Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
35 యెహోవా, నా పోరాటాలు పోరాడుము
నా యుద్ధాలు పోరాడుము.
2 యెహోవా, కేడెము, డాలు పట్టుకొని,
లేచి, నాకు సహాయం చేయుము.
3 ఈటె, బరిసె తీసుకొని
నన్ను తరుముతున్న వారితో పోరాడుము.
“నేను నిన్ను రక్షిస్తాను” అని, యెహోవా, నా ఆత్మతో చెప్పుము,
4 కొందరు మనుష్యులు నన్ను చంపాలని చూస్తున్నారు.
ఆ ప్రజలు నిరాశచెంది, సిగ్గుపడేలా చేయుము.
వారు మళ్లుకొని పారిపోయేట్టు చేయుము.
ఆ మనుష్యులు నాకు హాని చేయాలని తలస్తున్నారు.
వారిని ఇబ్బంది పెట్టుము.
5 ఆ మనుష్యుల్ని గాలికి ఎగిరిపోయే పొట్టులా చేయుము.
యెహోవా దూత వారిని తరిమేలా చేయుము.
6 యెహోవా, వారి మార్గం చీకటిగాను, జారిపోయేటట్టుగాను చేయుము.
యెహోవా దూత వారిని తరుమును గాక!
7 నేనేమీ తప్పు చేయలేదు. కాని ఆ మనుష్యులు నన్ను ఉచ్చులో వేసి చంపాలని ప్రయత్నించారు.
నేను తప్పు ఏమీ చేయలేదు. కాని వారు నన్ను పట్టుకోవాలని ప్రయత్నించారు.
8 కనుక యెహోవా, ఆ మనుష్యులను వారి ఉచ్చులలోనే పడనిమ్ము.
వారి స్వంత ఉచ్చులలో వారినే తొట్రిల్లి పడనిమ్ము.
తెలియని ఆపద ఏదైనా వారిని పట్టుకోనిమ్ము.
9 అంతట నేను యెహోవాయందు ఆనందిస్తాను.
ఆయన నన్ను రక్షించినప్పుడు నేను సంతోషంగా ఉంటాను.
10 “యెహోవా, నీ వంటివాడు ఒక్కడూ లేడు.
యెహోవా, బలవంతుల నుండి పేదవారిని నీవు రక్షిస్తావు.
దోచుకొనువారినుండి నిస్సహాయులను పేదవారిని నీవు రక్షిస్తావు”
అని నా పూర్ణ వ్యక్తిత్వంతో నేను చెబుతాను.
బిలాము—మోయాబు రాజు
22 తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మోయాబు మైదానాలకు ప్రయాణం చేసారు. యెరికోకు ఎదురుగా యొర్దాను నది దగ్గర వారు నివాసాలు కట్టుకొనిరి.
2-3 ఇశ్రాయేలు ప్రజలు అమోరీ ప్రజలకు చేసిన వాటన్నిటినీ సిప్పోరు కుమారుడైన బాలాకు చూసాడు. ఇశ్రాయేలు ప్రజలు చాలమంది ఉండటం చూచి, మోయాబు రాజు భయపడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలంటే మోయాబువాళ్లు భయపడ్డారు.
4 మోయాబు రాజు “ఆవు పొలంలో గడ్డి అంతా తినివేసినట్టు ఈ గొప్ప ప్రజా సమూహం మన చుట్టూ ఉన్న మొత్తం నాశనం చేసేస్తుంది” అని మిద్యాను నాయకులతో చెప్పాడు.
అప్పట్లో సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబు రాజు. 5 బెయోరు కుమారుడు బిలామును పిలువమని అతడు మనుష్యులను పంపించాడు. బిలాము యూఫ్రటీసు నది దగ్గర పెతోరు అనే చోట ఉన్నాడు. బాలాకు ఈ విధంగా సందేశం పంపాడు:
“ఈజిప్టునుండి ఒక కొత్త జాతి ప్రజలు వచ్చారు. దేశం అంతా కమ్మేసేటంతమంది ఉన్నారు వారు. వాళ్లు నా ప్రక్కనే గుడారాలు వేసుకొన్నారు. 6 వీళ్లను ఎదుర్కోటానికి నీవు వచ్చి నాకు సహాయం చేయి. అప్పుడు ఒకవేళ వారిని ఓడించగలనేమో వారి ముందు నా బలం చాలదు. అప్పుడు వారిని నా దేశంనుండి తరిమివేయగలను. నీకు గొప్పశక్తి ఉందని నాకు తెలుసు. నీవు ఎవరినైనా ఆశీర్వదిస్తే, వారికి మేలు జరుగుతుంది. నీవు ఎవరినైనా శపిస్తే వారికి కీడు జరుగుతుంది. అందుచేత వచ్చి ఈ ప్రజలను శపించు. అప్పుడు, నేను వారిని ఈ దేశం నుండి తోలి వేయగలను.”
7 మోయాబు, మిద్యాను నాయకులు వెళ్లిపోయారు. బిలాముతో మాట్లాడటానికి వారు వెళ్లారు. అతని సేవకోసం అతనికి చెల్లించేందుకు వారు డబ్బు తీసుకుని వెళ్లారు. బాలాకు చెప్పిన విషయం వారు అతనికి చెప్పారు.
8 బిలాము, “ఈ రాత్రికి మీరు ఇక్కడ ఉండండి. నేను యెహోవాతో మాట్లాడి, ఆయన నాకు ఇచ్చే జవాబు మీకు చెబుతాను” అని వారితో చెప్పాడు. అందుచేత మోయాబు ప్రజా నాయకులు ఆ రాత్రి వారితో ఉండిపోయారు.
9 దేవుడు బిలాము దగ్గరకు వచ్చి, “నీతో ఉన్న ఈ మనుష్యులు ఎవరు?” అని అడిగాడు.
10 బిలాము దేవునితో చెప్పాడు: “మోయాబు రాజును, సిప్పోరు కుమారుడునైన బాలాకు నాకు ఒక కబురు చెప్పమని వారిని పంపాడు. 11 ఆ సందేశం ఇది: ఈజిప్టునుండి ఒక కొత్త దేశపు జనాంగం వచ్చింది. వారు భూమి అంతా నిండిపొయ్యేంత మంది ఉన్నారు. కనుక వచ్చి వీళ్లను శపించు, అప్పుడు ఒకవేళ నేను వాళ్లతో యుద్ధం చేసి నా దేశంనుండి వెళ్లగొట్ట గలుగుతానేమో.”
12 అయితే దేవుడు, “వాళ్లతో వెళ్లవద్దు. ఈ ప్రజలను నీవు శపించకూడదు. వీరు నా ప్రజలు” అని బిలాముతో చెప్పాడు.
13 మరునాటి ఉదయం బిలాము లేచి, “మీ స్వదేశానికి తిరిగి వెళ్లిపొండి. యెహోవా నన్ను మీతో వెళ్ల నివ్వడు” అన్నాడు.
14 కనుక మోయాబు నాయకులు తిరిగి బాలాకు దగ్గరకు వెళ్లిపోయి అతనితో, “మాతో రావటానికి బిలాము నిరాకరించాడు” అని చెప్పారు.
15 కనుక బాలాకు మరికొందరు నాయకులను బిలాము దగ్గరకు పంపించాడు. మొదటి సారికంటే ఈ సారి చాల ఎక్కువ మందిని అతడు పంపించాడు. మొదటిసారి అతడు పంపిన వారికంటె వీరు ప్రముఖ నాయకులు. 16 వారు బిలాము దగ్గరకు వెళ్లి చెప్పారు: “సిప్పోరు కుమారుడైన బాలాకు నీతోఇలా చెప్పమన్నాడు. దయచేసి నీవు రాకుండా ఏదీ నిన్ను అడ్డుపెట్టనియ్యకు. 17 నేను అడిగిన దాన్ని నీవు చేస్తే, నేను నీకు విస్తారంగా డబ్బు ఇస్తాను. నీవు వచ్చి, నా పక్షంగా ఈ ప్రజలను శపించు.”
18 కానీ బిలాము ఆ మనుష్యులకు తన జవాబిచ్చాడు. అతడు ఇలా చెప్పాడు: “నా దేవుడైన యెహోవాకు నేను విధేయుడ్ని కావాలి. ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా నేనేమి చేయలేను. నేను చెయ్యొచ్చు అని నా ప్రభువు చెబితేనే తప్ప లేకపోతే సామాన్యమైనదైనా గొప్పదైనా నేనేమి చేయలేను. బాలాకు రాజు అందమైన తన భవనమంతా వెండి బంగారాలతో నింపి నాకు ఇచ్చినా సరే, నా ప్రభువు ఆజ్ఞకు వ్యతిరేకంగా నేనేమి చేయను. 19 అయితే ఇదివరకు వచ్చిన వారిలాగే మీరు ఈ రాత్రి ఇక్కడ వుండవచ్చు. ఈ రాత్రి యెహోవా నాతో ఏమి చెబుతాడో నేను తెలుసుకొంటాను.”
20 ఆ రాత్రి యెహోవా బిలాము దగ్గరకు వచ్చి, “ఈ మనుష్యులు వారితో కూడ నిన్ను రమ్మని అడగటానికి మళ్లీ వచ్చారు. కనుక నీవు వారితో వెళ్లవచ్చు. అయితే నేను నీతో ఏమి చెబుతానో అలా మాత్రమే చేయాలి” అని చెప్పాడు.
బిలాము, అతని గాడిద
21 మరునాడు ఉదయాన్నే బిలాము లేచి తన గాడిదకు గంత కట్టాడు. అప్పుడు అతడు మోయాబు నాయకులతో వెళ్లాడు.
పెద్దల్ని కలుసుకోవటం
17 మేము యెరూషలేముకు వచ్చాము. అక్కడి సోదరులు మాకు మనసారా స్వాగతమిచ్చారు. 18 మరుసటి రోజు మేము పౌలుతో కలిసి యాకోబును చూడాలని వెళ్ళాము. అక్కడ సంఘ పెద్దలందరూ ఉన్నారు. 19 పౌలు వాళ్ళను కుశల ప్రశ్నలు అడిగి తాను చేసిన కార్యాల వల్ల దేవుడు యూదులు కానివాళ్ళతో చేసిన వాటినన్నిటిని ఒక్కొక్కటి విడమరిచి చెప్పాడు.
20 వాళ్ళా మాటలు విని దేవుణ్ణి స్తుతించారు. ఆ తర్వాత పౌలుతో, “సోదరుడా! వేలకొలది యూదులు విశ్వాసులవటం నీవు చూస్తున్నావు. మోషే ధర్మశాస్త్రాన్ని పాటించటం ముఖ్యమని వాళ్ళ అభిప్రాయం. 21 కాని నీవు మోషే ధర్మశాస్త్రాన్ని వదలమని, కుమారులకు సున్నతి చేయించటం తప్పని, యూదుల ఆచారాలను పాటించవద్దని యూదులు కానివాళ్ళ మధ్య నివసిస్తున్న యూదులకు బోధించినట్లు వీళ్ళకు ఎవరో చెప్పారు.
22 “ఏం చెయ్యాలి? నీవు వచ్చిన విషయం వాళ్ళకు తప్పక తెలుస్తుంది. 23 అందువల్ల మేము చెప్పినట్లు చెయ్యి. మా దగ్గర మ్రొక్కుబడి ఉన్నవాళ్ళు నలుగురున్నారు. 24 వీళ్ళను నీ వెంట పిలుచుకెళ్ళు. వాళ్ళతో కలిసి శుద్ధీకరణ చేయి. వాళ్ళు తల వెంట్రుకలు తీయించుకోవటానికి అయ్యే డబ్బు చెల్లించు. అలా చేస్తే నీ గురించి విన్నవి నిజం కాదని అందరికీ రుజువౌతుంది. మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ జీవిస్తున్నావని వాళ్ళకు తెలుస్తుంది.
25 “ఇక యూదులుకాని భక్తుల విషయంలో మేమిదివరకే మా అభిప్రాయం తెలియచేసాము. వాళ్ళు ఈ నియమాన్ని మాత్రం పాటిస్తే చాలని ఇదివరకే వాళ్ళకు వ్రాసి పంపాము:
‘విగ్రహాలకు పెట్టిన నైవేద్యం ముట్టరాదు.
రక్తాన్ని, గొంతు నులిపి చంపిన జంతువుల మాంసాన్ని తినరాదు.
లైంగిక పాపము చేయరాదు’” అని అన్నారు.
పౌలు బంధింపబడటం
26 మరుసటి రోజు పౌలు వాళ్ళను పిలుచుకెళ్ళి వాళ్ళతో సహా శుద్ధి చేసుకొన్నాడు. ఆ తదుపరి యెరూషలేము మందిరానికి వెళ్ళి పూర్తిగా శుద్ధి కావటానికి ఎన్ని రోజులు వేచివుండాలో ప్రకటించాడు. చివరి రోజున తనతో వచ్చిన ప్రతి ఒక్కరి పక్షాన బలి ఇవ్వవచ్చని చెప్పాడు.
© 1997 Bible League International