Revised Common Lectionary (Complementary)
5 మరుసటి రోజు నాయకులు, పెద్దలు, పండితులు యెరూషలేములో సమావేశం అయ్యారు. 6 “అన్న” అనే ప్రధాన యాజకుడు, కయప, యోహాను, అలెక్సంద్రు, ప్రధాన యాజకుని కుటుంబానికి చెందినవాళ్ళంతా ఆ సమావేశంలో ఉన్నారు. 7 పేతురును, యోహానును వీళ్ళ ముందుకు పిలుచుకు వచ్చారు. “ఏ అధికారంతో, ఎవరి పేరిట మీరాపని చేసారు?” అని వాళ్ళు ప్రశ్నించటం మొదలు పెట్టారు.
8 అదే సమయంలో, పేతురు పవిత్రాత్మతో నిండినవాడై వాళ్ళకు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ప్రజా నాయకులారా! పెద్దరాలా! 9 ఒక కుంటివానికి చేసిన ఉపకారాన్ని గురించి మమ్మల్ని ప్రశ్నించాలనుకొంటున్నారా? అతనికి ఎవరు నయం చేసారని తెలుసుకోవాలనుకొంటున్నారా? 10 అలాగైతే మీరు, ఇశ్రాయేలు ప్రజలు ఇది తెలుసుకోవాలి. నజరేతు నివాసి యేసు క్రీస్తు పేరిట ఈ కుంటివాడు పూర్తిగా నయమై మీ ముందు నిలుచున్నాడు. మీరు యేసును సిలువకు వేసి చంపినా దేవుడాయన్ని బ్రతికించాడు.
11 ‘ఇల్లు కట్టువాళ్ళైన మీరు పారవేసిన రాయి ఈ యేసే!
ఇప్పుడది మూలకు తలరాయి అయింది.’(A)
12 రక్షణ యింకెవరి ద్వారా లభించదు. ఎందుకంటే, రక్షణ పొందటానికి ఈ పేరు (యేసు క్రీస్తు) తప్ప మరే పేరును దేవుడు మానవులకు తెలుపలేదు. ఈ పేరుకు తప్ప ఆ శక్తి ప్రపంచంలో మనుష్యులకివ్వబడిన మరే పేరుకు లేదు.”
దావీదు కీర్తన.
23 యెహోవా నా కాపరి
నాకు కొరత ఉండదు
2 పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో పెడతాడు.
ప్రశాంతమైన నీళ్లవద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు.
3 ఆయన తన నామ ఘనత కోసం నా ఆత్మకు నూతన బలం ప్రసాదిస్తాడు.
ఆయన నిజంగా మంచివాడని చూపించేందుకు ఆయన నన్ను మంచితనపు మార్గాల్లో నడిపిస్తాడు.
4 చివరికి మరణాంధకారపు లోయలో నడిచినప్పుడు కూడా
నేను భయపడను. ఎందుకంటే, యెహోవా, నీవు నాతో ఉన్నావు.
నీ చేతికర్ర, నీ దండం నన్ను ఆదరిస్తాయి కనుక.
5 యెహోవా, నా శత్రువుల ఎదుటనే నీవు నాకు భోజనం సిద్ధం చేశావు.
నూనెతో నా తలను నీవు అభిషేకిస్తావు.
నా పాత్ర నిండి, పొర్లిపోతుంది.
6 నా మిగిలిన జీవితం అంతా మేలు, కరుణ నాతో ఉంటాయి.
మరియు నేను ఎల్లకాలం యెహోవా ఆలయంలో నివసిస్తాను.
16 యేసు క్రీస్తు మనకోసం తన ప్రాణాలర్పించాడు. మనం మన సోదరుల కోసం ప్రాణాల్ని ధారపోయాలి. అప్పుడే “ప్రేమ” అంటే ఏమిటో మనం తెలుసుకోగలము. 17 ఒకని దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయనుకోండి. కాని, అతడు తన సోదరునికి అవసరాలు ఉన్నాయని తెలిసి కూడా దయ చూపకుండా ఉంటే అతని పట్ల దేవుని దయ ఎందుకు ఉంటుంది? 18 బిడ్డలారా! మనం మాటలతో కాక క్రియా రూపంగా, సత్యంతో మన ప్రేమను వెల్లడి చేద్దాం.
19-20 మన హృదయాలు మనల్ని గద్దించినప్పుడు, దేవుడు మన హృదయాలకన్నా గొప్పవాడు, అన్నీ తెలిసినవాడు కనుక, మనం నోటి మాటలతో కాక క్రియారూపంగా సత్యంతో ప్రేమను చూపుదాం. అలా చేస్తే మనం సత్యానికి చెందిన వాళ్ళమని తెలుసుకొంటాం. పైగా ఆయన సమక్షంలో దేవుడు మన హృదయాలకన్నా గొప్పవాడని, మన హృదయాలకు నచ్చ చెప్పగలుగుతాం.
21 ప్రియ మిత్రులారా! మన హృదయాలు మన మీద నిందారోపణ చేయలేనిచో మనకు ఆయన సమక్షంలో ధైర్యం ఉంటుంది. 22 దేవుని ఆజ్ఞల్ని పాటిస్తూ ఆయనకు ఆనందం కలిగే విధంగా నడుచుకొంటే మనం అడిగింది మనకు లభిస్తుంది. 23 ఆయన ఆజ్ఞ యిది: దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నామమందు విశ్వాసముంచండి. ఆయనాజ్ఞాపించిన విధంగా పరస్పరం ప్రేమతో ఉండండి. 24 దేవుని ఆజ్ఞల్ని పాటించినవాళ్ళు ఆయనలో జీవిస్తారు. ఆయన వాళ్ళలో జీవిస్తాడు. ఆయన మనకు ఇచ్చిన ఆత్మద్వారా ఆయన మనలో జీవిస్తున్నాడని తెలుసుకోగలుగుతాం.
11 “మంచి కాపరి గొఱ్ఱెల కోసం చావటానికి కూడా సిద్ధమౌతాడు. నేను ఆ మంచి కాపరిని. 12 కూలి కోసం పనిచేసే వాడు కాపరికాడు. గొఱ్ఱెలు అతనివి కావు. కనుక అతడు తోడేళ్ళు రావటం చూస్తే గొఱ్ఱెల్ని వదిలి పారిపోతాడు. అప్పుడు తోడేళ్ళు వచ్చి మంద మీద పడి వాటిని చెదరగొడతాయి. 13 అతడు కూలి కొరకు పని చేసేవాడు కాబట్టి గొఱ్ఱెల క్షేమం చూడడు.
14-15 “నేను మంచి కాపరిని. నా తండ్రికి నన్ను గురించి, నాకు నా తండ్రిని గురించి తెలుసు. అదే విధంగా నాకు నా గొఱ్ఱెల్ని గురించి, నా గొఱ్ఱెలకు నా గురించి తెలుసు. నా గొఱ్ఱెల కోసం నేను ప్రాణం ఇస్తాను. 16 ఈ మందకు చెందని గొఱ్ఱెలు కొన్ని ఉన్నాయి. అవికూడా నావే. వాటిని కూడా నేను తీసుకొని రావాలి. అవి నా మాట వింటాయి. అప్పుడు అన్నీ ఒకే మందగా ఉంటాయి. ఒకే ఒక కాపరి ఉంటాడు. 17 నేను నా ప్రాణం యివ్వటానికి సిద్ధంగా ఉన్నాను. దాన్ని తిరిగి పొందడానికి శక్తిమంతుడను. కనుకనే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. 18 నా ప్రాణాన్ని నానుండి ఎవ్వరూ తీసుకోలేరు. నేను స్వయంగా నా ప్రాణం యిస్తాను. నా ప్రాణం యివ్వటానికి, తిరిగి తీసుకోవటానికి నాకు అధికారం ఉంది. అది నా తండ్రి ఆజ్ఞ.”
© 1997 Bible League International