Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 69:1-5

సంగీత నాయకునికి: “పుష్పాల రాగం.” దావీదు కీర్తన.

69 దేవా, నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించుము.
    నా నోటి వరకు నీళ్లు లేచాయి.
నిలబడి ఉండుటకు ఏదీ లేదు.
    నేను మునిగిపోతున్నాను. క్రింద బురదలోకి దిగజారిపోతున్నాను.
లోతైనజలాల్లో నేనున్నాను.
    అలలు నా చుట్టూ కొట్టుకొంటున్నాయి. నేను మునిగిపోబోతున్నాను.
సహాయం కోసం పిలిచి పిలిచి నేను బలహీనుడనౌతున్నాను.
    నా గొంతు నొప్పిగా ఉంది.
నా కళ్లకు నొప్పి కలిగినంతవరకు
    నేను నీ సహాయం కోసం కనిపెట్టి చూశాను.
నా తలపైగల వెంట్రుకల కంటె ఎక్కువ మంది శత్రువులు నాకున్నారు.
    ఏ కారణం లేకుండానే వారు నన్ను ద్వేషిస్తున్నారు.
    వారు నన్ను నాశనం చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
నా శత్రువులు నన్ను గూర్చి అబద్ధాలు చెబుతున్నారు.
    వారు అబద్ధమాడి నేను వస్తువులు దొంగిలించానని చెప్పారు.
    ఆ తరువాత నేను దొంగిలించని వాటికి నా చేత బలవంతంగా డబ్బు కట్టించారు.
దేవా, నేను ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు.
    నా పాపము నీ నుండి దాచి పెట్టబడలేదు.

కీర్తనలు. 69:30-36

30 దేవుని నామమును కీర్తనతో నేను స్తుతిస్తాను.
    కృతజ్ఞతా గీతంతో నేను ఆయన్ని స్తుతిస్తాను.
31 ఆబోతును వధించుట, జంతువునంతటిని బలి అర్పించుటకంటె ఇది ఉత్తమము.
    ఇది దేవుణ్ణి సంతోషింపజేస్తుంది.
32 పేద ప్రజలారా, మీరు దేవుని ఆరాధించుటకు వచ్చారు.
    పేద ప్రజలారా, ఈ సంగతులను తెలుసుకొనేందుకు మీరు సంతోషిస్తారు.
33 నిరుపేదల, నిస్సహాయ ప్రజల ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు.
    యెహోవా కారాగారంలో ఉన్న తన వారిని విసర్జించడు.
34 ఆకాశమా, భూమీ, సముద్రమా,
    దానిలోని సమస్తమా, యెహోవాను స్తుతించండి.
35 యెహోవా సీయోనును రక్షిస్తాడు.
    యూదా పట్టణాలను యెహోవా తిరిగి నిర్మిస్తాడు.
ఆ భూమి స్వంతదారులు మరల అక్కడ నివసిస్తారు.
36     ఆయన సేవకుల సంతతివారు ఆ దేశాన్ని పొందుతారు.
    ఆయన నామాన్ని ప్రేమించే ప్రజలు అక్కడ నివసిస్తారు.

నిర్గమకాండము 30:22-38

అభిషేక తైలం

22 అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 23 “శ్రేష్ఠమైన సుగంధద్రవ్యాలు సంపాదించు. పరిమళ ధూపం చేయడానికి 500 తులాల స్వచ్ఛమైన గోపరసం, 250 తులాల సువాసనగల లవంగపట్ట, 500 తులాల సుగంధ ద్రవ్యాలు, 24 500 తులాల లవంగపట్ట తీసుకో. వీటన్నింటినీ కొలిచేందుకు అధికారిక కొలత ఉపయోగించు. మరియు మూడు పళ్ల ఒలీవ నూనె తీసుకో.

25 “ఒక పరిమళ అభిషేక తైలంగా చేయటానికి వీటన్నింటినీ కలపాలి. 26 సన్నిధి గుడారం మీద, ఒడంబడిక పెట్టె మీద ఈ తైలం పోయి, వీటికి ఒక ప్రత్యేక ఉద్దేశం వుంది అని ఇది తెలియజేస్తుంది. 27 బల్లమీద, దానిమీద ఉన్న పాత్రలన్నింటిమీద తైలం పోయి. దీపం మీద, దాని పరికరాలన్నింటి మీద ఈ తైలం పోయి. ధూపవేదిక మీద తైలం పోయి. 28 ఇంకా దేవునికి అర్పణలు దహనం చేసే బలిపీఠం మీద ఈ తైలం పోయి. ఆ బలిపీఠం పైన ఉండే సమస్తం మీద ఈ తైలం పోయి. గంగాళంమీద, దాని పీటమీద ఈ తైలం పోయి. 29 వీటన్నింటినీ నీవు పవిత్రం చేయాలి. అవి యెహోవాకు చాల ప్రత్యేకం. వీటిని ఏది తాకినా అది పవిత్రం అవుతుంది.

30 “అహరోను, అతని కుమారుల మీద ఈ తైలంపోయి. వారు ఒక ప్రత్యేక విధానంలో నన్ను సేవిస్తున్నారని ఇది తెలియజేస్తుంది. అప్పుడు యాజకులుగా వారు నా సేవ చేయవచ్చు. 31 అభిషేక తైలం ఎల్లప్పుడు నాకు ప్రత్యేకమైనదిగా ఉంటుందని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు. 32 సామాన్యమైన సుగంధ తైలంగా ఎవరూ దీనిని వాడకూడదు. ఈ ప్రత్యేక తైలం తయారు చేసిన విధానంలో సుగంధ తైలం తయారు చేయకూడదు. ఈ తైలం పవిత్రం, ఇది మీకు చాల ప్రత్యేకమైనదిగా ఉండాలి. 33 ఎవరైనా ఈ పవిత్ర తైలం వలె సుగంధ తైలం తయారు చేసి అన్యునికి యిస్తే, ఆ వ్యక్తి తన ప్రజల్లో నుండి వేరు చేయబడాలి.”

ధూపం

34 అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు, “ఈ పరిమళ ద్రవ్యాలను తీసుకురా! జటామాంసి, గోపి చందనం, గంధపుచెక్క స్వచ్ఛమైన సాంబ్రాణి. ఈ పరిమళ ద్రవ్యాలన్నీ సమపాళ్లలో ఉండేటట్టు తప్పక చూడాలి. 35 సుగంధ పరిమళ ధూపంగా ఉండేటట్టు ఈ పరిమళ ద్రవ్యాలన్నిటినీ కలపాలి. పరిమళ తైలం తయారుచేసే వాడు చేసినట్టే దీనిని చేయాలి. మరియు ఈ ధూపంలో ఉప్పు కలుపు. అది దీనిని స్వచ్ఛమైనదిగా, ప్రత్యేకమైనదిగా చేస్తుంది. 36 ధూప ద్రవ్యంలో కొంత మెత్తటి పొడుం అయ్యేంత వరకు నూరాలి. సన్నిధి గుడారంలో, ఒడంబడిక పెట్టె ఎదుట ఆ పొడుం ఉంచు. ఇది నేను నిన్ను కలుసుకొనే చోటు. ఈ ధూపపు పొడుంను దాని ప్రత్యేక పని కోసమే నీవు ఉపయోగించాలి. 37 యెహోవా కోసం ఈ ప్రత్యేక విధానంలో మాత్రమే నీవు ఈ ధూపాన్ని ఉపయోగించాలి. ఈ ధూపాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో నీవు తయారు చేయాలి. ఇంక ఏ యితరమైన ధూపం చేయడానికి కూడ ఈ ప్రత్యేక పద్ధతిని వినియోగించవద్దు. 38 ఒక వ్యక్తి, తన కోసం ఈ ధూపం కొంత తయారు చేసి, దాని పరిమళాన్ని అనుభవించాలని కోరవచ్చు. అయితే, అతడు గనుక అలా చేస్తే, వాడు తన ప్రజల నుండి వేరు చేయబడాలి.”

అపొస్తలుల కార్యములు 22:2-16

అతడు హెబ్రీ భాషలో మాట్లాడటం విని వాళ్ళు మరింత నిశ్శబ్దం వహించారు.

పౌలు ఈ విధంగా చెప్పుకొంటూ పొయ్యాడు: “నేను యూదుణ్ణి, కిలికియ దేశంలోని తార్సు అనే పట్టణంలో జన్మించాను. ఈ పట్టణంలో పెరిగాను. మన పూర్వులు అప్పగించిన ధర్మశాస్త్రంలో గమలీయేలు వద్ద సంపూర్ణంగా శిక్షణ పొందాను. మీరు ఈనాడు దేవుని పట్ల ఏ పద్ధతిననుసరించి మీ భక్తిని ప్రదర్శిస్తున్నారో అదే పద్ధతిలో నేనూ ప్రదర్శిస్తూ ఉండేవాణ్ణి. నేను యేసు మార్గాన్ని అనుసరించినవాళ్ళను ఎన్నో హింసలు పెట్టాను. తద్వారా కొందరికి మరణం కూడా సంభవించింది. ఆడా, మగా అనే భేదం లేకుండా అందర్ని బంధించి కారాగారంలో వేసేవాణ్ణి.

“ప్రధానయాజకుడు, మహాసభకు చెందిన పెద్దలు దీనికి సాక్ష్యం. వాళ్ళను, డెమాస్కసులోని వాళ్ళ సోదరులకు ఉత్తరాలు వ్రాసి ఇవ్వమని అడిగి తీసుకొన్నాను. అక్కడికి వెళ్ళి యేసు మార్గాన్ని అనుసరిస్తున్నవాళ్ళను బంధించి యెరూషలేమునకు పట్టుకు వచ్చి వాళ్ళకు శిక్ష ఇవ్వాలనేదే నా ఉద్దేశ్యం.

పౌలు తన మార్పునుగూర్చి చెప్పటం

“నేను డెమాస్కసుకు వెళ్తూ, ఆ పట్టణపు పొలిమేరలకు చేరగానే అకస్మాత్తుగా ఆకాశంనుండి తేజోవంతమైన వెలుగు నా చుట్టూ ప్రకాశించింది. అప్పుడు మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలు. నేను నేలకూలిపొయ్యాను. నాతో ఒక స్వరం, ‘సౌలా! సౌలా! నన్నెందుకు హింసిస్తున్నావు!’ అని అడిగింది.

“‘మీరెవరు ప్రభూ!’ అని నేనడిగాను. ‘నేను నజరేతుకు చెందిన యేసును. నీవు హింసిస్తున్నది నన్నే!’ అని ఆ స్వరం జవాబు చెప్పింది. నాతో ఉన్నవాళ్ళు ఆ వెలుగును చూసారు. కాని ఆ స్వరం ఏం మాట్లాడుతోందో వాళ్ళకు అర్థం కాలేదు.

10 “‘నన్నేం చేయమంటారు ప్రభూ!’ అని నేనడిగాను. ‘లేచి డెమాస్కసుకు వెళ్ళు. అక్కడికి వెళ్ళాక నీవు చేయవలసిన పనులు చెప్పబడతాయి’ అని ప్రభువు అన్నాడు. 11 ఆ వెలుగు నన్ను గ్రుడ్డివానిగా చెయ్యటం వల్ల నాతో ఉన్నవాళ్ళు నన్ను నా చేయి పట్టుకొని డెమాస్కసుకు నడిపించుకు వెళ్ళారు.

12 “అననీయ అనే పేరుగల వ్యక్తి నన్ను చూడటానికి వచ్చాడు. అతడు మోషే ధర్మశాస్త్రాన్ని శ్రద్ధతో పాటించే విశ్వాసి. అక్కడ నివసిస్తున్న యూదులందరు అతణ్ణి గౌరవించేవాళ్ళు. అననీయ నా ప్రక్కన నిల్చొని 13 ‘సౌలా! నా సోదరా! నీకు దృష్టి కలుగుగాక!’ అని అన్నాడు. తక్షణం నేను చూడగలిగాను.

14 “ఆ తదుపరి అతడు, ‘మన పూర్వికులు పూజించిన దేవుడు, తాను చేయదలచిన విషయం తెలుపటానికి, నీతిమంతుడైనటువంటి తన సేవకుణ్ణి చూడటానికి, ఆయన నోటిమాటలు వినటానికి నిన్ను ఎన్నుకొన్నాడు. 15 నీవు చూసినవాటిని గురించి, విన్నవాటిని గురించి ఆయన పక్షాన అందరి ముందు సాక్ష్యం చెబుతావు. 16 ఇంకా ఎందుకు చూస్తున్నావు? లే! బాప్తిస్మము పొందు. ఆయన పేరున ప్రార్థించి నీ పాపాలు కడుక్కో!’ అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International