Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.
139 యెహోవా, నీవు నన్ను పరీక్షించావు.
నన్ను గూర్చి నీకు అంతా తెలుసు.
2 నేను ఎప్పుడు కూర్చునేది ఎప్పుడు లేచేది నీకు తెలుసు.
దూరంలో ఉన్నా, నా తలంపులు నీకు తెలుసు.
3 యెహోవా, నేను ఎక్కడికి వెళ్లుతున్నది, ఎప్పుడు పండుకొంటున్నది నీకు తెలుసు.
నేను చేసే ప్రతీది నీకు తెలుసు.
4 యెహోవా, నా మాటలు నా నోటిని దాటక ముందే
నేను ఏమి చెప్పాలనుకొన్నానో అది నీకు తెలుసు.
5 యెహోవా, నీవు నా ముందు, నా వెనుక, నా చుట్టూరా ఉన్నావు.
నీవు నెమ్మదిగా నీ చేయి నామీద వేస్తావు.
6 నీకు తెలిసిన విషయాలను గూర్చి నాకు ఆశ్చర్యంగా ఉంది.
గ్రహించటం నాకు కష్టతరం.
13 యెహోవా, నా శరీరమంతటినీ[a] నీవు చేశావు.
నేను ఇంకా నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నీకు తెలుసు.
14 యెహోవా, నీవు నన్ను సృష్టించినప్పుడు నీవు చేసిన ఆశ్చర్యకరమైన కార్యాలు అన్నింటి కోసం నేను నీకు వందనాలు అర్పిస్తున్నాను.
నీవు చేసే పనులు ఆశ్చర్యం, అది నాకు నిజంగా తెలుసు.
15 నన్ను గూర్చి నీకు పూర్తిగా తెలుసు. నా తల్లి గర్భంలో దాగి ఉండి,
నా శరీరం రూపాన్ని దిద్దుకుంటున్నప్పుడు నా ఎముకలు పెరగటం నీవు గమనించావు.
16 యెహోవా, నా తల్లి గర్భంలో నా శరీరం పెరగటం నీవు చూశావు.
ఈ విషయాలన్నీ నీ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ప్రతిరోజు నీవు నన్ను మరువక గమనించావు.
17 దేవా, నీ తలంపులు గ్రహించటం ఎంతో కష్టతరం.
నీకు ఎంతో తెలుసు.
18 వాటిని లెక్కించగా అవి భూమి మీద ఉన్న యిసుక రేణువుల కంటే ఎక్కువగా ఉంటాయి.
కాని నేను వాటిని లెక్కిం చటం ముగించిన తర్వాత కూడా యింకా నీతోనే ఉంటాను.
అవిధేయతవలన అపజయం
6 అప్పుడు యెహోషువ ప్రజలను ఇంటికి పొమ్మని చెప్పాడు. అందుచేత ప్రతి వంశంవారు నివసించుటకు వారికి యివ్వబడిన భూమిని తీసుకొనుటకు వెళ్లారు. 7 యెహోషువ బ్రతికి ఉన్నంతవరకు ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించారు. యెహోవాషువ మరణించిన తరువాత జీవించిన నాయకుల (పెద్దలు) జీవిత కాలంలో వారు యెహోవాను సేవించారు. ఇశ్రాయేలు ప్రజలకోసం యెహోవా చేసిన గొప్ప కార్యాలన్నింటినీ ఈ వృద్ధులు చూశారు. 8 నూను కుమారుడు, యెహోవా సేవకుడునగు యెహోవాషువ 110 సంవత్సరాల వయస్సులో మరణించాడు. 9 ఇశ్రాయేలు ప్రజలు, యెహోవాషువకు ఇవ్వబడిన స్థలంలో వారు అతనిని సమాధి చేసారు. అది ఎఫ్రాయిము కొండ దేశంలో గాయషు పర్వతానికి ఉత్తరాన తిమ్నాతుహెరెసు దగ్గర ఉంది.
10 ఆ తరం వారంతా చనిపోయాక తరువాత తరం పెరిగింది. యెహోవాను గూర్చిగాని, ఇశ్రాయేలీయులకు యెహోవా చేసిన వాటిని గూర్చిగాని ఈ కొత్త తరం వారికి తెలియదు. 11 అందుచేత ఇశ్రాయేలు ప్రజలు కీడు చేస్తూ తప్పుడు దేవత బయలును సేవించారు. ప్రజలు ఈ కీడు చేయటం యెహోవా చూశాడు. 12 ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టు నుండి యెహోవా బయటకు తీసుకుని వచ్చాడు. ఈ ప్రజల పూర్వీకులు యెహోవాను ఆరాధించారు. కాని ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను అనుసరించటం మానుకొన్నారు. ఇశ్రాయేలీయులు వారి చుట్టూరా నివసించిన ప్రజలయొక్క తప్పుడు దేవుళ్లను[a] పూజించటం మొదలు పెట్టారు. అది యెహోవాకు కోపం కలిగించింది. 13 ఇశ్రాయేలీయులు యెహోవాను అనుసరించటం మానివేసి బయలు, అష్తారోతులను పూజించటం మొదలు పెట్టారు.
14 ఇశ్రాయేలు ప్రజలమీద యెహోవాకు కోపం వచ్చింది. కనుక శత్రువులు ఇశ్రాయేలీయుల మీద దాడిచేసి వారి ఆస్తులను తీసుకునేట్టుగా యెహోవా చేశాడు. యెహోవా వారి చుట్టూరా ఉన్న వారి శత్రువుల ద్వారా వారు ఓడిపోయేట్టు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి శత్రువులనుండి వారిని వారు కాపాడుకోలేక పోయారు. 15 ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి బయటకు వెళ్లినప్పుడల్లా ఓడిపోయారు. యెహోవా వారి పక్షంగా లేని కారణంచేత వారు ఓడిపోయారు. ఇశ్రాయేలీయులు వారి చుట్టూరా నివసిస్తున్న ప్రజల దేవతలను సేవిస్తే, వారు ఓడిపోతారని యెహోవా ముందుగానే వారిని హెచ్చరించాడు. ఇశ్రాయేలు ప్రజలు చాలా శ్రమ అనుభవించారు.
పౌలు తనను సమర్థించుకోవటం
10 క్రీస్తులో ఉన్న సాత్వికం పేరిట, దయ పేరిట మిమ్మల్ని వేడుకొంటున్నాను. కొందరు నేను మీ సమక్షంలో ఉన్నప్పుడు నాలో ధైర్యం ఉండదని, మీకు దూరంగా ఉన్నప్పుడు నాలో ధైర్యముంటుందని అంటున్నారు. 2 నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు ధైర్యంగా మాట్లాడవలసిన అవసరం లేదు. మేము లౌకికంగా జీవిస్తున్నామని అనుకొనేవాళ్ళతో కూడా ధైర్యంగా మాట్లాడనవసరం లేదు. 3 మేము ఈ ప్రపంచంలో జీవిస్తున్నా, ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళు యుద్ధం చేసినట్లు మేము చెయ్యము. 4 మేము ఉపయోగించే ఆయుధాలు ఈ ప్రపంచంలోనివాళ్ళు ఉపయోగించేవి కావు. కాని శత్రువుల కోటలను పడగొట్టగల దైవికమైన శక్తి మా ఆయుధాల్లో ఉంది. 5 మేము దేవుని జ్ఞానాన్ని ఎదిరించే తర్కాలను, డాంబిక వాదాలను ఓడించి పడగొడతాము. ప్రతి భావాన్ని బంధించి అందరినీ క్రీస్తుకు విధేయులు అయ్యేటట్లు చేస్తాము. 6 మిమ్మల్నందర్నీ విధేయులుగా చేసాక అవిధేయతతో ఉన్న ప్రతి సంఘటనను శిక్షించటానికి సిద్ధంగా ఉంటాము.
7 మీరు పైకి కనిపించే వాటిని మాత్రమే చూస్తున్నారు. తాను క్రీస్తుకు చెందినవాణ్ణని విశ్వసించినవాడు, తాను ఏ విధంగా క్రీస్తుకు చెందాడో మేము అతనిలాగే క్రీస్తుకు చెందినవాళ్ళమని గమనించాలి. 8 మిమ్మల్ని నాశనం చెయ్యటానికి కాకుండా అభివృద్ధి పరచటానికి ప్రభువు మాకు అధికారమిచ్చాడు. దాన్ని గురించి నేను గొప్పలు చెప్పుకోవటానికి సిగ్గుపడను. 9 నా లేఖల ద్వారా మిమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నించటం లేదు. మీరు అలా అనుకోకండి. 10 ఎందుకంటే కొందరు, “అతని లేఖలు బలంగా, ముఖ్యమైనవిగా కనిపిస్తాయి. కాని మనిషిని ఎదురుగా ఉన్నప్పుడు చూస్తే బలహీనంగా ఉంటాడు. మాటలు నిస్సారంగా ఉంటాయి” అని అంటారు. 11 వాళ్ళు మేము దూరంగా వుండి లేఖల్లో వ్రాసిన విధంగా సమక్షంలో ఉన్నప్పుడు కూడా నడుచుకొంటామని గమనించాలి.
© 1997 Bible League International