Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 51:1-12

సంగీత నాయకునికి: దావీదు కీర్తన. బత్షెబతో దావీదు పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త దావీదు దగ్గరకి వెళ్లినప్పుడు వ్రాసిన కీర్తన.

51 దేవా, నీ నమ్మకమైన ప్రేమ మూలంగా
    నా మీద దయ చూపించుము.
నీ మహా దయ మూలంగా
    నా పాపాలన్నీ తుడిచివేయుము.
దేవా, నా దోషం అంతా తీసివేయుము.
    నా పాపాలు కడిగివేసి, నన్ను మరల శుద్ధి చేయుము.
నేను పాపం చేశానని నాకు తెలుసు.
    నేను ఎల్లప్పుడు నా పాపాన్ని ఎరిగియున్నాను.
తప్పు అని నీవు చెప్పే వాటినే నేను చేసాను.
    దేవా, నీకే వ్యతిరేకంగా నేను పాపం చేసాను.
కనుక నేను దోషినని నీవు అన్నప్పుడు నీ మాట నిజమే.
    నీవు నన్ను నిందించేటప్పుడు నీవు న్యాయవంతుడవే.
నేను పాపంలో పుట్టాను.
    పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన ధరించింది.
దేవా, సంపూర్ణ భక్తిని లేదా యదార్థతను నీవు కోరతావు.
    అందుచేత నా హృదయంలో నాకు జ్ఞానమును బోధించుము.
హిస్సోపు ముక్కను ప్రయోగించి నన్ను పవిత్రం చేసే క్రమం జరిగించుము.
    నేను హిమం కంటె తెల్లగా ఉండేంతవరకు నన్ను కడుగుము.
నీవు విరుగ గొట్టిన ఎముకలను సంతోషించనిమ్ము.
    నన్ను సంతోషపరచుము! మరల నన్ను సంతోషపరచుము.
నా పాపాలను చూడకుము!
    వాటన్నింటినీ తుడిచి వేయుము.
10 దేవా, నాలో పవిత్ర హృదయాన్ని కలిగించుము
    నా ఆత్మను నూతనపరచి బలపరచుము.
11 నన్ను త్రోసివేయకుము!
    నీ పవిత్ర ఆత్మను నాలోనుండి తీసివేయకుము.
12 నీచేత రక్షించబడుట మూలంగా
    కలిగే ఆనందం నాకు తిరిగి ఇమ్ము!
    నీకు విధేయత చూపుటకు నా ఆత్మను సిద్ధంగా, స్థిరంగా ఉంచుము.

యెషయా 30:15-18

15 “మీరు తిరిగి నా దగ్గరకు వస్తే మీరు రక్షించబడుతారు. మీరు నన్ను విశ్వసిస్తే, మీకు ఉన్న ఒకే బలం మీకు వస్తుంది. అయితే మీరు మౌనంగా ఉండాలి” అంటున్నాడు ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు, యెహోవా, నా ప్రభువు.

కానీ అలా చేయటం మీకు ఇష్టం లేదు. 16 మీరు “మేము ఎక్కి పారిపోయేందుకు మాకు గుర్రాలు అవసరం” అంటారు. అది నిజమే, మీరు గుర్రాల మీద పారిపోతారు. కానీ శత్రువు మిమ్మల్ని తరుముతాడు. మరియు మీ గుర్రాలకంటె మీ శత్రువు వేగం ఎక్కువ. 17 ఒక శత్రువు బెదిరిస్తే, మీ వాళ్లు వేయిమంది పారిపోతారు. శత్రువులు అయిదుగురు బెదిరిస్తే, మీరు మొత్తం వారినుండి పారిపోతారు. మీ సైన్యంలో మిగిలేదల్లా, ఏదో ఒక కొండమీద జెండా కర్ర మాత్రమే.

దేవుడు తన ప్రజలకు సహాయం చేస్తాడు

18 యెహోవా మీకు తన దయ చూపించాలని కోరుతున్నాడు. యెహోవా కనిపెడ్తున్నాడు. యెహోవా లేచి, మిమ్మల్ని ఆదరించాలని కోరుతున్నాడు. యెహోవా దేవుడు న్యాయవంతుడు, యెహోవా సహాయం కోసం వేచి ఉండే ప్రతి వ్యక్తి ఆశీర్వదించబడతాడు.

హెబ్రీయులకు 4:1-13

దేవుని విశ్రాంతిలో ప్రవేశించుదుమన్న వాగ్దానం యింకా అలాగే ఉంది. అందువలన అక్కడికి వెళ్ళగలిగే అవకాశాన్ని ఎవ్వరూ జారవిడుచుకోకుండా జాగ్రత్త పడదాం. ఎందుకంటే, వాళ్ళకు ప్రకటింపబడినట్లే మనకు కూడా సువార్త ప్రకటింపబడింది. కాని, వాళ్ళు ఆ సువార్తను విశ్వాసంతో వినలేదు గనుక అది వాళ్ళకు నిష్ర్పయోజనమైపోయింది. సువార్తను విశ్వసించే మనం దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తాము.

“నా కోపంతో ప్రమాణం చేసి చెప్పుచున్నాను:
    ‘నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను’”(A)

అని దేవుడు అన్నాడు. ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత ఆయన కార్యం ముగిసింది. కాని, “దేవుడు ప్రపంచాన్ని సృష్టించటం ముగించిన తర్వాత విశ్రాంతి తీసుకొనెను”(B) అని ఏడవ రోజును గురించి ఒక చోట వ్రాయబడి ఉంది. దేవుడు ఈ విషయాన్ని గురించి మళ్ళీ చెబుతూ, “నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను” అని అన్నాడు.

ఆ విశ్రాంతిలో ప్రవేశించటానికి అవకాశం ఇంకావుంది. ఇదివరలో శుభసందేశాన్ని విన్నవాళ్ళు, వాళ్ళ అవిధేయతవల్ల లోపలికి వెళ్ళలేకపొయ్యారు. అందువల్ల దేవుడు మరొక దినాన్ని నిర్ణయించాడు. దాన్ని “ఈ రోజు” అని అన్నాడు. నేను ముందు వ్రాసినట్లు చాలాకాలం తర్వాత దేవుడు దావీదు ద్వారా ఈ విధంగా మాట్లాడాడు:

“ఈ రోజు మీరాయన స్వరం వింటే,
    మూర్ఖంగా ప్రవర్తించకండి.”(C)

యెహోషువ వాళ్ళకు విశ్రాంతి ఇచ్చినట్లయితే దేవుడు ఆ తర్వాత మరొక రోజును గురించి మాట్లాడి ఉండేవాడు కాదు. అందువల్ల, దేవుని ప్రజల కోసం “విశ్రాంతి” కాచుకొని ఉంది. 10 దేవుడు తన పని ముగించి విశ్రమించాడు. అలాగే, దేవుని విశ్రాంతిలో ప్రవేశించే ప్రతి ఒక్కడూ తన పనినుండి విశ్రాంతి పొందుతాడు. 11 అందువల్ల ఆ విశ్రాంతిని పొందటానికి మనం అన్ని విధాలా ప్రయత్నంచేద్దాం. వాళ్ళలా అవిధేయతగా ప్రవర్తించి క్రింద పడకుండా జాగ్రత్తపడదాం.

12 దైవసందేశం సజీవమైంది. దానిలో చురుకుదనం ఉంది. అది రెండు వైపులా పదునుగానున్న కత్తికన్నా పదునైంది. అది చొచ్చుకొని పోయి ఆత్మను, ప్రాణాన్ని, కీళ్ళను, ఎముకలో ఉన్న మూలుగను విభాగించగలదు. అది మనస్సు యొక్క భావాలమీద, ఆలోచనల మీద తీర్పు చెప్పగలదు. 13 సృష్టిలో ఉన్న ఏ వస్తువూ దేవుని దృష్టినుండి తప్పించుకోలేదు. కళ్ళ ముందు పరచబడినట్లు ఆయనకు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అలాంటి దేవునికి మనం మనకు సంబంధించిన లెక్కల్ని చూపవలసి వుంటుంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International