Revised Common Lectionary (Complementary)
25 యెహోవా, మహా సమాజంలో నా స్తుతి నిన్నుబట్టే వస్తుంది.
నేను చేస్తానని వాగ్దానం చేసిన వాటన్నింటినీ, ఈ ఆరాధికులందరి ఎదుటనే నేను చేస్తాను.
26 పేద ప్రజలు తిని, తృప్తి పొందుతారు.
యెహోవా కోసం చూస్తూ వచ్చే ప్రజలారా, మీరు ఆయనను స్తుతించండి.
మీ హృదయాలు ఎప్పటికీ సంతోషంగా ఉండునుగాక!
27 దూరదేశాల్లోని ప్రజలంతా యెహోవాను జ్ఞాపకం చేసుకొని
ఆయన వద్దకు తిరిగి వస్తారు.
28 ఎందుకనగా యెహోవాయే రాజు. దేశాలన్నింటినీ ఏలేవాడు ఆయనే.
ఆయనే సకల రాజ్యాలనూ పాలిస్తాడు.
29 నిజంగా, భూమిలో నిద్రించబోయే వారందరూ ఆయన్ని ఆరాధిస్తారు.
సమాధిలోనికి దిగిపోయేవారందరూ ఆయనకు తల వంచుతారు.
మరియు వారి ప్రాణాలను కాపాడుకొనలేనివారు కూడా తల వంచుతారు.
చచ్చిన ప్రతి మనిషి ఆయనకు తల వంచాలి.
30 భవిష్యత్తులో మన వారసులు యెహోవాను సేవిస్తారు.
యెహోవా విషయమై వారు నిత్యం చెప్పుతారు.
31 ఇంకా పుట్టని మనుష్యులకు దేవుని మంచితనం గూర్చి చెబుతారు.
దేవుడు నిజంగా చేసిన మంచి కార్యాలను గూర్చి ఆ మనుష్యులు చెబుతారు.
ఇశ్రాయేలు వినాశనానికి యెహోవా వాగ్దానం
7 యెహోవా ఇది చెపుతున్నాడు:
“ఇశ్రాయేలూ, మీరు నాకు ఇథియోపియనుల (కూషీయుల) వంటివారు.
ఇశ్రాయేలీయులను నేను ఈజిప్టు దేశంనుండి బయటకు తీసికొని వచ్చాను.
ఫిలిష్తీయులనుకూడ నేను కఫ్తోరునుండి బయటకు రప్పించాను.
మరియు అరామీయులను (సిరియనులను) కీరునుండి బయటకు తీసుకొని వచ్చాను.”
8 నా ప్రభువైన యెహోవా ఈ పాపపు రాజ్యాన్ని (ఇశ్రాయేలును) గమనిస్తున్నాడు.
యెహోవా ఇది చెప్పాడు:
“ఈ భూమి ఉపరితలంనుండి ఇశ్రాయేలును తొలగిస్తాను.
కాని యాకోబు వంశాన్ని పూర్తిగా నాశనం చేయను.
9 ఇశ్రాయేలు రాజ్యాన్ని నాశనం చేయటానికి ఆజ్ఞ ఇస్తున్నాను.
ఇశ్రాయేలు ప్రజలను ఇతర దేశాలకు చెదర గొడతాను.
కాని అది పిండిని జల్లించువాని రీతిగా ఉంటుంది.
ఒక వ్యక్తి జల్లెడలో పిండిని జల్లిస్తాడు.
అప్పుడు మెత్తని పిండి క్రిందికి దిగుతుంది. కాని బరక పిండి జల్లెట్లో మిగిలిపోతుంది. యాకోబు వంశం విషయంలోకూడ ఇదేరీతి జరుగుతుంది.
10 “నా ప్రజలలో పాపులైనవారు,
‘మాకేమీ కీడు జరుగదు!’ అని అంటారు.
కాని ఆ జనులందరూ కత్తులచే చంపబడతారు!”
రాజ్యాన్ని తిరిగి ఇచ్చేందుకు దేవుడు మాట ఇచ్చుట
11 “దావీదు గుడారం పడిపోయింది.
కాని నేను దానిని తిరిగి నిలబెడతాను.
గోడల కంతలు పూడ్చుతాను. శిథిలమైన భవనాలను తిరిగి నిర్మిస్తాను.
దానిని పూర్వమున్నట్లు నిర్మిస్తాను.
12 అప్పుడు ఎదోములో బతికివున్న ప్రజలు,
మరియు నా పేరుమీద పిలువబడే జనులందరూ సహాయం కొరకు యెహోవావైపు చూస్తారు.”
యెహోవా ఈ మాటలు చెప్పాడు.
అవి జరిగేలా ఆయన చేస్తాడు.
13 యెహోవా చెపుతున్నాడు: “పంటకోయువాని వెనుక భూమిని దున్నే రోజులు వస్తున్నాయి.
ద్రాక్షాపండ్లు తెంచేవాని వెనుకనే, పండ్లను తొక్కేవాడు వచ్చే సమయం రాబోతూవుంది.
కొండల నుంచి, పర్వతాల నుంచి
మధురమైన ద్రాక్షారసం పారుతుంది.
14 నా ప్రజలైన ఇశ్రాయేలీయులను చెరనుండి
తిరిగి తీసుకు వస్తాను.
వారు శిథిలమైన నగరాలను తిరిగి కడతారు.
ఆ నగరాలలో వారు మళ్లీ నివసిస్తారు.
వారు ద్రాక్షాతోటలు వేస్తారు.
ఆ తోటలనుంచి వచ్చిన ద్రాక్షారసాన్ని వారు తాగుతారు.
వారు తోటలను ఏర్పాటు చేస్తారు.
వారు ఆ తోటలనుండి వచ్చే ఫలాలను తింటారు.
15 నా ప్రజలను తమ దేశంలో మళ్లీ స్థిరపర్చుతాను.
నేను వారికిచ్చిన దేశాన్నుండి వారు మళ్లీ లాగి వేయబడరు.”
మీ దేవుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
దేవుని రాజ్యం దేనీతో పోల్చపడింది?
(మత్తయి 13:31-32, 34-35; లూకా 13:18-19)
30 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “దేవుని రాజ్యం ఏ విధంగా ఉందని చెప్పాలి? ఏ ఉపమానాన్ని ఉపయోగించి దాన్ని వర్ణించాలి? 31 అది ఆవగింజలాంటిది. మనం భూమిలో నాటే విత్తనాలన్నిటి కన్నా అది చాలా చిన్నది. 32 కాని ఆ ఆవగింజను నాటాక తోటలో ఉన్న అన్ని మొక్కల కన్నా అది పెద్దగా పెరుగుతుంది. దాని కొమ్మలు పెద్దగా ఉంటాయి. గాలిలో ఎగిరే పక్షులు దాని నీడలో గూడుకట్టుకొంటాయి.”
© 1997 Bible League International