Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: కోరహు కుమారుల స్తుతి కీర్తన
85 యెహోవా, నీ దేశం మీద దయ చూపించుము.
యాకోబు ప్రజలు విదేశంలో ఖైదీలుగా ఉన్నారు. ఖైదీలను తిరిగి వారి దేశానికి తీసుకొని రమ్ము.
2 యెహోవా, నీ ప్రజలను క్షమించుము!
వారి పాపాలు తుడిచివేయుము.
8 దేవుడు చెప్పేది నేను వింటున్నాను.
తన ప్రజలకు శాంతి కలుగుతుందని యెహోవా చెబుతున్నాడు.
ఆయన అనుచరులు వారి అవివేక జీవిత విధానాలకు తిరిగి వెళ్లకపోతే వారికి శాంతి ఉంటుంది.
9 దేవుడు తన అనుచరులను త్వరలో రక్షిస్తాడు.
మేము త్వరలోనే మా దేశంలో గౌరవంగా బ్రతుకుతాము.
10 దేవుని నిజమైన ప్రేమ ఆయన అనుచరులకు లభిస్తుంది.
మంచితనం, శాంతి ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకొంటాయి.
11 భూమి మీద మనుష్యులు దేవునికి నమ్మకంగా ఉంటారు.
పరలోకపు దేవుడు వారికి మేలు అనుగ్రహిస్తాడు.
12 యెహోవా మనకు అనేకమైన మంచివాటిని ఇస్తాడు.
భూమి అనేక మంచి పంటలను ఇస్తుంది.
13 మంచితనం దేవునికి ముందర నడుస్తూ
ఆయన కోసం, దారి సిద్ధం చేస్తుంది.
24 దేవుడు ఇలా అన్నాడు, “ఆయా రాజ్యాలనుండి మిమ్మల్ని బయటకు తీసి, ఒక్క చోటికి సమీకరించి మీ స్వంత దేశానికి తీసుకొనివస్తాను. 25 పిమ్మట మీ మీద పరిశుద్ధ జలాన్ని చల్లి మిమ్మల్ని పవిత్రులనుగా చేస్తాను. మీ మురికినంతటిని కడిగివేస్తాను. ఆ విగ్రహాలనుండి వచ్చిన మురికిని నేను కడిగివేస్తాను.” 26 దేవుడు ఇలా అన్నాడు: “మీలో సరిక్రొత్త ఆత్మను పెడతాను. మీ ఆలోచనా సరళి మార్చుతాను. మీ శరీరం నుండి రాతి గుండెను తొలగించి సున్నితమైన మానవ హృదయాన్ని ఇస్తాను. 27 మీలో నా ఆత్మను ప్రవేశపెడతాను. మీరు నా కట్టడులను పాటించేలా మిమ్మల్ని నేను మార్చుతాను. మీరు నా ఆజ్ఞలను జాగ్రత్తగా పాటిస్తారు. 28 పిమ్మట మీ పూర్వీకులకు నేనిచ్చిన దేశంలో మీరు నివసిస్తారు. మీరు నా ప్రజలవుతారు. నేను మీ దేవుడనవుతాను.”
యూదా నాయకులు యేసు అధికారాన్ని సందేహించటం
(మత్తయి 21:23-27; లూకా 20:1-8)
27 యేసు, ఆయన శిష్యులు యెరూషలేం చేరుకొన్నారు. ఆయన మందిరావరణంలో నడుస్తుండగా ప్రధానయాజకులు, శాస్త్రులు పెద్దలు ఆయన దగ్గరకు వచ్చారు. 28 వాళ్ళాయన్ని, “ఎవరిచ్చిన అధికారంతో నీవు వీటిని చేస్తున్నావు? ఇవి చేయటానికి అధికారమెవరిచ్చారు?” అని అడిగారు.
29 యేసు సమాధానంగా, “నన్ను ఒక్క ప్రశ్న అడుగనివ్వండి. దానికి మీరు సమాధానం చెప్పండి. అప్పుడు నేనివి ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో చెబుతాను. 30 యోహాను బాప్తిస్మము పరలోకంలో నుండి వచ్చినదా? లేక మానవులనుండి వచ్చినదా? సమాధానం చెప్పండి” అన్నాడు.
31 వాళ్ళు, ఆ విషయాన్ని గురించి పరస్పరం చర్చించుకొని, “మనం ‘పరలోకం నుండి’ అని అంటే, ‘మరి అలాగైతే మీరు యోహానును ఎందుకు నమ్మలేదు?’ అని అడుగుతాడు. 32 మనం ‘మానవుల నుండి’ అని అంటే ప్రజలకు మనమంటే కోపం వస్తుంది” అని అనుకున్నారు. యోహాను ఒక ప్రవక్త అని ప్రతి ఒక్కడు నమ్మటంవల్ల వాళ్ళు ప్రజలంటే భయపడ్డారు.
33 కనుక వాళ్ళు, “మాకు తెలియదు” అని సమాధానం చెప్పారు.
యేసు, “అలాగైతే నేను కూడా యివి ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో చెప్పను” అని అన్నాడు.
© 1997 Bible League International