Revised Common Lectionary (Complementary)
118 యెహోవా దేవుడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.
నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది.
2 “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
అని ఇశ్రాయేలూ, నీవు చెప్పుము.
19 మంచి గుమ్మములారా, నా కోసం తెరచుకోండి,
నేను లోనికి వచ్చి యెహోవాను ఆరాధిస్తాను.
20 అవి యెహోవా గుమ్మాలు.
ఆ గుమ్మాలలో నుండి మంచివాళ్లు మాత్రమే వెళ్లగలరు.
21 యెహోవా, నా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
నన్ను రక్షించినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
22 ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి
మూలరాయి అయ్యింది.
23 ఇలా జరుగునట్లు యెహోవా చేశాడు.
అది ఆశ్చర్యంగా ఉందని అనుకొంటున్నాము.
24 ఈ వేళ యెహోవా చేసిన రోజు.
ఈ వేళ మనం ఆనందించి సంతోషంగా ఉందాము!
25 ప్రజలు ఇలా చెప్పారు, “యెహోవాను స్తుతించండి.
దేవుడు, మమ్మల్ని రక్షించెను. దేవా, దయచేసి మమ్మల్ని వర్ధిల్లజేయుము.
26 యెహోవా నామమున వస్తున్న వానికి స్వాగతం చెప్పండి.”
యాజకులు ఇలా జవాబు ఇచ్చారు, “యెహోవా ఆలయానికి మేము నిన్ను ఆహ్వానిస్తున్నాము!
27 యెహోవాయే దేవుడు. ఆయన మనలను అంగీకరిస్తాడు.
బలి కోసం గొర్రెపిల్లను కట్టివేయండి. బలిపీఠపు కొమ్ముల[a] వద్దకు గొర్రెపిల్లను మోసికొని రండి.”
28 యెహోవా, నీవు నా దేవుడవు. నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను.
నేను నిన్ను స్తుతిస్తున్నాను.
29 యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.
నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
10 “ప్రజలారా మీరిలా అంటున్నారు, ‘మా దేశం వట్టి ఎడారి అయిపోయింది. మనుష్యులు గాని, జంతుజాలం గాని ఏదీ ఇక్కడ నివసించటం లేదు.’ యెరూషలేము వీధులలోను, యూదా పట్టణాలలోను ఇప్పుడు ప్రశాంతత నెలకొన్నది. కాని త్వరలో అక్కడ సందడి ఏర్పడుతుంది. 11 అక్కడ తిరిగి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. వధూవరుల వేడుకలు నెలకొంటాయి. దేవాలయానికి కానుకలు తెచ్చే జన సందోహాల సందడి వినిపిస్తుంది. ‘సర్వశక్తిమంతుడయిన యెహోవాకు జయగీతం పాడండి! యెహోవా దయామయుడు. ఆయన కరుణ శాశ్వతంగా మనకు లభిస్తుంది!’ అని ప్రజలు అంటారు. యూదాకు నేను మళ్లీ మంచి పనులు చేస్తాను. గనుక ప్రజలా మాటలు చెపుతారు. అప్పుడు యూదా తన పూర్వ వైభవం తిరిగి నెలకొంటుంది.” ఇదే యెహోవా వాక్కు.
12 సర్వశక్తిమంతుడయిన యెహోవా ఇలా అంటున్నాడు: “ఈ ప్రదేశం ఇప్పుడు ఖాళీగా వుంది. ఇది నిర్మానుష్యంగా, జంతు సంచారం కూడ లేకుండా ఉంది. కాని యూదా పట్టణాలన్నీ ప్రజలతో నిండిపోతాయి. గొర్రెల కాపరులుంటారు. పచ్చిక బయళ్లు మళ్లీ చిగురిస్తాయి. మందలు పచ్చిక మేసి హాయిగా వాటిలో విశ్రమిస్తాయి. 13 గొర్రెలు తమ ముందు నడుస్తూ ఉండగా, కాపరులు వారి గొర్రెలను లెక్కిస్తారు. మన్యం ప్రాంతంలో, పచ్చిమ కొండవాలు ప్రాంతంలో, నెగేవు ఎడారి ప్రాంతంలో, ఇంకా యూదా పట్టణాలన్నిటిలో ప్రజలు తమ తమ గొర్రెలను లెక్కపెట్టుకుంటూ ఉంటారు.”
మంచి కొమ్మ
14 ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది: “నేను ఇశ్రాయేలు, యూదా ప్రజలకు ఒక ప్రత్యేకమైన వాగ్దానం చేసియున్నాను. నేనిచ్చిన మాట నెరవేర్చుకునే సమయం ఆసన్నమవుతూ వుంది. 15 ఆ సమయంలో దావీదు వంశం నుండి ఒక మంచి ‘కొమ్మ’ చిగురించి పెరిగేలా చేస్తాను. ఆ మంచి ‘కొమ్మ’ (రాజు) దేశానికి ఏది మంచిదో, ఏది నీతి దాయకమో అది చేస్తుంది. 16 ఈ ‘కొమ్మ’ చిగిర్చిన కాలంలో యూదా ప్రజలు రక్షింపబడతారు. యెరూషలేములో ప్రజలు సురక్షితంగా జీవిస్తారు. ఈ కొమ్మ పేరు ‘యెహోవాయే మా నీతి.’”
యేసు తన మరణాన్ని గురించి మళ్ళీ మాట్లాడటం
(మత్తయి 20:17-19; లూకా 18:31-34)
32 యేసు, ఆయనతో ఉన్న వాళ్ళు అంతా యెరూషలేము వెళ్ళటానికి బయలుదేరారు. యేసు అందరికన్నా ముందు నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు దిగులుతో నడుస్తూ ఉన్నారు. యేసును అనుసరిస్తున్న యితరులు భయపడుతూ నడుస్తూ ఉన్నారు. యేసు మళ్ళీ తన శిష్యులను ప్రక్కకు పిలిచి తనకు జరుగనున్న వాటిని గురించి వాళ్ళకు చెప్పాడు. 33 ఆయన, “వినండి, మనం యెరూషలేము దాకా వెళ్తున్నాము. అక్కడ మనుష్యకుమారునికి ద్రోహం జరుగుతుంది. ఆయన ప్రధానయాజకులకు, శాస్త్రులకు అప్పగింపబడతాడు. వాళ్ళాయనకు మరణ శిక్ష విధించి యూదులుకాని వాళ్ళకు అప్పగిస్తారు. 34 యూదులుకాని వాళ్ళు ఆయన్ని హేళన చేసి ఆయన మీద ఉమ్మివేస్తారు. ఆయన్ని కొరడా దెబ్బలుకొడతారు. ఆ తర్వాత చంపివేస్తారు. మూడు రోజుల తర్వాత ఆయన బ్రతికి వస్తాడు” అని అన్నాడు.
గ్రుడ్డివానికి దృష్టి కలిగించటం
(మత్తయి 20:29-34; లూకా 18:35-43)
46 ఆ తర్వాత వాళ్ళు యెరికో చేరుకున్నారు. యేసు, ఆయన శిష్యులు, వాళ్ళతో ఉన్న ప్రజల గుంపు ఆ పట్టణాన్ని వదిలి బయలుదేరారు. తీమయి కుమారుడు బర్తిమయి అనే ఒక గ్రుడ్డివాడు దారి ప్రక్కన కూర్చుని ఉండినాడు. అతడు బిక్షగాడు. 47 ఆ గ్రుడ్డివాడు, వస్తున్నది నజరేతు నివాసి యేసు అని తెలుసుకొని, “యేసూ! దావీదు కుమారుడా! నాపై దయ చూపు!” అని బిగ్గరగా అనటం మొదలు పెట్టాడు.
48 చాలామంది అతణ్ణి తిట్టి ఊరుకోమన్నారు. కాని ఆ గ్రుడ్డివాడు. “దావీదు కుమారుడా! నా మీద దయ చూపు” అని యింకా బిగ్గరగా అరిచాడు.
49 యేసు ఆగి, “అతణ్ణి పిలవండి” అని అన్నాడు.
వాళ్ళా గ్రుడ్డివానితో, “ధైర్యంగా లేచి నిలుచో. ఆయన నిన్ను పిలుస్తున్నాడు” అని అన్నారు. 50 ఆ గ్రుడ్డివాడు కప్పుకొన్న వస్త్రాన్ని ప్రక్కకు త్రోసి, గభాలున లేచి యేసు దగ్గరకు వెళ్ళాడు.
51 యేసు, “ఏమి కావాలి?” అని అడిగాడు.
ఆ గ్రుడ్డివాడు, “రబ్బీ! నాకు చూపు కావాలి” అని అన్నాడు.
52 యేసు, “నీ విశ్వాసం నీకు నయం చేసింది. యిక వెళ్ళు” అని అన్నాడు. వెంటనే అతనికి చూపు వచ్చింది. అతడు యేసును అనుసరిస్తూ ఆయన వెంట వెళ్ళాడు.
© 1997 Bible League International