Revised Common Lectionary (Complementary)
150 యెహోవాను స్తుతించండి!
దేవుని ఆలయంలో ఆయనను స్తుతించండి!
ఆకాశంలో ఆయన శక్తిని బట్టి ఆయనను స్తుతించండి!
2 ఆయన గొప్ప కార్యములను బట్టి ఆయనను స్తుతించండి!
ఆయన గొప్పతనమంతటి కోసం ఆయనను స్తుతించండి!
3 బూరలతో, కొమ్ములతో ఆయనను స్తుతించండి!
స్వరమండలాలతో, సితారాలతో ఆయనను స్తుతించండి!
4 తంబురలతో, నాట్యంతో దేవుని స్తుతించండి!
తీగల వాయిద్యాలతో, పిల్లన గ్రోవితో ఆయనను స్తుతించండి!
5 పెద్ద తాళాలతో దేవుణ్ణి స్తుతించండి!
పెద్దగా శబ్దం చేసే తాళాలతో ఆయనను స్తుతించండి!
6 సజీవంగా ఉన్న ప్రతీది యెహోవాను స్తుతించాలి!
యెహోవాను స్తుతించండి.
జ్ఞానము ఆహ్వానించుట
9 జ్ఞానము తన నివాసమును కట్టుకొనెను. దానికి ఏడు స్తంభములను ఆమె నిలబెట్టెను. 2 ఆమె (జ్ఞానము) భోజనం సిద్ధం చేసి, ద్రాక్షారసమును కలిపి, భోజనమును బల్లపైఉంచెను. 3 అప్పుడు ఆమె (జ్ఞానము) తన సేవకులను, ప్రజలను నగరములోని ఎత్తయిన స్థలమునకు తనతో పాటు తినుటకు ఆహ్వానించెను. కొండ మీదికి వచ్చి, ఆమెతో కూడ భోజనం చేసేందుకు మనుష్యులను ఆహ్వానించుటకు తన సేవకులను ఊళ్లోనికి పంపింది. 4 “నేర్చుకోవాల్సిన అవసరం ఉన్న మనుష్యులారా, మీరు రండి” అని ఆమె చెప్పింది. బుద్దిహీనులను కూడా ఆమె పిలిచింది. 5 “నా జ్ఞాన భోజనం ఆరగించండి, రండి. నేను చేసిన ద్రాక్షారసం తాగండి. 6 మీ పాత బుద్ధిహీన పద్ధతులు విడిచి పెట్టండి. మీకు జీవం ఉంటుంది. తెలివిగల మార్గాన్ని అనుసరించండి” అని ఆమె చెప్పింది.
యేసు కనిపించటం
(మత్తయి 28:9-10; యోహాను 20:11-18; లూకా 24:13-35)
9 యేసు ఆదివారం తెల్లవారుఝామున బ్రతికి వచ్చి మొదట మగ్దలేనే మరియకు కనిపించాడు. గతంలో యేసు ఈమె నుండి ఏడు దయ్యాలను వదిలించి ఉన్నాడు. 10 ఆమె ఇదివరలో యేసుతో ఉన్నవాళ్ళ దగ్గరకు వెళ్ళింది. వాళ్ళు దుఃఖంతో విలపిస్తూ ఉన్నారు. ఆమె వాళ్లకు జరిగిన సంగతి చెప్పింది. 11 యేసు బ్రతికి ఉన్నాడని, తాను ఆయన్ని చూసానని చెప్పింది. ఇది వాళ్ళు విన్నారు. కాని వాళ్ళు ఆమె మాటలు నమ్మలేదు.
12 ఆ తర్వాత యేసు తన యిద్దరు శిష్యులు వారి గ్రామానికి నడుస్తుండగా మరో రూపంలో కనిపించాడు. 13 వీళ్ళు తిరిగి వచ్చి జరిగిన విషయం మిగిలిన శిష్యులకు చెప్పారు. కాని వాళ్ళు వీళ్ళను కూడా నమ్మలేదు.
యేసు తన శిష్యులతో మాట్లాడటం
(మత్తయి 28:16-20; లూకా 24:36-49; యోహాను 20:19-23; అపొ. కా. 1:6-8)
14 ఆ తర్వాత పదకొండుగురు భోజనం చేస్తుండగా యేసు వాళ్ళకు కనిపించాడు. తాను బ్రతికి వచ్చిన విషయం కొందరు చెప్పినా శిష్యులు నమ్మలేదు. కనుక యేసు వాళ్ళు తనను నమ్మనందుకు వాళ్ళను గద్దించాడు.
15 యేసు వాళ్ళతో, “ప్రపంచమంతా పర్యటన చేసి ప్రజలందరికి సువార్త ప్రకటించండి. 16 విశ్వసించి బాప్తిస్మము పొందిన వాళ్ళను దేవుడు రక్షిస్తాడు. కాని, విశ్వసించని వాళ్ళను దేవుడు శిక్షిస్తాడు. 17 విశ్వసించిన వాళ్లకు ఈ ఋజువులు కనిపిస్తాయి. నాపేరిట వాళ్ళు దయ్యాలను వెళ్ళగొట్టకలుగుతారు. తమకు రాని భాషల్లో మాట్లాడకలుగుతారు. 18 తమ చేతుల్తో పాముల్ని పట్టుకోగలుగుతారు. విషం త్రాగినా వాళ్ళకే హానీ కలుగదు. వాళ్ళు తమ చేతుల్ని రోగులపై ఉంచితే వాళ్ళకు నయమైపోతుంది” అని అన్నాడు.
© 1997 Bible League International