Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.
139 యెహోవా, నీవు నన్ను పరీక్షించావు.
నన్ను గూర్చి నీకు అంతా తెలుసు.
2 నేను ఎప్పుడు కూర్చునేది ఎప్పుడు లేచేది నీకు తెలుసు.
దూరంలో ఉన్నా, నా తలంపులు నీకు తెలుసు.
3 యెహోవా, నేను ఎక్కడికి వెళ్లుతున్నది, ఎప్పుడు పండుకొంటున్నది నీకు తెలుసు.
నేను చేసే ప్రతీది నీకు తెలుసు.
4 యెహోవా, నా మాటలు నా నోటిని దాటక ముందే
నేను ఏమి చెప్పాలనుకొన్నానో అది నీకు తెలుసు.
5 యెహోవా, నీవు నా ముందు, నా వెనుక, నా చుట్టూరా ఉన్నావు.
నీవు నెమ్మదిగా నీ చేయి నామీద వేస్తావు.
6 నీకు తెలిసిన విషయాలను గూర్చి నాకు ఆశ్చర్యంగా ఉంది.
గ్రహించటం నాకు కష్టతరం.
13 యెహోవా, నా శరీరమంతటినీ[a] నీవు చేశావు.
నేను ఇంకా నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నీకు తెలుసు.
14 యెహోవా, నీవు నన్ను సృష్టించినప్పుడు నీవు చేసిన ఆశ్చర్యకరమైన కార్యాలు అన్నింటి కోసం నేను నీకు వందనాలు అర్పిస్తున్నాను.
నీవు చేసే పనులు ఆశ్చర్యం, అది నాకు నిజంగా తెలుసు.
15 నన్ను గూర్చి నీకు పూర్తిగా తెలుసు. నా తల్లి గర్భంలో దాగి ఉండి,
నా శరీరం రూపాన్ని దిద్దుకుంటున్నప్పుడు నా ఎముకలు పెరగటం నీవు గమనించావు.
16 యెహోవా, నా తల్లి గర్భంలో నా శరీరం పెరగటం నీవు చూశావు.
ఈ విషయాలన్నీ నీ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ప్రతిరోజు నీవు నన్ను మరువక గమనించావు.
17 దేవా, నీ తలంపులు గ్రహించటం ఎంతో కష్టతరం.
నీకు ఎంతో తెలుసు.
18 వాటిని లెక్కించగా అవి భూమి మీద ఉన్న యిసుక రేణువుల కంటే ఎక్కువగా ఉంటాయి.
కాని నేను వాటిని లెక్కిం చటం ముగించిన తర్వాత కూడా యింకా నీతోనే ఉంటాను.
21 దేవుని అనుగ్రహం వల్ల హన్నాకు క్రమేపీ ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. బాలకుడైన సమూయేలు యెహోవా ఆలయములో దినదినము మంచి స్థితికి ఎదుగు చుండెను.
కుమారుల విషయంలో ఏలీ అసమర్థత
22 ఏలీ చాలా వృద్ధుడై పోయాడు. షిలోహుకు వచ్చే ఇశ్రాయేలీయులందరి యెడల తన కుమారులు చేస్తున్న పనులను గూర్చి అతడు నిరంతరం వింటూనే వున్నాడు. పైగా సన్నిధి గుడారపు ద్వారం వద్ద పరిచర్యలు చేసే స్త్రీలతో తన కుమారులు శయనిస్తున్నారని కూడా ఏలీ విన్నాడు.
23 ఏలీ తన కుమారులతో, “మీరు చేసిన చెడ్డ కార్యాలను గూర్చి ఇక్కడ ప్రజలు నాతో చెప్పారు. మీరెందుకు ఈ చెడ్డపనులు చేస్తున్నారు? 24 నా కుమారులారా, ఈ చెడ్డపనులు చేయకండి. యెహోవా ప్రజలు మీ గురించి చెడుగా చెప్పుకుంటున్నారు. 25 ఒక వ్యక్తి మరో వ్యక్తి పట్ల అపచారం చేస్తే, దేవుడు ఒక వేళ అతనికి సహాయం చేయవచ్చు. అయితే ఒక వ్యక్తి యెహోవా పట్ల అపచారం చేస్తే ఇక వానికి దిక్కెవరు?” అని అడిగాడు.
అయినా ఏలీ కుమారులు తండ్రి సలహాను లెక్కచేయలేదు; కాబట్టి యెహోవా ఏలీ కుమారులను చంపటానికి నిర్ణయించాడు.
పది మంది కన్యకల ఉపమానం
25 “దేవుని రాజ్యం ఇలా ఉంటుంది: పది మంది కన్యకలు తమ తమ దీపాలు తీసుకొని పెళ్ళి కుమారుణ్ణి కలవటానికి వెళ్ళారు. 2 వాళ్ళలో ఐదుగురు తెలివిలేని వాళ్ళు; ఐదుగురు తెలివిగల వాళ్ళు. 3 తెలివి లేని కన్యలు దీపాలు తీసుకెళ్ళారు కాని తమ వెంట నూనె తీసుకు వెళ్ళలేదు. 4 తెలివిగల కన్యలు తమ దీపాలతో పాటు పాత్రలో నూనె కూడా తీసుకు వెళ్ళారు. 5 పెళ్ళి కుమారుడు రావటం ఆలస్యం అయింది. అందరికి కునుకు వచ్చి నిద్దుర పొయ్యారు.
6 “అర్థరాత్రి వేళ, ‘అదిగో పెళ్ళి కుమారుడు! వచ్చి చూడండీ!’ అని ఎవరో బిగ్గరగా కేక వేసారు.
7 “వెంటనే ఆ కన్యకలందరూ లేచి తమ దీపాల్ని సరి చేసుకొన్నారు. 8 తెలివి లేని కన్యలు ‘మీ నూనె కొద్దిగా మాకివ్వండి; మా దీపాలలో నూనంతా అయిపోయింది!’ అని తెలివిగల కన్యల్ని అడిగారు.
9 “తెలివి గల కన్యలు, ‘ఈ నూనె మనకందరికి సరిపోదేమో! దుకాణానికి వెళ్ళి మీకోసం కొద్ది నూనె కొనుక్కురండి’ అని సమాధానం చెప్పారు.
10 “కాని వాళ్ళు నూనె కొనుక్కురావటానికి వెళ్ళినప్పుడు పెళ్ళి కుమారుడు వచ్చాడు. సిద్ధంగా ఉన్న కన్యలు పెళ్ళి విందుకు అతనితో కలసి లోపలికి వెళ్ళారు. ఆ తదుపరి తలుపు వేయబడింది.
11 “మిగతా కన్యలు వచ్చి, ‘అయ్యా! అయ్యా! తలుపు తెరవండి’ అని అడిగారు.
12 “కాని అతడు, ‘నేను నిజం చెబుతున్నాను; మీరెవరో నాకు తెలియదు’ అని సమాధానం చెప్పాడు.
13 “మీకు ఆ రోజు, ఆ ఘడియ ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక మెలకువతో ఉండండి.
© 1997 Bible League International