Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 సమూయేలు 3:1-10

దేవుడు సమూయేలును పిలుచుట

ఆ రోజుల్లో యెహోవా ఎవరితోనూ ప్రత్యక్షంగా తరచు మాట్లాడేవాడు కాడు. స్వప్న దర్శనాలూ చాలా తక్కువే. ఏలీ పర్యవేక్షణలో బాలకుడైన సమూయేలు యెహోవా సేవలో ఉన్నాడు.

ఏలీ కళ్లు బలిహీనమై ఇంచుమించు గుడ్డివాడైపోయాడు. ఒకరోజు అతడు పడుకుని వున్నాడు. సమూయేలు యెహోవా పవిత్ర గుడారంలో పడుకున్నాడు. దేవుని పవిత్ర పెట్టె[a] కూడా గుడారంలోనే వుంది. గుడారంలో యెహోవా దీపం ఇంకా వెలుగుతూనే వుంది. యెహోవా సమూయేలును పిలిచాడు. “ఇక్కడే వున్నాను” అంటూ (ఏలీ తనను పిలిచాడని అనుకొని) సమూయేలు ఏలీ వద్దకు పరుగున పోయాడు. “మీరు పిలిచారుగా అందుకే, వచ్చాను” అన్నాడు.

“నేను నిన్ను పిలవలేదు. పోయి పడుకో” అన్నాడు ఏలీ.

సమూయేలు పోయి పడుకున్నాడు. దేవుడు మళ్లీ, “సమూయేలూ!” అని పిలిచాడు. సమూయేలు ఏలీ వద్దకు వెళ్లి, “నేనిక్కడే ఉన్నాను, నన్ను పిలిచారా?” అని అడిగాడు.

“నేను నిన్ను పిలవలేదు. పోయి పడుకో” అన్నాడు ఏలీ.

సమూయేలుకు ఇంకా యెహోవాతో అనుభవంలేదు. అతనితో యెహోవా ఇంతవరకూ ప్రత్యక్షంగా మాట్లాడి వుండలేదు.[b]

మూడవసారి యెహోవా సమూయేలును పిలిచాడు. సమూయేలు లేచి ఏలీ వద్దకు వెళ్లి, “నేను ఇక్కడే వున్నాను; నన్ను పిలిచారా?” అని అన్నాడు.

యెహోవా ఆ బాలుని పిలుస్తున్నాడని అప్పుడు ఏలీకి అర్థమయింది. ఏలీ సమూయేలుతో, “నీవు పోయి పడుకో. మళ్లీ ఎవరైనా నిన్ను పిలిస్తే ‘యెహోవా, సెలవియ్యండి! నేను తమ దాసుణ్ణి. నేను వింటున్నాను’” అని చెప్పమన్నాడు.

తరువాత సమూయేలు వెళ్లి పక్కమీద పడుకున్నాడు. 10 యెహోవా వచ్చి అక్కడ నిలిచాడు. “సమూయేలూ!, సమూయేలూ” అంటూ మునుపటిలా పిలిచాడు.

“చెప్పండి, నేను మీ దాసుడను. నేను వింటున్నాను” అన్నాడు సమూయేలు.

1 సమూయేలు 3:11-20

11 యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు: “చూడు, నేను ఇశ్రాయేలులో ఒక కార్యం నిర్వహించదలిచాను. దీనిని గురించి విన్న ప్రతి ఒక్కడూ ఆశ్చర్యపోతాడు.[a] 12 నేను ఏలీకి, అతని కుటుంబానికి ఏది చేస్తానని చెప్పివున్నానో అదంతా అప్పుడు చేస్తాను. మొదటినుంచి చివరి వరకు అంతా చేసి తీరుతాను. 13 తన వంశాన్ని శాశ్వతంగా శిక్షిస్తానని ఏలీతో చెప్పాను. అలా ఎందుకు చేయదలిచానంటే తన కుమారులు దైవదూషణ చేసినట్లు, అకృత్యాలకు పాల్పడినట్లు ఏలీకి తెలుసు. అయినా వారిని అదుపులో పెట్టలేక పోయాడు. 14 అందువల్ల ఏలీ వంశం ఎన్ని బలులు, ధాన్యార్పణలు సమర్పించినా వారి పాపాన్ని మాపుకో లేరని నిశ్చితంగా చెప్పి ఉన్నాను.”

15 తెల్లవారేవరకూ సమూయేలు పక్కమీదే ఉన్నాడు. ఆ తరువాత లేచి దేవాలయ ద్వారం తెరిచాడు. దర్శనం గూర్చి ఏలీతో చెప్పటానికి సమూయేలు భయపడ్డాడు

16 కాని ఏలీ, “కుమారుడా సమూయేలూ” అని పిలిచాడు.

“ఇక్కడే ఉన్నానయ్యా” అన్నాడు సమూయేలు.

17 “యెహోవా నీతో ఏమన్నాడు? నాతో ఏమీ దాచవద్దు. ఆయన నీకు చెప్పిన సమాచారంలో నీవు ఏమి దాచినా దేవుడు నిన్ను బాగా శిక్షిస్తాడు” అని అన్నాడు.

18 దానితో సమూయేలు ఉన్నది వున్నట్లు ఏలీకి ఏమీ దాచకుండా చెప్పాడు.

అది విన్న ఏలీ, “ఆయన యెహోవా. ఆయనకు ఏది మంచిదనిపిస్తే అది చేయనీ” అన్నాడు.

19 సమూయేలు పెరుగుతూ వుండగా యెహోవా అతనికి తోడై ఉండెను. యెహోవా సమూయేలుతో చెప్పిన వర్తమానాలను ఎన్నడూ అబద్ధం కానీయలేదు. 20 అందువల్ల దానునుండి, బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు దేశమంతా సమూయేలును యెహోవా యొక్క నిజమైన ప్రవక్తగా గుర్తించింది.

కీర్తనలు. 139:1-6

సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.

139 యెహోవా, నీవు నన్ను పరీక్షించావు.
    నన్ను గూర్చి నీకు అంతా తెలుసు.
నేను ఎప్పుడు కూర్చునేది ఎప్పుడు లేచేది నీకు తెలుసు.
    దూరంలో ఉన్నా, నా తలంపులు నీకు తెలుసు.
యెహోవా, నేను ఎక్కడికి వెళ్లుతున్నది, ఎప్పుడు పండుకొంటున్నది నీకు తెలుసు.
    నేను చేసే ప్రతీది నీకు తెలుసు.
యెహోవా, నా మాటలు నా నోటిని దాటక ముందే
    నేను ఏమి చెప్పాలనుకొన్నానో అది నీకు తెలుసు.
యెహోవా, నీవు నా ముందు, నా వెనుక, నా చుట్టూరా ఉన్నావు.
    నీవు నెమ్మదిగా నీ చేయి నామీద వేస్తావు.
నీకు తెలిసిన విషయాలను గూర్చి నాకు ఆశ్చర్యంగా ఉంది.
    గ్రహించటం నాకు కష్టతరం.

కీర్తనలు. 139:13-18

13 యెహోవా, నా శరీరమంతటినీ[a] నీవు చేశావు.
    నేను ఇంకా నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నీకు తెలుసు.
14 యెహోవా, నీవు నన్ను సృష్టించినప్పుడు నీవు చేసిన ఆశ్చర్యకరమైన కార్యాలు అన్నింటి కోసం నేను నీకు వందనాలు అర్పిస్తున్నాను.
    నీవు చేసే పనులు ఆశ్చర్యం, అది నాకు నిజంగా తెలుసు.
15 నన్ను గూర్చి నీకు పూర్తిగా తెలుసు. నా తల్లి గర్భంలో దాగి ఉండి,
    నా శరీరం రూపాన్ని దిద్దుకుంటున్నప్పుడు నా ఎముకలు పెరగటం నీవు గమనించావు.
16 యెహోవా, నా తల్లి గర్భంలో నా శరీరం పెరగటం నీవు చూశావు.
    ఈ విషయాలన్నీ నీ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ప్రతిరోజు నీవు నన్ను మరువక గమనించావు.
17 దేవా, నీ తలంపులు గ్రహించటం ఎంతో కష్టతరం.
    నీకు ఎంతో తెలుసు.
18 వాటిని లెక్కించగా అవి భూమి మీద ఉన్న యిసుక రేణువుల కంటే ఎక్కువగా ఉంటాయి.
    కాని నేను వాటిని లెక్కిం చటం ముగించిన తర్వాత కూడా యింకా నీతోనే ఉంటాను.

1 కొరింథీయులకు 6:12-20

లైంగిక అవినీతి

12 “ఏది చెయ్యటానికైనా నాకు అనుమతి ఉంది.” కాని వాటివల్ల లాభం కలుగదు. “ఏది చెయ్యటానికైనా నాకు అనుమతి ఉంది” కాని నేను దానికి బానిసను కాను, 13 “తిండి కడుపు కోసము, కడపు తిండి కోసం సృష్టింపబడినాయి.” కాని దేవుడు రెంటినీ నాశనం చేస్తాడు. దేహం ఉన్నది వ్యభిచారం చేయటానికి కాదు. అది ప్రభువు కోసం ఉంది. ప్రభువు దేహం కోసం ఉన్నాడు. 14 దేవుడు తన శక్తితో ప్రభువును బ్రతికించాడు. అదే విధంగా మనల్ని కూడా బ్రతికిస్తాడు. 15 మీ దేహాలు క్రీస్తుకు అవయవాలని మీకు తెలియదా? మరి అలాంటప్పుడు క్రీస్తు అవయవాల్ని, వేశ్య దేహంతో కలుపమంటారా? అసంభవము. 16 తన దేహాన్ని వేశ్య దేహంతో కలిపినవాడు ఆ దేహంతో ఒకటైపోతాడని మీకు తెలియదా? దీన్ని గురించి, “రెండు దేహాలు ఒక దేహంగా అవుతాయి”(A) అని లేఖనాల్లో వ్రాయబడి ఉంది. 17 కాని ప్రభువుతో ఐక్యమైన వాడు ఆయన ఆత్మతో ఐక్యమౌతాడు.

18 లైంగిక అవినీతికి దూరంగా ఉండండి, మనిషి చేసే మిగతా పాపాలు తన దేహానికి సంబంధించినవి కావు. కాని వ్యభిచారం చెయ్యటంవల్ల వ్యక్తి తన స్వంత దేహంపట్ల పాపం చేసినట్లౌతుంది. 19 మీ దేహం పరిశుద్ధాత్మకు మందిరమని మీకు తెలియదా? దేవుడు యిచ్చిన పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు. మీ దేహంపై మీకు హక్కులేదు. 20 మీ కోసం వెల చెల్లించబడింది. కనుక మీ దేహాల్ని దేవుని మహిమ కోసం ఉపయోగించండి.

యోహాను 1:43-51

43 మరుసటి రోజు యేసు గలిలయకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఫిలిప్పు దగ్గరకు వెళ్ళి అతనితో, “నన్ను అనుసరించు” అని అన్నాడు. 44 అంద్రెయ, పేతురులాగే, ఫిలిప్పు కూడా బేత్సయిదా గ్రామస్థుడు. 45 ఫిలిప్పు నతనయేలు కోసం వెతికి అతనితో, “మేము మోషే ధర్మశాస్త్రంలో ఎవర్ని గురించి వ్రాయబడివుందో ఆయన్ని కనుగొన్నాము. ప్రవక్తలు వ్రాసింది ఈయన్ని గురించే. ఈయన పేరు యేసు. ఈయన యోసేపు కుమారుడు. నజరేతు గ్రామస్థుడు” అని చెప్పాడు.

46 నతనయేలు, “నజరేతు గ్రామం నుండి మంచి జరగటం సంభవమా!” అని అడిగాడు.

“వచ్చి చూడు!” అని ఫిలిప్పు అన్నాడు.

47 నతనయేలు తన వైపు రావటం యేసు చూసాడు. అతణ్ణి గురించి, “అదిగో! నిజమైన ఇశ్రాయేలీయుడు! అతనిలో ఏ కపటమూ లేదు” అని అన్నాడు.

48 “మీకు నేనెలా తెలుసు?” అని నతనయేలు అడిగాడు.

యేసు, “ఫిలిప్పు నిన్ను పిలువక ముందే, నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూసాను” అని అన్నాడు.

49 నతనయేలు, “రబ్బీ! మీరు నిజముగా దేవుని కుమారుడు. ఇశ్రాయేలు జనాంగానికి ప్రభువు” అని అన్నాడు.

50 యేసు, “నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండటం చూసానని చెప్పినందుకు విశ్వసిస్తున్నావా? వీటికన్నా గొప్ప వాటిని చూస్తావు!” అని అన్నాడు. 51 ఆయన మళ్ళీ, “ఇది నిజం. ఆకాశం తెరచుకోవటం, దేవదూతలు మనుష్యకుమారుని యొద్దకు దిగటం, మరల ఎక్కిపోవటం చూస్తావు” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International