Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 86

దావీదు ప్రార్థన.

86 నేను నిరుపేదను, నిస్సహాయుణ్ణి.
    యెహోవా, దయతో నా మాట విని నా ప్రార్థనకు జవాబు ఇమ్ము.
యెహోవా, నేను నీ అనుచరుడను. దయతో నన్ను కాపాడు.
    నేను నీ సేవకుడను. నీవు నా దేవుడవు.
    నేను నిన్ను నమ్ముకొన్నాను. కనుక నన్ను రక్షించుము.
నా ప్రభువా, నా మీద దయ చూపించుము.
    రోజంతా నేను నీకు ప్రార్థన చేస్తున్నాను.
ప్రభువా, నా జీవితాన్ని నేను నీ చేతుల్లో పెడుతున్నాను.
    నన్ను సంతోషపెట్టుము, నేను నీ సేవకుడను.
ప్రభువా, నీవు మంచివాడవు, దయగలవాడవు.
    సహాయం కోసం నిన్ను వేడుకొనే నీ ప్రజలను నీవు నిజంగా ప్రేమిస్తావు.
యెహోవా, దయకోసం నేను మొరపెట్టుకునే
    నా ప్రార్థనలు ఆలకించుము.
యెహోవా, నా కష్టకాలంలో నేను నిన్ను ప్రార్థిస్తున్నాను.
    నీవు నాకు జవాబు యిస్తావని నాకు తెలుసు.
దేవా, నీవంటివారు మరొకరు లేరు.
    నీవు చేసిన వాటిని ఎవ్వరూ చేయలేరు.
ప్రభువా, నీవే అందరినీ సృష్టించావు.
    వారందరూ నిన్ను ఆరాధించెదరు గాక. వాళ్లంతా నీ నామాన్ని ఘనపరిచెదరు గాక.
10 దేవా, నీవు గొప్పవాడవు! నీవు అద్భుత కార్యాలు చేస్తావు.
    నీవు మాత్రమే దేవుడవు.
11 యెహోవా, నీ మార్గాలు నాకు నేర్పించు
    నేను నీ సత్యాలకు లోబడి జీవిస్తాను.
నిన్నారాధించుటయే నా జీవితంలోకెల్లా
    అతి ముఖ్యాంశంగా చేయుము.
12 దేవా, నా ప్రభువా, నేను నా పూర్ణ హృదయంతో నిన్ను స్తుతిస్తాను.
    నీ నామాన్ని నేను శాశ్వతంగా కీర్తిస్తాను.
13 దేవా, నా యెడల నీకు ఎంతో గొప్ప ప్రేమ ఉంది.
    మరణపు అగాథ స్థలం నుండి నీవు నన్ను రక్షిస్తావు.
14 దేవా, గర్విష్ఠులు నాపై పడుతున్నారు.
    కృ-రులైన మనుష్యుల గుంపు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు.
    ఆ మనుష్యులు నిన్ను గౌరవించటం లేదు.
15 ప్రభూ, నీవు దయ, కరుణగల దేవుడవు.
    నీవు సహనం, నమ్మకత్వం, ప్రేమతో నిండి ఉన్నావు.
16 దేవా, నీవు నా మాట వింటావని నా యెడల దయగా ఉంటావని చూపించుము.
    నాకు బలాన్ని అనుగ్రహించుము. నేను నీ సేవకుడను.
    నన్ను రక్షించుము. నేను నీ సేవకుడను.
17 దేవా, నీవు నాకు సహాయం చేస్తావని రుజువు చేయుటకు ఏదైనా చేయుము.
    అప్పుడు నా శత్రువులు నిరాశ చెందుతారు.
    ఎందుకంటే ప్రభూ, నీవు నా యెడల దయ చూపించావని, నాకు సహాయం చేశావని అది తెలియచేస్తుంది.

1 సమూయేలు 15:10-31

సమూయేలు సౌలుకు తన పాపం విషయం చెప్పుట

10 యెహోవా వాక్కు సమూయేలు దగ్గరకు వచ్చింది. 11 “సౌలు నన్ను అనుసరించటం మానేశాడు. కావున సౌలును రాజుగా చేసినందుకు బాధపడుతున్నాను. అతడు నా ఆజ్ఞలను శిరసావహించలేదు.” అని యెహోవా చెప్పాడు. ఇది విన్న సమూయేలు గాభరా పడిపోయాడు. రాత్రంతా దుఃఖంతో యెహోవాని ప్రార్థించాడు.

12 మరునాటి తెల్లవారుఝామున సమూయేలు లేచి సౌలును కలుసుకొనేందుకు వెళ్లాడు. కానీ అక్కడి ప్రజలు, “సౌలు కర్మెలుకు వెళ్లాడు. తన గౌరవార్థం అక్కడ ఒక జ్ఞాపక స్తంభం నిలబెట్టడానికి సౌలు వెళ్లాడు. తర్వాత సౌలు అనేక చోట్లకు ప్రయాణం చేసి, చివరికి గిల్గాలు వెళ్లాలని ఏర్పాటు చేసుకున్నాడు” అని చెప్పారు.

కనుక సౌలు ఉన్న చోటికే సమూయేలు వెళ్లాడు. సౌలు అమాలేకీయుల దగ్గర తీసుకున్నవాటిలో మొదటి భాగాన్ని అప్పుడే అర్పించాడు. సౌలు వాటిని దహనబలిగా యెహోవాకు అర్పిస్తున్నాడు. 13 సమూయేలు సౌలు దగ్గరకు వెళ్లాడు: “యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక! యెహోవా ఆజ్ఞలకు నేను విధేయుడనయ్యాను” అని సౌలు చెప్పాడు.

14 “ఆజ్ఞ నెరవేర్చితే మరి నేను వింటున్న గొర్రెల, పశువుల అరుపులు ఏమిటి” అని సమూయేలు ప్రశ్నించాడు.

15 సౌలు ఇలా జవాబు చెప్పాడు: “సైనికులు వాటిని అమాలేకీయులనుండి తీసుకున్నారు. నీ దేవుడైన యెహోవాకు దహనబలి చేయటానికి సైనికులు మంచి గొర్రెలను పశువులను కాపాడారు. కాని మిగిలిన వాటన్నిటినీ మేము చంపేశాము.”

16 సమూయేలు, “ఇంక మాట్లాడకు. రాత్రి యెహోవా నాకు ఏమి చెప్పాడో నీవు విను” అన్నాడు సౌలుతో.

సౌలు, “సరే నాకు చెప్పు” అన్నాడు.

17 సమూయేలు ఇలా చెప్పాడు: “గతంలో నీవు ప్రముఖుడవు కాదని తలచావు. కాని ఇశ్రాయేలు వంశాలన్నింటికీ నీవు నాయకుడవైనావు. ఇశ్రాయేలుకు రాజుగా యెహోవా నిన్ను ఎంపిక చేశాడు. 18 యెహోవా నిన్ను ఒక ప్రత్యేక పనిమీద పంపించాడు. ‘వెళ్లి ఆ దుర్మార్గపు అమాలేకీయులనందరినీ చంపివేయి. వాళ్లను పూర్తిగా నాశనం చేయి’ అని యెహోవా చెప్పాడు. 19 కానీ నీవు యెహోవా మాట వినలేదు. వాటిని నీకోసం అట్టే పెట్టుకోవాలను కున్నావు. కనుక ఏది చెడ్డదని యెహోవా చెప్పాడో అదే నీవు చేసావు.”

20 సౌలు, “నేనైతే యెహోవాకు విధేయుడనయ్యాను. యెహోవా పంపిన చోటికి నేను వెళ్లాను. అమాలేకీయులనందరినీ నేను నాశనం చేశాను. వారి రాజు అగగును మాత్రమే నేను తిరిగి తీసుకుని వచ్చాను. 21 సైనికులు మాత్రమే నీ దేవుడైన యెహోవాకు గిల్గాలువద్ద బలి అర్పించేందుకు శ్రేష్ఠమైన గొర్రెలను, పశువులను తీసుకుని వచ్చారు” అన్నాడు.

22 కానీ సమూయేలు, “యెహోవాకు ఎక్కువ ప్రీతి పాత్రమైనది ఏమిటి? దహనబలులు, బలులా? లేక యెహోవా ఆజ్ఞాపాలనయా? దేవునికి బలులు అర్పించటంకంటే, ఆయనకు విధేయుడై ఉండటం శ్రేష్ఠము. పొట్టేళ్ల కొవ్వును అర్పించేకంటే, దేవుని వాక్కు వినటం శ్రేష్ఠము. 23 అవిధేయుడవై ఉండట మంటే మంత్రం వేసే పాపం లాంటిదే. మొండి వైఖరితో నీకు తోచినదే చేయటం విగ్రహారాధనవంటి పాపమే. నీవు యెహోవా ఆజ్ఞను ధిక్కరించావు. ఈ కారణంగా ఇప్పుడు యెహోవా నిన్ను రాజుగా తిరస్కరిస్తున్నాడు.”

24 అప్పుడు సౌలు, “నేను పాపం చేశాను. నేను యెహోవా ఆజ్ఞలకు లోబడలేదు. నీవు చెప్పినట్లుగా నేను చేయలేదు. నేను ప్రజలకు భయపడ్డాను. వారు ఎలా చెప్పితే అలా చేశాను. 25 నా పాపం క్షమించుమని ఇప్పుడు నేను నిన్ను వేడుకుంటున్నాను. నేను యెహోవాని ఆరాధిస్తాను, నాతో కూడ రా” అని సమూయేలుతో చెప్పాడు.

26 కానీ సమూయేలు, “నేను నీతో మళ్లీ వెనుకకురాను. నీవు యెహోవా ఆజ్ఞ తిరస్కరించావు. ఇప్పుడు యెహోవా నిన్ను ఇశ్రాయేలు రాజుగా తిరస్కరిస్తున్నాడు” అని చెప్పాడు.

27 సమూయేలు వెళ్లిపోవటానికి తిరగగానే, సౌలు అతని అంగీ పట్టుకున్నాడు. అంగీ చిరిగిపోయింది. 28 సమూయేలు, “నీవు నా అంగీ చింపేసావు. అదే విధంగా ఈవేళ యెహోవా ఇశ్రాయేలు రాజ్యాన్ని నీనుంచి తీసేస్తాడు. నీ స్నేహితుల్లో ఒకరికి ఈ రాజ్యాన్ని యెహోవా ఇచ్చాడు. ఇతడు నీకంటే మంచివాడు. 29 యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు. యెహోవా శాశ్వతంగా జీవిస్తాడు. యెహోవా అబద్ధం చెప్పడు. తన మనస్సు మార్చుకోడు. అనుక్షణం మనస్సుమార్చుకునే మనిషిలాంటివాడు కాదు యెహోవా” అని సౌలుతో చెప్పాడు.

30 సౌలు సమాధానమిస్తూ, “సరే నేను పాపం చేశాను. కాని దయచేసి నాతోకూడ రా. కనీసం నాయకుల ఎదుట, ఇశ్రాయేలు ప్రజల ఎదుట నాకు కొంచెం మర్యాద చూపించు. దేవుడైన యెహోవాను నేను ఆరాధించటానికి నాతోకూడ తిరిగి రా” అన్నాడు. 31 కనుక సమూయేలు సౌలుతో కలిసి వెనుకకు వెళ్లాడు. సౌలు యెహోవాను ఆరాధించాడు.

అపొస్తలుల కార్యములు 5:1-11

అననీయ మరియు సప్పీరా

“అననీయ” అనబడే ఒక వ్యక్తి, అతని భార్య “సప్పీరా” కలిసి తమ భూమి అమ్మేసారు. “అననీయ” తన కొరకు కొంత డబ్బు దాచుకొన్నాడు. ఈ విషయం అతని భార్యకు తెలుసు. “అననీయ” మిగతా డబ్బు తెచ్చి అపొస్తలుల కాళ్ళ ముందుంచాడు.

అప్పుడు పేతురు ఈ విధంగా అన్నాడు: “అననీయా, నీ మనస్సులో సాతాను ఎందుకు చేరాడు? భూమి అమ్మగా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని దాచి పవిత్రాత్మను ఎందుకు మోసం చేసావు? అది అమ్మక ముందు కూడా నీదే కదా! అమ్మిన తర్వాత కూడా ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! ఇలా చెయ్యటానికి నీకెట్లా బుద్ధి పుట్టింది? నీవు మనుష్యులతో కాదు అబద్ధం ఆడింది, దేవునితో.”

ఈ మాటలు విని అననీయ క్రింద పడి ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటనని విన్నవాళ్ళందరికీ ఒక పెద్ద భయం పట్టుకుంది. కొందరు యువకులు ముందుకొచ్చి అననీయ దేహాన్ని ఒక వస్త్రంలో చుట్టి మోసుకెళ్ళి సమాధి చేసారు.

మూడు గంటల తర్వాత అననీయ భార్య అక్కడికి వచ్చింది. అక్కడ జరిగిందేదీ ఆమెకు తెలియదు. పేతురు, “మీరు భూమి అమ్మగా లభించిన డబ్బు యింతేనా? చెప్పు!” అని ఆమెను అడిగాడు.

“ఔను! అంతే డబ్బు లభించింది” అని ఆమె సమాధానం చెప్పింది.

పేతురు ఆమెతో, “నీవు, నీ భర్త కలిసి ప్రభువు ఆత్మను పరీక్షించాలని ఎందుకు నిశ్చయించుకున్నారు? ఆ తలుపు దగ్గరనుండి వస్తున్న అడుగుల చప్పుడు విను! అవి నీ భర్తను సమాధి చేసినవాళ్ళవి. వాళ్ళు నిన్ను కూడా మోసుకు వెళ్తారు” అని అన్నాడు. 10 తక్షణమే ఆమె అతని పాదాలముందు పడి ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత యువకులు లోపలికి వచ్చి ఆమె చనిపోయి ఉండటం చూసి ఆమెను కూడా మోసుకు వెళ్ళి ఆమె భర్త ప్రక్కన సమాధి చేసారు. 11 సంఘానికి, ఈ సంఘటనలు విన్నవాళ్ళకు పెద్ద భయం పట్టుకుంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International