Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
19 ఆకాశాలు దేవుని మహిమను తెలియజేస్తున్నాయి.
యెహోవా చేతులు చేసిన మంచివాటిని అంతరిక్షం తెలియజేస్తుంది.
2 ప్రతి క్రొత్త రోజూ ఆ గాథను మరింత చెబుతుంది.
ప్రతి రాత్రి దేవుని గురించి మరింత ఎక్కువగా తెలియజేస్తుంది.
3 నిజానికి నీవు ఏ ఉపన్యాసం గాని మాటలుగాని వినలేవు.
మనం వినగలిగిన శబ్దం ఏదీ అవి చేయవు.
4 అయినా వాటి “స్వరం” ప్రపంచం అంతా ప్రసరిస్తుంది.
వాటి “మాటలు” భూమి చివరి వరకూ వెళ్తాయి.
అంతరిక్షం సూర్యునికి ఒక ఇల్లు లాంటిది.
5 తన పడక గది నుండి వచ్చే సంతోష భరితుడైన పెండ్లి కుమారునిలా సూర్యుడు బయటకు వస్తాడు.
పందెంలో పరుగెత్తడానికి ఆత్రంగా ఉన్న ఆటగానిలా సూర్యుడు
ఆకాశంలో తన దారిని మొదలు పెడతాడు.
6 సూర్యుడు అంతరిక్షంలోని ఒక దిశలో మొదలు పెడ్తాడు,
మరియు ఆవలి దిశకు అది పరుగెడుతుంది.
దాని వేడి నుండి ఏదీ దాక్కొలేదు. యెహోవా ఉపదేశాలు అలా ఉన్నాయి.
7 యెహోవా ఉపదేశాలు పరిపూర్ణం.
అవి దేవుని ప్రజలకు బలాన్నిస్తాయి.
యెహోవా ఒడంబడిక విశ్వసించదగింది.
జ్ఞానం లేని మనుష్యులకు అది జ్ఞానాన్ని ఇస్తుంది.
8 యెహోవా చట్టాలు సరియైనవి.
అవి మనుష్యులను సంతోషపెడ్తాయి.
యెహోవా ఆదేశాలు పరిశుద్ధమైనవి.
ప్రజలు జీవించుటకు సరైన మార్గాన్ని చూపడానికి అవి కన్నులకు వెలుగునిస్తాయి.
9 యెహోవాను ఆరాధించుట మంచిది.
అది నిరంతరము నిలుస్తుంది.
యెహోవా తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి.
అవి సంపూర్ణంగా సరియైనవి.
10 శ్రేష్ఠమైన బంగారంకంటె యెహోవా ఉపదేశాలను మనము ఎక్కువగా కోరుకోవాలి.
సాధారణ తేనె పట్టు నుండి వచ్చే శ్రేష్ఠమైన తేనె కంటె అవి మధురంగా ఉంటాయి.
11 యెహోవా ఉపదేశాలు నీ సేవకుణ్ణి చాలా తెలివిగలవాణ్ణిగా చేస్తాయి.
నీ చట్టాలు పాటించేవారు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు.
12 యెహోవా, ఏ వ్యక్తీ, తన స్వంత తప్పులన్నింటినీ చూడలేడు.
కనుక నేను రహస్య పాపాలు చేయకుండా చూడుము.
13 యెహోవా, నేను చేయాలనుకొనే పాపాలు చేయకుండా నన్ను ఆపుచేయుము.
ఆ పాపాలు నా మీద అధికారం చెలాయించ నీయకుము.
నీవు నాకు సహాయం చేస్తే, అప్పుడు నేను గొప్ప పాపము నుండి, పవిత్రంగా దూరంగా ఉండగలను.
14 నా మాటలు, తలంపులు నిన్ను సంతోషపెడ్తాయని నేను ఆశిస్తున్నాను.
యెహోవా, నీవే నా ఆశ్రయ దుర్గం. నీవే నన్ను రక్షించేవాడవు.
9 “దట్టమైన మేఘంలో నేను మీ దగ్గరకు వస్తాను. నేను నీతో మాట్లాడుతాను. నేను నీతో మాట్లాడటం ప్రజలంతా వింటారు. నీవు చెప్పే విషయాలు ప్రజలు ఎల్లప్పుడూ నమ్మేటట్టుగా నేను ఈ పని చేస్తాను.” అని యెహోవా మోషేతో చెప్పాడు.
అప్పుడు ప్రజలు చెప్పిన సంగతులన్నీ యెహోవాతో చెప్పాడు మోషే.
10 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: “ప్రత్యేకమైన ఒక సమావేశంగా ప్రజల్ని ఇవ్వాళ రేపు నీవు సిద్ధం చేయాలి. ప్రజలు తమ బట్టలు ఉదుక్కొని 11 మూడో రోజున నా కోసం సిద్ధంగా ఉండాలి. మూడో రోజున సీనాయి పర్వతం మీదికి యెహోవా దిగివస్తాడు. ప్రజలంతా నన్ను చూస్తారు. 12-13 అయితే ప్రజలు పర్వతానికి దూరంగా ఉండాలని నీవు తప్పక చెప్పాలి. ఒక గీతగీసి ప్రజలు ఆ గీత దాటి రాకుండా చూడు. ఏ మనిషిగాని, జంతువుగాని పర్వతాన్ని తాకినట్లయితే, చంపేయాలి. బాణాలతో, లేక రాళ్లతో కొట్టి చంపేయాలి. కాని అలాంటి వాణ్ణి ఎవరూ ముట్టుకోకూడదు. బూర ఊదేంత వరకు ప్రజలు వేచి ఉండాలి. అప్పుడే వాళ్లు పర్వతం మీదికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వబడుతుంది,” అని మోషేతో యెహోవా చెప్పాడు.
14 కనుక మోషే పర్వతం దిగి కిందికి వెళ్లాడు. ఆయన ప్రజల దగ్గరికి వెళ్లి, ప్రత్యేక సమావేశం కోసం వాళ్లను సిద్ధం చేసాడు. ప్రజలు వాళ్ల బట్టలు ఉదుక్కొన్నారు.
15 అప్పుడు మోషే ప్రజలతో, “ఇంక మూడు రోజుల్లో యెహోవాతో సమావేశం అయ్యేందుకు సిద్ధంగా ఉండండి. అంతవరకు పురుషులు స్త్రీలను ముట్టుకోగూడదు” అని చెప్పాడు.
30 “నలభై సంవత్సరాలు గడిచాయి. ఒక రోజు సీనాయి పర్వతంపై మండుతున్న పొదలో మోషేకు ఒక దేవదూత కనిపించాడు. 31 ఆ దృశ్యాన్ని చూసి మోషే దిగ్భ్రాంతి చెందాడు. దగ్గరనుండి చూడాలనుకొని ముందుకు వెళ్తుండగా అతనికి ప్రభువు స్వరం వినిపించింది. 32 ఆ స్వరం అతనితో ‘నేను మీ పూర్వుల దేవుణ్ణి! అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి!’(A) అని అన్నాడు. మోషే వణికిపోయాడు. తలెత్తి చూడటానికి అతనికి ధైర్యం చాలలేదు.
33 “ప్రభువు, ‘చెప్పులు తీసెయ్యి! నీవు నిలుచున్న స్థలం పవిత్రమైనది. 34 నా ప్రజల్ని ఈజిప్టులో అణచి ఉంచటం చూసాను. వాళ్ళ ఏడుపులు విన్నాను. వాళ్ళకు విముక్తి కలిగించటానికి వచ్చాను. రా! నిన్ను తిరిగి ఈజిప్టు పంపుతాను!’”(B) అని అన్నాడు.
35 స్తెఫను ఇంకా ఇలా చెప్పాడు: “‘నిన్ను పాలకునిగా, న్యాయాధిపతిగా చేసిందెవరు?’ అని వాళ్ళచే తిరస్కరించబడినవాడే ఈ మోషే. ఈ మోషేను దేవుడు వాళ్ళ పాలకునిగా, రక్షకునిగా పంపినట్లు పొదలో కనిపించిన దేవదూత ద్వారా తెలియచేసాడు. 36 మోషే అద్భుతాలు, మహత్యాలు చేసి వాళ్ళను ఈజిప్టునుండి వెలుపలికి పిలుచుకు వచ్చాడు. ఎఱ్ఱ సముద్రం దగ్గర, ఆ తర్వాత నలభై సంవత్సరాలు ఎడారుల్లో కూడా అద్భుతాలు, మహత్యాలు చేసాడు.
37 “‘నాలాంటి ప్రవక్తను దేవుడు మీనుండి ఎన్నుకొని మీకందిస్తాడు’ అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన మోషే ఇతడే! 38 ఇశ్రాయేలు ప్రజలందరూ ఎడారిలో సమావేశమైనప్పుడు, అక్కడున్న మన పూర్వికులతో కలిసి ఉన్నవాడు మోషేనే. సీనాయి పర్వతంపై దేవదూతతో మాట్లాడింది మోషేనే. మనకు అందివ్వటానికి సజీవమైన దైవసందేశాన్ని పొందింది మోషేనే.
39 “కాని మన పూర్వికులు అతని మాటలు వినలేదు. పైగా అతణ్ణి తిరస్కరించి ఈజిప్టు దేశానికి తిరిగి వెళ్ళాలనుకొన్నారు. 40 అందువల్ల అహరోనుతో, ‘మాకు దారి చూపించగల దేవుళ్ళ విగ్రహాలను సిద్ధం చేయించు. మమ్మల్ని ఈజిప్టునుండి పిలుచుకు వచ్చిన ఆ మోషేకు ఏమైందో ఏమో!’(C) అని అన్నారు.
© 1997 Bible League International