Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 69:1-5

సంగీత నాయకునికి: “పుష్పాల రాగం.” దావీదు కీర్తన.

69 దేవా, నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించుము.
    నా నోటి వరకు నీళ్లు లేచాయి.
నిలబడి ఉండుటకు ఏదీ లేదు.
    నేను మునిగిపోతున్నాను. క్రింద బురదలోకి దిగజారిపోతున్నాను.
లోతైనజలాల్లో నేనున్నాను.
    అలలు నా చుట్టూ కొట్టుకొంటున్నాయి. నేను మునిగిపోబోతున్నాను.
సహాయం కోసం పిలిచి పిలిచి నేను బలహీనుడనౌతున్నాను.
    నా గొంతు నొప్పిగా ఉంది.
నా కళ్లకు నొప్పి కలిగినంతవరకు
    నేను నీ సహాయం కోసం కనిపెట్టి చూశాను.
నా తలపైగల వెంట్రుకల కంటె ఎక్కువ మంది శత్రువులు నాకున్నారు.
    ఏ కారణం లేకుండానే వారు నన్ను ద్వేషిస్తున్నారు.
    వారు నన్ను నాశనం చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
నా శత్రువులు నన్ను గూర్చి అబద్ధాలు చెబుతున్నారు.
    వారు అబద్ధమాడి నేను వస్తువులు దొంగిలించానని చెప్పారు.
    ఆ తరువాత నేను దొంగిలించని వాటికి నా చేత బలవంతంగా డబ్బు కట్టించారు.
దేవా, నేను ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు.
    నా పాపము నీ నుండి దాచి పెట్టబడలేదు.

కీర్తనలు. 69:30-36

30 దేవుని నామమును కీర్తనతో నేను స్తుతిస్తాను.
    కృతజ్ఞతా గీతంతో నేను ఆయన్ని స్తుతిస్తాను.
31 ఆబోతును వధించుట, జంతువునంతటిని బలి అర్పించుటకంటె ఇది ఉత్తమము.
    ఇది దేవుణ్ణి సంతోషింపజేస్తుంది.
32 పేద ప్రజలారా, మీరు దేవుని ఆరాధించుటకు వచ్చారు.
    పేద ప్రజలారా, ఈ సంగతులను తెలుసుకొనేందుకు మీరు సంతోషిస్తారు.
33 నిరుపేదల, నిస్సహాయ ప్రజల ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు.
    యెహోవా కారాగారంలో ఉన్న తన వారిని విసర్జించడు.
34 ఆకాశమా, భూమీ, సముద్రమా,
    దానిలోని సమస్తమా, యెహోవాను స్తుతించండి.
35 యెహోవా సీయోనును రక్షిస్తాడు.
    యూదా పట్టణాలను యెహోవా తిరిగి నిర్మిస్తాడు.
ఆ భూమి స్వంతదారులు మరల అక్కడ నివసిస్తారు.
36     ఆయన సేవకుల సంతతివారు ఆ దేశాన్ని పొందుతారు.
    ఆయన నామాన్ని ప్రేమించే ప్రజలు అక్కడ నివసిస్తారు.

యెషయా 41:14-20

14     ప్రశస్తమైన యూదా, భయపడకు. ప్రియమైన నా ఇశ్రాయేలు ప్రజలారా భయపడవద్దు.
నిజంగా నేను మీకు సహాయం చేస్తాను.”

సాక్షాత్తూ యెహోవాయే ఆ మాటలు చెప్పాడు.

“ఇశ్రాయేలు పరిశుద్ధుడు (దేవుడు),
    నిన్ను రక్షించేవాడు ఈ సంగతులు చెప్పాడు:
15 చూడు, నిన్ను నేను ఒక క్రొత్త నూర్పిడి చెక్కగా చేశాను. ఈ పనిముట్టుకు పదునైన పండ్లు చాలా ఉన్నాయి.
    ధాన్యపు గింజల గుల్లలు పగులగొట్టుటకు రైతులు దీనిని ఉపయోగిస్తారు.
    నీవు పర్వతాలను అణగ దొక్కి, చితుక గొడ్తావు. కొండలను నీవు పొట్టులా చేస్తావు.
16 వాటిని గాలిలో విసిరివేస్తావు.
    గాలి దానిని విసరి, చెదరగొడ్తుంది.
అప్పుడు నీవు యెహోవాయందు సంతోషంగా ఉంటావు.
    ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని (దేవుని) గూర్చి నీవు ఎంతగానో అతిశయిస్తావు.

17 “పేదలు, అక్కరలో ఉన్నవారు నీళ్లకోసం వెదకుతారు.
    కానీ వారికి ఏమీ దొరకవు.
    వారు దాహంతో ఉన్నారు. వారి నాలుకలు పిడచకట్టాయి.
నేను వారి ప్రార్థనలకు జవాబిస్తాను.
    నేను వాళ్లను విడువను, చావనివ్వను.
18 ఎండిపోయిన కొండల మీద నేను నదులను ప్రవహింపజేస్తాను.
    లోయలో నీటి ఊటలను నేను ప్రవహింపజేస్తాను.
అరణ్యాన్ని నీటి సరసుగా నేను చేస్తాను.
    ఎండిన భూములలో నీటి బుగ్గలు ఉబుకుతాయి.
19 అరణ్యంలో వృక్షాలు పెరుగుతాయి.
    దేవదారు వృక్షాలు, తుమ్మ చెట్లు గొంజి చెట్లు, తైలవృక్షాలు తమాల వృక్షాలు, సరళ వృక్షాలు అక్కడ ఉంటాయి.
20 ఈ సంగతులు జరగడం ప్రజలు చూస్తారు. యెహోవా శక్తిచేత ఇవి జరిగాయని వారు తెలుసుకొంటారు.
    ప్రజలు ఈ సంగతులు చూస్తారు.
వారు గ్రహించటం మొదలుబెడతారు.
    ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు (దేవుడు)
    ఈ సంగతులను చేసినట్టు వారు తెలుసుకొంటారు.”

యోహాను 1:29-34

దేవుని గొఱ్ఱె పిల్ల

29 మరుసటి రోజు యోహాను యేసు తన వైపురావటం చూసి, “అదిగో! దేవుని గొఱ్ఱెపిల్ల! ఆయన ప్రజల పాపాలను తన మీద వేసుకొంటాడు. 30 నేను యిదివరలో, ‘నా తర్వాత రానున్న వాడొకడున్నాడు. ఆయన నాకన్నా ముందు నుండి ఉన్నవాడు. అందువలన ఆయన నాకన్నా గొప్పవాడు’ అని నేను చెప్పింది ఈయన్ని గురించే! 31 అప్పుడాయన ఎవరో నాక్కూడా తెలియదు. కాని, ఆయన్ని ఇశ్రాయేలు ప్రజలకు తెలియ చేయటానికి బాప్తిస్మము నిస్తూ వచ్చాను” అని అన్నాడు.

32 ఆ తర్వాత యోహాను మళ్ళీ ఈ విధంగా చెప్పాడు: “ఆకాశం నుండి పవిత్రాత్మ ఒక పావురంలా వచ్చి ఆయనపై వాలటం చూసాను. 33 బాప్తిస్మము నివ్వటానికి దేవుడు నన్ను పంపాడు. ‘పవిత్రాత్మ క్రిందికి వచ్చి ఎవరి మీద వ్రాలుతాడో ఆ వ్యక్తి పవిత్రాత్మ ద్వారా బాప్తిస్మము యిస్తాడు’ అని దేవుడు నాకు ముందే చెప్పక పోయివుంటే ఆయనెవరో నాకు తెలిసేది కాదు. 34 నేను ఈ సంఘటనను చూసాను. ఈయన దేవుని కుమారుడని సాక్ష్యం చెబుతున్నాను.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International