Revised Common Lectionary (Complementary)
విశ్వాసుల ఐకమత్యం
32 విశ్వాసుల మనస్సు, ఆత్మ ఒకే విధంగా ఉండేవి. ఎవ్వరూ “ఇది నాది” అని అనకుండా తమకున్న వాటిని ఇతర్లతో పంచుకొనేవాళ్ళు. 33 దైవికమైన శక్తితో అపొస్తలులు ప్రభువు బ్రతికి వచ్చాడని రుజువు చేసారు. దేవుని అనుగ్రహం వాళ్ళందరిపై సంపూర్ణంగా ఉంది. 34 వాళ్ళలో ఎవ్వరికీ ఏ కొరతలు ఉండేవి కావు. ఇండ్లు, పొలాలు ఉన్నవాళ్ళు వాటిని అమ్మి, 35 ఆ డబ్బును అపొస్తలుల పాదాల ముందుంచేవాళ్ళు. ఆ అపొస్తలులు అవసరమున్న ప్రతి ఒక్కనికి ఆ డబ్బును పంచేవాళ్ళు.
దావీదు యాత్ర కీర్తనల్లో ఒకటి.
133 సహోదరులు ఐక్యంగా శాంతి కలిగి జీవించటం
ఎంతో మంచిది, ఎంతో ఆనందం.
2 అది యాజకుని తలమీద పోయబడిన కమ్మని వాసనగల తైలంలాగా ఉంటుంది. అది అహరోను గడ్డం మీదికి కారుతున్న తైలంలాగా ఉంటుంది.
అది అహరోను ప్రత్యేక వస్త్రాల మీదికి కారుతున్న తైలంలాగ ఉంటుంది.
3 అది హెర్మోను పర్వతం మీద నుండి సీయోను కొండమీద పడుతున్న మంచులా ఉంటుంది.
సీయోను వద్దనే యెహోవా తన ఆశీర్వాదం ఇచ్చాడు. శాశ్వతజీవాన్ని ఆశీర్వాదంగా యెహోవా ఇచ్చాడు.
జీవ వాక్యం
1 ఏది మొదటినుండి ఉన్నదో, దాన్ని మేము విన్నాము, మా కళ్ళారా చూసాము. చూసి మా చేతుల్తో తాకాము. అదే జీవం కలిగించే వాక్యం. దాన్ని గురించే మీకు ప్రకటిస్తున్నాము. 2 జీవం కనిపించింది. మేము దాన్ని చూసాము. చూసినట్టు సాక్ష్యం కూడా చెపుతున్నాము. ఆ జీవాన్ని గురించి మీకు ప్రకటిస్తున్నాము. ఆ జీవం తండ్రితో ఉంది. అది మాకు కనిపించింది. 3 తండ్రితో ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో మాకు సహవాసం ఉంది కనుక, మీరు కూడా మాతో సహవాసం చెయ్యాలనే ఉద్దేశ్యంతో మేము చూసినదాన్ని, విన్నదాన్ని మీకు ప్రకటిస్తున్నాము. 4 మన[a] ఆనందం సంపూర్ణంగా ఉండాలని యిది మీకు వ్రాస్తున్నాను.
వెలుగులో నడుచుట
5 దేవుడు వెలుగై వున్నాడు. ఆయనలో చీకటి ఏ మాత్రం లేదు. ఈ సందేశాన్ని ఆయన మాకు చెప్పాడు. దాన్ని మేము మీకు ప్రకటిస్తున్నాం. 6 మనకు ఆయనతో సహవాసముందని అంటూ చీకట్లో నడిస్తే మనము అసత్యమాడినట్లే కదా! సత్యాన్ని ఆచరించటం మానుకొన్నట్లే కదా! 7 దేవుడు వెలుగులో ఉన్నాడు. కాబట్టి మనం కూడా వెలుగులో నడిస్తే మన మధ్య సహవాసం ఉంటుంది. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు రక్తం మన పాపాలన్నిటిని కడుగుతుంది.
8 మనలో పాపం లేదని అంటే, మనల్ని మనము మోసం చేసుకొన్న వాళ్ళమౌతాము. సత్యం మనలో ఉండదు. 9 మనం చేసిన పాపాన్ని ఒప్పుకొంటే దేవుడు సత్యవంతుడు, సక్రమంగా న్యాయం జరిగించేవాడు కనుక మన పాపాల్ని క్షమిస్తాడు. మనలో ఉన్న అవినీతిని కడిగి వేస్తాడు. 10 మనం పాపాలు చెయ్యలేదని అంటే ఆయన్ని మనం అబద్ధమాడుతున్న వానిగా చేసినట్లౌతుంది. ఆయన సందేశానికి మన జీవితాల్లో స్థానం ఉండదు.
యేసు మన సహాయకుడు
2 బిడ్డలారా! మీరు పాపం చెయ్యకూడదని మీకు లేఖను వ్రాస్తున్నాను. ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే, మన పక్షాన తండ్రితో మాట్లాడేందుకు న్యాయవాది అయిన యేసు క్రీస్తు ఉన్నాడు. 2 ఆయన మన పాప పరిహారార్థం బలి అయ్యాడు. మన పాపాల కోసమే కాకుండా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి పాపాలకోసం బలి అయ్యాడు.
యేసు తన శిష్యులకు కనిపించటం
(మత్తయి 28:16-20; మార్కు 16:14-18; లూకా 24:36-49)
19 ఆ ఆదివారం సాయంకాలం శిష్యులందరు ఒకే చోట సమావేశమయి ఉన్నారు. యేసు వచ్చి వాళ్ళ మధ్య నిలుచొని, “మీకు శాంతి కలుగుగాక!” అని అన్నాడు. 20 ఇలా అన్నాక ఆయన తన చేతుల్ని, ప్రక్క భాగాన్ని చూపించాడు. ప్రభువును చూసాక శిష్యులకు చాలా ఆనందం కలిగింది.
21 యేసు మళ్ళీ, “మీకు శాంతి కులుగు గాక! తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను” అని అన్నాడు. 22 ఇలా అన్నాక, “పవిత్రాత్మను పొందండి!” అని వాళ్ళపై ఊదాడు. 23 ఆ తర్వాత, “మీరు ఎవరి పాపాలు క్షమిస్తే వారి పాపాలు క్షమింపబడతాయి. మీరు ఎవరి పాపాలు క్షమించకపోతే వారి పాపాలు క్షమించబడవు” అని వాళ్ళతో అన్నాడు.
తోమా యేసును చూడటం
24 యేసు వచ్చినప్పుడు పండ్రెండుగురిలో ఒకడైన తోమా శిష్యుల్తోలేడు. ఇతణ్ణి “దిదుమ” అని పిలిచే వాళ్ళు. 25 మిగత శిష్యులు తోమాతో, “మేము ప్రభువును చుసాము” అని అన్నారు. కాని తోమా, “నేను స్వయంగా ఆయన చేతులకున్న మేకుల గాయాల్ని చూసి, వాటిని చేతుల్తో తాకి, ఆయన ప్రక్క డొక్కపై నా చేతుల్ని ఉంచాక ఆయన్ని నమ్ముతాను” అని అన్నాడు.
26 ఒక వారం రోజుల తర్వాత యేసు శిష్యులు ఒక యింట్లో ఉన్నారు. తోమా కూడా వాళ్ళతో ఉన్నాడు. తలుపులు మూసి వేసి ఉన్నా యేసు లోపలికి వచ్చి వాళ్ళ మధ్య నిలుచొని, “మీకు శాంతి కలుగుగాక!” అని అన్నాడు. 27 యేసు తోమాతో, “నా చేతులు చూడు. నీ వేళ్ళతో వాటిని తాకు. నా ప్రక్క భాగంపై నీ చేతుల్ని ఉంచు! ఇక అనుమానించకు” అని అన్నాడు.
28 తోమా ఆయనతో, “దేవా! నా ప్రభూ!” అని అన్నాడు.
29 అప్పుడు యేసు అతనితో, “నన్ను చూసావు కనుక నమ్మావు. నన్ను చూడకున్నా విశ్వసించే వాళ్ళు ధన్యులు” అని అన్నాడు.
ఈ గ్రంథం వ్రాయటంలో ఉద్దేశ్యం
30 నేను ఈ గ్రంథంలో వ్రాసినవే కాక, యేసు ఇంకా అనేకమైన మహాత్కార్యాలు చేసాడు. వాటన్నిటినీ శిష్యులు చూసారు. 31 యేసు “క్రీస్తు” అని, “దేవుని కుమారుడు” అని, ఆయన్ని విశ్వసించిన వాళ్ళకు ఆయన పేరిట అనంత జీవితం లభిస్తుందని మీరు నమ్మాలనే ఉద్దేశ్యంతో యివి వ్రాయబడ్డాయి.
© 1997 Bible League International