Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: కోరహు కుమారుల అలామోతు రాగ గీతం.
46 దేవుడు మా ఆశ్రయం, మా శక్తి.
ఆయన యందు, మాకు కష్ట కాలంలో ఎల్లప్పుడూ సహాయం దొరుకుతుంది.
2 అందుచేత భూమి కంపించినప్పుడు,
మరియు పర్వతాలు సముద్రంలో పడినప్పుడు మేము భయపడము.
3 సముద్రాలు పొంగినను, చీకటితో నిండినను,
భూమి, మరియు పర్వతాలు కంపించినను మేము భయపడము.
4 ఒక నది ఉంది. దాని కాలువలు దేవుని నివాసానికి,
మహోన్నత దేవుని పరిశుద్ధ పట్టణానికి సంతోషం తెచ్చి పెడ్తాయి.
5 ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. కనుక అది ఎన్నటికీ నాశనం చేయబడదు.
సూర్యోదయానికి ముందే దేవుడు సహాయం చేస్తాడు.
6 రాజ్యాలు భయంతో వణకుతాయి.
యెహోవా గద్దించగా ఆ రాజ్యాలు కూలిపోతాయి. భూమి పగిలిపోతుంది.
7 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
8 యెహోవా చేసే మహత్తర కార్యాలు చూడండి.
ఆ కార్యాలు భూమి మీద యెహోవాను ప్రసిద్ధి చేస్తాయి.
9 భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధాలను యెహోవా ఆపివేయగలడు.
సైనికుల విల్లులను, వారి ఈటెలను ఆయన విరుగగొట్టగలడు. రథాలను ఆయన అగ్నితో కాల్చివేయగలడు.
10 దేవుడు చెబుతున్నాడు, “మౌనంగా ఉండి, నేను దేవుణ్ణి అని తెలుసుకొనండి.
రాజ్యాలతో నేను స్తుతించబడతాను.
భూమిమీద మహిమపర్చబడతాను.”
11 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
దేవుడు అబ్రామును పిలచుట
12 అబ్రాముతో యెహోవా ఇలా అన్నాడు,
“నీ దేశాన్ని, నీ ప్రజలను విడిచిపెట్టు.
నీ తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి,
నేను నీకు చూపించు దేశానికి వెళ్లు.
2 నిన్ను ఆశీర్వదిస్తాను.
నిన్ను ఒక గొప్ప జనముగా నేను చేస్తాను.
నీ పేరును నేను ప్రఖ్యాతి చేస్తాను.
ఇతరులను ఆశీర్వదించటానికి ప్రజలు
నీ పేరు ఉపయోగిస్తారు.
3 నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను.
నిన్ను శపించే వాళ్లను నేను శపిస్తాను.
భూమి మీదనున్న మనుష్యులందరిని ఆశీర్వదించడానికి
నేను నిన్ను ఉపయోగిస్తాను.”
అబ్రాము కనానుకు వెళ్లుట
4 కనుక అబ్రాము యెహోవాకు విధేయుడై కనాను వెళ్లాడు. అతడు హారానును విడిచిపెట్టాడు, లోతు అతనితో కూడ వెళ్లాడు. ఈ సమయంలో అబ్రాము వయస్సు 75 సంవత్సరాలు. 5 అబ్రాము హారానును విడిచిపెట్టినప్పుడు అతడు ఒంటరివాడు కాడు. తన భార్య శారయిని, తమ్ముని కుమారుడు లోతును, హారానులో వారికి కలిగిన సమస్తాన్ని అబ్రాము తనతో తీసుకు వెళ్లాడు. హారానులో అబ్రాము సంపాదించిన బానిసలు అంతా వారితో వెళ్లారు. అబ్రాము, అతని వర్గంవారు హారాను విడిచి, కనాను దేశానికి ప్రయాణం చేశారు. 6 అబ్రాము కనాను దేశంగుండా సంచారం చేశాడు. అబ్రాము షెకెము పట్టణానికి పయనించి మోరేలో ఉన్న మహా వృక్షం దగ్గరకు వచ్చాడు. ఆ కాలంలో కనానీ ప్రజలు ఈ దేశంలో నివసించారు.
7 అబ్రాముకు యెహోవా ప్రత్యక్షమయి, “ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను” అన్నాడు.
ఆ స్థలంలో అబ్రాముకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు. కనుక ఆ స్థలంలో యెహోవాను ఆరాధించటానికి అబ్రాము ఒక బలిపీఠం కట్టాడు. 8 తర్వాత అబ్రాము ఆ స్థలం విడిచిపెట్టి బేతేలుకు తూర్పున ఉన్న పర్వత ప్రాంతాలకు వెళ్లాడు. అక్కడ అబ్రాము తన గుడారం వేసుకొన్నాడు. పడమటికి బేతేలు పట్టణం ఉంది. తూర్పున హాయి పట్టణం ఉంది. ఆ స్థలంలో యెహోవా కోసం మరో బలిపీఠాన్ని అబ్రాము నిర్మించాడు. అక్కడ అబ్రాము యెహోవాను ఆరాధించాడు. 9 ఆ తర్వాత అబ్రాము మరల ప్రయాణం మొదలు పెట్టాడు. నెగెబు[a] దిశగా అతడు ప్రయాణం చేశాడు.
దేవుడు నిన్ను పిలిచినట్లే జీవించు
17 ప్రతి ఒక్కడూ తన జీవితాన్ని ప్రభువు ప్రసాదించిన వరం ప్రకారం జీవించాలి. మీ జీవితం ప్రభువు నియమించిన ప్రకారముగా పిలుపుకు తగినట్టుగా ఉండాలి. ఈ నియమాన్ని అన్ని సంఘాలు పాటించాలని ఆజ్ఞాపిస్తున్నాను. 18 సున్నతి చేయించుకొన్నవాడు దేవుని పిలుపును అంగీకరిస్తే, అతడు ఆ సున్నతి లేనివానిగా ఉండుటకు ప్రయత్నించరాదు. సున్నతి చేయించుకొననివాడు దేవుని పిలుపును అంగీకరిస్తే అతడు సున్నతి చేయించుకోవటానికి ప్రయత్నం చేయరాదు. 19 సున్నతి చేయించుకొన్నా, చేయించుకోక పోయినా జరిగేది ఏమిలేదు. దేవుని ఆజ్ఞల్ని పాటించటం ముఖ్యం. 20 ప్రతి ఒక్కడూ, దేవుడు పిలిచినప్పుడు ఏ విధంగా ఉన్నాడో అదేవిధంగా ఉండాలి. 21 దేవుడు పిలిచినప్పుడు నీవు బానిసవా? చింతించకు. కాని నీవు స్వేచ్ఛ పొందగలిగితే అందుకు ప్రయత్నం చేయి. 22 ప్రభువు పిలిచినప్పుడు బానిసగా ఉన్నవాడు, ప్రభువులో ఐక్యత పొందటంవల్ల స్వేచ్ఛను పొందుతాడు. అదే విధంగా ప్రభువు పిలిచినప్పుడు స్వేచ్ఛగా ఉన్నవాడు ప్రభువుకు బానిస అవుతాడు. 23 మీకోసం వెల చెల్లించి దేవుడు మిమ్మల్ని కొన్నాడు. మానవులకు బానిసలు కాకండి. 24 సోదరులారా! దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరేవిధంగా ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉండి దేవునితో కలిసి ఉండండి.
© 1997 Bible League International