Revised Common Lectionary (Complementary)
5 దేవుడు నన్ను రక్షించాలని నేను సహనంతో వేచి ఉన్నాను.
దేవుడు ఒక్కడే నా నిరీక్షణ.
6 దేవుడు నా కోట. దేవుడు నన్ను రక్షిస్తాడు.
పర్వతం మీద ఎత్తయిన నా క్షేమ స్థానం దేవుడే.
7 నా కీర్తి, విజయం దేవుని నుండి వస్తాయి.
ఆయన నా బలమైన కోట. దేవుడు నా క్షేమ స్థానం
8 ప్రజలారా, ఎల్లప్పుడూ దేవునియందు నమ్మిక ఉంచండి.
మీ సమస్యలు దేవునితో చెప్పండి.
దేవుడే మన క్షేమ స్థానం.
9 మనుష్యులు నిజంగా సహాయం చేయలేరు.
నిజంగా సహాయం కోసం నీవు వారిని నమ్ముకోలేవు.
వారు గాలిబుడగల్లా వట్టి ఊపిరియైయున్నారు.
10 బలవంతంగా విషయాలను చేజిక్కించుకొనుటకు నీ శక్తిని నమ్ముకోవద్దు.
దొంగిలించడం ద్వారా నీకు ఏదైనా లాభం కలుగుతుందని తలంచవద్దు.
నీవు ధనికుడవైతే నీ సహాయం కోసం
ధనాన్ని నమ్ముకొనవద్దు.
11 నీవు నిజంగా ఆధారపడదగినది ఒకటి ఉన్నదని దేవుడు చెబుతున్నాడు,
“బలము దేవుని నుండే వస్తుంది.”
12 నా ప్రభువా, నీ ప్రేమ నిజమైనది.
ఒకడు చేసినవాటినిబట్టి నీవతనికి బహుమానం ఇస్తావు లేదా శిక్షిస్తావు.
ఐదవసారి యిర్మీయా విన్నపం
7 యెహోవా, నీవు నన్ను భ్రమలో పడవేశావు. నేను నిజంగా మోసగింపబడ్డాను.
నీవు నాకంటె బలవంతుడవు, అందువల్ల నీవు గెలిచావు.
నేను నవ్వుల పాలయ్యాను.
రోజంతా ప్రజలు నన్ను జూచి నవ్వటం ఎగతాళి చేయటం మొదలు పెట్టారు.
8 నేను మాట్లాడిన ప్రతిసారీ అరుస్తున్నాను.
దౌర్జన్యం గురించి, వినాశనాన్ని గురించి నేను ఎప్పుడూ అరుస్తున్నాను.
యెహోవా నుంచి నాకు అందిన సమాచారాన్నే నేను బహిరంగంగా చెపుతున్నాను.
కాని నా ప్రజలు నన్ను కేవలం అవమానపర్చి,
హేళనచేస్తున్నారు.
9 “నేనిక దేవుని గురించి మర్చిపోతాను.
ఇక ఏ మాత్రం దేవుని నామం పేరిట నేను మాట్లాడను!”
అని నేను కొన్ని సార్లు అనుకున్నాను.
కాని నేనలా అన్నప్పుడు దేవుని వర్తమానం నాలో అగ్నిలా రగులుతుంది!
అది నన్ను లోపల దహించి వేస్తుంది.
దేవుని వర్తమానం నాలో ఇముడ్చుకొన ప్రయత్నించి వేసారి పోయాను.
ఇక ఎంత మాత్రం దానిని నాలో వుంచుకోలేను.
10 అనేక మంది నాకు వ్యతిరేకంగా గుసగుసలాడు కోవటం నేను వింటున్నాను.
ప్రతి చోటా నన్ను భయపెట్టే విషయాలు వింటున్నాను.
నా స్నేహితులు కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
నేనేదైనా తప్పు చేయాలని జనం కనిపెట్టుకుని వున్నారు.
“మనం అబద్ధమాడి అతడేదైనా తప్పు చేశాడని చెపుదాం!
లేదా యిర్మీయాను మనం మోసపుచ్చవచ్చు!
అప్పుడతనిని మనం ఎలాగో ఇరికించవచ్చు.
తద్వారా అతనిని మనం వదిలించుకోవచ్చు.
లేదా అప్పుడు మనం అతనిని పట్టుకొని మన కక్ష తీర్చుకోవచ్చు” నని వారంటున్నారు.
11 కాని యెహోవా నాతో వున్నాడు.
యెహోవా ఒక బలమైన సైనికునిలా వున్నాడు.
కావున నన్ను తరిమే వారంతా పడిపోతారు.
వారు నన్ను ఓడించలేరు.
వారి ప్రయత్నం వ్యర్థం.
వారు ఆశా భంగం చెందుతారు.
వారు అవమానం పాలవుతారు.
వారి అవమానాన్ని వారెన్నడు మరువలేరు.
12 సర్వశక్తి మంతుడవైన ఓ యెహోవా, నీవు మంచి వారిని పరీక్షిస్తావు.
మనిషి గుండెలోకి, మనస్సులోకి సూటిగా నీవు చూడగలవు.
ఆ ప్రజలకు వ్యతిరేకంగా నావాదాన్ని నేను నీకు విన్నవించాను
కావున నీవు వారికి తగిన శిక్ష విధించటం నన్ను చూడనిమ్ము.
13 యెహోవాను ఆరాధించుము! యెహోవాను స్తుతించుము!
యెహోవా పేద వారిని ఆదుకుంటాడు!
ఆయన వారిని దుర్మార్గుల బారి నుండి రక్షిస్తాడు!
యేసు మరలా వస్తాడు
3 ప్రియమైన సోదరులారా! ఇది నా రెండవ ఉత్తరం. కల్మషం లేని మీ హృదయాలను ఉత్తేజపరచాలని మీకీ రెండు ఉత్తరాలు వ్రాసాను. 2 పవిత్రులైన ప్రవక్తలు చాలాకాలం క్రిందటే చెప్పిన సందేశాలను మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు మీ అపొస్తలుల ద్వారా యిచ్చిన ఆజ్ఞను మీకు జ్ఞాపకం చెయ్యాలని నా ఉద్దేశ్యం.
3 చివరి రోజుల్లో కొందరు వ్యక్తులు వచ్చి తమ వాంఛల్ని తీర్చుకుంటూ మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. ఈ విషయాన్ని మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి: 4 “వస్తానని వాగ్దానం చేసాడే, ఎప్పుడు వస్తాడు? మా పూర్వికులు మరణించినప్పటి నుండే కాదు. ప్రపంచం సృష్టింపబడినప్పటి నుండీ అన్నీ సక్రమంగానే నడుస్తున్నాయి” అని వాళ్ళంటారు.
5 చాలా కాలం క్రితమే దేవుడు తన మాటతో ఆకాశాలను, భూమిని సృష్టించాడు. వాళ్ళు ఈ విషయాన్ని కావాలనే మరిచిపోతారు. ఈ భూమి నీళ్ళనుండి, నీళ్ళ ద్వారా సృష్టింపబడింది. 6 నీళ్ళ కారణంగా ప్రళయం వచ్చి ఆనాటి ప్రపంచం నాశనమై పోయింది. 7 దేవుడు ఆ మాటతోటే ఈనాటి ఆకాశాన్ని, భూమిని మంటలతో నాశనం చెయ్యటానికి దాచి ఉంచాడు. తీర్పుచెప్పే రోజుదాకా, అంటే దైవభక్తి లేనివాళ్ళను నాశనంచేసే రోజుదాకా దాచి ఉంచుతాడు.
© 1997 Bible League International