Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
29 దేవుని కుమారులారా, యెహోవాను స్తుతించండి.
ఆయన మహిమ ప్రభావాలను స్తుతించండి.
2 యెహోవాను స్తుతించండి, ఆయన నామాన్ని కీర్తించండి.
మీరు ప్రత్యేక వస్త్రాలు ధరించి, ఆయన్ని ఆరాధించండి.
3 యెహోవా సముద్రం వద్ద తన స్వరం వినిపింపజేస్తున్నాడు.
మహిమగల దేవుని స్వరం మహా సముద్రం మీద ఉరుమువలె వినిపిస్తుంది.
4 యెహోవా స్వరం ఆయన శక్తిని తెలుపుతుంది.
ఆయన స్వరం ఆయన మహిమను తెలుపుతుంది.
5 యెహోవా స్వరం దేవదారు మహా వృక్షాలను ముక్కలుగా విరుగ గొట్టుతుంది.
లెబానోను దేవదారు మహా వృక్షాలను యెహోవా విరగ్గొడతాడు.
6 లెబానోను పర్వతాలను యెహోవా కంపింపజేస్తాడు. అవి గంతులు వేస్తున్న దూడలా కనిపిస్తాయి.
షిర్యోను కంపిస్తుంది. అది మేకపోతు గంతులు వేస్తున్నట్టు కనిపిస్తుంది.
7 యెహోవా స్వరం అగ్ని జ్వాలలను మండిస్తుంది.
8 యెహోవా స్వరం అరణ్యాన్ని కంపింపజేస్తుంది.
యెహోవా స్వరాన్ని విని కాదేషు అరణ్యం వణకుతుంది.
9 యెహోవా స్వరం లేళ్ళను భయపడేటట్టు చేస్తుంది.
ఆయన అరణ్యాలను నాశనం చేస్తాడు.
ఆయన ఆలయంలో ఆయన మహిమను గూర్చి ప్రజలు పాడుతారు.
10 వరదలను యెహోవా అదుపు చేసాడు.
మరియు యెహోవా ఎల్లప్పుడూ సమస్తాన్నీ తన అదుపులో ఉంచుకొనే రాజు.
11 యెహోవా తన ప్రజలను కాపాడును గాక.
యెహోవా తన ప్రజలకు శాంతినిచ్చి ఆశీర్వదించును గాక.
సమూయేలు బేత్లెహేముకు వెళ్లుట
16 యెహోవా, “ఎంతకాలం ఇలా సౌలుకోసం చింతిస్తావు? ఇశ్రాయేలు రాజుగా సౌలును నేను నిరాకరించాను. నీ కొమ్ములనునూనెతో నింపుకొని వెళ్లు. యెష్షయి అనే మనిషి దగ్గరకు నేను నిన్ను పంపిస్తున్నాను. యెష్షయి బేత్లెహేములో నివసిస్తున్నాడు. అతని కుమారులలో ఒకనిని నేను రాజుగా ఎంపిక చేసాను” అని సమూయేలుతో చెప్పాడు.
2 కానీ, “నేను వెళితే ఈ వార్త సౌలు విని నన్ను చంపటానికి ప్రయత్నం చేస్తాడు” అని సమూయేలు అన్నాడు.
“నీవు ఒక కోడెదూడను తీసుకుని బెత్లెహేముకు వెళ్లు. ‘యెహోవాకు నేను ఒక బలి అర్పించటానికి వచ్చాను’ అని చెప్పు. 3 బలి కార్యక్రమానికి యెష్షయిని రమ్మని ఆహ్వానించు. అప్పుడు ఏమి చేయాలో నేను నీకు తెలియచేస్తాను. నేను నీకు చూపిన మనిషిని నీవు తప్పక అభిషేకించాలి” అని యెహోవా చెప్పాడు.
4 యెహోవా చెప్పినట్లు సమూయేలు చేసాడు. సమూయేలు బెత్లెహేముకు వెళ్లాడు. బెత్లెహేము పెద్దలు భయంతో వణకిపోయారు. వారు సమూయేలును కలుసుకొని, “నీవు సమాధానంగానే వచ్చావా?” అని అడిగారు.
5 “అవును నేను సమాధానంగానే వచ్చాను. యెహోవాకు ఒక బలి అర్పించటానికి నేను వచ్చాను. మీరంతా తయారై బలి కార్యక్రమానికి నాతోకూడ రావటానికి సిద్ధపడండి” అని సమూయేలు జవాబు చెప్పాడు. సమూయేలు యెష్షయిని, అతని కుమారులను సిద్ధంచేశాడు. బలి అర్పణలో పాలుపుచ్చుకోమని సమూయేలు వారిని ఆహ్వానించాడు.
6 యెష్షయి, అతని కుమారులు వచ్చినపుడు సమూయేలు ఏలీయాబును చూసాడు. “నిజంగా యెహోవా ఎంపిక చేసిన మనిషి ఇతడే” అని సమూయేలు తలంచాడు.
7 అయితే యెహోవా, “ఏలీయాబు ఎంతో అందంగా ఎత్తుగా ఉన్నాడు. కానీ ఆ విషయాలు లక్ష్యపెట్టకు. మనుష్యులు చూసే విషయాలను కాదు దేవుడు చూసేదు. ప్రజలు బాహ్య సౌందర్యం చూస్తారు కానీ యెహోవా హృదయం చూస్తాడు. ఏలీయాబు తగిన వాడు కాడు” అని తెలియజేసాడు.
8 అప్పుడు యెష్షయి తన కుమారుడైన అబీనాదాబును పిలిచాడు. అబీనాదాబు సమూయేలు ఎదుటనడిచాడు. కానీ సమూయేలు, “లేదు యెహోవా ఎంపిక చేసినవాడు ఇతడు కాదు” అన్నాడు.
9 తరువాత షమ్మాను సమూయేలు ఎదుట నడువుమని యెష్షయి చెప్పాడు. కానీ సమూయేలు, “లేదు, ఇతనినికూడ యెహోవా ఎంపిక చేయలేదు” అన్నాడు.
10 తన కుమారులు ఏడుగురిని యెష్షయి సమూయేలుకు చూపించాడు. కానీ, “వీరిలో ఎవ్వరినీ యెహోవా ఎంపిక చేయలేదని” సమూయేలు యెష్షయితో చెప్పాడు.
11 అప్పుడు, “నీ కుమారులంతా వీరేనా?” అని సమూయేలు యెష్షయిని అడిగాడు.
“అందరికంటె చిన్నవాడు ఇంకొకడు ఉన్నాడు. కానీ వాడు గొర్రెలను మేపుతున్నాడు” అని యెష్షయి జవాబిచ్చాడు.
సమూయేలు, “అతనికి కబురు చేయి. అతన్ని ఇక్కడకు తీసుకునిరా. అతడొచ్చేవరకూ మనం భోజనానికి కూర్చోము” అని చెప్పాడు.
12 యెష్షయి తన చిన్న కుమారుని తీసుకుని వచ్చేందుకు ఒకరిని పంపించాడు. ఈ కుమారుడు ఎర్రని తల వెంట్రుకలతో చక్కగా కనబడేవాడు. అతడు ఎర్రటివాడు మరియు చాలా అందగాడు.
“లేచి అతనిని అభిషేకించు. అతడే సుమా!” అని యెహోవా సమూయేలుతో చెప్పాడు.
13 ప్రత్యేక నూనెతో ఉన్న కొమ్మును సమూయేలు తీసుకుని యెష్షయి చిన్న కుమారుని సోదరులందరి ఎదుటనే అతని మీద పోసాడు. ఆ రోజునుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి మహా శక్తివంతంగా వచ్చింది. తరువాత సమూయేలు రామాకు వెళ్లి పోయాడు.
11 ఈ విషయాలు మిగతావాళ్ళకు బోధించి, వాటిని ఆచరించుని ఆజ్ఞాపించు. 12 నీవు వయస్సులో చిన్నవాడైనందుకు నిన్నెవ్వడూ చులకన చెయ్యకుండా జాగ్రత్త పడు. క్రీస్తును విశ్వసించేవాళ్ళకు మాటల్లో, జీవిత విధానంలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో ఆదర్శంగా ఉండు.
13 నేను వచ్చేవరకు నీ కాలాన్ని దైవవాక్యాలు బహిరంగంగా చదవటానికి, వాటిని ఉపదేశించటానికి ఉపయోగించు. ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందింప చేయి. 14 పెద్దలు తమ చేతుల్ని నీపై ఉంచినప్పుడు ప్రవక్తలు చెప్పిన భవిష్యత్తు ప్రకారం నీకు వరం లభించింది. దాన్ని నిర్లక్ష్యం చెయ్యవద్దు. 15 నేను చెప్పిన విషయాలపై నీ మనస్సు లగ్నం చేయి. అప్పుడు అందరూ నీ అభివృద్ధిని గమనిస్తారు. 16 నీ వ్యక్తిగత జీవితాన్నీ, నీవు బోధించే వాటినీ జాగ్రత్తగా గమనించు. వాటిని పట్టుదలతో సాధించు. అలా చేస్తే నిన్ను నీవు రక్షించుకొన్నవాడవౌతావు. నీ బోధన విన్నవాళ్ళను రక్షించినవాడవౌతావు.
© 1997 Bible League International