Revised Common Lectionary (Complementary)
12 పేతురు వాళ్ళను చూసి ఈ విధంగా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలారా! ఇది మీకెందుకు ఆశ్చర్యం కలిగిస్తోంది? మేము మా స్వశక్తితో లేక మా మంచితనంతో యితణ్ణి నడిపించినట్లు మావైపు అంత దీక్షతో ఎందుకు చూస్తున్నారు? 13 అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మన వంశీయుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమ పర్చాడు. మీరాయన్ని అధికారులకు అప్పగించారు. పిలాతు ఆయన్ని విడుదల చెయ్యాలని నిర్ణయించినప్పుడు మీరు పిలాతు ముందు యేసును నిరాకరించారు. 14 పవిత్రుడు, నీతిమంతుడు అయిన ఆయన్ని నిరాకరించి, ఆయనకు మారుగా ఒక హంతకుణ్ణి విడుదల చెయ్యాలని మీరు కోరారు. 15 మీరు మీకు నిత్యజీవితాన్నిచ్చే దాతను చంపారు. కాని దేవుడాయన్ని చావు నుండి బ్రతికించాడు. మేము దీనికి సాక్షులం.
16 “మాకు ‘యేసు’ అనే పేరులో నమ్మకం ఉండబట్టే మీకు తెలిసిన యితనికి, మీరు చూస్తున్న యితనికి నయమైపోయింది. యేసు పేరు, ఆయన కలిగించిన విశ్వాసము యితనికి పూర్తిగా స్వస్థత కలిగించాయి. ఇది మీరు చూసారు.
17 “సోదరులారా! మీ నాయకులవలె మీరు కూడా అమాయకంగా ప్రవర్తించారని నాకు తెలుసు. 18 కాని, ‘క్రీస్తు తప్పక చనిపోవాలి’ అని ప్రవక్తలందరి ద్వారా దేవుడు ముందే పలికిన వాక్కుల్ని ఈ విధంగా నిజం చేసాడు. 19 మారుమనస్సు పొంది దేవుని వైపు మళ్ళండి. అలా చేస్తే దేవుడు మీ పాపాలు కడిగి వేస్తాడు. మీకు విమోచనం కలిగే రోజులు వస్తాయి.
సంగీత నాయకునికి: తంతి వాద్యాలతో పాడదగిన దావీదు కీర్తన.
4 నా మంచి దేవా, నేను నిన్ను ప్రార్థించినప్పుడు నాకు జవాబు ఇమ్ము.
నా ప్రార్థన ఆలకించి, నా యెడల దయ చూపించుము!
ఎప్పుడైనా నాకు కష్టాలు వస్తే, వాటిని తొలగించుము.[a]
2 ప్రజలారా, ఎన్నాళ్లు మీరు నన్నుగూర్చి చెడ్డమాటలు చెబుతారు?
ప్రజలారా, మీరు నన్ను గూర్చి చెప్పుటకు కొత్త అబద్ధాలకోసం చూస్తూనే ఉంటారు. అలాంటి అబద్ధాలు చెప్పటం అంటే మీకు ఇష్టం.
3 యెహోవా తన మంచి ప్రజల మొర వింటాడని మీకు తెలుసు.
నేను యెహోవాను ప్రార్థించినప్పుడు, ఆయన నా ప్రార్థన వింటాడు.
4 మిమ్ములను ఏదైనా ఇబ్బంది పెడుతుంటే, అప్పుడు కోప్పడవచ్చు.
కాని పాపం చేయవద్దు. మీరు పడకకు వెళ్లినప్పుడు ఆ విషయాలను గూర్చి ఆలోచించండి, అప్పుడు విశ్రాంతి తీసుకోండి.
5 దేవునికి మంచి బలులు అర్పించండి.
మరి యెహోవాయందు విశ్వాసం ఉంచండి.
6 “దేవుని మంచితనాన్ని మనకు ఎవరు చూపిస్తారు?
యెహోవా! ప్రకాశించే నీ ముఖాన్ని మమ్ముల్ని చూడనిమ్ము.” అని చాలామంది ప్రజలు అంటారు.
7 యెహోవా, నీవు నన్ను చాలా సంతోషపెట్టావు. ధాన్యం, ద్రాక్షారసం మాకు విస్తారంగా ఉన్నందుచేత పంట కోత సమయంలో సంబరపడే దానికంటే ఇప్పుడు మేము ఎక్కువ సంతోషంగా ఉన్నాము.
8 నేను పడకకు వెళ్లి, ప్రశాంతంగా నిద్రపోతాను.
ఎందుకంటె యెహోవా, నీవే నన్ను భద్రంగా నిద్ర పుచ్చుతావు గనుక.
మనం దేవుని బిడ్డలం
3 మనం దేవుని సంతానంగా పరిగణింపబడాలని తండ్రి మనపై ఎంత ప్రేమను కురిపించాడో చూడండి. అవును, మనం దేవుని సంతానమే. ప్రపంచం ఆయన్ని తెలుసుకోలేదు కనుక మనల్ని కూడా తెలుసుకోవటం లేదు. 2 ప్రియ మిత్రులారా! మనం ప్రస్తుతానికి దేవుని సంతానం. ఇకముందు ఏ విధంగా ఉంటామో దేవుడు మనకింకా తెలియబరచలేదు. కాని యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయనెలా ఉంటాడో చూస్తాము. కనుక మనం కూడా ఆయనలాగే ఉంటామని మనకు తెలుసు. 3 ఇలాంటి ఆశాభావాన్ని ఉంచుకొన్న ప్రతి ఒక్కడూ ఆయనలా పవిత్రమౌతాడు.
4 పాపాలు చేసిన ప్రతి ఒక్కడూ నీతిని ఉల్లంఘించిన వాడౌతాడు. నిజానికి, పాపమంటేనే ఆజ్ఞను ఉల్లంఘించటం. 5 కాని, యేసు పాప పరిహారం చెయ్యటానికి వచ్చాడని మీకు తెలుసు. ఆయనలో పాపమనేది లేదు. 6 ఆయనలో జీవించేవాడెవ్వడూ పాపం చెయ్యడు. ఆయన్ని చూడనివాడు, ఆయనెవరో తెలియనివాడు మాత్రమే పాపం చేస్తూ ఉంటాడు.
7 బిడ్డలారా! మిమ్మల్నెవరూ మోసం చెయ్యకుండా జాగ్రత్త పడండి. యేసు నీతిమంతుడు. ఆయనలా నీతిని పాలించే ప్రతివ్యక్తి నీతిమంతుడు.
యేసు తన శిష్యులకు కనిపించటం
(మత్తయి 28:16-20; మార్కు 16:14-18; యోహాను 20:19-23; అపొ. కా. 1:6-8)
36 వాళ్ళు ఈ విషయాన్ని గురించి యింకా మాట్లాడుతుండగా యేసు స్వయంగా వచ్చి వాళ్ళతో నిలుచుని, “శాంతి కలుగుగాక” అని అన్నాడు.
37 వాళ్ళు భూతాన్ని చూసామనుకొని వణికి భయపడిపోయారు. 38 యేసు వాళ్ళతో, “మీరెందుకు భయపడ్తున్నారు. మీకు సందేహాలు ఎందుకు కలుగుతున్నాయి? 39 నా చేతులు, కాళ్ళు చూడండి. నేనే ఆయనను. తాకి చూడండి. నాకు మాంసము, ఎముకలు ఉన్నాయి. భూతానికి అవి ఉండవు” అని అన్నాడు.
40 ఆయన ఈ మాటలు అంటూ తన చేతులు, కాళ్ళు వాళ్ళకు చూపాడు. 41 వాళ్ళకు ఆశ్చర్యము, ఆనందము కలిగాయి. వాళ్ళు నమ్మలేకపొయ్యారు. అప్పుడు యేసు, “మీ దగ్గర తినటానికి ఏమైనా ఉందా?” అని అడిగాడు. 42 వాళ్ళు ఒక కాల్చిన చేపను తెచ్చి యిచ్చారు. 43 ఆయన దాన్ని తీసుకొని వాళ్ళ సమక్షంలో తిన్నాడు.
44 ఆయన, “నేను మీతో కలిసి ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాలలో, కీర్తనలలో నన్ను గురించి వ్రాసినవన్నీ జరుగుతాయి అని చెప్పాను” అని అన్నాడు.
45 అప్పుడు వాళ్ళు లేఖనాలను అర్థం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో వాళ్ళ కండ్లు తెరిపించాడు. 46 ఆయన వాళ్ళతో, “ఈ విధంగా వ్రాయబడి ఉంది: క్రీస్తు చనిపోయి మూడవరోజున బ్రతికి వస్తాడు! 47 పశ్చాత్తాపాన్ని గురించి, పాప క్షమాపణ గురించి ఆయన పేరిట ప్రకటించటం మొదట యెరూషలేములో మొదలౌతుంది. ఆ పిదప అది అన్ని దేశాల్లో ప్రకటింపబడుతుంది. 48 మీరు వీటికి సాక్షులు.
© 1997 Bible League International