Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన. బత్షెబతో దావీదు పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త దావీదు దగ్గరకి వెళ్లినప్పుడు వ్రాసిన కీర్తన.
51 దేవా, నీ నమ్మకమైన ప్రేమ మూలంగా
నా మీద దయ చూపించుము.
నీ మహా దయ మూలంగా
నా పాపాలన్నీ తుడిచివేయుము.
2 దేవా, నా దోషం అంతా తీసివేయుము.
నా పాపాలు కడిగివేసి, నన్ను మరల శుద్ధి చేయుము.
3 నేను పాపం చేశానని నాకు తెలుసు.
నేను ఎల్లప్పుడు నా పాపాన్ని ఎరిగియున్నాను.
4 తప్పు అని నీవు చెప్పే వాటినే నేను చేసాను.
దేవా, నీకే వ్యతిరేకంగా నేను పాపం చేసాను.
కనుక నేను దోషినని నీవు అన్నప్పుడు నీ మాట నిజమే.
నీవు నన్ను నిందించేటప్పుడు నీవు న్యాయవంతుడవే.
5 నేను పాపంలో పుట్టాను.
పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన ధరించింది.
6 దేవా, సంపూర్ణ భక్తిని లేదా యదార్థతను నీవు కోరతావు.
అందుచేత నా హృదయంలో నాకు జ్ఞానమును బోధించుము.
7 హిస్సోపు ముక్కను ప్రయోగించి నన్ను పవిత్రం చేసే క్రమం జరిగించుము.
నేను హిమం కంటె తెల్లగా ఉండేంతవరకు నన్ను కడుగుము.
8 నీవు విరుగ గొట్టిన ఎముకలను సంతోషించనిమ్ము.
నన్ను సంతోషపరచుము! మరల నన్ను సంతోషపరచుము.
9 నా పాపాలను చూడకుము!
వాటన్నింటినీ తుడిచి వేయుము.
10 దేవా, నాలో పవిత్ర హృదయాన్ని కలిగించుము
నా ఆత్మను నూతనపరచి బలపరచుము.
11 నన్ను త్రోసివేయకుము!
నీ పవిత్ర ఆత్మను నాలోనుండి తీసివేయకుము.
12 నీచేత రక్షించబడుట మూలంగా
కలిగే ఆనందం నాకు తిరిగి ఇమ్ము!
నీకు విధేయత చూపుటకు నా ఆత్మను సిద్ధంగా, స్థిరంగా ఉంచుము.
ధూప పీఠం
30 “తుమ్మ కర్రతో ఒక వేదిక చేయి. ధూపం వేసేందుకు ఈ పీఠమును నీవు ఉపయోగించాలి. 2 వేదికను 18 అంగుళాలు పొడవు, 18 అంగుళాలు వెడల్పు గల చతురస్రముగా నీవు చేయాలి. దీని ఎత్తు 36 అంగుళాలు ఉండాలి. నాలుగు మూలల కొమ్ములు ఉండాలి. ఈ కొమ్ముల్ని వేదికతో కలిపి ఒకటిగా చేయాలి. 3 బలిపీఠం పైభాగాన్ని, అన్ని ప్రక్కలను స్వచ్ఛమైన బంగారం పొదిగించాలి. బలిపీఠం చుట్టూ బంగారు నగిషిబద్ద పెట్టాలి. 4 నగిషీబద్ద అడుగు భాగాన బంగారు ఉంగరాలు నాలుగు ఉండాలి. ఈ బలిపీఠానికి ఎదురుగా రెండు బంగారు ఉంగరాలు ఉండాలి. బలిపీఠం మోసే కర్రలకోసం ఈ బంగారు ఉంగరాలు ఉపయోగించబడతాయి. 5 తుమ్మకర్రతోనే ఆ కర్రలు చేయాలి. కర్రలకు బంగారు తాపడం చేయాలి. 6 ప్రత్యేక తెరముందు ఈ బలిపీఠాన్ని ఉంచాలి. ఒడంబడిక పెట్టెను తెర అవతల ఉంచాలి. ఆ పెట్టె మూతకు ముందర బలిపీఠం ఉంచాలి. నేను నిన్ను కలుసుకోనే చోటు ఇదే.
7 “ప్రతీ ఉదయం పరిమళ ద్రవ్యాల ధూపాన్ని బలిపీఠం మీద అహరోను వేయాలి. దీపాలు సరిచేసేందుకు వచ్చినప్పుడు అతడు దీనిని చేయాలి. 8 మరల సాయంత్రం అతడు ధూపం వేయాలి. ఇది అతడు సాయంత్రం దీపాలను సరిచేసే వేళ. కనుక ప్రతిరోజూ శాశ్వతంగా యెహోవా ఎదుట ధూపం వేయబడుతుంది. 9 ఇంకే విధమైన ధూపం వేసేందుకు గాని, దహన బలి కోసంగాని ఈ బలిపీఠాన్ని ఉపయోగించవద్దు. ఏ విధమైన ధాన్యార్పణగాని, పానార్పణంగాని అర్పించేదుకు ఈ బలిపీఠాన్ని ఉపయోగించవద్దు.
10 “సంవత్సరానికి ఒక సారి అహరోను యెహోవాకు ఒక ప్రత్యేక బలి అర్పించాలి. ప్రజల పాప పరిహారం నిమిత్తం చెల్లించేందుకు పాపపరిహారార్థ బలి రక్తాన్ని అహరోను ఉపయోగించాలి. ఈ బలిపీఠపు కొమ్ముల దగ్గర అహరోను దీనిని చేయాలి. ఇది, ప్రాయశ్చిత్తార్థ దినం అని పిలువబడుతుంది. ఇది యెహవాకు అతి ప్రత్యేక దినం.”
యేసు గొప్ప ప్రధాన యాజకుడు
14 పరలోకానికి వెళ్ళిన యేసు దేవుని కుమారుడు. ఆయనే మన ప్రధాన యాజకుడు. మనం బహిరంగంగా అంగీకరించిన విశ్వాసాన్ని విడువకుండా దృఢంగా ఉండాలి. 15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతలను చూసి సానుభూతి చెందుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మనలాగే అన్ని రకాల పరీక్షలకు గురి అయ్యాడు. కాని, ఆయన ఏ పాపమూ చెయ్యలేదు. 16 అందువలన మనకు అనుగ్రహం ప్రసాదించే దేవుని సింహాసనం దగ్గరకు విశ్వాసంతో వెళ్ళుదాం. అలా చేస్తే మనకు అవసరమున్నప్పుడు, ఆయన దయ, అనుగ్రహము మనకు లభిస్తాయి.
5 ఆధ్యాత్మిక విషయాల్లో, తమ పక్షాన పని చెయ్యటానికి ప్రజలు తమ నుండి ప్రధాన యాజకుని ఎన్నుకొంటారు. పాప పరిహారార్థం అర్పించే కానుకల్ని, బలుల్ని దేవునికి యితడు సమర్పిస్తాడు. 2 ఇతనిలో కూడా ఎన్నో రకాల బలహీనతలు ఉంటాయి కనుక, అజ్ఞానంతో తప్పులు చేస్తున్న ప్రజల పట్ల యితడు సానుభూతి కనుబరుస్తాడు. 3 ఈ కారణంగానే, ప్రజల పాపాలకు బలిని అర్పించినట్లే తన పాపాలకు కూడా బలిని అర్పించవలసి వుంటుంది.
4 ప్రధాన యాజకుని స్థానం గౌరవనీయమైంది. ఆ స్థానాన్ని ఎవ్వరూ, స్వయంగా ఆక్రమించలేరు. దేవుడు అహరోనును పిలిచినట్లే ఈ స్థానాన్ని ఆక్రమించటానికి అర్హత గలవాణ్ణి పిలుస్తాడు.
© 1997 Bible League International