే నిజానికి ముఖ్యమైనవి. 23 ముఖ్యం కాదనుకొనే భాగాలను మనము ప్రత్యేకంగా కాపాడుతాము. బహిరంగపరచలేని భాగాల పట్ల మనము ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతాము. 24 బహిరంగపరచగల భాగాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపనవసరం లేదు. కాని దేవుడు శరీరానికి సంబంధించిన భాగాల్ని ఒక చోట చేర్చి ప్రాముఖ్యత లేని భాగాలకు ప్రాముఖ్యత కలిగించాడు. 25 శరీరంలో చీలికలు ఉండరాదని, దాని భాగాలు పరస్పరం శ్రద్ధ చూపుతూ ఉండాలని, ఆయన ఉద్దేశ్యం. 26 ఒక భాగానికి కష్టం కలిగితే ప్రతీయొక భాగం దానితో సహా కష్టం అనుభవిస్తుంది. ఒక భాగానికి గౌరవం లభిస్తే మిగతా భాగాలన్నింటికీ దానితో సహా ఆనందం కలుగుతుంది.
27 మీరు క్రీస్తు శరీరం. మీలో ప్రతి ఒక్కరూ ఆ శరీరానికి చెందిన భాగాలు.
© 1997 Bible League International