Revised Common Lectionary (Complementary)
12 అయితే యెహోవా, నీవు శాశ్వతంగా జీవిస్తావు.
నీ నామం శాశ్వతంగా కొనసాగుతుంది.
13 నీవు లేచి సీయోనును ఆదరిస్తావు.
నీవు సీయోను యెడల దయగా ఉండే సమయం వస్తూంది.
14 యెరూషలేము పట్టణపు రాళ్లను వారు ప్రేమిస్తారు.
15 జనసముదాయాలు యెహోవా నామాన్ని ఆరాధిస్తారు.
దేవా, భూమి మీద రాజులందరూ నిన్ను గౌరవిస్తారు.
16 ఎందుకంటే యెహోవా సీయోనును మరల నిర్మిస్తాడు.
యెరూషలేము మహిమను ప్రజలు మరల చూస్తారు.
17 దేవుడు సజీవులుగా విడిచిపెట్టిన ప్రజల ప్రార్థనలు వింటాడు.
దేవుడు వారి ప్రార్థనలు వింటాడు.
18 రాబోయే తరంవారు చదువుకొనేందుకు ఈ సంగతులు రాసిపెట్టు.
అప్పుడు, భవిష్యత్తులో ఆ ప్రజలు యెహోవాను స్తుతిస్తారు.
19 యెహోవా పైనున్న తన పవిత్ర స్థానం నుండి క్రిందకు చూస్తాడు.
యెహోవా పరలోకం నుండి క్రింద భూమిని చూస్తాడు.
20 ఖైదీల ప్రార్థనలు ఆయన వింటాడు.
మరణశిక్ష విధించబడిన ప్రజలను ఆయన విడుదల చేస్తాడు.
21 సీయోను ప్రజలు యెహోవాను గూర్చి చెబుతారు.
వారు యెహోవా నామాన్ని యెరూషలేములో స్మరిస్తారు.
22 జనసమూహములు కలిసి పోగుచేయబడునప్పుడు
రాజ్యాలు యెహోవాకు సేవచేయటానికి వచ్చినప్పుడు ఇది జరుగుతుంది.
23 నాలో బలం పోయింది.
నా జీవితం తక్కువగా చేయబడింది.
24 కనుక నేను ఇలా చెప్పాను, “నేను ఇంకా యువకునిగా ఉండగానే నన్ను చావనివ్వకు.
దేవా, నీవు శాశ్వతంగా జీవిస్తావు.
25 చాలా కాలం క్రిందట నీవు ప్రపంచాన్ని సృష్టించావు.
ఆకాశాన్ని నీ స్వహస్తాలతో చేశావు.
26 ప్రపంచం, ఆకాశం అంతం ఆవుతాయి.
కాని నీవు శాశ్వతంగా జీవిస్తావు.
అవి బట్టల్లా పాడైపోతాయి.
మరియు వస్త్రాలు మార్చినట్టుగా నీవు వాటిని మార్చివేస్తావు. అవన్నీ మార్చివేయబడతాయి.
27 కాని, దేవా, నీవు ఎన్నటికీ మారవు.
నీవు శాశ్వతంగా జీవిస్తావు!
28 ఈ వేళ మేము నీ సేవకులము.
భవిష్యత్తులో మా సంతతి వారిక్కడ నివసిస్తారు.
మరియు వారి సంతతి వారిక్కడ నిన్ను ఆరాధిస్తారు.”
యోబు ఎలీఫజుకు జవాబిచ్చుట
6 1-2 అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు:
“నా శ్రమే గనుక తూచబడితే,
నా కష్టం అంతా త్రాసులో ఉంచబడితే,
3 సముద్రాల ఇసుక కంటె నా దుఃఖం ఎక్కువ బరువయిందని నీవు గ్రహిస్తావు!
అందుకే నా మాటలు వెర్రిగా కనిపిస్తాయి.
4 సర్వశక్రిమంతుడైన దేవుని బాణాలు నాలో ఉన్నాయి.
ఈ బాణాల విషం నా ఆత్మను తాకుతుంది.
దేవుని దారుణ విషయాలు అన్నీ కలిపి నాకు విరోధంగా ఉంచబడ్డాయి.
5 (ఏ చెడుగూ జరగనప్పుడు మాటలాడడం సులభం) అడవి గాడిద తినేందుకు గడ్డి ఉంటే అదేమి గొడవ చెయ్యదు.
ఆవుకు ఆహారం ఉంటే అది ఆరోపణ చెయ్యదు.
6 రుచిలేని భోజనం ఉప్పు లేకుండా తినగలమా?
గ్రుడ్డులోని తెల్లసొన రుచిలేనిది.
7 (ఇప్పుడు నీ మాటలు వీటివలెనే ఉన్నాయి) దానిని నేను ముట్టుకోవటానికి కూడా ఒప్పుకోను;
అలాంటి భోజనం నన్ను జబ్బు మనిషిలా చేస్తుంది.
8 “నేను అడిగింది నాకు దొరకాలని కోరుకుంటాను.
నేను దేనికోసం కనిపెట్టుకొని ఉంటానో, దాన్ని దేవుడు నాకు ఇవ్వాలని కోరుకుంటాను.
9 దేవుడు నన్ను చితకగొట్టేందుకు ఇష్టపడి,
నన్ను చంపివేస్తాడని నేను నిరీక్షిస్తున్నాను!
10 ఆయన నన్ను చంపివేస్తే, ఒక్క విషయంలో నేను ఆదరణ పొందుతాను.
ఎడతెగని నా బాధల్లోనే నేను ఒక్క విషయంలో సంతోషిస్తాను. పరిశుద్ధుని ఆదేశాలకు విధేయత చూపేందుకు నేను తిరస్కరించలేదు.
11 “నా బలం క్షీణించిపోయింది, గనుక నేను ఇంకా బ్రతుకుతాను అనే ఆశాకిరణం నాకు లేదు.
చివరికి నాకు ఏమి జరుగుతుందో నాకు తెలియదు. అందుచేత నేను సహనంగా ఉండాల్సిన కారణం ఏమీ లేదు.
12 బండలాంటి బలం నాకు లేదు.
నా శరీరం కంచుతో చేయబడలేదు.
13 ఇప్పుడు నాకు నేను సహాయం చేసుకొనే శక్తినాకు లేదు.
ఎందుకంటే విజయం నా వద్దనుండి తొలగించి వేయబడింది.
ప్రజలు యేసును అనుసరించటం
7 యేసు తన శిష్యులతో కలిసి సముద్రం దగ్గరకు వెళ్ళాడు. గలిలయ నుండి చాలా మంది ప్రజలు ఆయన్ని అనుసరించారు. 8 యేసు చేస్తున్నవన్నీ విని చాలామంది ప్రజలు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదూమియ నుండి, యోర్దాను నది అవతలి వైపునున్న ప్రాంతాలనుండి, తూరు, సీదోను పట్టణాల చుట్టూవున్న ప్రాంతాలనుండి ఆయన దగ్గరకు వచ్చారు.
9 చాలామంది ప్రజలు ఉండటం వల్ల వాళ్ళు తనను త్రోయకుండా ఉండాలని యేసు తన శిష్యులతో ఒక చిన్న పడవను తన కోసం సిద్ధం చేయమని చెప్పాడు. 10 ఆయన చాలామందికి నయం చేసాడు. అందువల్ల రోగాలున్నవాళ్ళు ఆయన్ని తాకాలని ముందుకు త్రోసుకుంటూ వస్తూ ఉన్నారు. 11 చెడు ఆత్మలు ఆయన్ని చూసినప్పుడల్లా ఆయన ముందుపడి బిగ్గరగా, “నీవు దేవుని కుమారుడివి” అని కేకలు వేసేవి. 12 యేసు తానెవరో ఎవ్వరికి చెప్పవద్దని ఆ ప్రజల్ని గట్టిగా ఆజ్ఞాపించాడు.
© 1997 Bible League International