Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: “ఒప్పందం పుష్పాలు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన.
80 ఇశ్రాయేలీయుల కాపరీ, నా మాట వినుము.
యోసేపు గొర్రెలను (ప్రజలను) నీవు నడిపించుము.
కెరూబులపై నీవు రాజుగా కూర్చున్నావు. ప్రకాశించుము.
2 ఇశ్రాయేలీయుల కాపరీ, ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షేలకు నీ మహాత్యం చూపించుము.
వచ్చి మమ్మల్ని రక్షించుము.
3 దేవా, మరల మమ్మల్ని స్వీకరించుము.
మేము రక్షించబడునట్లు నీ ముఖాన్ని మా మీద ప్రకాశింపచేయుము.
4 సర్వశక్తిగల యెహోవా దేవా, నీవు మా మీద ఎప్పటికి కోపంగానే ఉంటావా?
మా ప్రార్థనలు నీవు ఎప్పుడు వింటావు?
5 నీవు నీ ప్రజలకు కన్నీళ్లే ఆహారంగా ఇచ్చావు.
నీ ప్రజల కన్నీళ్లతో నిండిన పాత్రలే నీవు నీ ప్రజలకు ఇచ్చావు. అవే వారు తాగుటకు నీళ్లు.
6 మా పొరుగువారు పోరాడుటకు నీవు మమ్మల్ని హేతువుగా ఉండనిచ్చావు.
మా శత్రువులు మమ్మల్ని చూచి నవ్వుచున్నారు.
7 సర్వశక్తిమంతుడవైన దేవా, మరల మమ్మల్ని అంగీకరించుము.
నీ ముఖము మామీద ప్రకాశించునట్లు మమ్మల్ని రక్షించుము.
17 దేవా, నీ కుడి ప్రక్క నిలిచి ఉన్న నీ కుమారుని ఆదుకొనుము.
నీవు పెంచిన నీ కుమారుని ఆదుకొనుము.
18 అతడు మరల నిన్ను విడువడు.
అతన్ని బ్రదుక నీయుము. అతడు నీ నామాన్ని ఆరాధిస్తాడు.
19 సర్వశక్తిమంతుడవైన యెహోవా, దేవా, తిరిగి మా దగ్గరకు రమ్ము.
నీ ముఖ మహిమను మామీద ప్రకాశించనీయుము. మమ్మల్ని రక్షించుము.
తీర్పు రోజు
14 చూడండి. తీర్పుతీర్చటానికి యెహోవాకు ఒక రోజు ఉంది. మీరు తీసుకున్న ధనం మీ నగరంలో విభజించబడుతుంది. 2 యెరూషలేము మీదికి దేశాలన్నిటినీ నేను రప్పిస్తాను. వారు నగరాన్ని పట్టుకొని ఇండ్లన్నీ నాశనం చేస్తారు. స్త్రీలు మానభంగం చేయబడతారు. జనాభాలో సగం మంది బందీలుగా పట్టుకుపోబడతారు. కాని, మిగిలిన ప్రజలు నగరంనుండి తీసుకుపోబడరు. 3 అప్పుడు యెహోవా ఆయా దేశాలపైకి యుద్ధానికి వెళతాడు. అది నిజమైన యుద్ధం అవుతుంది. 4 ఆ సమయంలో ఆయన యెరూషలేముకు తూర్పున వున్న ఒలీవల కొండమీద నిలబడతాడు. ఒలీవల కొండ రెండుగా చీలి పోతుంది. ఆ కొండలో ఒక భాగం ఉత్తరానికి, మరొక భాగం దక్షిణానికి తిరుగుతాయి. తూర్పునుండి పడమటికి ఒక లోతైన లోయ ఏర్పడుతుంది. 5 ఆ పర్వతలోయ మీకు మరి సన్నిహితంగా రావటంతో మీరు పారిపోవటానికి ప్రయత్నిస్తారు. యూదా రాజైన ఉజ్జియా కాలంలో భూకంపం వచ్చినప్పుడు మీరు పారిపోయిన రీతిగా మీరిప్పుడు పారిపోతారు. కాని, నా దేవుడైన యెహోవా వస్తాడు. ఆయనయొక్క పవిత్ర జనులందరూ ఆయనతో ఉంటారు.
6-7 అది ఒక ప్రత్యేకమైన రోజు. ఆ రోజున వెలుతురుగాని, చలిగాని, మంచుగాని వుండవు. అప్పుడు పగలూ వుండదు, రాత్రీ వుండదు. అది ఎట్లాగో యెహోవా ఒక్కనికే తెలుసు. అప్పుడు మామూలుగా చీకటి పడేటప్పడు ఇంకా కొంత వెలుతురు ఉంటుంది. 8 ఆ సమయంలో యెరూషలేమునుండి నీరు ఎడతెరిపి లేకుండా ప్రవహిస్తుంది. ఆ ప్రవాహం రెండు పాయలై ఒకటి తూర్పుగా పారుతుంది. రెండవది పడమటిగా మధ్యధరా సముద్రంవైపు ప్రవహిస్తుంది. అది సంవత్సరం పొడవునా వేసవిలోను, శీతాకాలంలోను ప్రవహిస్తుంది. 9 ఆ సమయంలో యెహోవా ప్రపంచానికంతటికి రాజుగా వుంటాడు. యెహోవా ఒక్కడే. ఆయనకు పేరు ఒక్కటే.
దేవునికి నచ్చిన జీవితం
4 సోదరులారా! చివరకు చెప్పేదేమిటంటే దేవుని మెప్పు పొందటానికి ఏ విధంగా జీవించాలో మేము మీకు బోధించాము. మీరు మేము చెప్పినట్లు జీవిస్తున్నారు. కాని మేము ప్రస్తుతం యేసు ప్రభువు పేరిట మిమ్మల్ని అడిగేదేమిటంటే మీరు ఆ జీవితాన్ని యింకా సంపూర్ణంగా జీవించాలి. ఇది మా విజ్ఞప్తి. 2 యేసు ప్రభువు యిచ్చిన అధికారంతో మేము చెప్పిన ఉపదేశాలు మీకు తెలుసు. 3 మీరు పవిత్రంగా ఉంటూ వ్యభిచారం చెయ్యకుండా ఉండాలి. ఇది దేవుని యిచ్ఛ. 4 మీరు పవిత్రంగా, గౌరవప్రదంగా జీవించాలి. మీ దేహాలను మీరు అదుపులో పెట్టుకోవాలి.[a] 5 పవిత్రులు కానివాళ్ళు లైంగిక వాంఛలతో బ్రతుకుతూ ఉంటారు. ఆ విధంగా మీరు జీవించకూడదు. 6 ఈ విషయంలో ఎవరూ తమ సోదరుల్ని మోసం చేయరాదు. వాళ్ళను తమ లాభానికి ఉపయోగించుకోరాదు. అలాంటి పాపం చేసినవాళ్ళను ప్రభువు శిక్షిస్తాడు. మేము దీన్ని గురించి ముందే చెప్పి వారించాము. 7 దేవుడు మనల్ని పిలిచింది అపవిత్రంగా ఉండేందుకు కాదు. పవిత్రంగా జీవించేందుకు పిలిచాడు. 8 అందువల్ల ఈ ఉపదేశాన్ని తృణీకరించినవాడు మానవుణ్ణి కాదు, తన పరిశుద్ధాత్మనిచ్చిన దేవుణ్ణి తృణీకరించినవాడౌతాడు.
9 సోదర ప్రేమను గురించి మేము వ్రాయవలసిన అవసరం లేదు. ఎందుకంటే పరస్పరం ప్రేమించుకొనమని దేవుడే మీకు బోధించాడు. 10 నిజానికి మాసిదోనియ ప్రాంతంలో ఉన్న సోదరులందరినీ మీరు ప్రేమిస్తున్నారు. కాని సోదరులారా! మీరు యింకా ఎక్కువ ప్రేమించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
11 మేమిదివరకే చెప్పిన విధంగా శాంతితో జీవించాలని ఆశించండి. మీ స్వహస్తాలతో పని చేస్తూ యితర్ల జోలికి పోకుండా జీవించండి. 12 అలా చేస్తే మీ నిత్య జీవితాన్ని చూసి యితర్లు మిమ్మల్ని గౌరవిస్తారు. అప్పుడు మీరు యితర్లపై ఆధారపడనవసరం ఉండదు.
ప్రభువు రాకడ
13 సోదరులారా! చనిపోయినవాళ్ళను గురించి మీకు తెలియాలని మా కోరిక. బ్రతుకుపై ఆశలేని వాళ్ళవలే దుఃఖించరాదని మా కోరిక. 14 యేసు చనిపోయి తిరిగి బ్రతికివచ్చాడని మనం నమ్ముతాము. అందుకే యేసును విశ్వసించినవాళ్ళు మరణించినప్పుడు దేవుడు వాళ్ళను ఆయనతో సహా బ్రతికిస్తాడని కూడా మనం విశ్వసిస్తాము.
15 ప్రభువు వచ్చేవరకు మనం బ్రతికి ఉంటే, యింతకు క్రితము చనిపోయినవాళ్ళకంటే ముందు వెళ్ళము. ఇది ప్రభువు స్వయంగా చెప్పాడు. 16 ప్రభువు పరలోకం నుండి దిగివచ్చినప్పుడు ప్రధాన దూతతో అధికార పూర్వకంగా వస్తాడు. అప్పుడు ప్రధాన దూత శబ్దము, దేవుని బూర శబ్దం వినిపిస్తాయి. అప్పుడు క్రీస్తులో చనిపోయినవాళ్ళు మొదటలేస్తారు. 17 ఆ తర్వాత యింకా బ్రతికి ఉన్న మనల్ని ప్రభువు వాళ్ళతో సహా ఆకాశంలో ఉన్న మేఘాల్లోకి తీసుకువెళ్తాడు. అప్పటినుండి మనం ఆయనతో చిరకాలం ఉండిపోతాము. 18 అందువల్ల వీటిని గురించి మాట్లాడుకొని పరస్పరం ధైర్యం చెప్పుకోండి.
© 1997 Bible League International