Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
29 దేవుని కుమారులారా, యెహోవాను స్తుతించండి.
ఆయన మహిమ ప్రభావాలను స్తుతించండి.
2 యెహోవాను స్తుతించండి, ఆయన నామాన్ని కీర్తించండి.
మీరు ప్రత్యేక వస్త్రాలు ధరించి, ఆయన్ని ఆరాధించండి.
3 యెహోవా సముద్రం వద్ద తన స్వరం వినిపింపజేస్తున్నాడు.
మహిమగల దేవుని స్వరం మహా సముద్రం మీద ఉరుమువలె వినిపిస్తుంది.
4 యెహోవా స్వరం ఆయన శక్తిని తెలుపుతుంది.
ఆయన స్వరం ఆయన మహిమను తెలుపుతుంది.
5 యెహోవా స్వరం దేవదారు మహా వృక్షాలను ముక్కలుగా విరుగ గొట్టుతుంది.
లెబానోను దేవదారు మహా వృక్షాలను యెహోవా విరగ్గొడతాడు.
6 లెబానోను పర్వతాలను యెహోవా కంపింపజేస్తాడు. అవి గంతులు వేస్తున్న దూడలా కనిపిస్తాయి.
షిర్యోను కంపిస్తుంది. అది మేకపోతు గంతులు వేస్తున్నట్టు కనిపిస్తుంది.
7 యెహోవా స్వరం అగ్ని జ్వాలలను మండిస్తుంది.
8 యెహోవా స్వరం అరణ్యాన్ని కంపింపజేస్తుంది.
యెహోవా స్వరాన్ని విని కాదేషు అరణ్యం వణకుతుంది.
9 యెహోవా స్వరం లేళ్ళను భయపడేటట్టు చేస్తుంది.
ఆయన అరణ్యాలను నాశనం చేస్తాడు.
ఆయన ఆలయంలో ఆయన మహిమను గూర్చి ప్రజలు పాడుతారు.
10 వరదలను యెహోవా అదుపు చేసాడు.
మరియు యెహోవా ఎల్లప్పుడూ సమస్తాన్నీ తన అదుపులో ఉంచుకొనే రాజు.
11 యెహోవా తన ప్రజలను కాపాడును గాక.
యెహోవా తన ప్రజలకు శాంతినిచ్చి ఆశీర్వదించును గాక.
దేవుడు సమూయేలును పిలుచుట
3 ఆ రోజుల్లో యెహోవా ఎవరితోనూ ప్రత్యక్షంగా తరచు మాట్లాడేవాడు కాడు. స్వప్న దర్శనాలూ చాలా తక్కువే. ఏలీ పర్యవేక్షణలో బాలకుడైన సమూయేలు యెహోవా సేవలో ఉన్నాడు.
2 ఏలీ కళ్లు బలిహీనమై ఇంచుమించు గుడ్డివాడైపోయాడు. ఒకరోజు అతడు పడుకుని వున్నాడు. 3 సమూయేలు యెహోవా పవిత్ర గుడారంలో పడుకున్నాడు. దేవుని పవిత్ర పెట్టె[a] కూడా గుడారంలోనే వుంది. గుడారంలో యెహోవా దీపం ఇంకా వెలుగుతూనే వుంది. 4 యెహోవా సమూయేలును పిలిచాడు. “ఇక్కడే వున్నాను” అంటూ 5 (ఏలీ తనను పిలిచాడని అనుకొని) సమూయేలు ఏలీ వద్దకు పరుగున పోయాడు. “మీరు పిలిచారుగా అందుకే, వచ్చాను” అన్నాడు.
“నేను నిన్ను పిలవలేదు. పోయి పడుకో” అన్నాడు ఏలీ.
సమూయేలు పోయి పడుకున్నాడు. 6 దేవుడు మళ్లీ, “సమూయేలూ!” అని పిలిచాడు. సమూయేలు ఏలీ వద్దకు వెళ్లి, “నేనిక్కడే ఉన్నాను, నన్ను పిలిచారా?” అని అడిగాడు.
“నేను నిన్ను పిలవలేదు. పోయి పడుకో” అన్నాడు ఏలీ.
7 సమూయేలుకు ఇంకా యెహోవాతో అనుభవంలేదు. అతనితో యెహోవా ఇంతవరకూ ప్రత్యక్షంగా మాట్లాడి వుండలేదు.[b]
8 మూడవసారి యెహోవా సమూయేలును పిలిచాడు. సమూయేలు లేచి ఏలీ వద్దకు వెళ్లి, “నేను ఇక్కడే వున్నాను; నన్ను పిలిచారా?” అని అన్నాడు.
యెహోవా ఆ బాలుని పిలుస్తున్నాడని అప్పుడు ఏలీకి అర్థమయింది. 9 ఏలీ సమూయేలుతో, “నీవు పోయి పడుకో. మళ్లీ ఎవరైనా నిన్ను పిలిస్తే ‘యెహోవా, సెలవియ్యండి! నేను తమ దాసుణ్ణి. నేను వింటున్నాను’” అని చెప్పమన్నాడు.
తరువాత సమూయేలు వెళ్లి పక్కమీద పడుకున్నాడు. 10 యెహోవా వచ్చి అక్కడ నిలిచాడు. “సమూయేలూ!, సమూయేలూ” అంటూ మునుపటిలా పిలిచాడు.
“చెప్పండి, నేను మీ దాసుడను. నేను వింటున్నాను” అన్నాడు సమూయేలు.
11 యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు: “చూడు, నేను ఇశ్రాయేలులో ఒక కార్యం నిర్వహించదలిచాను. దీనిని గురించి విన్న ప్రతి ఒక్కడూ ఆశ్చర్యపోతాడు.[c] 12 నేను ఏలీకి, అతని కుటుంబానికి ఏది చేస్తానని చెప్పివున్నానో అదంతా అప్పుడు చేస్తాను. మొదటినుంచి చివరి వరకు అంతా చేసి తీరుతాను. 13 తన వంశాన్ని శాశ్వతంగా శిక్షిస్తానని ఏలీతో చెప్పాను. అలా ఎందుకు చేయదలిచానంటే తన కుమారులు దైవదూషణ చేసినట్లు, అకృత్యాలకు పాల్పడినట్లు ఏలీకి తెలుసు. అయినా వారిని అదుపులో పెట్టలేక పోయాడు. 14 అందువల్ల ఏలీ వంశం ఎన్ని బలులు, ధాన్యార్పణలు సమర్పించినా వారి పాపాన్ని మాపుకో లేరని నిశ్చితంగా చెప్పి ఉన్నాను.”
15 తెల్లవారేవరకూ సమూయేలు పక్కమీదే ఉన్నాడు. ఆ తరువాత లేచి దేవాలయ ద్వారం తెరిచాడు. దర్శనం గూర్చి ఏలీతో చెప్పటానికి సమూయేలు భయపడ్డాడు
16 కాని ఏలీ, “కుమారుడా సమూయేలూ” అని పిలిచాడు.
“ఇక్కడే ఉన్నానయ్యా” అన్నాడు సమూయేలు.
17 “యెహోవా నీతో ఏమన్నాడు? నాతో ఏమీ దాచవద్దు. ఆయన నీకు చెప్పిన సమాచారంలో నీవు ఏమి దాచినా దేవుడు నిన్ను బాగా శిక్షిస్తాడు” అని అన్నాడు.
18 దానితో సమూయేలు ఉన్నది వున్నట్లు ఏలీకి ఏమీ దాచకుండా చెప్పాడు.
అది విన్న ఏలీ, “ఆయన యెహోవా. ఆయనకు ఏది మంచిదనిపిస్తే అది చేయనీ” అన్నాడు.
19 సమూయేలు పెరుగుతూ వుండగా యెహోవా అతనికి తోడై ఉండెను. యెహోవా సమూయేలుతో చెప్పిన వర్తమానాలను ఎన్నడూ అబద్ధం కానీయలేదు. 20 అందువల్ల దానునుండి, బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు దేశమంతా సమూయేలును యెహోవా యొక్క నిజమైన ప్రవక్తగా గుర్తించింది. 21 షిలోహులో యెహోవా సమూయేలుకు దర్శనమిస్తూ వచ్చాడు. మాటలోనే సమూయేలుకు యెహోవా ప్రత్యక్షమయ్యేవాడు.
10 డెమాస్కసులో యేసు భక్తుడొకడుండేవాడు. అతని పేరు అననీయ. ప్రభువతనికి దివ్యదర్శనంలో కనపడి, “అననీయా!” అని పిలిచాడు.
“ఇదిగో, ఇక్కడున్నాను ప్రభూ!” అని అతడు జవాబు చెప్పాడు.
11 ప్రభువతనితో, “‘తిన్నని వీధి’ అని పిలువబడే వీధిలో ఉన్న ‘యూదా’ యింటికి వెళ్ళు, ‘తార్సు’ అనే పట్టణంనుండి వచ్చిన సౌలు అనే వ్యక్తి కోసం అడుగు. అతడు ప్రార్థిస్తూ ఉంటాడు. 12 అతడొక దివ్యదర్శనంలో ‘అననీయ’ అనే పేరుగలవాడు అతని దగ్గరకు వచ్చినట్లు, అతనికి దృష్టి రావటానికి అతనిపై చేతులుంచబడినట్లు చూసాడు” అని చెప్పాడు.
13 అననీయ, “ప్రభూ, అతడు యెరూషలేంలోని పరిశుద్ధులకు చాలా హాని చేసినట్లు చాలా మంది విన్నారు. 14 మిమ్మల్ని శరణుజొచ్చిన ప్రతి ఒక్కణ్ణి బంధించే అధికారం అతడు ప్రధానయాజకుల దగ్గరనుండి పొందాడు”, అని సమాధానం చెప్పాడు.
15 అప్పుడు ప్రభువు అననీయతో, “వెళ్ళు! నా పేరు యూదులు కానివాళ్ళకు, వాళ్ళ పాలకులకు, ఇశ్రాయేలు ప్రజలకు ప్రచారం చేయటానికి యితణ్ణి నేను ఒక సాధనంగా ఎన్నుకొన్నాను. 16 నా పేరిట అతడెన్ని కష్టాలు పడవలసి వస్తుందో నేనతనికి తెలియచేస్తాను” అని అన్నాడు.
17 ఆ తర్వాత అననీయ అక్కడినుండి బయలుదేరి సౌలు ఉన్న యింటికి వెళ్ళాడు. తన చేతుల్ని సౌలు మీద ఉంచి, “సోదరుడా! సౌలా! యేసు ప్రభువు నీవిక్కడికి వస్తున్నప్పుడు నీకు దారిలో కనిపించాడే, ఆయనే, నీవు మళ్ళీ చూడగలగాలని, పవిత్రాత్మ నీలో నిండాలని నన్ను పంపాడు” అని అన్నాడు. 18 వెంటనే పొరల్లాంటివి సౌలు కళ్ళనుండి రాలి క్రిందపడ్డాయి. అతడు మళ్ళీ చూడగలిగాడు. అతడు లేచి బాప్తిస్మము పొందాడు. 19 ఆ తర్వాత కొంత ఆహారాన్ని పుచ్చుకొన్నాక అతనికి బలం వచ్చింది.
సౌలు డెమాస్కసులో బోధించుట
సౌలు డెమాస్కసులో ఉన్న విశ్వాసులతో కొద్ది రోజులు గడిపాడు.
© 1997 Bible League International