Revised Common Lectionary (Complementary)
148 యెహోవాను స్తుతించండి!
పైన ఉన్న దూతలారా, ఆకాశంలో యెహోవాను స్తుతించండి!
2 సకల దూతలారా, యెహోవాను స్తుతించండి!
ఆయన సర్వ సైనికులారా,[a] ఆయనను స్తుతించండి!
3 సూర్యచంద్రులారా, యెహోవాను స్తుతించండి.
ఆకాశంలోని నక్షత్రాలూ, వెలుతురూ యెహోవాను స్తుతించండి!
4 మహా ఉన్నతమైన ఆకాశంలోని యెహోవాను స్తుతించండి.
ఆకాశం పైగా ఉన్న జలములారా, ఆయనను స్తుతించండి.
5 యెహోవా నామాన్ని స్తుతించండి.
ఎందుకనగా దేవుడు ఆజ్ఞ యివ్వగా ప్రతి ఒక్కటీ సృష్టించబడింది.
6 ఇవన్నీ శాశ్వతంగా కొనసాగేందుకు దేవుడు చేశాడు.
ఎన్నటికి అంతంకాని న్యాయచట్టాలను దేవుడు చేశాడు.
7 భూమి మీద ఉన్న సమస్తమా. యెహోవాను స్తుతించు!
మహా సముద్రాలలోని గొప్ప సముద్ర జంతువుల్లారా, యెహోవాను స్తుతించండి.
8 అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి,
తుఫాను, గాలులు అన్నింటినీ దేవుడు చేశాడు.
9 పర్వతాలను, కొండలను, ఫలవృక్షాలను,
దేవదారు వృక్షాలను దేవుడు చేశాడు.
10 అడవి జంతువులను, పశువులను, పాకే ప్రాణులను, పక్షులను అన్నింటినీ దేవుడు చేశాడు.
11 భూమి మీద రాజ్యాలను రాజులను దేవుడు చేశాడు.
నాయకులను, న్యాయాధిపతులను దేవుడు చేశాడు.
12 యువతీ యువకులను దేవుడు చేశాడు.
వృద్ధులను, యవ్వనులను దేవుడు చేశాడు.
13 యెహోవా నామాన్ని స్తుతించండి!
ఆయన నామాన్ని శాశ్వతంగా ఘనపర్చండి!
భూమిపైన, ఆకాశంలోను ఉన్న
సమస్తం ఆయనను స్తుతించండి!
14 దేవుడు తన ప్రజలను బలవంతులుగా చేస్తాడు.
దేవుని అనుచరులను మనుష్యులు పొగడుతారు.
ఎవరి పక్షంగా అయితే దేవుడు పోరాడుతున్నాడో ఆ ఇశ్రాయేలీయులను మనుష్యులు పొగడుతారు. యెహోవాను స్తుతించండి!
18 అప్పుడు మోషే, “అలాగైతే నీ మహిమ నాకు చూపించు” అన్నాడు.
19 అప్పుడు యెహోవా జవాబిచ్చాడు: “నా మంచితనం అంతా నీ ముందు నడిచేటట్లు చేస్తాను. నేను యెహోవాను. నీకు వినబడేటట్టు నా పేరు నేను ప్రకటిస్తాను. నేను ప్రకటించుకున్న వారికి ప్రేమ, దయ నేను చూపెడతాను. 20 కాని నా ముఖం నీవు చూడలేవు. ఏ మనిషీ నన్ను చూచి బ్రతకలేడు.
21 “అక్కడ నా దగ్గర ఒక చోట ఒక బండ వుంది. నీవు ఆ బండమీద నిలబడవచ్చు. 22 నా మహిమ ఆ స్థలాన్ని దాటి వెళ్తుంది. ఆ బండలోని ఒక పెద్ద సందులో నేను నిన్ను ఉంచి, నేను దాటి వెళ్లేటప్పుడు, నా చేతితో నిన్ను కప్పుతాను. 23 అప్పుడు నేను నా చేయిని తీసివేస్తాను. నీవు నా వెనుకవైపు చూస్తావు. కాని నా ముఖం మాత్రము నీవు చూడలేవు.”
జీవ వాక్యం
1 ఏది మొదటినుండి ఉన్నదో, దాన్ని మేము విన్నాము, మా కళ్ళారా చూసాము. చూసి మా చేతుల్తో తాకాము. అదే జీవం కలిగించే వాక్యం. దాన్ని గురించే మీకు ప్రకటిస్తున్నాము. 2 జీవం కనిపించింది. మేము దాన్ని చూసాము. చూసినట్టు సాక్ష్యం కూడా చెపుతున్నాము. ఆ జీవాన్ని గురించి మీకు ప్రకటిస్తున్నాము. ఆ జీవం తండ్రితో ఉంది. అది మాకు కనిపించింది. 3 తండ్రితో ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో మాకు సహవాసం ఉంది కనుక, మీరు కూడా మాతో సహవాసం చెయ్యాలనే ఉద్దేశ్యంతో మేము చూసినదాన్ని, విన్నదాన్ని మీకు ప్రకటిస్తున్నాము. 4 మన[a] ఆనందం సంపూర్ణంగా ఉండాలని యిది మీకు వ్రాస్తున్నాను.
వెలుగులో నడుచుట
5 దేవుడు వెలుగై వున్నాడు. ఆయనలో చీకటి ఏ మాత్రం లేదు. ఈ సందేశాన్ని ఆయన మాకు చెప్పాడు. దాన్ని మేము మీకు ప్రకటిస్తున్నాం. 6 మనకు ఆయనతో సహవాసముందని అంటూ చీకట్లో నడిస్తే మనము అసత్యమాడినట్లే కదా! సత్యాన్ని ఆచరించటం మానుకొన్నట్లే కదా! 7 దేవుడు వెలుగులో ఉన్నాడు. కాబట్టి మనం కూడా వెలుగులో నడిస్తే మన మధ్య సహవాసం ఉంటుంది. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు రక్తం మన పాపాలన్నిటిని కడుగుతుంది.
8 మనలో పాపం లేదని అంటే, మనల్ని మనము మోసం చేసుకొన్న వాళ్ళమౌతాము. సత్యం మనలో ఉండదు. 9 మనం చేసిన పాపాన్ని ఒప్పుకొంటే దేవుడు సత్యవంతుడు, సక్రమంగా న్యాయం జరిగించేవాడు కనుక మన పాపాల్ని క్షమిస్తాడు. మనలో ఉన్న అవినీతిని కడిగి వేస్తాడు.
© 1997 Bible League International