Revised Common Lectionary (Complementary)
ప్రపంచ ప్రారంభం
1 మొట్ట మొదట దేవుడు ఆకాశాన్ని భూమిని చేశాడు. 2 భూమి మొత్తం శూన్యంగా ఉండెను. భూమిమీద ఏమీ ఉండలేదు. మహా సముద్రాన్ని చీకటి ఆవరించి ఉండెను. దేవుని ఆత్మ నీళ్లమీద సంచరిస్తూ ఉండెను.
మొదటి రోజు-వెలుగు
3 అప్పుడు దేవుడు, “వెలుగు కలుగును గాక!” అన్నాడు. వెలుగు ప్రకాశించటం మొదలయింది. 4 దేవుడు ఆ వెలుగును చూశాడు. ఆయనకు అది చక్కగా కనబడింది. అప్పుడు దేవుడు ఆ వెలుగును చీకటి నుండి వేరు చేశాడు. 5 వెలుగుకు “పగలు” అని, చీకటికి “రాత్రి” అని దేవుడు పేరు పెట్టాడు.
అస్తమయము అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది మొదటి రోజు.
దావీదు కీర్తన.
29 దేవుని కుమారులారా, యెహోవాను స్తుతించండి.
ఆయన మహిమ ప్రభావాలను స్తుతించండి.
2 యెహోవాను స్తుతించండి, ఆయన నామాన్ని కీర్తించండి.
మీరు ప్రత్యేక వస్త్రాలు ధరించి, ఆయన్ని ఆరాధించండి.
3 యెహోవా సముద్రం వద్ద తన స్వరం వినిపింపజేస్తున్నాడు.
మహిమగల దేవుని స్వరం మహా సముద్రం మీద ఉరుమువలె వినిపిస్తుంది.
4 యెహోవా స్వరం ఆయన శక్తిని తెలుపుతుంది.
ఆయన స్వరం ఆయన మహిమను తెలుపుతుంది.
5 యెహోవా స్వరం దేవదారు మహా వృక్షాలను ముక్కలుగా విరుగ గొట్టుతుంది.
లెబానోను దేవదారు మహా వృక్షాలను యెహోవా విరగ్గొడతాడు.
6 లెబానోను పర్వతాలను యెహోవా కంపింపజేస్తాడు. అవి గంతులు వేస్తున్న దూడలా కనిపిస్తాయి.
షిర్యోను కంపిస్తుంది. అది మేకపోతు గంతులు వేస్తున్నట్టు కనిపిస్తుంది.
7 యెహోవా స్వరం అగ్ని జ్వాలలను మండిస్తుంది.
8 యెహోవా స్వరం అరణ్యాన్ని కంపింపజేస్తుంది.
యెహోవా స్వరాన్ని విని కాదేషు అరణ్యం వణకుతుంది.
9 యెహోవా స్వరం లేళ్ళను భయపడేటట్టు చేస్తుంది.
ఆయన అరణ్యాలను నాశనం చేస్తాడు.
ఆయన ఆలయంలో ఆయన మహిమను గూర్చి ప్రజలు పాడుతారు.
10 వరదలను యెహోవా అదుపు చేసాడు.
మరియు యెహోవా ఎల్లప్పుడూ సమస్తాన్నీ తన అదుపులో ఉంచుకొనే రాజు.
11 యెహోవా తన ప్రజలను కాపాడును గాక.
యెహోవా తన ప్రజలకు శాంతినిచ్చి ఆశీర్వదించును గాక.
ఎఫెసులో పౌలు
19 అపొల్లో యింకా కొరింథులోనే ఉన్నాడు. పౌలు భూమార్గం ద్వారా ప్రయాణం చేసి ఎఫెసు చేరుకున్నాడు. అక్కడ కొంత మంది శిష్యుల్ని కలుసుకొని 2 వాళ్ళతో, “మీరు విశ్వసించిన పిదప పవిత్రాత్మను పొందారా?” అని అడిగాడు.
వాళ్ళు, “లేదు! పవిత్రాత్మ ఉన్నాడనేది కూడా మేము వినలేదు” అని సమాధానం చెప్పారు.
3 పౌలు, “మీరు ఎలాంటి బాప్తిస్మం పొందారు?” అని అడిగాడు.
“యోహాను బాప్తిస్మం” అని వాళ్ళు చెప్పారు.
4 పౌలు, “యోహాను మారుమనస్సుకు సంబంధించిన బాప్తిస్మము నిచ్చాడు. అతడు, తన తర్వాత రానున్నవాణ్ణి, అంటే యేసును నమ్మమని ప్రజలకు బోధించాడు కదా!” అని అన్నాడు.
5 ఇది విన్నాక వాళ్ళు యేసు ప్రభువు పేరిట బాప్తిస్మము పొందారు. 6 పౌలు తన చేతుల్ని వాళ్ళ తలలపై ఉంచగానే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదికి వచ్చాడు. వాళ్ళంతా తమకు రాని భాషల్లో మాట్లాడారు. దేవుడు ప్రేరేపించిన సత్యాలు ప్రకటించారు. 7 అక్కడ మొత్తం పన్నెండు మంది ఉన్నారు.
4 కనుక యోహాను ప్రజలకు ఎడారి ప్రాంతంలో బాప్తిస్మమిచ్చాడు. పాపపరిహారార్థం మారుమనస్సు పొందటం, బాప్తిస్మము పొందటం అవసరమని వాళ్ళకు ప్రకటించాడు. 5 యూదయ దేశంలోని ప్రజలు, యెరూషలేములోని ప్రజలు అతని దగ్గరకు వెళ్ళారు. తాము చేసిన పాపాలను చెప్పుకొన్నారు. అతడు వాళ్ళకు యొర్దాను నదిలో బాప్తిస్మం[a] ఇచ్చాడు.
6 యోహాను ఒంటె వెంట్రుకలతో చేసిన దుస్తుల్ని వేసుకొనేవాడు. నడుముకు తోలుదట్టి కట్టుకొనేవాడు. మిడుతల్ని, అడవి తేనెను తింటూ జీవించేవాడు.
7 అతడు ప్రకటించిన సందేశం ఇది, “నా తర్వాత నాకన్నా శక్తివంతుడైన వాడు వస్తాడు. నేను వంగి అతని చెప్పులు విప్పే అర్హత కూడా నాకు లేదు. 8 నేను మీకు నీళ్ళతో బాప్తిస్మము యిస్తున్నాను. కాని ఆయన మీకు పవిత్రాత్మతో బాప్తిస్మమిస్తాడు.”
యోహాను చేత యేసు బాప్తిస్మం పొందటం
(మత్తయి 3:13-17; లూకా 3:21-22)
9 ఆ రోజుల్లో, గలిలయలోని నజరేతు పట్టణానికి చెందిన యేసు వచ్చాడు. యోహాను ఆయనకు యొర్దాను నదిలో బాప్తిస్మము యిచ్చాడు. 10 యేసు నీటి నుండి బయటికి వస్తుండగా ఆకాశం తెరుచుకొని అందులో నుండి పవిత్రాత్మ ఒక పావురంలా తన మీదికి దిగిరావడం ఆయన గమనించాడు. 11 పరలోకం నుండి ఒక స్వరము, “నీవు నా ప్రియ కుమారుడవు. నీవంటే నాకెంతో ఆనందం!” అని అన్నది.
© 1997 Bible League International