Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
23 యెహోవా నా కాపరి
నాకు కొరత ఉండదు
2 పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో పెడతాడు.
ప్రశాంతమైన నీళ్లవద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు.
3 ఆయన తన నామ ఘనత కోసం నా ఆత్మకు నూతన బలం ప్రసాదిస్తాడు.
ఆయన నిజంగా మంచివాడని చూపించేందుకు ఆయన నన్ను మంచితనపు మార్గాల్లో నడిపిస్తాడు.
4 చివరికి మరణాంధకారపు లోయలో నడిచినప్పుడు కూడా
నేను భయపడను. ఎందుకంటే, యెహోవా, నీవు నాతో ఉన్నావు.
నీ చేతికర్ర, నీ దండం నన్ను ఆదరిస్తాయి కనుక.
5 యెహోవా, నా శత్రువుల ఎదుటనే నీవు నాకు భోజనం సిద్ధం చేశావు.
నూనెతో నా తలను నీవు అభిషేకిస్తావు.
నా పాత్ర నిండి, పొర్లిపోతుంది.
6 నా మిగిలిన జీవితం అంతా మేలు, కరుణ నాతో ఉంటాయి.
మరియు నేను ఎల్లకాలం యెహోవా ఆలయంలో నివసిస్తాను.
యాకోబు లాబానును మోసగించుట
25 యోసేపు పుట్టిన తర్వాత లాబానుతో యాకోబు అన్నాడు: “ఇక నా మాతృదేశంలోని నా స్వంత యింటికి నన్ను వెళ్లనివ్వు. 26 నా భార్యల్ని, పిల్లలను నాకు అప్పగించు. నీ దగ్గర 14 సంవత్సరాలు పనిచేసి నేను వాళ్లను సంపాదించుకొన్నాను. నీ దగ్గర నేను మంచి పని చేసానని నీకు తెలుసు.”
27 అతనితో లాబాను అన్నాడు: “నన్ను ఒక్క మాట చెప్పనివ్వు. నీ మూలంగానే యెహోవా నన్ను ఆశీర్వదించాడని నాకు తెలుసు. 28 నీకు ఏం చెల్లించమంటావో చెప్పు, అది నీకు నేను చెల్లిస్తాను.”
29 యాకోబు జవాబిచ్చాడు: “నీ కోసం నేను కష్టపడి పని చేసానని నీకు తెలుసు. నీ గొర్రెల మందలను నేను కాస్తూ ఉండగా అవి విస్తరించాయి, క్షేమంగా ఉన్నాయి. 30 నేను వచ్చిన మొదట్లో నీకు ఉన్నది స్వల్పం. ఇప్పుడు నీకు చాలా విస్తారంగా ఉంది. నీ కోసం నేను ఏదైనా చేసినప్పుడల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. ఇప్పుడు ఇక నా కోసం నేను పని చేసుకోవాలి, నా ఇంటిని నేను కట్టుకోవాలి.”
31 “అలాగైతే నేను నీకు ఏమి ఇవ్వాలి?” అని లాబాను అడిగాడు.
యాకోబు ఇలా జవాబిచ్చాడు: “నీవు నాకు ఏమీ యివ్వక్కర్లేదు. నీవు నన్ను ఈ ఒక్క పని చేయనిస్తే చాలు: నేను మళ్లీ వెళ్లి నీ గొర్రెలను కాస్తాను. 32 అయితే ఈ వేళ నీ గొర్రెల మందల్లో నన్ను నడువనియ్యి, వాటిలో మచ్చలుగాని చారలుగాని ఉన్న ప్రతి గొర్రె పిల్లను నన్ను తీసుకోనివ్వు. అలాగే నల్ల మేకపిల్లలు అన్నిటిని, చారలు మచ్చలు ఉన్న ప్రతి ఆడ మేకను నన్ను తీసుకోనివ్వు. అదే నాకు జీతం. 33 నా నిజాయితీ ఏమిటో భవిష్యత్తులో నీవు తేలిగ్గా తెలుసుకోవచ్చు. నీవు వచ్చి నా మందల్ని చూడవచ్చు. మచ్చలేని మేకగాని, నలుపు లేని గొర్రెగాని నా దగ్గర ఉంటే, దాన్ని నేను దొంగిలించినట్లు నీకు తెలుస్తుంది.”
34 “అది నాకు సమ్మతమే. నీవు అడిగినట్లు మనం చేద్దాం” అన్నాడు లాబాను. 35 అయితే మచ్చలు ఉన్న మేకపోతులన్నింటిని ఆ రోజే లాబాను దాచిపెట్టేశాడు. మచ్చలు ఉన్న ఆడ మేకలన్నింటిని కూడ లాబాను దాచిపెట్టేశాడు. ఈ గొర్రెలను కనిపెట్టి ఉండమని లాబాను తన కుమారులతో చెప్పాడు. 36 కనుక ఆ కుమారులు మచ్చలుగల గొర్రెలన్నింటిని మరో చోటుకు తోలుకొని వెళ్లారు. మూడు రోజుల పాటు వారు ప్రయాణం చేశారు. యాకోబు అక్కడ ఉండి, మిగిలిన జంతువులన్నింటి విషయం జాగ్రత్త పుచ్చుకొన్నాడు. అయితే అక్కడ ఉన్నవాటిలో మచ్చలు ఉన్నవి గాని చారలు ఉన్నవి గాని ఏ జంతువు లేదు.
37 కనుక బూరగ, బాదం అను చెట్ల పచ్చటి కొమ్మలు యాకోబు నరికాడు. ఆ చువ్వల పైబెరడును అక్కడక్కడ యాకోబు తీసివేసినందువల్ల వాటి మీద తెల్ల చారలు కనబడుతున్నాయి. 38 నీళ్లు త్రాగే స్థలాల్లో మందల ముందు యాకోబు ఆ చువ్వలను ఉంచాడు. ఆ జంతువులు నీళ్లు త్రాగటానికి వచ్చినప్పుడు, అక్కడే అవి కలిసేవి. 39 ఆ చువ్వల ముందర మేకలు చూలు కట్టినప్పుడు మచ్చలు, చారలు, నలుపుగల పిల్లలు వాటికి పుట్టాయి.
40 మచ్చలు, నలుపు ఉన్న జంతువులను మిగతా జంతువులనుండి యాకోబు వేరుచేశాడు. యాకోబు తన జంతువులను లాబాను జంతువులనుండి వేరుగా ఉంచాడు. 41 మందలోని బలమైన జంతువులు ఎదైనప్పుడల్లా యాకోబు ఆ చువ్వలను వాటి కళ్లముందు ఉంచాడు. ఆ కొమ్మల దగ్గర ఆ జంతువులు చూలు కట్టేవి. 42 అయితే ఒక్కటి, బలహీనమైన జంతువులు ఎదైనప్పుడు యాకోబు ఆ కొమ్మలను అక్కడ పెట్టలేదు. కనుక బలహీనమైన జంతువులకు పుట్టిన పిల్లలన్నీ లాబానువే. బలమైన జంతువులకు పుట్టిన పిల్లలన్నీ యాకోబువి. 43 ఈ విధంగా యాకోబు చాలా ధనికుడయ్యాడు. పెద్ద మందలు, చాలా మంది సేవకులు, ఒంటెలు, గాడిదలు అతనికి ఉన్నాయి.
17 “సోదరులారా! మీ నాయకులవలె మీరు కూడా అమాయకంగా ప్రవర్తించారని నాకు తెలుసు. 18 కాని, ‘క్రీస్తు తప్పక చనిపోవాలి’ అని ప్రవక్తలందరి ద్వారా దేవుడు ముందే పలికిన వాక్కుల్ని ఈ విధంగా నిజం చేసాడు. 19 మారుమనస్సు పొంది దేవుని వైపు మళ్ళండి. అలా చేస్తే దేవుడు మీ పాపాలు కడిగి వేస్తాడు. మీకు విమోచనం కలిగే రోజులు వస్తాయి. 20 మీ కోసం దేవుడు క్రీస్తుగా నియమించిన యేసును పంపుతాడు.
21 “చాలా కాలం క్రితమే తమను తాము దేవునికి అంకితం చేసుకొన్న ప్రవక్తల నోటి ద్వారా యిలా అభయమిచ్చాడు. సర్వం పునఃస్థాపితం చేసేకాలం వచ్చేవరకు యేసు పరలోకంలోనే ఉండాలి. 22 మోషే ఈ విధంగా అన్నాడు: ‘ప్రభువైన దేవుడు మీ కొరకు నాలాంటి ప్రవక్తను పంపుతాడు. ఆయన మీ సోదరులనుండి వస్తాడు. ఆయన చెప్పినట్లు మీరు వినాలి. 23 దేవుడు ఆయన మాటల్ని వినని ప్రతి ఒక్కణ్ణి తమ వాళ్ళనుండి దూరం చేసి నాశనం చేస్తాడు.’(A)
24 “సమూయేలు కాలంనుండి ప్రవక్తలందరూ ఈ రోజులు రానున్నాయని చెప్పారు. 25 మీ పూర్వికులతో దేవుడు చేసిన ఒప్పందానికి, మీ ప్రవక్తలకు మీరు వారసులు. దేవుడు అబ్రాహాముతో, ‘నీ వంశీయుని ద్వారా భూమ్మీద ఉన్న ప్రజలందర్ని దీవిస్తాను’(B) అని అన్నాడు. 26 దేవుడు తన సేవకుణ్ణి మొదట మీ దగ్గరకు పంపాడు. మీ అందర్ని మీ మీ దుర్మార్గాలనుండి మళ్ళించటానికి ఆయన్ని పంపాడు. అలా చేసి మిమ్మల్ని దీవించాలని అనుకొన్నాడు.”
© 1997 Bible League International