Revised Common Lectionary (Complementary)
దేవుడు వస్తున్నాడు
60 “నా వెలుగైన యెరూషలేమా లెమ్ము!
నీ వెలుగు (దేవుడు) వస్తున్నాడు. యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తుంది.
2 ఇప్పుడు భూమిని,
దాని ప్రజలను చీకటి ఆవరించి ఉంది.
కానీ యెహోవా నీ మీద ప్రకాశిస్తాడు.
నీ చుట్టూరా ఆయన మహిమను ప్రజలు చూస్తారు.
3 ఆ సమయంలో రాజ్యాలు నీ వెలుగు (దేవుడు) దగ్గరకు వస్తాయి.
ప్రకాశవంతమైన నీ వెలుగు దగ్గరకు రాజులు వస్తారు.
4 నీ చుట్టూ చూడు,
చూడు ప్రజలు చూట్టూ చేరి, నీ దగ్గరకు వస్తున్నారు.
ఆ ప్రజలు దూరం నుండి వస్తున్న నీ కుమారులు.
మరియు వారితో నీ కుమార్తెలు వస్తున్నారు.
5 “భవిష్యత్తులో ఇది సంభవిస్తుంది. ఆ సమయంలో నీ ప్రజలను నీవు చూస్తావు.
ఆనందంతో మీ ముఖాలు ప్రకాశిస్తాయి.
మొదట, మీరు భయపడతారు,
కానీ తర్వాత మీరు సంబరపడతారు.
సముద్రాల ఆవలి రాజ్యాల ఐశ్వర్యాలన్నీ నీ ముందు ఉంచబడతాయి.
రాజ్యాల ఐశ్వర్యాలు నీకు సంక్రమిస్తాయి.
6 మిద్యాను, ఏయిఫాల నుండి ఒంటెల మందలు
నీ దేశంలో నిండిపోతాయి.
షేబనుండి ఒంటెలు బారులు తీరి వస్తాయి.
బంగారం, బోళం అవి తెస్తాయి.
ప్రజలు యెహోవాకు స్తుతులు పాడతారు.
సొలొమోను కీర్తన.
72 దేవా, రాజు నీవలె జ్ఞానముగల తీర్మానాలు చేయుటకు సహాయం చేయుము.
రాజకుమారుడు నీ మంచితనం గూర్చి నేర్చుకొనేందుకు సహాయం చేయుము.
2 నీ ప్రజలకు న్యాయంగా తీర్పు తీర్చేందుకు రాజుకు సహాయం చేయుము.
నీ పేద ప్రజలకు ఏది మంచిదో దానిని చేయుటకు అతనికి సహాయం చేయుము.
3 దేశం అంతటా శాంతి, న్యాయం ఉండనీయుము.
4 పేద ప్రజలకు రాజు న్యాయంగా ఉండునుగాక.
నిస్సహాయులకు అతణ్ణి సహాయం చేయనిమ్ము. వారిని బాధించే ప్రజలను అతణ్ణి శిక్షించనిమ్ము.
5 సూర్యుడు ప్రకాశించునంత వరకు ఆకాశంలో చంద్రుడు ఉన్నంత వరకు
ప్రజలు రాజుకు భయపడి గౌరవిస్తారని ఆశిస్తున్నాను.
ప్రజలు అతనికి శాశ్వతంగా భయపడి గౌరవిస్తారని నేను ఆశిస్తున్నాను.
6 పొలాల మీద కురిసే వర్షంలా రాజు ఉండునట్లు అతనికి సహాయం చేయుము.
నేలమీద పడే జల్లులా ఉండుటకు అతనికి సహాయం చేయుము.
7 అతడు రాజుగా ఉండగా మంచితనం వికసించనిమ్ము.
చంద్రుడున్నంతవరకు శాంతిని కొనసాగనిమ్ము.
10 తర్షీషు రాజులు మరియు దూర తీరాల రాజులు అతనికి కానుకలు సమర్పించుదురు గాక.
షేబ మరియు సెబా రాజులు అతనికి కప్పం చెల్లించెదరు గాక.
11 రాజులందరూ మన రాజుకు సాగిలపడుదురు గాక.
రాజ్యాలన్నీ అతన్ని సేవించెదరు గాక.
12 మన రాజు సహాయం లేని వారికి సహాయం చేస్తాడు.
మన రాజు పేదలకు, నిస్సహాయులకు సహాయం చేస్తాడు.
13 పేదలు, నిస్సహాయులు ఆయన మీద ఆధారపడతారు.
రాజు వారిని బ్రతికించి ఉంచుతాడు.
14 వారిని బాధించుటకు ప్రయత్నించే కృ-రుల బారినుండి రాజు వారిని రక్షిస్తాడు.
ఆ పేద ప్రజల ప్రాణాలు రాజుకు చాలా ముఖ్యం.
పౌలు యూదులు కానివాళ్ళకు బోధించుట
3 అందువల్ల యూదులుకాని మీ కోసం పౌలు అను నేను, యేసు క్రీస్తు ఖైదీని అయ్యాను. 2 దేవుడు నన్ను అనుగ్రహించి మీకోసం ఈ పని నాకు అప్పగించినట్లు మీరు తప్పకుండా వినే వుంటారు. 3 ఈ రహస్యం నాకు తెలుపబడినట్లు నేను యిదివరకే క్లుప్తంగా మీకు వ్రాసాను. 4 క్రీస్తును గురించి రహస్య జ్ఞానం నాకు అర్థమైనట్లు నేను వ్రాసింది చదివితే మీకు తెలుస్తుంది. 5 ఈ రహస్య జ్ఞానాన్ని దేవుడు మన పూర్వికులకు ఇవ్వలేదు. ఇప్పుడా రహస్య జ్ఞానాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులైన అపొస్తలులకు, ప్రవక్తలకు తెలియచేసాడు. 6 ఆ రహస్యం ఏమిటంటే, సువార్తవల్ల యూదులు కానివాళ్ళు ఇశ్రాయేలువాళ్ళతో సహా వారసులౌతారు. వాళ్ళు ఒకే శరీరానికి సంబంధించిన అవయవాలు. అంతేకాక దేవుడు యేసు క్రీస్తు ద్వారా చేసిన వాగ్దానానికి వాళ్ళు భాగస్తులు. ఇది సువార్త వల్ల సంభవిస్తోంది.
7 దేవుడు తన శక్తిని నాపై ఉపయోగించి తన అనుగ్రహాన్ని నాకు వరంగా ప్రసాదించటం వల్ల నేను ఈ సువార్తకు దాసుణ్ణయ్యాను. 8 దేవుని ప్రజలందరిలో నేను అధముణ్ణి. అయినా దేవుడు నాకీవరం ప్రసాదించాడు. క్రీస్తులో ఉన్న అనంతమైన ఐశ్వర్యాన్ని గురించి యూదులు కానివాళ్ళకు బోధించే అవకాశం నాకిచ్చి నన్ను అనుగ్రహించాడు. 9 అన్నిటినీ సృష్టించిన దేవుడు తరతరాల నుండి తనలో దాచుకొన్న ఈ రహస్య ప్రణాళికను ప్రతి ఒక్కరికీ స్పష్టం చేయమని నాకు అప్పగించాడు. 10 భూమండలంలో ఉన్న పాలకులకు, అధికారులకు సంఘం ద్వారా అన్నిటిలో అతీతుడైన దేవుని జ్ఞానాన్ని తెలియచేయాలని ఆయన ఉద్దేశ్యం. 11 దేవుడు యిలా చెయ్యాలని కాలానికి ముందే అనుకున్నాడు. ఆ అనుకొన్న దాన్ని ఇప్పుడు మన యేసు క్రీస్తు ద్వారా సాధించాడు. 12 క్రీస్తుతో మనకు కలిగిన ఐక్యతవల్ల మరియు ఆయనలో మనకున్న విశ్వాసం వల్ల మనము దేవుని సమక్షంలో ధైర్యంగా సంపూర్ణమైన స్వేచ్ఛతో నిలబడగలుగుతున్నాము.
తూర్పు నుండి జ్ఞానులు రావటం
2 హేరోదు రాజ్యపాలన చేస్తున్న కాలంలో యూదయ దేశంలోని బేత్లెహేములో యేసు జన్మించాడు. తూర్పు దిశనుండి జ్ఞానులు యెరూషలేముకు వచ్చి 2 “యూదుల రాజుగా జన్మించినవాడు ఎక్కడున్నాడు? తూర్పున మేమాయన నక్షత్రాన్ని చూసి ఆయన్ని ఆరాధించటానికి వచ్చాము” అని అన్నారు.
3 ఈ విషయం విని హేరోదు చాలా కలవరం చెందాడు. అతనితో పాటు యెరూషలేము ప్రజలు కూడ కలవరపడ్డారు. 4 అతడు ప్రధానయాజకుల్ని, పండితుల్ని[a] సమావేశపరచి, “క్రీస్తు ఎక్కడ జన్మించబోతున్నాడు?” అని అడిగాడు. 5 వాళ్ళు, “యూదయ దేశంలోని బేత్లెహేములో” అని సమాధానం చెప్పారు. దీన్ని గురించి ప్రవక్త ఈ విధంగా వ్రాసాడు:
6 “‘యూదయ దేశంలోని బేత్లెహేమా!
నీవు యూదయ పాలకులకన్నా తక్కువేమీ కాదు!
ఎందుకంటే, నీ నుండి ఒక పాలకుడు వస్తాడు.
ఆయన నా ప్రజల, అంటే ఇశ్రాయేలు ప్రజల, కాపరిగా ఉంటాడు.’”(A)
7 ఆ తర్వాత హేరోదు జ్ఞానుల్ని రహస్యంగా పిలిచి ఆ నక్షత్రం కనిపించిన సరియైన సమయం వాళ్ళనడిగి తెలుసుకొన్నాడు. 8 వాళ్ళను బేత్లెహేముకు పంపుతూ, “వెళ్ళి, ఆ శిశువును గురించి సమాచారం పూర్తిగా కనుక్కోండి. ఆ శిశువును కనుక్కొన్నాక నాకు వచ్చి చెప్పండి. అప్పుడు నేను కూడా వచ్చి ఆరాధిస్తాను” అని అన్నాడు.
9 వాళ్ళు రాజు మాటలు విని తమ దారిన తాము వెళ్ళిపొయ్యారు. వాళ్ళు తూర్పు దిశన చూసిన నక్షత్రం వాళ్ళకన్నా ముందు వెళ్ళుతూ ఆ శిశువు ఉన్న ఇంటి మీద ఆగింది. 10 వాళ్ళా నక్షత్రం ఆగిపోవటం చూసి చాలా ఆనందించారు.
11 ఇంట్లోకి వెళ్ళి ఆ పసివాడు తన తల్లి మరియతో ఉండటం చూసారు. వాళ్ళు ఆయన ముందు మోకరిల్లి ఆయన్ని ఆరాధించారు. ఆ తర్వాత తమ కానుకల మూటలు విప్పి ఆయనకు బంగారు కానుకలు, సాంబ్రాణి, బోళం బహూకరించారు. 12 హేరోదు దగ్గరకు వెళ్ళొద్దని దేవుడు ఆ జ్ఞానులతో చెప్పాడు. అందువల్ల వాళ్ళు తమ దేశానికి మరో దారి మీదుగా వెళ్ళిపోయారు.
© 1997 Bible League International