Revised Common Lectionary (Complementary)
111 యెహోవాను స్తుతించండి!
మంచి మనుష్యులు సమావేశమయ్యే సమాజంలో
నేను నా హృదయపూర్తిగా యెహోవాకు వందనాలు చెల్లిస్తాను.
2 యెహోవా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
దేవుని నుండి లభ్యమయ్యే మంచిది ప్రతి ఒక్కటి ప్రజలకు కావాలి.
3 దేవుడు వాస్తవంగా మహిమగల ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
ఆయన మంచితనం నిరంతరం కొనసాగుతుంది.
4 దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
కనుక యెహోవా దయ, జాలి గలవాడని మనం జ్ఞాపకం చేసుకొంటాము.
5 దేవుడు తన అనుచరులకు ఆహారం ఇస్తాడు.
దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొంటాడు.
6 దేవుడు చేసిన శక్తివంతమైన పనులు ఆయన తన ప్రజలకు
వారి దేశాన్ని ఇస్తున్నాడని తెలియజేస్తున్నాయి.
7 దేవుడు చేసే ప్రతిది మంచిది, న్యాయమయింది కూడా.
ఆయన ఆదేశాలు అన్నీ నమ్మదగినవి.
8 దేవుని ఆదేశాలు నిత్యం కొనసాగుతాయి.
ఆ ఆదేశాలు ఇవ్వటంలోగల దేవుని కారణాలు నిజాయితీగలవి, పవిత్రమైనవి.
9 దేవుడు తన ప్రజలను రక్షిస్తాడు. దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా కొనసాగేందుకు చేసాడు.
దేవుని నామం అద్భుతం, పవిత్రం!
10 దేవుడంటే భయము, భక్తి ఉంటేనే జ్ఞానం ప్రారంభం అవుతుంది.
దేవుణ్ణి గౌరవించే ప్రజలు చాలా జ్ఞానంగలవారు.
శాశ్వతంగా దేవునికి స్తుతులు పాడుతారు.
28 నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలన్నింటికి జాగ్రత్తగా విధేయులు కావాలి. మంచివి, సరైనవి మీ దేవుడైన యెహోవాను ఆనందపర్చే పనులు మీరు చేసినప్పుడు మీకూ, మీ సంతతివారికి శాశ్వతంగా మేలు కలుగుతుంది.
29 “ఇతర రాజ్యాల ప్రాంతంలోనికి మీరు వెళ్లినప్పుడు ఆ రాజ్యాలను మీ దేవుడైన యెహోవా బయటకు వెళ్లగొట్టి నాశనం చేస్తాడు. మీరు లోనికి వెళ్లి వారినుండి ఆ దేశం తీసుకొంటారు. వారి దేశంలో మీరు నివసిస్తారు. 30 అయితే అది జరిగిన తర్వాత జాగ్రత్తగా ఉండండి. ఆ రాజ్యాలవారు పూజించిన దేవుళ్లను గూర్చి తెలుసుకోవటం ద్వారా మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవద్దు. వారు వారి దేవుళ్లను ఎలా పూజిస్తారో అది మీరు నేర్చుకొనేందుకు ప్రయత్నించవద్దు. వాళ్లు పూజించినట్టు పూజించాలనే ఆలోచన కూడా చేయవద్దు. 31 ఆ ప్రజలు వారి దేవుళ్లను పూజించిన పద్ధతిలో మీరు మీ దెవుడైన యెహోవాను ఆరాధించకూడదు. ఎందుకంటే వారు వారి పూజలో యెహోవాకు అసహ్యమైన చెడ్డపనులు అన్నీ చేస్తారు. చివరికి వారు వారి చిన్న బిడ్డలను కూడ వారి దేవుళ్లకు బలి అర్పణగా కాల్చివేస్తారు.
32 “నేను మీకు ఆజ్ఞాపించే సమస్తం జాగ్రత్తగా చేయాలి. నేను మీకు చెప్పేవాటికి మరేమీ కలుపవద్దు, ఏమీ తీసివేయవద్దు.
పెర్గములోని సంఘానికి
12 “పెర్గములోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:
“రెండు వైపులా పదునైన కత్తిగలవాడు ఈ విధంగా చెబుతున్నాడు.
13 “సాతాను సింహాసనం ఎక్కడ ఉందో అక్కడే నీవు నివసిస్తున్నావని నాకు తెలుసు. అయినా నీకు నా పేరంటే విశ్వాసం ఉంది. విశ్వాసంతో నా విషయంలో అంతిప తన భక్తిని వ్యక్తపరిచిన కాలంలో కూడా నా పట్ల నీకున్న విశ్వాసాన్ని నీవు వదులుకోలేదు. సాతాను నివసించే పట్టణంలో అంతిప చంపబడ్డాడు.
14 “కాని కొన్ని విషయాల్లో నాకు నీవు నచ్చలేదు. బిలాము బోధలు[a] పఠించేవాళ్ళు కొందరు నీ సంఘంలో ఉన్నారు. ఈ బిలాము, ఇశ్రాయేలీయులను రేకెత్తించి వాళ్ళతో పాపపు పనులు చేయించమని బాలాకుకు బోధించాడు. బాలాకు వాళ్ళు విగ్రహాలకు[b] ఆరగింపు పెట్టిన ఆహారం తినేటట్లు అవినీతిగా బ్రతికేటట్లు చేసాడు. 15 నీకొలాయితులను అనుసరించేవాళ్ళు కూడా నీ దగ్గరున్నారు. 16 మారుమనస్సు పొందండి. అలా చేయకపోతే నేను త్వరలోనే మీ దగ్గరకు వచ్చి, నా నోటి నుండి బయలు వెడలు కత్తితో యుద్ధం చేస్తాను.
17 “ఆత్మ క్రీస్తు సంఘాలకు చెప్పిన వాటిని ప్రతివాడు వినాలి.
“విజయం సాధించిన వానికి నేను దాచి ఉంచిన ‘మన్నా’ను[c] తినుటకు యిస్తాను. ఒక తెల్ల రాయి మీద ఒక క్రొత్త పేరు వ్రాసి దాన్ని కూడా అతనికి యిస్తాను. నేను ఆ రాయి ఎవరికి యిస్తానో అతనికి మాత్రమే ఆ పేరు తెలుస్తుంది.
© 1997 Bible League International