Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
27 యెహోవా, నీవే నా వెలుగు, నా రక్షకుడవు.
నేను ఎవరిని గూర్చి భయపడనక్కర్లేదు.
యెహోవా, నీవే నా జీవిత క్షేమస్థానం.
కనుక నేను ఎవరికి భయపడను.
2 దుర్మార్గులు నా మీద దాడి చేయవచ్చు.
వారు నా శరీరాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించవచ్చు.
వారు నా శత్రువులు, విరోధులు.
వారు కాలు తప్పి పడిపోదురు.
3 అయితే నా చుట్టూరా సైన్యం ఉన్నప్పటికీ నేను భయపడను.
యుద్ధంలో ప్రజలు నామీద విరుచుకు పడ్డప్పటికీ నేను భయపడను. ఎందుకంటే నేను యెహోవాను నమ్ముకొన్నాను.
4 యెహోవా నాకు అనుగ్రహించాలని నేను ఆయనను అడిగేది ఒకే ఒకటి ఉంది.
నేను అడిగేది ఇదే:
“నా జీవిత కాలం అంతా నన్ను యెహోవా ఆలయంలో కూర్చుండనిచ్చుట.
ఆయన రాజ భవనాన్ని నన్ను సందర్శించనిచ్చుట.
యెహోవా సౌందర్యాన్ని నన్ను చూడనిమ్ము.”
5 నేను ఆపదలో ఉన్నప్పుడు యెహోవా నన్ను కాపాడుతాడు.
ఆయన తన గుడారంలో నన్ను దాచిపెడతాడు.
ఆయన తన క్షేమ స్థానానికి నన్ను తీసుకొని వెళ్తాడు.
6 నా శత్రువులు నన్ను చుట్టుముట్టేశారు. కాని ఇప్పుడు వారిని ఓడించటానికి యెహోవా నాకు సహాయం చేస్తాడు.
అప్పుడు నేను ఆయన గుడారంలో బలులు అర్పిస్తాను. సంతోషంతో కేకలు వేస్తూ ఆ బలులు నేను అర్పిస్తాను.
యెహోవాను ఘనపరచుటకు నేను వాద్యం వాయిస్తూ గానం చేస్తాను.
7 యెహోవా, నా స్వరం ఆలకించి నాకు జవాబు ఇమ్ము.
నా మీద దయ చూపించుము.
8 యెహోవా, నా హృదయం నిన్ను గూర్చి మాట్లాడమంటున్నది.
వెళ్లు, నీ యెహోవాను ఆరాధించమంటున్నది అందువల్ల యెహోవా నేను నిన్ను ఆరాధించటానికి వచ్చాను.
9 యెహోవా, నా దగ్గర్నుండి తిరిగిపోకుము.
కోపగించవద్దు, నీ సేవకుని దగ్గర్నుండి తిరిగి వెళ్లిపోవద్దు.
నీవు నాకు సహాయమైయున్నావు, నన్ను త్రోసివేయకుము. నన్ను విడిచిపెట్టవద్దు. నా దేవా, నీవు నా రక్షకుడవు.
10 నా తల్లి, నా తండ్రి నన్ను విడిచిపెట్టారు.
అయితే యెహోవా నన్ను తీసుకొని, తన వానిగా చేసాడు.
11 యెహోవా, నాకు శత్రువులు ఉన్నారు, కనుక నాకు నీ మార్గాలు నేర్పించుము.
సరైన వాటిని చేయటం నాకు నేర్పించుము.
12 నా శత్రువుల కోరికకు నన్నప్పగించవద్దు.
నన్ను గూర్చి వాళ్లు అబద్ధాలు చెప్పారు. నాకు హాని కలిగించేందుకు వాళ్లు అబద్ధాలు చెప్పారు.
13 నేను చనిపోక ముందు యెహోవా మంచితనాన్ని నేను చూస్తానని
నిజంగా నేను నమ్ముచున్నాను.
14 యెహోవా సహాయం కోసం కనిపెట్టి ఉండుము.
బలంగా, ధైర్యంగా ఉండుము.
యెహోవా సహాయం కోసం కనిపెట్టుము.
యూదా దేవునికి నమ్మకంగా లేదు
10 మన అందరికీ ఒకే తండ్రి ఉన్నాడు (దేవుడు). ఆ దేవుడే మనలో ప్రతి ఒక్కరినీ చేశాడు! కాని, ప్రజలు ఎందుకు వారి సోదరులను మోసం చేస్తున్నారు? ఆ ప్రజలు ఒడంబడికను సన్మానించటం లేదని వ్యక్తం చేస్తున్నారు. మన పూర్వీకులు దేవునితో చేసుకున్న ఒడంబడికను వారు గౌరవించరు. 11 యూదా మనుష్యులు ఇతరులను మోసం చేశారు. యెరూషలేములో, ఇశ్రాయేలులో ప్రజలు భయంకర విషయాలు జరిపించారు. యూదాలో ప్రజలు యెహోవా పవిత్ర ఆలయాన్ని గౌరవించలేదు. ఆ స్థలం దేవునికి ఇష్టమైనది! యూదా ప్రజలు ఆ విదేశీ దేవతను పూజించటం మొదలు పెట్టారు. 12 యెహోవా ఆ మనుష్యులను యూదా వంశంలోనుండి తొలగించివేస్తాడు. ఆ ప్రజలు యెహోవాకు కానుకలు తీసికొని రావచ్చుగాక, కానీ అది సహాయ పడదు. 13 నీవు ఏడ్చి, యెహోవా బలిపీఠాన్ని కన్నీళ్ళతో నింపవచ్చు, కానీ యెహోవా నీ కానుకలు అంగీకరించడు. నీవు ఆయనకోసం తెచ్చే వస్తువులతో యెహోవా సంతోషించడు.
14 “మా కానుకలను యెహోవా ఎందుచేత అంగీకరించలేదు?” అని మీరు అడుగుతారు. ఎందుకంటే మీరు చేసిన చెడుకార్యాలు యెహోవా చూశాడు, మీకు విరుద్ధంగా ఆయనే సాక్షి. నీవు నీ భార్యను మోసం చేయటం ఆయన చూశాడు. నీవు యువకునిగా ఉన్నప్పుడే నీవు ఆ స్త్రీకి వివాహం చేయబడ్డావు. ఆమె నీ స్నేహితురాలు. తర్వాత మీరు ఇద్దరూ ఒకరికి ఒకరు ప్రమాణాలు చేసికొన్నారు. ఆమె నీకు భార్య అయింది. కానీ నీవు ఆమెను మోసం చేసావు. 15 భర్తలు, భార్యలు ఒకే శరీరం, ఒకే ఆత్మ కావాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే, వారికి పవిత్రమైన పిల్లలు ఉండాలని. అందుచేత ఆత్మపరమైన ఆ ఐక్యతను కాపాడుకోండి. నీ భార్యను మోసం చేయవద్దు. నీవు యువకునిగా ఉన్నప్పటినుండి ఆమె నీకు భార్యగా ఉంది.
16 “విడాకులు అంటే నాకు అసహ్యం. మరియు పురుషులు తమ భార్యలయెడల చేసే క్రూరమైన పనులు నాకు అసహ్యం. అందుచేత మీ ఆత్మపరమైన ఐక్యాన్ని కాపాడుకోండి. నీ భార్యను మోసం చేయవద్దు” అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెపుతున్నాడు.
తీర్పు కోసం ప్రత్యేక సమయం
17 మీరు తప్పుడు విషయాలు నేర్పించారు. ఆ తప్పుడు ప్రబోధాలు యెహోవాకు చాలా విచారం కలిగించాయి. చెడుకార్యాలు చేసేవారంటే దేవునికి ఇష్టం అని మీరు ప్రబోధించారు. అలాంటివారే మంచివాళ్లని దేవుడు తలుస్తాడు అని మీరు ప్రబోధించారు. చెడుకార్యాలు చేసినందుకు దేవుడు శిక్షించడు అని మీరు ప్రబోధం చేశారు.
3 “చూడండి, నేను నా సందేశకుని పంపిస్తున్నాను. అతడు నా కోసం మార్గం సిద్ధం చేస్తాడు. అకస్మాత్తుగా మీరు ఎదురుచూచే యజమాని తన ఆలయంలోనికి వచ్చేస్తాడు. అవును, మీరు కోరుతున్న కొత్త ఒడంబడిక దూత నిజంగా వస్తున్నాడు! సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
జెకర్యా మరియు ఎలీసబేతు
5 హేరోదు[a] రాజు యూదయను పాలించే కాలంలో జెకర్యా అనే ఒక యాజకుడు ఉండేవాడు. ఇతడు అబీయా[b] అనబడే యాజక శాఖకు చెందినవాడు. ఇతని భార్య అహారోను శాఖకు చెందినది. ఆమె పేరు ఎలీసబెతు. 6 ఈ దంపతులు యధార్థంగా, దేవునికి ప్రీతికరంగా నుడుచుకుంటూ ప్రభువు ఆజ్ఞల్ని పాటిస్తూ ఏ అపకీర్తి లేకుండా నిష్టాపరులై జీవించే వాళ్ళు, 7 ఎలీసబెతు గొడ్రాలు. పైగా వాళ్ళిద్దరూ వయస్సు మళ్ళిన వాళ్ళు. వాళ్ళకు సంతానం కలుగలేదు.
8 తన శాఖకు చెందిన వాళ్ళు చేయవలసిన వంతు రావటంవల్ల జెకర్యా యాజక పనులు చేస్తూ ఉన్నాడు. 9 దేవాలయంలో దేవునికి ధూపం వేయటానికి వాడుక ప్రకారం చీట్లు వేసి జెకర్యాను ఎన్నుకున్నారు. 10 అతడు ధూపం వేస్తుండగా బయట సమావేశమైన భక్తులు ప్రార్థిస్తున్నారు.
11 ధూపవేదికకు కుడివైపున జెకర్యాకు ఒక దేవదూత ప్రత్యక్షం అయ్యాడు. 12 జెకర్యా అతణ్ణి చూడగానే ఉలిక్కి పడ్డాడు. అతనికి భయం వేసింది. 13 దేవదూత అతనితో, “జెకర్యా భయపడకు. దేవుడు నీ ప్రార్థనలు విన్నాడు. నీ భార్య ఎలీసబెతు ఒక మగశిశువును కంటుంది. ఆ పిల్లవానికి యోహాను అని నామకరణం చెయ్యి. 14 ఇతని పుట్టుక వల్ల నీవు చాలా ఆనందిస్తావు. నీవేకాక ప్రజలందరూ ఆనందిస్తారు. 15 అతడు ఆధ్యాత్మికతతో గొప్పవాడౌతాడు. దేవుడతని గొప్పతనం చూసి ఆనందిస్తాడు. అతడు ద్రాక్షారసం కాని, లేక యితర రకములైన మద్యపానాల్ని కాని ముట్టడు. పుట్టినప్పటి నుండే అతనిలో పవిత్రాత్మ[c] ఉంటాడు.
16 “ఇశ్రాయేలు ప్రజల ప్రభువైన దేవుని దగ్గరకు యితడు చాలా మంది ప్రజల్ని తీసుకు వస్తాడు. 17 తండ్రుల హృదయాలను పిల్లల వైపు మళ్ళించటానికి, దేవుణ్ణి నమ్మని వాళ్ళను నీతిమంతుల జ్ఞానం సంపాదించేటట్లు చెయ్యటానికి, ప్రభువు రాకకు ప్రజల్ని సిద్ధపరచటానికి ఇతడు ఏలియాలో[d] ఉన్న ఆత్మ బలంతో ప్రభువు కన్నా ముందుగా వెళ్తాడు” అని అన్నాడు.
© 1997 Bible League International