Revised Common Lectionary (Complementary)
150 యెహోవాను స్తుతించండి!
దేవుని ఆలయంలో ఆయనను స్తుతించండి!
ఆకాశంలో ఆయన శక్తిని బట్టి ఆయనను స్తుతించండి!
2 ఆయన గొప్ప కార్యములను బట్టి ఆయనను స్తుతించండి!
ఆయన గొప్పతనమంతటి కోసం ఆయనను స్తుతించండి!
3 బూరలతో, కొమ్ములతో ఆయనను స్తుతించండి!
స్వరమండలాలతో, సితారాలతో ఆయనను స్తుతించండి!
4 తంబురలతో, నాట్యంతో దేవుని స్తుతించండి!
తీగల వాయిద్యాలతో, పిల్లన గ్రోవితో ఆయనను స్తుతించండి!
5 పెద్ద తాళాలతో దేవుణ్ణి స్తుతించండి!
పెద్దగా శబ్దం చేసే తాళాలతో ఆయనను స్తుతించండి!
6 సజీవంగా ఉన్న ప్రతీది యెహోవాను స్తుతించాలి!
యెహోవాను స్తుతించండి.
ఆశాజనకమైన వాగ్ధానాలు
30 ఈ వర్తమానం యిర్మీయాకు యెహోవా నుండి వచ్చింది. 2 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలా చెప్పాడు: “యిర్మీయా, నేను నీతో మాట్లాడిన విషయాలన్నీ ఒక పుస్తక రూపంలో వ్రాయుము. నీవే ఈ పుస్తకాన్ని (పత్రము) వ్రాయాలి. 3 ఎందువల్లనంటే, బందీలుగావున్న ఇశ్రాయేలు, యూదా ప్రజలను నేను తిరిగి తీసుకొనివచ్చే రోజులు వస్తాయి.” ఇది యెహోవా సందేశం: “వారి పూర్వీకులకు నేనిచ్చిన దేశంలో వారిని నేను మరల స్థిరపడేలా చేస్తాను. మళ్లీ నా ప్రజలు ఆ రాజ్యన్ని స్వంతం చేసుకుంటారు!” ఇదే యెహోవా వాక్కు.
4 యెహోవా సందేశాన్ని ఇశ్రాయేలు, యూదా ప్రజలను గూర్చి చెప్పాడు. 5 యెహోవా చెప్పినది ఇలా ఉంది:
“భయంతో ప్రజలు చేసే ఆక్రందన మనం వింటున్నాం!
ప్రజలు భీతావహులయ్యారు! వారికి శాంతి లేదు!
6 “ఈ ప్రశ్న అడిగి, దాన్ని గురించి ఆలోచించుము:
ఎవడైనా ఒక పురుషుడు బిడ్డను కనగలడా? అసంభవం!
అయితే ప్రతి బలవంతుడు పురిటి నొప్పులతో బాధపడే స్త్రీ వలే
తన కడుపు పట్టుకొనటం నేనెందుకు చూస్తున్నాను?
ఎందువల్ల ప్రతివాని ముఖం శవంలా తెల్లనై వెలవెలబోతుంది?
ఎందుకంటే పురుషులు మిక్కిలి భయపడి ఉన్నారు!
7 “యూకోబుకు ఇది గొప్ప సంకట సమయం.
ఇది బహు కష్ట కాలం.
ఇటువంటి కాలం మరి ఉండబోదు.
అయినా యాకోబు సంరక్షింపబడతాడు.
8 “అప్పుడు నేను ఇశ్రాయేలు, యూదా ప్రజల మెడపై కాడిని విరిచి వేస్తాను.” ఇది సర్వశక్తిమంతుడైన యెహోవా నుండి వచ్చిన వర్తమానం: మిమ్మల్ని బంధించిన తాళ్లను తెంచివేస్తాను. విదేశీయులెవ్వరూ మరెన్నడు నా ప్రజలను బానిసలుగా చేసుకోవాలని బలవంతం చేయరు. 9 ఇశ్రాయేలు, యూదా ప్రజలు విదేశాలలో దాస్యం చేయరు. ఎన్నడూ చేయరు! వారి దేవుడైన యెహోవానే వారు సేవిస్తారు. వారి రాజైన దావీదుకు[a] వారు సేవచేస్తారు. ఆ రాజును నేను వారివద్దకు పంపుతాను.
10 “కావున నా సేవకుడవైన యాకోబూ, నీవు భయపడవద్దు!”
ఇదే యెహోవా వాక్కు:
“ఇశ్రాయేలూ, భయపడవద్దు!
ఆ సుదూర దేశంనుండి నిన్ను నేను రక్షిస్తాను.
ఆ దూర దేశంలో మీరు బందీలైవున్నారు.
మీ సంతతివారిని ఆ దేశంనుండి తిరిగి తీసుకొస్తాను.
యాకోబుకు తిరిగి శాంతి సమకూరుతుంది.
ప్రజలు యాకోబును బాధ పెట్టరు.
నా ప్రజలను భయపెట్టుటకు ఇక శత్రువులుండరు.
11 ఇశ్రాయేలు, యూదా ప్రజలారా, నేను మీతో వున్నాను.!”
ఇదే యెహోవా వాక్కు.
“నేను మిమ్మల్ని రక్షిస్తాను.
నేనే మిమ్మల్ని ఆయా దేశాలకు చెదరగొట్టాను.
కాని ఆ రాజ్యాలను నేను పూర్తిగా నాశనం చేస్తాను.
ఇది నిజం. నేనా దేశాలను నాశనం చేస్తాను.
కాని నేను మిమ్మల్ని మాత్రం నాశనం చేయను.
అయితే మీరు చేసిన దుష్కార్యాలకు మీరు తప్పక శిక్షింపబడాలి.
నేను మిమ్మల్ని బాగా క్రమశిక్షణలోకి తెస్తాను.”
10 అదే విధంగా తన సోదరుణ్ణి ప్రేమించనివాడు దేవుని సంతానం కాదు. నీతిని పాటించనివాడు దేవుని సంతానం కాదు. దీన్నిబట్టి దేవుని సంతానమెవరో, సాతాను సంతానమెవరో మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం.
పరస్పరం ప్రేమతో ఉండండి
11 “పరస్పరం ప్రేమతో ఉండాలి” అనే సందేశాన్ని మీరు మొదటినుండి విన్నారు. 12 సాతాను సంబంధియైన కయీను తన సోదరుణ్ణి హత్య చేసాడు. మీరు అతనిలా ఉండకూడదు. కయీను తన సోదరుణ్ణి ఎందుకు హత్య చేసాడు? కయీను దుర్మార్గుడు. అతని సోదరుడు సన్మార్గుడు.
13 ప్రపంచం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడకండి. 14 మనం మన సోదరుల్ని ప్రేమిస్తున్నాము కనుక మరణంనుండి బ్రతికింపబడ్డాము. ఈ విషయం మనకు తెలుసు. ప్రేమించనివాడు మరణంలోనే ఉండిపోతాడు. 15 సోదరుణ్ణి ద్వేషించేవాడు హంతకునితో సమానము. అలాంటివానికి నిత్యజీవం లభించదని మీకు తెలుసు.
16 యేసు క్రీస్తు మనకోసం తన ప్రాణాలర్పించాడు. మనం మన సోదరుల కోసం ప్రాణాల్ని ధారపోయాలి. అప్పుడే “ప్రేమ” అంటే ఏమిటో మనం తెలుసుకోగలము.
© 1997 Bible League International