Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: కోరహు కుమారుల అలామోతు రాగ గీతం.
46 దేవుడు మా ఆశ్రయం, మా శక్తి.
ఆయన యందు, మాకు కష్ట కాలంలో ఎల్లప్పుడూ సహాయం దొరుకుతుంది.
2 అందుచేత భూమి కంపించినప్పుడు,
మరియు పర్వతాలు సముద్రంలో పడినప్పుడు మేము భయపడము.
3 సముద్రాలు పొంగినను, చీకటితో నిండినను,
భూమి, మరియు పర్వతాలు కంపించినను మేము భయపడము.
4 ఒక నది ఉంది. దాని కాలువలు దేవుని నివాసానికి,
మహోన్నత దేవుని పరిశుద్ధ పట్టణానికి సంతోషం తెచ్చి పెడ్తాయి.
5 ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. కనుక అది ఎన్నటికీ నాశనం చేయబడదు.
సూర్యోదయానికి ముందే దేవుడు సహాయం చేస్తాడు.
6 రాజ్యాలు భయంతో వణకుతాయి.
యెహోవా గద్దించగా ఆ రాజ్యాలు కూలిపోతాయి. భూమి పగిలిపోతుంది.
7 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
8 యెహోవా చేసే మహత్తర కార్యాలు చూడండి.
ఆ కార్యాలు భూమి మీద యెహోవాను ప్రసిద్ధి చేస్తాయి.
9 భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధాలను యెహోవా ఆపివేయగలడు.
సైనికుల విల్లులను, వారి ఈటెలను ఆయన విరుగగొట్టగలడు. రథాలను ఆయన అగ్నితో కాల్చివేయగలడు.
10 దేవుడు చెబుతున్నాడు, “మౌనంగా ఉండి, నేను దేవుణ్ణి అని తెలుసుకొనండి.
రాజ్యాలతో నేను స్తుతించబడతాను.
భూమిమీద మహిమపర్చబడతాను.”
11 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
25 కనుక ఆ సోదరులు ఈజిప్టు దేశం విడిచి, కనాను దేశంలో ఉన్న తమ తండ్రి దగ్గరకు వెళ్లారు. 26 ఆ సోదరులు “నాయనా, యోసేపు బ్రతికే ఉన్నాడు, ఈజిప్టు దేశం అంతటికి అతడే అధికారి” అని అతనితో చెప్పారు. వారి తండ్రి ఆశ్చర్యచకితుడయ్యాడు. అతడు వాళ్లను నమ్మలేదు. 27 అయితే యోసేపు చెప్పినదంతా ఆ సోదరులు వారి తండ్రికి చెప్పారు. తర్వాత తనని ఈజిప్టు తీసుకొని రమ్మని యోసేపు పంపిన బండ్లను యాకోబు చూశాడు. అప్పుడు యాకోబు సంతోషంతో ఉప్పొంగిపొయ్యాడు. 28 “ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాను. నా కుమారుడు యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు! నేను మరణించక ముందు అతణ్ణి చూస్తాను” అన్నాడు ఇశ్రాయేలు.
ఇశ్రాయేలుకు దేవుని అభయం
46 కనుక ఇశ్రాయేలు ఈజిప్టుకు తన ప్రయాణం మొదలు పెట్టాడు. మొదట ఇశ్రాయేలు బెయేర్షెబాకు వెళ్లాడు. అక్కడ తన తండ్రియైన ఇస్సాకు దేవుణ్ణి ఇశ్రాయేలు ఆరాధించాడు. అతడు బలులు అర్పించాడు. 2 ఆ రాత్రి ఒక కలలో దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడాడు. “యాకోబూ, యాకోబూ” అన్నాడు దేవుడు.
“ఇదిగో ఇక్కడే ఉన్నాను” అని ఇశ్రాయేలు జవాబు ఇచ్చాడు.
3 అప్పుడు దేవుడు అన్నాడు: “నేను దేవుణ్ణి, నీ తండ్రి దేవుణ్ణి. ఈజిప్టు వెళ్లేందుకు భయపడకు. ఈజిప్టులో నిన్ను ఒక గొప్ప జనంగా నేను చేస్తాను. 4 నీతో కూడ నేను ఈజిప్టుకు వస్తాను. మళ్లీ నేనే నిన్ను ఈజిప్టునుండి బయటకు తీసుకొని వస్తాను. నీవు ఈజిప్టులో మరణిస్తావు, కాని యోసేపు నీతో ఉంటాడు. నీవు చనిపోయినప్పుడు అతని స్వంత చేతులే నీ కళ్లను మూస్తాయి.”
ఇశ్రాయేలు ఈజిప్టుకు వెళ్ళుట
5 అప్పుడు యాకోబు బెయేర్షెబా విడిచి, ఈజిప్టుకు ప్రయాణం చేశాడు. అతని కుమారులు, ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రిని, భార్యలను, తమ పిల్లలందరిని ఈజిప్టుకు తీసుకొని వచ్చారు. ఫరో పంపిన బండ్లలో వారు ప్రయాణం చేశారు. 6 తమ పశువులు, కనాను దేశంలో వారికి ఉన్నవి అన్నీ వారితోబాటు ఉన్నవి. కనుక ఇశ్రాయేలు తన పిల్లలందరితో, తన కుటుంబం అంతటితో కలిసి ఈజిప్టు వెళ్లాడు. 7 అతని కుమారులు అతని మనుమళ్లు, అతని కుమార్తెలు, అతని మనమరాళ్లు అతనితో ఉన్నారు. అతని కుటుంబం అంతా అతనితో కలిసి ఈజిప్టుకు వెళ్లారు.
33 ఇది విని వాళ్ళకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు అపొస్తలులను చంపాలనుకున్నారు. 34 కాని “గమలీయేలు” అనే పరిసయ్యుడు ఆ మహాసభలో లేచి నిలుచొని అపొస్తలుల్ని కొంతసేపు అవతలకు తీసుకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. గమలీయేలు ధర్మశాస్త్ర పండితుడు. ప్రజల గౌరవం పొందినవాడు. 35 అతడు వాళ్ళని సంబోధిస్తూ, “ఇశ్రాయేలు ప్రజలారా! వీళ్ళను ఏమి చెయ్యాలో జాగ్రత్తగా ఆలోచించండి! 36 ఇదివరలో థూదా కనిపించి తానొక గొప్పవాణ్ణని చెప్పుకున్నాడు. సుమారు నాలుగువందలమంది అతణ్ణి అనుసరించారు. అతడు చంపబడ్డాడు. ఆ తర్వాత అతని అనుచరులు చెదిరిపోయారు. చివరకు ఏమీ మిగల్లేదు. 37 అతని తర్వాత జనాభా లెక్కల కాలంలో యూదా అనే వాడు వచ్చి ప్రజల్ని చేరదీసి తిరుగుబాటు చేసాడు. ఇతడు గలిలయవాడు. ఇతడు కూడా చంపబడ్డాడు. అతని అనుచరులందరూ చెదిరిపోయారు. 38 అందువల్ల వాళ్ళ విషయంలో నా సలహా ఇది: వాళ్ళ విషయం పట్టించుకోకండి! వాళ్ళను వదిలివేయండి! వాళ్ళ కార్యము, వాళ్ళ ఉద్దేశ్యము మానవుడు సృష్టించినదైతే అది నశిస్తుంది. 39 అలా కాకుండా అది దైవేచ్ఛ వలన అయితే మీరు వాళ్ళను ఆపలేరు. అలా చేస్తే మీరు దేవునికి ఎదురు తిరిగిన వాళ్ళౌతారు” అని అన్నాడు.
40 సభ్యులు అతడు చెప్పినట్లు విన్నారు. అపొస్తలుల్ని పిలిపించి కొరడా దెబ్బలు కొట్టించారు. ఆ తర్వాత, యేసు పేరిట మాట్లాడవద్దని వారించి వదిలి వేసారు. 41 అపొస్తలులు యేసు కోసం అవమానింపబడటానికి తాము అర్హులైనందుకు సంతోషిస్తూ మహాసభనుండి వెళ్ళిపోయారు. 42 ప్రతి రోజూ మందిరంలో, ఇంటింటా “యేసే క్రీస్తు” అని ప్రకటించారు. ఈ సువార్త ప్రకటించటం మానుకోలేదు.
© 1997 Bible League International