Revised Common Lectionary (Complementary)
ఎజ్రాహివాడైన ఏతాను ధ్యానగీతం.
89 యెహోవా ప్రేమను గూర్చి నేను ఎల్లప్పుడూ పాడుతాను.
ఆయన నమ్మకత్వం గూర్చి శాశ్వతంగా, ఎప్పటికీ నేను పాడుతాను!
2 యెహోవా, నీ ప్రేమ శాశ్వతంగా నిలుస్తుందని నేను నిజంగా నమ్ముతాను.
నీ నమ్మకత్వం ఆకాశాలవలె కొనసాగుతుంది!
3 దేవుడు చెప్పాడు, “నేను ఏర్పరచుకొన్న రాజుతో నేను ఒడంబడిక చేసుకొన్నాను.
నా సేవకుడైన దావీదుకు నేను ఒక వాగ్దానం చేసాను.
4 ‘దావీదూ, నీ వంశం శాశ్వతంగా కొనసాగేట్టు నేను చేస్తాను.
నీ రాజ్యాన్ని శాశ్వతంగా ఎప్పటికీ నేను కొనసాగింపజేస్తాను.’”
19 కనుక నిజమైన నీ అనుచరులతో దర్శనంలో నీవు మాట్లాడావు.
నీవు చెప్పావు: “ప్రజల్లోనుండి నేను ఒక యువకుని ఏర్పాటు చేసికొన్నాను.
ఆ యువకుని నేను ప్రముఖుణ్ణి చేసాను. నేను యుద్ధ వీరునికి శక్తిని అనుగ్రహించాను.
20 నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను.
నా ప్రత్యేక తైలంతో నేను అతన్ని అభిషేకించాను.
21 నా కుడిచేతితో నేను దావీదును బలపరచాను.
మరి నా శక్తితో నేను అతన్ని బలముగల వానిగా చేశాను.
22 ఏర్పాటు చేసికోబడిన రాజును శత్రువు ఓడించలేకపోయాడు.
దుర్మార్గులు అతన్ని ఓడించలేక పోయారు.
23 అతని శత్రువులను నేను అంతం చేసాను.
ఏర్పరచబడిన రాజును ద్వేషించిన వారిని నేను ఓడించాను.
24 ఏర్పరచబడిన రాజును నేను ఎల్లప్పుడూ ప్రేమిస్తాను. బలపరుస్తాను.
నేను ఎల్లప్పుడూ అతన్ని బలవంతునిగా చేస్తాను.
25 ఏర్పరచబడిన నా రాజును సముద్రం మీద నాయకునిగా ఉంచుతాను.
నదులను అతడు అదుపులో ఉంచుతాడు.
26 ‘నీవు నా తండ్రివి నీవు నా దేవుడవు, నా బండవు, నా రక్షకుడవు’
అని అతడు నాతో చెబుతాడు.
12 ప్రజలు దావీదు వద్దకు వచ్చి, “దేవుని పవిత్ర పెట్టె అక్కడున్న కారణాన యెహోవా ఓబేదెదోము కుటుంబాన్ని, అతని వస్తువాహనాలను ఆశీర్వదించాడు” అని చెప్పారు. దానితో దావీదు ఓబేదెదోము ఇంటి నుండి దేవుని ఒడంబడిక పెట్టెను ఆనందోత్సాహాలతో తేవటానికి వెళ్లాడు. 13 యెహోవా పవిత్ర పెట్టెను మోసేవారు ఆరడుగులు నడిచి ఆగగా, దావీదు ఒక ఎద్దును, ఒక బలిసిన దూడను బలియిచ్చాడు. 14 పిమ్మట యెహోవా ముందు దావీదు నృత్యం చేశాడు. ఏఫోదు అనబడే యాజకుల పవిత్ర వస్త్రాన్ని ధరించాడు.
15 యెహోవా పవిత్ర పెట్టెను నగరంలోకి తెస్తూవుండగా దావీదు, ఇశ్రాయేలీయులంతా సంతోషంతో కేకలు వేశారు. బూరలు ఊదారు. 16 సౌలు కుమార్తె మీకాలు ఒక కిటికీ గుండా చూస్తూ వుంది. యెహోవా పవిత్ర పెట్టె నగరంలోనికి వచ్చినప్పుడు, యెహోవా ముందు దావీదు చిందులేస్తూ, నాట్యం చేస్తూవున్నాడు. ఇదంతా మీకాలు చూసి, దావీదును తన మనసులో అవమానించింది.
17 పవిత్ర పెట్టె కొరకు దావీదు ఒక గుడారం నిర్మింపజేశాడు. ఇశ్రాయేలీయులు యెహోవా పవిత్ర పెట్టెను గుడారంలో దాని స్థానంలో నిలిపారు. దావీదు అప్పుడు దహన బలులు, సమాధాన బలులు యెహోవాకు సమర్పించాడు.
18 దహన బలులు, సమాధాన బలులు సమర్పించాక, సర్వశక్తిమంతుడైన యెహోవా పేరిట దావీదు ప్రజలను ఆశీర్వదించాడు. 19 నైవేద్యంగా ఉంచిన రొట్టె, ఎండిన ద్రాక్ష భక్ష్యములు, ఖర్జూరపు పండువేసి చేసిన రొట్టెలను స్త్రీ పురుషులందరికీ, ఇశ్రాయేలీయులందరికీ ప్రసాదంగా పంచి పెట్టాడు. తరువాత వారంతా తమ తమ ఇండ్లకు వెళ్లిపోయారు.
5 ఎందుకంటే దేవుడు ఏ దేవదూతతో కూడా ఈ విధంగా అనలేదు:
“నీవు నా కుమారుడవు,
నేడు నేను నీ తండ్రినయ్యాను.”(A)
మరొక చోట:
“నేనతనికి తండ్రి నౌతాను.
అతడు నా కుమారుడౌతాడు.”(B)
6 మరొకచోట, దేవుడు తన మొదటి సంతానాన్ని ఈ ప్రపంచంలోకి తీసుకొని వచ్చినప్పుడు ఈ విధంగా అన్నాడు:
“దేవదూతలు ఆయన్ని ఆరాధించాలి!”(C)
7 దేవదూతల గురించి దేవుడు మాట్లాడుతూ:
“దేవుడు తన దూతల్ని ఆత్నలుగాను
తన సేవకుల్ని అగ్ని జ్వాలల్లా చేస్తాడు!”(D)
8 కాని కుమారుణ్ణి గురించి ఈ విధంగా అన్నాడు:
“ఓ దేవా! నీ సింహాసనం చిరకాలం ఉంటుంది.
నీతి నీ రాజ్యానికి రాజదండంగా ఉంటుంది.
9 నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించావు.
అందువల్ల దేవుడు, నీ దేవుడు ఆనందమనే నూనెతో నిన్ను
అభిషేకించి నీ స్నేహితులందరి కన్నా నిన్ను అధికంగా గౌరవించాడు.”(E)
10 ఆయనింకా ఈ విధంగా అన్నాడు:
“ఓ ప్రభూ! ఆదిలో ఈ ప్రపంచానికి నీవు పునాదులు వేశావు.
ఆకాశాలను నీ చేతుల్తో సృష్టించావు.
11 అవి నశించి పోతాయి ఒక వస్త్రంలా పాత బడతాయి.
కాని, నీవు చిరకాలం ఉంటావు.
12 వాటిని నీవు ఒక వస్త్రంలా మడుస్తావు.
వాటిని నీవు దుస్తులు మార్చినట్లు మారుస్తావు.
కాని నీవు మాత్రం అలాగే ఉంటావు!
నీ సంవత్సరములకు అంతంలేదు!”(F)
13 దేవుడు ఏ దేవదూతతోనైనా:
“నీ శత్రువుల్ని నీ పాద పీఠంగా చేసేవరకు
నా కుడివైపు కూర్చో,”(G)
అని ఎన్నడైనా అన్నాడా? 14 ఈ దేవదూతలందరూ సేవ చేయటానికి వచ్చిన ఆత్మలే కదా! రక్షణ పొందే వ్యక్తుల సేవ చేయటానికే గదా దేవుడు వీళ్ళను పంపింది?
© 1997 Bible League International