Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన. బత్షెబతో దావీదు పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త దావీదు దగ్గరకి వెళ్లినప్పుడు వ్రాసిన కీర్తన.
51 దేవా, నీ నమ్మకమైన ప్రేమ మూలంగా
నా మీద దయ చూపించుము.
నీ మహా దయ మూలంగా
నా పాపాలన్నీ తుడిచివేయుము.
2 దేవా, నా దోషం అంతా తీసివేయుము.
నా పాపాలు కడిగివేసి, నన్ను మరల శుద్ధి చేయుము.
3 నేను పాపం చేశానని నాకు తెలుసు.
నేను ఎల్లప్పుడు నా పాపాన్ని ఎరిగియున్నాను.
4 తప్పు అని నీవు చెప్పే వాటినే నేను చేసాను.
దేవా, నీకే వ్యతిరేకంగా నేను పాపం చేసాను.
కనుక నేను దోషినని నీవు అన్నప్పుడు నీ మాట నిజమే.
నీవు నన్ను నిందించేటప్పుడు నీవు న్యాయవంతుడవే.
5 నేను పాపంలో పుట్టాను.
పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన ధరించింది.
6 దేవా, సంపూర్ణ భక్తిని లేదా యదార్థతను నీవు కోరతావు.
అందుచేత నా హృదయంలో నాకు జ్ఞానమును బోధించుము.
7 హిస్సోపు ముక్కను ప్రయోగించి నన్ను పవిత్రం చేసే క్రమం జరిగించుము.
నేను హిమం కంటె తెల్లగా ఉండేంతవరకు నన్ను కడుగుము.
8 నీవు విరుగ గొట్టిన ఎముకలను సంతోషించనిమ్ము.
నన్ను సంతోషపరచుము! మరల నన్ను సంతోషపరచుము.
9 నా పాపాలను చూడకుము!
వాటన్నింటినీ తుడిచి వేయుము.
10 దేవా, నాలో పవిత్ర హృదయాన్ని కలిగించుము
నా ఆత్మను నూతనపరచి బలపరచుము.
11 నన్ను త్రోసివేయకుము!
నీ పవిత్ర ఆత్మను నాలోనుండి తీసివేయకుము.
12 నీచేత రక్షించబడుట మూలంగా
కలిగే ఆనందం నాకు తిరిగి ఇమ్ము!
నీకు విధేయత చూపుటకు నా ఆత్మను సిద్ధంగా, స్థిరంగా ఉంచుము.
2 యెహోవా, నిన్ను గూర్చిన వార్త విన్నాను.
యెహోవా, పూర్వం నీవు చేసిన శక్తివంతమైన పనుల విషయంలో నేను విస్మయం చెందాను.
అట్టి గొప్ప పనులు మా కాలంలో జరిపించమని నేను నిన్ను వేడుకుంటున్నాను.
ఆ పనులు మాకాలంలోనే జరిపించమని నేను ప్రార్థిస్తున్నాను.
కాని నీ ఆవేశంలో (ఉద్రేకం) మా పట్ల కరుణ చూపటం గుర్తుపెట్టుకొనుము.
3 దేవుడు తేమానులోనుండి వస్తున్నాడు.
పరిశుద్ధుడు పారాను పర్వతం[a] మీది నుండి వస్తున్నాడు.
యెహోవా మహిమ ఆకాశాన్ని కప్పి వేసింది!
ఆయన ప్రభావంతో భూమి నిండి పోయింది!
4 అది ప్రకాశమానమై మెరుస్తున్న వెలుగు. ఆయన చేతినుండి కాంతి కిరణాలు ప్రసరిస్తున్నాయి.
అట్టి మహత్తర శక్తి ఆయన చేతిలో దాగివుంది.
5 వ్యాధి ఆయనకు ముందుగా వెళ్లింది.
ఆయన వెనుక వినాశకారి అనుసరించి వెళ్లింది.
6 యెహోవా నిలుచుండి భూమికి తీర్పు తీర్చాడు.
ఆయన అన్ని దేశాల ప్రజలవైవు చూశాడు.
వారు భయంతో వణికి పోయారు.
అనాదిగా పర్వతాలు బలంగా నిలిచి ఉన్నాయి.
కాని ఆ పర్వతాలు బద్దలై పోయాయి.
చాల పాత కొండలు పడిపోయాయి.
దేవుడు ఎల్లప్పుడూ అలానే ఉంటాడు!
7 కుషాను (కూషీయుల) నగరాలలో ఆపద సంభవించటం నేను చూశాను.
మిద్యాను దేశీయుల ఇండ్లు భయంతో కంపించాయి.
8 యెహోవా, నీవు నదులపట్ల కోపంగా ఉన్నావా?
వాగులపట్ల నీవు కోపంగా ఉన్నావా? సముద్రంపట్ల నీవు కోపంగా ఉన్నావా?
నీవు నీ గుర్రాలను,
రథాలను విజయానికి నడిపించినప్పుడు నీవు కోపంగా ఉన్నావా?
9 అప్పుడుకూడ నీ రంగుల కాంతిపుంజాన్ని (ఇంద్ర ధనుస్సును) నీవు చూపించావు. భూవాసులతో
నీవు చేసుకున్న ఒడంబడికకు అది నిదర్శనం.
ఎండు భూమి నదులను విభజించింది.
10 పర్వతాలు నిన్ను చూచి వణికాయి.
నీరు నేల విడిచి పారుతున్నది. సముద్రపు నీటికి పట్టు తప్పినందున అది పెద్దగా ధ్వని చేసింది.
11 సూర్యుడు, చంద్రుడు వాటి కాంతిని కోల్పోయాయి.
నీ దేదీప్యమానమైన మెరుపు కాంతులు చూడగానే అవి ప్రకాశించటం మానివేశాయి.
ఆ మెరుపులు గాలిలో దూసుకుపోయే ఈటెలు, బాణాలవలె ఉన్నాయి.
12 నీవు కోపంతో భూమిపై నడిచి
దేశాలను శిక్షించావు.
13 నీ ప్రజలను రక్షించటానికి నీవు వచ్చావు.
అభిషేకం చేయబడిన నీ వ్యక్తిని రక్షించటానికి నీవు వచ్చావు.
ప్రతి చెడ్డ కుటుంబంలోనూ మొదట పుట్టిన వానిని నీవు చంపివేశావు.
ఆ కుటుంబం దేశంలో అతి తక్కువదా,
లేక అతి గొప్పదా అనే విభేదం నీవు చూపలేదు.
యేసు బేతనియలో తన స్నేహితులతో
(మత్తయి 26:6-13; మార్కు 14:3-9)
12 పస్కా పండుగకు ఆరు రోజుల ముందే యేసు బేతనియ చేరుకున్నాడు. యేసు బ్రతికించిన లాజరు యింతకు పూర్వం ఆ గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. 2 అక్కడ యేసు గౌరవార్థం ఒక విందు ఏర్పాటు చేయబడింది. మార్త వడ్డిస్తూ ఉంది. యేసుతో సహా కూర్చున్న వాళ్ళలో లాజరు ఒకడు. 3 మరియ జటామాంసి చెట్టుతో చేయబడిన ఒక సేరున్నర విలువైన మంచి అత్తరు యేసు పాదాల మీద పోసి, తన తల వెంట్రుకలతో పాదాలను తుడుచింది. ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది.
4-5 యూదా ఇస్కరియోతు యేసు శిష్యుల్లో ఒక్కడు. యేసుకు ద్రోహం చెయ్యబోయేవాడు వీడే. యూదా, “ఈ అత్తరు అమ్మి, ఆ డబ్బు పేద వాళ్ళ కెందుకివ్వలేదు. ఆ అత్తరు వెల మూడువందల దేనారా లన్నా ఉంటుంది కదా!” అని అన్నాడు. 6 యూదాకు పేద వాళ్ళపై కనికరం ఉండుటవలన యిలా అనలేదు. వీడు దొంగ. డబ్బు సంచి తన దగ్గర ఉండటంవల్ల దానిలోవున్న డబ్బు దొంగలించే వాడు.
7 యేసు, “ఆమె ఈ అత్తరుతో నన్ను సమాధికి సిద్ధం చెయ్యటానికి ఈనాటి దాకా దాన్ని దాచి ఉంచింది. 8 మీతో పేదవాళ్ళు ఎప్పటికీ ఉంటారు. కాని నేను ఎల్లకాలం మీతో ఉండను” అని అన్నాడు.
లాజరుకు విరోధముగా కుట్ర
9 ఇంతలో పెద్ద యూదుల గుంపు ఒకటి యేసు అక్కడవున్నాడని విని అక్కడికి వచ్చింది. ఆయన కోసమే కాకుండా ఆయన బ్రతికించిన లాజరును కూడా చూడటానికి వచ్చారు. 10-11 తద్వారా ప్రధాన యాజకులు లాజరును కూడా చంపాలని పన్నాగం పన్నారు. ఎందుకంటే యితని కారణంగానే చాలామంది యూదులు యేసు దగ్గరకు వెళ్ళి ఆయన యందు నమ్మకం ఉంచారు.
© 1997 Bible League International