Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: “పుష్పాల రాగం.” దావీదు కీర్తన.
69 దేవా, నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించుము.
నా నోటి వరకు నీళ్లు లేచాయి.
2 నిలబడి ఉండుటకు ఏదీ లేదు.
నేను మునిగిపోతున్నాను. క్రింద బురదలోకి దిగజారిపోతున్నాను.
లోతైనజలాల్లో నేనున్నాను.
అలలు నా చుట్టూ కొట్టుకొంటున్నాయి. నేను మునిగిపోబోతున్నాను.
3 సహాయం కోసం పిలిచి పిలిచి నేను బలహీనుడనౌతున్నాను.
నా గొంతు నొప్పిగా ఉంది.
నా కళ్లకు నొప్పి కలిగినంతవరకు
నేను నీ సహాయం కోసం కనిపెట్టి చూశాను.
4 నా తలపైగల వెంట్రుకల కంటె ఎక్కువ మంది శత్రువులు నాకున్నారు.
ఏ కారణం లేకుండానే వారు నన్ను ద్వేషిస్తున్నారు.
వారు నన్ను నాశనం చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
నా శత్రువులు నన్ను గూర్చి అబద్ధాలు చెబుతున్నారు.
వారు అబద్ధమాడి నేను వస్తువులు దొంగిలించానని చెప్పారు.
ఆ తరువాత నేను దొంగిలించని వాటికి నా చేత బలవంతంగా డబ్బు కట్టించారు.
5 దేవా, నేను ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు.
నా పాపము నీ నుండి దాచి పెట్టబడలేదు.
30 దేవుని నామమును కీర్తనతో నేను స్తుతిస్తాను.
కృతజ్ఞతా గీతంతో నేను ఆయన్ని స్తుతిస్తాను.
31 ఆబోతును వధించుట, జంతువునంతటిని బలి అర్పించుటకంటె ఇది ఉత్తమము.
ఇది దేవుణ్ణి సంతోషింపజేస్తుంది.
32 పేద ప్రజలారా, మీరు దేవుని ఆరాధించుటకు వచ్చారు.
పేద ప్రజలారా, ఈ సంగతులను తెలుసుకొనేందుకు మీరు సంతోషిస్తారు.
33 నిరుపేదల, నిస్సహాయ ప్రజల ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు.
యెహోవా కారాగారంలో ఉన్న తన వారిని విసర్జించడు.
34 ఆకాశమా, భూమీ, సముద్రమా,
దానిలోని సమస్తమా, యెహోవాను స్తుతించండి.
35 యెహోవా సీయోనును రక్షిస్తాడు.
యూదా పట్టణాలను యెహోవా తిరిగి నిర్మిస్తాడు.
ఆ భూమి స్వంతదారులు మరల అక్కడ నివసిస్తారు.
36 ఆయన సేవకుల సంతతివారు ఆ దేశాన్ని పొందుతారు.
ఆయన నామాన్ని ప్రేమించే ప్రజలు అక్కడ నివసిస్తారు.
సున్నతి ఒడంబడికకు గురుతు
17 అబ్రాముకు 99 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడి యిలా చెప్పాడు: “నేను సర్వశక్తిమంతుడైన దేవుడిని. నా కోసం ఈ పనులు చేయి. నాకు విధేయుడవై, సరైన జీవితం జీవించు. 2 ఇలా గనుక నీవు చేస్తే, మన ఇద్దరి మధ్య ఒక ఒడంబడికను నేను తయారు చేస్తాను. నిన్ను బాగా అభివృద్ధి చేస్తాను.”
3 అప్పుడు దేవునియెదుట అబ్రాము సాష్టాంగ పడ్డాడు. అతనితో దేవుడు అన్నాడు. 4 “మన ఒడంబడికలో నా భాగం ఇది. అనేక జనములకు నిన్ను తండ్రిగా నేను చేస్తాను. 5 నీ పేరు నేను మార్చేస్తాను. నీ పేరు అబ్రాము కాదు, నీ పేరు అబ్రాహాము. అనేక జనాంగములకు నీవు తండ్రివి అవుతావు గనుక, నీకు నేను ఈ పేరు పెడుతున్నాను. 6 నీకు నేను పెద్ద సంతానాన్ని ఇస్తాను. నీనుండి క్రొత్త జనాంగాలు ఉద్భవిస్తాయి. నీనుండి క్రొత్త రాజులు వస్తారు. 7 నీకు, నాకు మధ్య ఒక ఒడంబడికను నేను ఏర్పాటు చేస్తాను. నీ సంతానానికి ఈ ఒడంబడిక వర్తిస్తుంది. నేను నీకు దేవునిగా ఉంటాను. నీ సంతానానికి దేవునిగా ఉంటాను. 8 నీవు పరాయివాడిగా నివసిస్తున్న ఈ దేశాన్ని, అంటే కనాను దేశాన్ని నీకును, నీ సంతానపు వారందిరికిని శాశ్వతపు హక్కుగా ఇస్తాను. నేను మీకు దేవునిగా ఉంటాను.”
9 అబ్రాహాముతో దేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “ఇక, ఒడంబడికలో నీ భాగం యిది. ఒడంబడికను నీవు నిలబెట్టాలి. నీవూ, నీ సంతానమంతా నా ఒడంబడికకు విధేయులు కావాలి. 10 మీరు విధేయులు కావాల్సిన ఒడంబడిక ఇదే. ఇది మీకు, నాకు మధ్య ఒడంబడిక. ఇది నీ సంతానము వారి కోసమూను; పుట్టిన ప్రతి పిల్లవాడికి తప్పక సున్నతి చెయ్యాలి. 11 నీకు, నాకు మధ్యగల ఒడంబడికను నీవు అనుసరిస్తావని తెలియచేసేందుకు నీవు నీ మర్మాంగపు ముందు చర్మాన్ని కోయాలి. 12 నీ జనములో పుట్టిన ప్రతి బాలుడు, నీ జనమునుండి కాక, ఇతర జనములనుండి డబ్బుతో బానిసగా కొనబడిన వారిలో ప్రతి పురుషుడు సున్నతి చేయించుకొనవలెను. 13 కనుక నీ జాతి అంతటిలో ప్రతి పిల్లవానికి సున్నతి జరుగుతుంది. నీ వంశంలో పుట్టిన ప్రతి పిల్లవాడికి, లేక బానిసగా కొనబడిన పిల్లవాడికి సున్నతి జరుగుతుంది.
అబ్రాహాము యొక్క విశ్వాసం
4 అబ్రాహాము మన మూలపురుషుడు. అతడు ఈ విషయంలో ఏమి నేర్చుకొన్నాడు! 2 అబ్రాహాము చేసిన కార్యాలవలన అతడు నీతిమంతునిగా పరిగణింపబడి ఉంటే అతడు గర్వించటానికి కారణం ఉండేది. కాని దేవుని యెదుట కాదు 3 ఈ విషయాన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “అబ్రాహాము దేవుణ్ణి విశ్వసించాడు కనుక దేవుడు అతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు.”(A)
4 పనిచేసేవానికి కూలి దొరుకుతుంది. అది అతని హక్కు. ఆ వచ్చిన జీతం బహుమానం కాదు. 5 దుర్మార్గుల్ని నీతిమంతులుగా చెయ్యగల దేవుడు, వాళ్ళు కార్యాలు చెయ్యకపోయినా వాళ్ళు తనను విశ్వసిస్తే, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళను నీతిమంతులుగా పరిగణిస్తాడు. 6 క్రియలు చేయకున్నా దేవునిచే నీతిమంతునిగా పరిగణింపబడిన మానవుడు ధన్యుడు. ఈ విషయాన్ని గురించి దావీదు ఈ విధంగా అన్నాడు:
7 “దేవుడు ఎవరి తప్పుల్ని,
పాపాల్ని క్షమిస్తాడో వాళ్ళు ధన్యులు.
8 ఎవరి పాపాల్ని ప్రభువు వాళ్ళ లెక్కలో
వెయ్యడో వాళ్ళు ధన్యులు.”(B)
9 మరి, సున్నతి చేయించుకొన్నవాళ్ళు మాత్రమే ధన్యులా లేక సున్నతి చేయించుకోనివాళ్ళు కూడా ధన్యులా? అబ్రాహాములో విశ్వాసం ఉండటం వల్ల దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడని మనమంటూ వచ్చాము. 10 దేవుడు అతణ్ణి నీతిమంతునిగా ఎప్పుడు అన్నాడు? సున్నతి చేయించుకొన్న పిదపనా లేక ముందా? సున్నతి చేయించుకున్న పిదప కాదు, ముందే. 11 అబ్రాహాము సున్నతి చేయించుకోకముందు అతనిలో విశ్వాసముండటం వల్ల దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు. దీనికి చిహ్నంగా అబ్రాహాము సున్నతిని ఒక ముద్రగా పొందాడు. తద్వారా సున్నతి పొందకున్నా, విశ్వాసం ఉన్నవాళ్ళకు అతడు తండ్రి అయ్యాడు. వీళ్ళను నీతిమంతులుగా పరిగణించాలని దేవుని ఉద్దేశం. 12 అబ్రాహాము సున్నతి చేయించుకొన్నవాళ్ళకు కూడా తండ్రి. అంటే అందరికి కాదు. మన తండ్రి అబ్రాహాము సున్నతి చేయించుకోకముందు నుండి అతనిలో ఉన్న విశ్వాసాన్ని తమలో చూపిన వాళ్ళకు మాత్రమే అతడు తండ్రి.
© 1997 Bible League International